సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను వాటిపక్కనే ఉన్న నరసరావుపేట మున్సిపాలిటీలో విలీనం చేయాలని రెండున్నరేళ్ల కిందట మున్సిపల్ శాఖ ప్రతిపాదించింది. వివిధ కారణాలతో ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో గ్రామ పంచాయతీలను స్థాయి పెంచాలని, లేకపోతే సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేయాలని పురపాలకశాఖ ప్రతిపాదించింది. పలు పంచాయతీలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు కొన్నింటిని వాటిపక్కనున్న మున్సిపాలిటీల్లో విలీనం చేశారు.
19 మండలాల్లోని 87 గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. మున్సిపల్ శాఖ ఈ తరహాగా ప్రతిపాదించిన గ్రామ పంచాయతీల్లో అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల నిర్వహణను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆ 87 గ్రామ పంచాయతీల తాజా పరిస్థితి గురించి ఆరాతీసింది. వాటిని నగర పంచాయతీలుగా మార్చే, సమీప పట్టణాల్లో విలీనం చేసే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ఇటీవల మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు లేఖ రాసింది.
ఆ పంచాయతీలను గ్రామాలుగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారా అని అడిగింది. ఈ విషయాలు తెలపాలని కోరింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ కూడా ఆయా పంచాయతీల తాజా పరిస్థితిని తెలియజేయాలంటూ రెండురోజుల కిందట మున్సిపల్ శాఖకు లేఖ రాసింది.
చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
Comments
Please login to add a commentAdd a comment