1998 నుంచి గెలుస్తున్న ఎంపీలు అందరూ జిల్లాయేతరులే
గుంటూరు నుంచి వచ్చిన రోశయ్య, మోదుగుల, లావు శ్రీకృష్ణ
నెల్లూరు నుంచి వచ్చిన నేదురుమల్లి, మేకపాటి
ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున అనిల్‌కుమార్ యాదవ్ పోటీ
నెల్లూరు సెంటిమెంట్, తొలి బీసీ అభ్యర్థి కావడంతో అనిల్ గెలుపు పక్కా అంటున్న రాజకీయ విశ్లేషకులు
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల్లో అభ్యర్థి స్థానికత అంశం ఎంతో కీలకం. కొన్నిసార్లు దాని ఆధారంగా గెలుపోటములు ప్రభావితమవుతుంటాయి. నరసరావుపేట ఓటర్లు 1998 పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటివరకు పల్నాడు వెలుపలి వారినే పట్టం కడుతున్నారు. ప్రధాన పారీ్టలు కూడా నాన్‌లోకల్ అభ్యర్థులనే బరిలోకి దింపుతున్నాయి. 1998 ఎన్నికలలో ప్రస్తుత బాపట్ల జిల్లాలోని వేమూరులో జన్మించిన మాజీ సీఎం కొణిజేటి రోశయ్యను నరసరావుపేట పార్లమెంట్ ఓటర్లు గెలిపించారు. ఆ తరువాత 1999 ఎన్నికల్లో మరో మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి లాల్‌జాన్‌బాషాపై గెలుపొందారు. ఇదే లోకసభ నియోజకవర్గం నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి ఎంపీగా గెలవడంతో ముగ్గురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంలను ఢిల్లీకి పంపిన ఘనత నరసరావుపేటకి దక్కింది.
నేదురుమల్లి తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీగా గెలుపొందారు. వీరు ముగ్గురు కాంగ్రెస్–ఐ పార్టీ తరపున గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి గెలుపొందారు. మోదుగుల స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు మాత్రం అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందినవారు.2019లో జరిగిన చివరి సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన లావు శ్రీకృష్ణదేవరాయులు వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇలా గత ఆరు ఎన్నికల్లో ఐదుమంది పల్నాడు ప్రాంతానికి చెందని వారు ఎంపీగా గెలుస్తున్నారు.
నెల్లూరు సెంటిమెంట్
రాజకీయంగా నరసరావుపేటకి నెల్లూరుకి అవినాభావసంబంధం ఉన్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1999 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని పల్నాడు ప్రాంత వాసులు గెలిపించారు. తరువాత ఎన్నికల్లో అదే నెల్లూరు నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డిని నరసరావుపేట పార్లమెంట్ ఓటర్లు 86,255 ఓట్ల భారీ మెజారీ్టతో గెలిపించారు. ఇలా ఇప్పటివరకు నెల్లూరు నుంచి వచ్చి పోటీ చేసిన నేతలకు నరసరావుపేట ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. త్వరలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ నెల్లూరు జిల్లా వాసి మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వైఎస్సార్‌సీపీ తరపున పోటీలో ఉంటున్నారు. దీంతో మరోసారి నెల్లూరు సెంటిమెంట్ పనిచేసి అనిల్‌కుమార్ యాదవ్ గెలుపు పక్కా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అనిల్‌కుమార్ యాదవ్‌కు బ్రహ్మరథం
బీసీల అడ్డా అయిన నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఇంతవరకు ఒక్క బీసీ అభ్యర్థి కూడా ఎంపీగా గెలుపొందలేదు. బీసీలను రాజకీయంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ వర్గానికి చెందిన పి.అనిల్‌కుమార్ యాదవ్‌ను పోటీలో ఉంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఆయన గెలుపు పక్కా అనే టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment