బడి తెరుసుడు.. పుస్తకాలిచ్చుడు.. | Telangana Government Schools Books Is Coming | Sakshi
Sakshi News home page

బడి తెరుసుడు.. పుస్తకాలిచ్చుడు..

Published Fri, May 10 2019 11:57 AM | Last Updated on Fri, May 10 2019 11:57 AM

Telangana Government Schools Books Is Coming - Sakshi

ఖమ్మంసహకారనగర్‌: విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాల కోసం ఇబ్బందిపడకుండా.. పాత పుస్తకాలతోనే సరిపెట్టుకోకుండా.. కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం ఆ మేరకు పాఠశాలలు తెరిచే రోజు విద్యార్థుల చేతిలో పుస్తకాలు ఉంచేందుకు ముందుగానే ముద్రణ ప్రారంభించి.. వాటిని జిల్లాకు చేరవేసే చర్యలు చేపట్టింది. 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే విద్యాశాఖాధికారులు పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా పాఠ్య పుస్తకాల పంపిణీకి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

ప్రతి ఏడాది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సకాలంలో అందకపోవడంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు. దీంతో చదువు అభ్యసించడం కష్టంగా మారుతోంది. కొందరు నిరుపేద విద్యార్థులు ప్రైవేట్‌గా పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేసి చదువుకోవాల్సి వస్తోంది. పాఠ్య పుస్తకాలు అందే సరికి సగం విద్యా సంవత్సరం ముగుస్తుండడం, అవసరమైన వాటిలో సగం పుస్తకాలు మాత్రమే అందుతుండడం వంటి చర్యలతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా అనేక పోరాటాలు చేసిన సందర్భాలున్నాయి. అయితే ప్రభుత్వం విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా పుస్తకాలు విద్యార్థులకు చేరాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
 
జిల్లాకు చేరిన పుస్తకాలు.. 
2019–20 విద్యా సంవత్సరం జూన్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. అప్పట్లోగానే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు చేరనున్నాయి. ఎన్ని పాఠ్య పుస్తకాలు అవసరం అవుతాయనే దానిపై జిల్లా విద్యాశాఖాధికారులు పాఠశాలలవారీగా వివరాలను రాష్ట్ర విద్యాశాఖకు పంపించారు. దీని ఆధారంగా పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 5,64,620 పాఠ్య పుస్తకాలు అవసరం అవుతాయని గుర్తించారు. ఇప్పటివరకు 4,51,302 పుస్తకాలు జిల్లాకు చేరాయి. ఇంకా 1,13,318 పుస్తకాలు జిల్లాకు చేరాల్సి ఉంది. ఇవి కూడా త్వరలోనే జిల్లాకు చేరనున్నాయి.

క్రమసంఖ్య.. లోగో.. 
విద్యార్థులకు అందజేసే పుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు అందజేసిన పుస్తకాలను వారు అమ్ముకోకుండా.. వాటిపై క్రమసంఖ్యతోపాటు ప్రభుత్వ పుస్తకాలు ఉచితంగా అందజేసినట్లు సూచించే లోగోను కూడా ముద్రించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అందించారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ పాఠ్య పుస్తకాలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల వద్ద మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలు చేపట్టారు.  

జూన్‌ ఒకటిలోగా పుస్తకాలు.. 
జిల్లా కేంద్రానికి చేరుకున్న పాఠ్య పుస్తకాలను త్వరలోనే మండలాలవారీగా పంపించనున్నాం. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు అందిస్తారు. ఈ పుస్తకాలన్నింటినీ జూన్‌ 1వ తేదీన పంపిణీ చేస్తారు. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.  – పి.మదన్‌మోహన్, డీఈఓ, ఖమ్మం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement