విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
సాక్షి, నరసరావుపేట : పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధిగా తనను కలిసేందుకు శాలువాలు, బోకెలు, ఇతర సన్మాన సామగ్రితో రాకుండా నోట్ పుస్తకాలతో రావాల్సిందిగా సూచించారు. నిత్యం నియోజకవర్గం నుంచి ఎందరో పార్టీ నాయకులు, అధికారులు తనను కలిసేందుకు వస్తూ దండలు, బోకెలను తీసుకురావడాన్ని గమనించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా, వైద్యానికి ఇస్తున్న అధిక ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వంలో భాగస్వామ్యిగా ఉడతా సాయంగా విద్యాభివృద్ధికి తోడ్పడాలని నిర్ణయించారు. తన వద్దకు వచ్చే సందర్శకులను బొకెలు, పూలదండలకు బదులు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు వంటి విద్యా సామగ్రితో కలవాల్సిందిగా పిలుపునిచ్చారు.
విశేష స్పందన....
పేద విద్యార్థులకు సహకారం అందించే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఇచ్చిన పిలుపుతో అధికారులు, పార్టీ నాయకులు స్పందించారు. ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చిన ప్రతిసారి నోట్ పుస్తకాలతో హాజరవుతున్నారు. గత పదిహేను రోజుల్లో దాదాపు ఎనిమిది వేల నోటుపుస్తకాలు ఈ విధంగా ఎమ్మెల్యేకు అందజేశారు. ఇలా లభించిన నోట్ పుస్తకాలను మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు పంపిణీకి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 29 మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఈ పుస్తకాలను అందిస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని 17 పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ పూర్తయింది.
గోపిరెడ్డి చారిటీస్ ద్వారా...
దాతలు అందించిన 8వేల నోట్ పుస్తకాలను పంపిణీ చేయగా మిగిలిన పాఠశాలలకు గోపిరెడ్డి చారిటీస్ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్‌గోపిరెడ్డి తన సొంత నిధులతో మరో 8 వేల పుస్తకాలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు. వారం రోజుల్లో మున్సిపాలిటి పరిధిలోని అన్ని పాఠశాలలకు నోట్ పుస్తకాలను అందజేయనున్నారు.
విద్య ద్వారానే పేదరిక నిర్మూలన
విద్య ద్వారానే పేదిరికాన్నినిర్మూలించవచ్చని బలంగా నమ్మే కుటుంబం మాది. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన మాతండ్రి మా ముగ్గురు అన్నదమ్ములు, సోదరికి విద్యనే ఆస్తిగా ఇచ్చారు. ఇప్పుడు సమాజంలో గౌరవస్థానాల్లో ఉన్నాం. అటువంటి విద్య అందరికీ అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి భవిష్యత్‌లో మరికొన్ని కార్యక్రమాలను తీసుకురాబోతున్నాం..
– ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment