books distribution
-
శ్రీకాకుళం: ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలు విద్యార్థులకు పంచండి మహాప్రభో
వీరఘట్టం: విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్స రంలో పాఠ్యపుస్తకాల పంపిణీలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఏపీ స్టేట్ టెక్ట్స్ బుక్స్ డైరెక్టర్ కె.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఈ నెల 20వ తేదీన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీని సందర్శించినప్పుడు 8వ తరగతి విద్యార్థులకు గణిత పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదనే విషయా న్ని గుర్తించారు. దీనికి బాధ్యులను చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా డీఈఓ ఎస్.డి.వి రమణతో పాటు వీరఘట్టం ఎంఈఓ పి.కృష్ణమూర్తి, కేజీబీవీ ఎస్ఓ రోహిణి, జీసీడీఓ రోజారమణిలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పాఠ్యపుస్తకాల పంపిణీ లో లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు కె. రవీంద్రనాధ్‌రెడ్డి వీరఘట్టం మండలానికి సోమవా రం వచ్చారు. రేగులపాడు కేజీబీవీ, వీరఘట్టం ఎంఈఓ కార్యాలయంతో పాటు పలు ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు చేశారు. 8వ తరగతి గణిత పాఠ్యపుస్తకాలు వచ్చాయా లేదా అని ఆరా తీశారు. పలు తరగతులకు చెందిన సుమారు రెండు వేలకు పైగా పాఠ్యపుస్తకాలు వీరఘట్టం ఎంఈఓ కార్యాలయంలో పంపిణీ చేయకుండా ఉండడాన్ని ఆయన గుర్తించారు. ఈ పుస్తకాలు ఎందుకు పంపిణీ చేయలేదని ఎంఈఓ కృష్ణమూర్తిని ప్రశ్నించారు. వాస్తవా నికి గత ఏడాది జూలై 25న 533 మంది 8వ తరగతి విద్యార్థులకు 560 పాఠ్యపుస్తకాలు రాగా, వీటిలో 452 తెలుగు మీడియం, 108 ఇంగ్లిషు మీడియం పుస్తకాలు వీరఘట్టం కార్యాలయానికి ఇచ్చినట్టు గుర్తించారు. వీటిలో 108 ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు తమకు రాలేదని ఇక్కడ సిబ్బంది అప్పటిలో జిల్లా అధికారులకు ఫోన్లో తెలియజేసారన్నారు. ఆ మేరకు పాఠ్యపుస్తకాలు అందినట్టు రాతపూర్వ కంగా అధికారుల వద్ద రుజువులు ఉన్నాయని చెప్పారు. వీరికి 108 పాఠ్యపుస్తకాలు అందలేదనే విషయానికి రుజువు లేకపోవడంతో చర్యలు తీసు కున్నట్టు స్టేట్ డైరెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందని స్టేట్ డైరెక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఉన్నతస్థాయి అధికారులు వచ్చి పరిశీలించే వరకు ఏయే పుస్తకాలు విద్యార్థుల కు అందజేశామన్న విషయం తెలియకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఒక విద్యార్థికి విద్యా సంవత్సరం చివరి వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవ డం తప్పుకాదా అని నిలదీశారు. పాఠ్యపుస్తకాల పంపిణీకి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. విద్యార్థులకు పంపిణీ చేయకుండా ఇంకా శ్రీకాకుళం బుక్ డిపోలో 2.18 లక్షల పాఠ్యపుస్తకా లు ఉన్నాయని, ఈ పుస్తకాలను ఎందుకు పంపిణీ చేయలేకపోయారని వారిని అడిగారు. అనంతరం జీసీడీఓ రోజారమణి, ఎంఈఓ కృష్ణమూర్తి, గతంలో ఉన్న ఎంఈఓ నారాయణస్వామి, కేజీబీవీ ఎస్ఓ, శ్రీకాకుళం బుక్స్ డిపో మేనేజర్ తదితరుల నుంచి ఆయన వివరణ తీసుకున్నారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. ఆయన వెంట శ్రీకాకుళం డీఈఓ తిరుమల చైతన్య, పాలకొండ ఉప విద్యాశాఖ అధికారి విజయకుమారి తదితరులు ఉన్నారు. -
కేశిరాజు విజయ కుమారి: 19 X 7 = ?
‘‘డిజిటల్ యుగంలో లెక్కలు చేయడం సులువైంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చేతిలో కంప్యూటర్ ఉన్నట్లే. ఈ విజ్ఞాన పరిణామం ఎటు దారి తీసిందో తెలుసా? ఏడెనిమిదులు ఎంతో చెప్పలేకపోతున్న తరం తయారైంది. అవన్నీ గుర్తు పెట్టుకోవడం తన పని కాదనుకుంటోంది మెదడు. కాలిక్యులేటర్ ఉండగా తనకెందుకు శ్రమ అని విశ్రాంతిలోకి వెళ్తోంది. కాలిక్యులేటర్ ఉండాల్సింది చేతిలో కాదు... తలలో. నిజమే! కాలిక్యులేటర్ బుర్రలో ఉండాలి... ఎక్కాలు నాలుక మీద నాట్యం చేయాలి.’’ అని... పిల్లలకు ఎక్కాలు నేర్పించడానికి ముందుకొచ్చారు కేశిరాజు విజయ కుమారి. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చిన్న గ్రామం కవిటం. థింక్ బిగ్ అని ఏపీజే అబ్దుల్ కలామ్ చెప్పగా ఆమె వినలేదు. కానీ తనకు తానుగా పెద్ద కలనే కన్నారు. ఐఏఎస్ కావాలనే కల నెరవేరకపోవడానికి ఒకటి కాదు రెండు కాదు కుటుంబ రీత్యా అనేక కారణాలు. అడ్డంకులు ఐఏఎస్ కాకుండా ఆపగలిగాయి, కానీ సమాజానికి సేవ చేయడానికి కాదు కదా అనుకున్నారామె. తన ఎదురుగా కనిపించిన ప్రతి సమస్యకూ పరిష్కారాన్ని వెతుకుతూ, పరిష్కరించే వరకు విశ్రమించకుండా శ్రమించారు. బాల్యంలోనే నాన్న పోవడం, పిల్లల పెంపకం బాధ్యతను మోస్తూ అమ్మ భుజాలు అరిగిపోవడం చూస్తూ పెరిగారామె. అంతేకాదు... తొలి ఉద్యోగం ఒక ఎన్జీవోలో టీచర్‌గా. దాంతో ఆ తర్వాత కూడా ఆమె అడుగులు సర్వీస్ వైపుగానే సాగాయి. దశాబ్దాలపాటు మహిళల కోసమే సేవలందించారామె. ఈ ప్రయాణంలో ఆమెకో కొత్త సంగతి తెలిసింది. డిగ్రీ చదువుకున్న వాళ్లకు కూడా ఎక్కాలు రావడం లేదు. నేర్చుకుని మర్చిపోయారా అంటే... అదీ కాదు. బడి గడప తొక్కని, అక్షరాలు నేర్వని బాల్యం ఉంటుంది. కానీ బడికి వెళ్లి అక్షరాలు నేర్చుకుని ఎక్కాలు నేర్వని బాల్యం ఉంటుందని ఊహించలేదామె. మరింత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తెలిసిందేమిటంటే... నేటి బాల్యానికి ఎక్కాలు నేర్చుకోవడం టైమ్ వేస్ట్ పనిగా ఉంటోందని. కాలిక్యులేటర్ లేకుండా వందలో నాలుగోవంతు ఎంత అంటే చెప్పడం చేతకావడం లేదని. ఇన్ని తెలిసిన తర్వాత ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి ఎక్కాల పుస్తకాలు పంచు తున్నారు. ఒకటి రెండు నెలల పాటు వాళ్లకు నేర్చుకునే టైమ్ ఇచ్చి ఆ తర్వాత పోటీలు పెడుతున్నారు. ప్రతి క్లాసులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పాల్గొన్న వాళ్లకు కూడా ప్రోత్సాహకాలిస్తున్నారు. రకరకాలుగా సాగిన తన సామాజిక ప్రస్థానాన్ని ఆమె సాక్షితో పంచుకున్నారు. ఆడపిల్ల పుట్టాలి... చదవాలి! ‘‘మా వారి ఉద్యోగరీత్యా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ఉన్నాను. పెళ్లికి ముందు చదువు చెప్పిన అలవాటు ఉండడంతో అక్కడ ఖాళీగా ఉండలేకపోయేదాన్ని. పైగా మేము నార్త్‌లో ఉన్న రోజుల్లో అక్కడి మహిళలు దాదాపుగా నిరక్షరాస్యులే. నేనిక్కడ చదివింది సెకండ్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే. కానీ అక్షరాలు, వాక్యాలు నేర్పించడానికి సరిపోయేది. వాళ్లకు నేర్పిస్తూ నేను హిందీ మాట్లాడడం నేర్చుకున్నాను. భాష మీద పట్టు రావడంతో వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం సులువైంది. ఘూంఘట్ చాటున, అత్తింటి నియమాల మాటున జీవించడమే వాళ్లకు తెలిసింది. కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే బిడ్డను కనకూడదని, గర్భస్రావం చేయించుకోవాలని నూరిపోసింది అక్కడి సమాజం. యువతులు కూడా అదే నిజమనే విశ్వాసంతో ఉండేవాళ్లు. స్త్రీ లేని సమాజం ఎలా మనుగడ సాగిస్తుందో చెప్పమని, దక్షిణాదిలో ఆడపిల్ల çపుడితే లక్ష్మీదేవి పుట్టినట్లు భావిస్తారని వాళ్లకు నచ్చచెప్తుంటే... ‘ఇద్దరు మగపిల్లలున్న తల్లి ఆమె ఏ మాటైనా చెబుతుంది. ఆడపిల్లకు కట్నాలిచ్చేది ఎవరు’ అని అక్కడి మగవాళ్లలో నా మీద వ్యతిరేకత పెల్లుబుకుతుండేది. నాది నిశ్శబ్ద ఉద్యమం కాబట్టి నా మీద దాడులు జరగలేదు. ఇంటిముందు మురుగు కాలువ ఓపెన్ డ్రైనేజ్‌లో పిల్లలు పడుతుంటారు కూడా. పరిశుభ్రత లేమిని, ఇలాంటి సమస్యలను ప్రశ్నిస్తూ, మహిళలను కలుపుకుని స్థానిక మున్సిపల్ ఆఫీసులకు వెళ్లేదాన్ని. రోడ్డు శుభ్రం చేసిన తర్వాత ఆ కాలనీలో నివసించే ఆడవాళ్ల చేత సంతకం చేయించుకునే నియమం పెట్టారు మున్సిపల్ కమిషనర్. నేర్చుకోవడానికి వయసు పరిమితి ఎందుకు! నా ఉద్దేశం ఒక్కటే. ‘మహిళ కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తే... ఆ క్షణంలో బెంబేలెత్తిపోకూడదు. ప్రతి ఒక్కరి చేతిలో ఏదో ఒక పని ఉండాలి. ఆర్థిక స్వావలంబన సాధించాలి’... అని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేకం చేశాను. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్‌లో వయో పరిమితి ఉంటుంది. అందులో ఇమడని వాళ్లు ‘మాకూ నేర్చుకోవాలని ఉంది’ అంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. అలాంటి వాళ్ల కోసం కేవీఎస్ ఫౌండేషన్ స్థాపించి ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. శిక్షణ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు 2006 నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శిక్షణ కార్యక్రమాల నుంచి పుట్టుకు వచ్చిన అవసరమే ఈ ఎక్కాల ఉద్యమం’’ అన్నారు విజయకుమారి. టైలరింగ్ నేర్పించేటప్పుడు నడుము చుట్టు కొలత లో నాలుగో వంతు మార్క్ చేయమంటే చాలామందికి తెలిసేది కాదు. దాంతో ముందు లెక్కలు నేర్పించాల్సి వచ్చేది. ఏదో సందేహం వచ్చి హైదరాబాద్‌లోని మా అపార్ట్మెంట్ పిల్లలను అడిగాను. ఎక్కాలు చదవడం ఏంటన్నట్లు చూశారు. అపార్ట్మెంట్లో ఎక్కాల పోటీలు పెట్టాను. పాల్గొనడానికే సిగ్గుపడుతున్నారు కొందరు. స్కూళ్లకు వెళ్లాను. ప్రైవేట్ స్కూళ్లు పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వ పాఠశాలలు స్వాగతించాయి. సిటీలో ఇప్పటికి మూడువేల ఎక్కాల పుస్తకాలు పంచాను. ఉప్పరపల్లి, ప్రభుత్వ పాఠశాల లో రెండవ తరగతి పిల్లాడు చాలా త్వరగా ఇరవై ఎక్కాలు నేర్చుకున్నాడు. పిల్లలకు చక్కగా నేర్పిస్తే మెరికల్లా తయారవుతారు. ప్రైవేట్ విద్యారంగం పిల్లలను మార్కుల పోటీలోకి నెట్టేస్తూ, లెక్కలకు పునాది వంటి ఎక్కాలను నిర్లక్ష్యం చేస్తోంది. మహిళలకు స్కిల్ డెవలప్‌మెంట్‌తోపాటు పిల్లలకు ఎక్కాలు నేర్పించే మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని చేపట్టాను. – కేశిరాజు విజయకుమారి, సామాజిక కార్యకర్త, కేవీఎస్ ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
పుస్తకాల పిలుపు.. డిసెంబర్ పాఠ్య ప్రణాళికకు పుస్తకాలన్నీ సిద్ధం
సాక్షి, అమరావతి: విద్యారంగంలో కీలక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం చదువులు సాఫీగా సాగేందుకు పాఠశాలల నుంచి పుస్తకాల దాకా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలను రూ.వేల కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దడంతోపాటు చరిత్రలో తొలిసారిగా పాఠ్య పుస్తకాలను స్కూళ్లు ప్రారంభానికి ముందే సిద్ధం చేసి విద్యా కానుకతోపాటు అందచేస్తోంది. పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా పుస్తకాలను ప్రభుత్వమే ముద్రించి దశలవారీగా అందిస్తూ పిల్లలకు మోత బరువు నుంచి, తల్లిదండ్రులకు ధరల భారం నుంచి భారీ ఊరట కల్పించింది. గత సర్కారు హయాంలో విద్యా సంవత్సరం సగం గడిచినా పుస్తకాలు రాకపోవడం, అందరికీ ఒకేసారి ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి రాగానే పిల్లల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రతి అంశాన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విద్యా కానుక ద్వారా అందించే వస్తువుల నాణ్యత, పాఠ్య ప్రణాళిక, పుస్తకాలను నేరుగా పరిశీలిస్తూ పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ద్విభాషా (బై లింగ్యువల్) పాఠ్య పుస్తకాల కారణంగా కొంత మేర పరిమాణం పెరిగినట్లు గుర్తించడంతో పిల్లలకు మోత బరువు లేకుండా ముద్రించిన పుస్తకాలను రెండు దశల్లో అందించాలని ఆదేశించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లు తెరవగానే మొదటి దశ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన అధికారులు 2, 3వ దశల పుస్తకాలను సైతం ఇప్పటికే సిద్ధం చేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి 2వ దశ పాఠ్య ప్రణాళిక తరగతులు ప్రారంభం కానుండగా నెల రోజులు ముందుగానే అక్టోబర్ 30 నాటికే విద్యాశాఖ పుస్తకాలను తయారుగా ఉంచడం గమనార్హం. 2, 3 దశల పుస్తకాలను ఒకే షెడ్యూల్లో విద్యార్ధులకు అందచేసేలా చర్యలు చేపట్టింది. మొదటి దశలో 3,45,29,970 పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందచేశారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి రూపొందించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పుస్తకాలను సిద్ధం చేశారు. రెండు, మూడు దశల కోసం 1,39,38,034 పుస్తకాలను ముద్రించి అక్టోబర్ 15 – 31వ తేదీల మధ్య జిల్లాలకు తరలించారు. నవంబర్ 10 లోపు మండల పాయింట్లకు, అక్కడి నుంచి స్కూళ్లకు చేరవేసి విద్యార్ధులకు అందించేలా షెడ్యూల్ ప్రకటించి ఏర్పాట్లు చేపట్టారు. ప్రైవేట్ స్కూళ్లకు కూడా.. మొదటి దశలో ప్రైవేట్ స్కూళ్లకు 1,39,79,221 పుస్తకాలను విద్యాశాఖ అందించింది. వీటిలో 1,05,82,332 పుస్తకాలను విక్రయించగా 33,96,889 పుస్తకాలు మిగిలి ఉన్నాయి. ఈ పాఠశాలలకు 2, 3 దశల కింద 37,69,423 పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ జిల్లా కేంద్రాలలో ఇప్పటికే సిద్ధంగా ఉంచింది. నాడు నిద్రావస్థ.. నేడు ముందే ముద్రణ గత సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు అందాలంటే డిసెంబర్ వస్తేగానీ ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఇప్పటి మాదిరిగా కాకుండా సబ్జెక్టులవారీగా ఒకటే పుస్తకాన్ని ముద్రించారు. అది కూడా గరిష్టంగా 2.8 కోట్ల పుస్తకాలే కావడం గమనార్హం. పోనీ అవైనా స్కూళ్లు తెరవగానే ఇచ్చారా అంటే అదీ లేదు. ఆర్నెల్లు గడిస్తే గానీ పాఠ్య పుస్తకాలు అందేవి కావు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 6.88 కోట్ల పుస్తకాలను ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు శరవేగంగా సమకూరుస్తోంది. గతంతో పోలిస్తే మూడు రెట్ల పుస్తకాలను అదనంగా ముద్రిస్తూ విద్యార్ధులకు తరగతుల ప్రారంభానికి ముందే అందేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ద్వి భాషా పుస్తకాలు (బై లింగ్యువల్), వర్కు బుక్స్, పాఠ్య పుస్తకాలు ఇలా వేర్వేరు రకాలుగా ముద్రించి ముందుగానే అందించడం విద్యా రంగం పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది. పుస్తకాల పేరుతో పిండేసి.. టీడీపీ హయాంలో ప్రైవేట్‌కు లబ్ధి చేకూరేలా వ్యవహరించడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు బయట దుకాణాల్లో పుస్తకాలు కొనుక్కోవాల్సి వచ్చేది. ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యం చేస్తూ పిల్లలను గత సర్కారు అవస్థలకు గురి చేసింది. ప్రైవేట్ స్కూళ్లకు ప్రైవేట్ పబ్లిషర్లే పాఠ్య పుస్తకాలను ముద్రిస్తూ ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేశారు. రూ.వందల విలువ చేసే పుస్తకాలను వేల రూపాయాలకు విక్రయించారు. నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాలను ముద్రించి పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను పిండుకున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేట్ పాఠశాలలకు సైతం పుస్తకాలను ముద్రించి అందచేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించడం వల్ల తల్లిదండ్రులపై వేల రూపాయల భారం తగ్గింది. -
మన్‌కీ బాత్‌లో మోదీ మెచ్చుకుంది ఈయననే!
ఎంత పంచితే అంత పెరిగేది జ్ఞానం. ఆ విజ్ఞానకాంతులను నలుదిశలా పరుచుకోవాలని తపిస్తున్న వ్యక్తి పేరు సందీప్ కుమార్ బద్స్రా. ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కి బాత్ ప్రసంగంలో సమాజంలో విద్య, జ్ఞానం వ్యాప్తిని ప్రోత్సహించే వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు చండీగడ్ వాసి సందీప్ కుమార్ చేస్తున్న మంచి పని గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో 28 ఏళ్ల సందీప్ పేదల పిల్లలకు పుస్తకాల పంపిణీ, సేకరణలో బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు 8 వేల మందికి పైగా నిరుపేద విద్యార్థులకు 18,000 పుస్తకాలను పంపిణీ చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక తన పేరును ప్రధాని ప్రస్తావించడంపై ఉద్వేగభరితుడయ్యాడు. సందీప్ మాట్లాడుతూ ‘నేను ఈ రోజు బాపు ధామ్ వద్ద పుస్తకాల పంపిణీలో బిజీగా ఉన్నాను. అందుకే నేను ఉదయం మన్ కి బాత్ కార్యక్రమం వినలేదు. నా పనిని ప్రస్తావించడం గురించి, దేశ ప్రధానమంత్రి మెచ్చుకున్నప్పుడు నేను సరైన దిశలో వెళుతున్నానని మరింతగా స్పష్టమైంది. విద్య సమాజాన్ని మార్చగలిగే మాధ్యమం అని ఎప్పుడూ నమ్ముతాను. ప్రధాని ప్రస్తావించడం అంటే సమాజం కోసం మరింత మేలు చేయటానికి ప్రోత్సాహానిస్తుంది’ అన్నాడు. ఇంటింటికీ తిరిగి సేకరణ హర్యానాలోని భివానీ జిల్లాలోని ధని మహు గ్రామానికి చెందిన సందీప్ చండీగడ్‌లోని శ్రీ గురు గోవింద్ సింగ్ ఖల్సా కాలేజీ నుండి డిగ్రీ పూర్తిచేశాడు. 2016 లో భివానీ జిల్లాలోని దాదామ్ గ్రామంలో తన ఆరు నెలల జెబిటి శిక్షణ సమయంలోనే పేద పిల్లలకు పుస్తకాలు అందించి, వారిని ప్రోత్సహించాలనుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత పుస్తకాలు కొనడం, స్టేషనరీ వస్తువులను సేకరించడం వాటిని రీసైక్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. 2017 లో సందీప్ ‘ఓపెన్ ఐ ఫౌండేష ’ను ప్రారంభించాడు. ఈ మూడేళ్లలో అతను ట్రిసిటీలోని మురికివాడల పిల్లలకు 18,000 పుస్తకాలను పంపిణీ చేశాడు. ‘నా జెబిటి శిక్షణ సమయంలో, దాదామ్ గ్రామంలోని పాఠశాల పిల్లలు పుస్తకాలు, నోటుబుక్స్ లేకపోవడంతో స్కూల్‌కి వచ్చేవారు కాదు. వారి కోసం ఏదైనా చేయాలనుకున్నాను. మా ఇంట్లోవాళ్లకు ఆలోచన గురించి చెప్పినప్పుడు మొదట్లో ఇష్టపడలేదు. ముందు ఏదైనా ఉద్యోగం చేయమన్నారు. దీంతో నేను ఇంటిని విడిచిపెట్టి, కొంత డబ్బు సంపాదించడానికి పెళ్లిళ్ళలో వెయిటర్‌గా పని చేశాను. సెక్టార్ 11 లోని పిజిజిసిలో మొదటి పుస్తక విరాళ శిబిరాన్ని నిర్వహించాను. నా నిబద్ధతను చూసి, మా అన్న అతని భార్యతో సహా నా కుటుంబం కూడా పుస్తకాల కోసం రూ.35,000 ఇచ్చి తమ చేయూతను అందించారు. అప్పటి నుండి, పేదలకు పుస్తకాలు, చదువును అందించడం గురించే ఆలోచించాను. ప్రజల నుండి పుస్తకాలను సేకరించడానికి నేను సెకండ్ హ్యాండ్ స్కూటర్‌ను నడుపుతున్నాను. నా గదిలో ఎక్కువ స్థలం లేనందున కొన్నిసార్లు నా స్నేహితుల ఇళ్ళ వద్ద పుస్తకాలను ఉంచాల్సి వచ్చేది’ అని తెలిపారు సందీప్. మిత్రుల సాయం రెండేళ్ళలో నాయగావ్ వద్ద ఒక చిన్న ఆఫీసు తెరిచాడు సందీప్. తరువాత 690 చదరపు అడుగుల çస్థలంలో ఉన్న ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్కడ కన్సల్టెన్సీతో పాటు టిఫిన్ వ్యాపారాన్ని నడపడం మొదలుపెట్టాడు. అతని ఆదాయంలో 60 శాతం ఎన్జీఓ కోసం ఖర్చు చేస్తాడు. లాక్డౌన్ సమయంలో ఈ ఎన్జీవో 40 మంది మురికివాడల పిల్లలకు పుస్తకాలు అందజేసింది. దృష్టి లోపం ఉన్న విద్యార్థుల కోసం 40 ఆడియో పుస్తకాలను రికార్డ్ చేసింది. ‘నేను చేసినదంతా సమాజ హితం కోసమే. తమ వంతు పాత్ర పోషించాలనుకునే మిత్రుల సాయంతో ఇదంతా జరిగింది. కిందటేడాది చిన్నలైబ్రరీని ఏర్పాటుకు వ్యాన్ తీసుకున్నాను. లాక్డౌన్ సమయంలో చాలా మంది నగరవాసులు, వాలంటీర్లు దృష్టి లోపం ఉన్న విద్యార్థుల కోసం 40 కి పైగా ఆడియో పుస్తకాలను రికార్డ్ చేయడంలో సహాయపడ్డారు’ అని ఆనందంగా తెలిపాడు సందీప్. గొప్ప అవకాశం విద్యార్థులు తమ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం, చదవుకోవడానికి పుస్తకాలు ఇవ్వడమనేది తనకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం అని చెబుతాడు సందీప్. ‘మా తాత సుబేదార్ కన్హయ్య కుమార్ నుండి నేను ప్రేరణ పొందాను. అతను 1950 లలో మా స్థానిక గ్రామంలో తన భూమిని అమ్మి అక్కడ ఒక పాఠశాలను ప్రారంభించాడు. ఈ పాఠశాల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలగా మార్చారు. అక్కడి విద్యార్థులు స్వీట్స్‌తో మా ఇంటికి వచ్చి, వచ్చే ఏడాదికి కూడా పుస్తకాలు అవసరమని నాకు చెప్పినప్పుడు వారికి సాయం చేసే అవకాశం ఇస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంటుంది’ అని వివరించాడు. -
నోట్ దిస్ పాయింట్
సాక్షి, నరసరావుపేట : పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధిగా తనను కలిసేందుకు శాలువాలు, బోకెలు, ఇతర సన్మాన సామగ్రితో రాకుండా నోట్ పుస్తకాలతో రావాల్సిందిగా సూచించారు. నిత్యం నియోజకవర్గం నుంచి ఎందరో పార్టీ నాయకులు, అధికారులు తనను కలిసేందుకు వస్తూ దండలు, బోకెలను తీసుకురావడాన్ని గమనించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా, వైద్యానికి ఇస్తున్న అధిక ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వంలో భాగస్వామ్యిగా ఉడతా సాయంగా విద్యాభివృద్ధికి తోడ్పడాలని నిర్ణయించారు. తన వద్దకు వచ్చే సందర్శకులను బొకెలు, పూలదండలకు బదులు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు వంటి విద్యా సామగ్రితో కలవాల్సిందిగా పిలుపునిచ్చారు. విశేష స్పందన.... పేద విద్యార్థులకు సహకారం అందించే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఇచ్చిన పిలుపుతో అధికారులు, పార్టీ నాయకులు స్పందించారు. ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చిన ప్రతిసారి నోట్ పుస్తకాలతో హాజరవుతున్నారు. గత పదిహేను రోజుల్లో దాదాపు ఎనిమిది వేల నోటుపుస్తకాలు ఈ విధంగా ఎమ్మెల్యేకు అందజేశారు. ఇలా లభించిన నోట్ పుస్తకాలను మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు పంపిణీకి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 29 మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఈ పుస్తకాలను అందిస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని 17 పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ పూర్తయింది. గోపిరెడ్డి చారిటీస్ ద్వారా... దాతలు అందించిన 8వేల నోట్ పుస్తకాలను పంపిణీ చేయగా మిగిలిన పాఠశాలలకు గోపిరెడ్డి చారిటీస్ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్‌గోపిరెడ్డి తన సొంత నిధులతో మరో 8 వేల పుస్తకాలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు. వారం రోజుల్లో మున్సిపాలిటి పరిధిలోని అన్ని పాఠశాలలకు నోట్ పుస్తకాలను అందజేయనున్నారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన విద్య ద్వారానే పేదిరికాన్నినిర్మూలించవచ్చని బలంగా నమ్మే కుటుంబం మాది. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన మాతండ్రి మా ముగ్గురు అన్నదమ్ములు, సోదరికి విద్యనే ఆస్తిగా ఇచ్చారు. ఇప్పుడు సమాజంలో గౌరవస్థానాల్లో ఉన్నాం. అటువంటి విద్య అందరికీ అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి భవిష్యత్‌లో మరికొన్ని కార్యక్రమాలను తీసుకురాబోతున్నాం.. – ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి -
విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ
సాక్షి, నాగారం: స్వచ్ఛంద సంస్థ ‘బీ ద చేంజ్’ సౌజన్యంతో ఆషీ ఫౌండేషన్ సభ్యులు శనివారం నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. వీటితో పాటు వాటర్ బాటిళ్లు, పెన్నులు కూడా ఇచ్చారు. దాదాపు వంద మంది విద్యార్థులకు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డితో పాటు స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు పవిత్ర, కావ్య, సౌమ్య, జయ, భార్గవ్, రామకృష్ణ పాల్గొన్నారు. పేద విద్యార్థుల చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు వలంటీర్లు తెలిపారు. జూపార్క్, చార్మినార్, గోల్కొండ కోట ప్రదేశాలకు పేద విద్యార్థులను తీసుకెళ్లి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నామని చెప్పారు. వలంటీర్లు వచ్చిన వచ్చిన వారంతా కాలేజీ విద్యార్థులే కావడం విశేషం. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వీరిని పాఠశాల సిబ్బంది అభినందించారు. తమకు ఉచితంగా బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేసినందుకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. -
బడి తెరుసుడు.. పుస్తకాలిచ్చుడు..
ఖమ్మంసహకారనగర్: విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాల కోసం ఇబ్బందిపడకుండా.. పాత పుస్తకాలతోనే సరిపెట్టుకోకుండా.. కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం ఆ మేరకు పాఠశాలలు తెరిచే రోజు విద్యార్థుల చేతిలో పుస్తకాలు ఉంచేందుకు ముందుగానే ముద్రణ ప్రారంభించి.. వాటిని జిల్లాకు చేరవేసే చర్యలు చేపట్టింది. 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే విద్యాశాఖాధికారులు పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా పాఠ్య పుస్తకాల పంపిణీకి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రతి ఏడాది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సకాలంలో అందకపోవడంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు. దీంతో చదువు అభ్యసించడం కష్టంగా మారుతోంది. కొందరు నిరుపేద విద్యార్థులు ప్రైవేట్‌గా పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేసి చదువుకోవాల్సి వస్తోంది. పాఠ్య పుస్తకాలు అందే సరికి సగం విద్యా సంవత్సరం ముగుస్తుండడం, అవసరమైన వాటిలో సగం పుస్తకాలు మాత్రమే అందుతుండడం వంటి చర్యలతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా అనేక పోరాటాలు చేసిన సందర్భాలున్నాయి. అయితే ప్రభుత్వం విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా పుస్తకాలు విద్యార్థులకు చేరాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాకు చేరిన పుస్తకాలు.. 2019–20 విద్యా సంవత్సరం జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. అప్పట్లోగానే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు చేరనున్నాయి. ఎన్ని పాఠ్య పుస్తకాలు అవసరం అవుతాయనే దానిపై జిల్లా విద్యాశాఖాధికారులు పాఠశాలలవారీగా వివరాలను రాష్ట్ర విద్యాశాఖకు పంపించారు. దీని ఆధారంగా పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 5,64,620 పాఠ్య పుస్తకాలు అవసరం అవుతాయని గుర్తించారు. ఇప్పటివరకు 4,51,302 పుస్తకాలు జిల్లాకు చేరాయి. ఇంకా 1,13,318 పుస్తకాలు జిల్లాకు చేరాల్సి ఉంది. ఇవి కూడా త్వరలోనే జిల్లాకు చేరనున్నాయి. క్రమసంఖ్య.. లోగో.. విద్యార్థులకు అందజేసే పుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు అందజేసిన పుస్తకాలను వారు అమ్ముకోకుండా.. వాటిపై క్రమసంఖ్యతోపాటు ప్రభుత్వ పుస్తకాలు ఉచితంగా అందజేసినట్లు సూచించే లోగోను కూడా ముద్రించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అందించారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ పాఠ్య పుస్తకాలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల వద్ద మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలు చేపట్టారు. జూన్ ఒకటిలోగా పుస్తకాలు.. జిల్లా కేంద్రానికి చేరుకున్న పాఠ్య పుస్తకాలను త్వరలోనే మండలాలవారీగా పంపించనున్నాం. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు అందిస్తారు. ఈ పుస్తకాలన్నింటినీ జూన్ 1వ తేదీన పంపిణీ చేస్తారు. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – పి.మదన్మోహన్, డీఈఓ, ఖమ్మం -
ఈసారి గుణ‘పాఠం’
కడప ఎడ్యుకేషన్: ఈసారి స్కూళ్లు తెరిచే సమయానికి పాఠ్య పుస్తకాలు చేతికందేలా ఉన్నాయి. గతం నుంచి నేర్చుకున్న పాఠాలతో అధికారులు తొందరగా మేలుకొన్నారు. ఒక అడుగు ముందుకేశారు. వేసవి సెలవులు ముగిసేలోపే పాఠ్యపుస్తకాలను తెప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పుస్తకాలను జిల్లాకు చేరాయని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జూన్ నాటికి స్కూల్స్ పాయింట్లకు చేర్చేందుకు విద్యాశాఖ ముందస్తు కసరత్తు చేస్తోంది. గత మూడు, నాలుగేళ్ల నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడిచినా అరకొరగానే పాఠ్యపుస్తకాలు అందేవి. ఈ విద్యా సంవత్సరంలో మాత్రం ఇలాంటి ఇబ్బందులేవీ తలెత్తకూడదని విద్యాశాఖ కరసత్తు మొదలు పెట్టి సకాలంలో చేర్చేందుకు శ్రీకారం చుట్టింది. వేసవి సెలవులు ముగిసే నాటికే ప్రింటర్ల నుంచి జిల్లా కేంద్రానికి ..అక్కడి నుంచి మండల వనరుల కేంద్రానికి పాఠ్య పుస్తకాలను చేర్చనుంది. తర్వాత పాఠశాలలువెంటనే విద్యార్థులకు అందజేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. 2017– 18 యూడైస్ ప్రకారం.... జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2542, ప్రాథమికోన్నత పాఠశాలలు 272, ఉన్నత పాఠశాలలు 391 ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 91,750 మంది కాగా, ప్రాథమికోన్నత పాఠశాలలు – విద్యార్థులు 18,013 మంది ఉంటున్నారని అంచనా. అలాగే ఉన్నత పాఠశాలల్లో 92,769 మంది చదువుతున్నారు. గతేడాది ఈ సమయానికి ముద్రణ పక్రియనే మొదలు కాలేదు. ఆలస్యంగా పుస్తకాలు రావడంతో పాఠ పుస్తకాలతోనే చదువులు కొనసాగించాల్సి వచ్చింది. దీంతో విద్యాశాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. 2019–20 విద్యా సంవత్సరానికి మొదటి విడతలో భాగంగా ఈనెల 18 నుంచి పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోడౌన్‌కు చేరుకుంటున్నాయి. ఇందులో 2వ తరగతికి ఇంగ్లీస్ రీడర్‌కు సంబంధించి 15.065 పుస్తకాలు, 8వ తరగతి ఫిజికల్ సైన్సు (ఇంగ్లీష్ మీడియం) 9641 పుస్తకాలు వచ్చాయి. 9వ తరగతి( తెలుగు మీడియం) సోషల్ పుస్తకాలు 7678 వచ్చాయి. రెండు మూడు రోజులలో తక్కిన పుస్తకాలు రానున్నాయి. మే చివరికల్లా అన్ని పుస్తకాలు జిల్లాకు రానున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపారు. 50 శాతం మేర రాగానే పంపిణీ ప్రారంభం: పాఠ్యపుస్తకాలకు సంబంధించి మన జిల్లాకు రావాల్సిన పాఠ్యపుస్తకాల్లో సగం పుస్తకాలు జిల్లాకు రాగానే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ ఏడాది సకాలంలోనే పాఠ్యపుస్తకాలను అందించేందుకు కృషి చేస్తాం. – పి. శైలజ, జిల్లా విద్యాశాకాధికారి -
విద్యార్థులకు ప్రోగ్రెస్‌కార్డులు చేరేదెప్పుడో?
మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల ప్రగతి ఎలా ఉందో తెలుసుకోవాలంటే నివేదిక కీలకం. తరగతి గదిలో విద్యార్థి ప్రతిభ, మార్కులు ఎలా వస్తున్నాయో ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రుకు తెలియాలంటే అందించే ప్రగతి నివేదిక పంపిణీలో ఎనలేని జాప్యం జరుగుతోంది. విద్య సంవత్సరం ప్రారంభమై ఐదునెలలు గడుస్తున్నా ప్రగతి నివేదిక పత్రాలు పాఠశాలలకు చేరలేదు. విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పే పాలకులు, అధికారులు మాటలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికే రెండు పరీక్షలు ముగిసిన వాటికి సంబంధించిన ప్రగతిని రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంది. ఆలస్యం కారణం ఏమైనా మంచిర్యాల బుక్ డిపోకు చేరి వారం గడుస్తున్నా గోదాంలు దాటని వైనంపై ‘సాక్షి’ కథనం. ప్రగతి నివేదికలు పంపిణీ ఇలా? విద్యాసంవత్సరం ప్రారంభమైన మొదటో ఏటా ఒకటి, ఆరోతరగతి విద్యార్థులకు ప్రగతి నివేదికల రికార్డులు అందిస్తారు. ప్రగతి నివేదిక ప్రోగ్రెస్ రిపోర్టు, సమగ్ర నిరంతర మూల్యంకనం, సెంట్రల్ మార్క్ రిజిస్టర్లను ప్రభుత్వమే అందిస్తూ వస్తోంది. మిగతా తరగతుల వారికి గతంలో ఇచ్చిన వాటిల్లోనే (రికార్డుల్లోనే) మార్కులు పొందుపరుస్తారు. కానీ ఈ ఏడాది ఐదునెలలు గడిచినా ప్రగతి నివేదికల రికార్డులబుక్లు అందకపోవడంతో విద్యార్థుల మార్కులను నోట్ పుస్తకాల్లోనే రాసుకోవాల్సిన పరిస్థితి. పరీక్షలు పూర్తయినా... ఇప్పటికే ఎఫ్ఏ–1, ఎఫ్ఏ–2 పరీక్షలు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థుల ప్రగతి నివేదికలను పూర్తి వివరాలతో తల్లిదండ్రులకు పంపించాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఉపాధ్యాయులు జవాబుపత్రాలను విద్యార్థులతో ఇంటికి పంపించి వారి తల్లిదండ్రులు చూపించి సంతకం తీసుకురావాలని సూచనలు చేస్తున్న వారు లేకపోలేదు. ప్రస్తుతం కాగితాలు, జవాబుపత్రాలపై ఉన్న మార్కులు మళ్లీ ప్రగతి నివేదికల్లో వేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఐదు నెలలు గడుస్తున్నా... పాఠశాలలు పున:ప్రారంభమై ఐదునెలులు గడిచిపోయింది. సెంట్రల్మార్కు రిజిస్టర్, విద్యార్థి సంచిత సమగ్ర ప్రగతి నివేదిక ( క్యుములేటివ్ రికార్డు), సీసీఈ రిజిస్టర్ (ప్రగతి నమోదు రిజిస్టర్)లు మాత్రం ఇప్పటివరకు పాఠశాలలకు చేరలేదు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాకేంద్రం ప్రభుత్వం పుస్తక విక్రయ కేంద్రం (బుక్‌డిపో)కు చేరి రోజులు గడుస్తున్నా గోదాంల నుంచి దాటడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుక్ డిపోల్లోనే భద్రం.. జిల్లాలోని 18 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసే సీసీఈ ప్రోగ్రెస్ రికార్డింగ్ రిజిస్ట్రర్లు 173(తెలుగు మీడియం), 14 (ఉర్దూ),7(ఇంగ్లీష్) క్యుములేటివ్ ప్రోగ్రెస్ రికార్డు 764 (తెలుగు మీడియం) 64(ఉర్దూ), సెంట్రల్ మార్కు రిజిస్ట్రర్లు–86 (తెలుగు మీడియం) 5(ఉర్దూ), 4 (ఇంగ్లీష్ మీడియం) బుక్‌డిపోకు చేరాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు అందించేందుకు సీసీఈ ప్రోగ్రెస్ రికార్డింగ్ రిజిస్టర్లు– 3048(తె.మీ), 505(ఇ.మీ), 116(ఉ.మీ), క్యుములేటివ్ ప్రోగ్రెస్ రికార్డు 5486(తె.మీ), 3149(ఇ.మీ), 117(ఉ.మీ), సెంట్రల్ మార్కు రిజిస్టర్లు 707(తె.మీ),197(ఇ.మీ), 24(ఉ.మీ) సంబంధించిన విద్యార్థి ప్రగతి నివేదిక పుస్తకాలు గోదాంల్లోనే ఉన్నాయి. ఒక్క ఇంగ్లీశ్ మీడియానికి చెందిన క్యుములేటివ్ ప్రోగ్రెస్ రికార్డులకు సంబంధించిన 53 మాత్రమే తక్కువగా వచ్చాయి. రెండురోజుల్లో పంపిణీ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల ప్రగతి నివేదికలకు సంబంధించిన రికార్డులు బుక్‌డిపోకు చేరాయి. ఏయే పాఠశాలలకు ఎన్ని ఇవ్వాలో నివేదిక తయారు చేశాం. మండల ఎంఈవోలకు సమాచారం పంపించాం. రెండురోజుల్లో మండలాలకు అక్కడి నుంచి పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. – పారుపెల్లి ప్రభాకర్‌రావు,సెక్టోరల్ అధికారి మంచిర్యాల -
పుస్తకాలు వచ్చేశాయ్!
జిల్లాలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న వయోజన విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: సాక్షర భారత్ కార్యక్రమంలో కదలిక వచ్చింది. ఈ పథకం కింద జిల్లా కేంద్రాలకు పుస్తకాలు, మెటీరియల్ తదితరాలను రాష్ట్ర వయోజన విద్యా శాఖ చేరవేస్తోంది. కొంత కాలంగా ఈ పథకం నిలిచిన నేపథ్యంపై జూలై 31న సాక్షి ప్రధాన సంచికలో ‘అటకెక్కిన సాక్షర భారత్’కథనానికి యంత్రాంగం స్పందించి ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఈనెల 20న ఎన్ఓఐఎస్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్) పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. మరోవైపు పక్షం రోజుల్లో పరీక్షలుండగా... ఇంత ఆలస్యంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. -
టీఆర్ఎస్ సభ్యత్వ పుస్తకాల పంపిణీలో ఉద్రిక్తం
నల్లగొండ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పుస్తకాల పంపిణీ అర్థంతరంగా ఆగిపోయింది. గురువారం పెద్దవూరలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ నేతలు సభ్యత్వ పుస్తకాల పంపిణీ చేపట్టారు. అయితే, పెద్దవూర మండలానికి సంబంధించిన పుస్తకాలను ఒక వర్గం వారికే అప్పగిస్తున్నారంటూ మరో వర్గం వారు ఆందోళనకు దిగారు. జిల్లా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గమనించిన పార్టీ నేతలు పెద్దవూర మండలానికి పుస్తకాల పంపిణీని వాయిదా వేసి మిగతా మండలాలకు అందజేశారు.