నర్సాపూర్: బడిబాటలో భాగంగా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు
పాపన్నపేట (మెదక్): బడీడు పిల్లలు బడిలో ఉండేలా ప్రభుత్వం రూపొందించిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం శుక్రవారం జిల్లాలో ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి చదువుకుంటే వచ్చే ఫలితాలను వివరించారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుని ప్రభుత్వం నుంచి అమలయ్యే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బడిబయట ఉన్న పిల్లలందరినీ బడిలో చేర్పించాలని కోరారు.
పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ జిల్లా నోడల్ అధికారి మధుమోహన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించి ఉన్నత విద్యా ప్రమాణాలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ బడుల గొప్పతనాన్ని ప్రజలకు చేరవేసి విద్యా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment