BC candidate
-
నరసరావుపేటలో స్థానికేతరులకే పట్టం
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల్లో అభ్యర్థి స్థానికత అంశం ఎంతో కీలకం. కొన్నిసార్లు దాని ఆధారంగా గెలుపోటములు ప్రభావితమవుతుంటాయి. నరసరావుపేట ఓటర్లు 1998 పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటివరకు పల్నాడు వెలుపలి వారినే పట్టం కడుతున్నారు. ప్రధాన పారీ్టలు కూడా నాన్‌లోకల్ అభ్యర్థులనే బరిలోకి దింపుతున్నాయి. 1998 ఎన్నికలలో ప్రస్తుత బాపట్ల జిల్లాలోని వేమూరులో జన్మించిన మాజీ సీఎం కొణిజేటి రోశయ్యను నరసరావుపేట పార్లమెంట్ ఓటర్లు గెలిపించారు. ఆ తరువాత 1999 ఎన్నికల్లో మరో మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి లాల్‌జాన్‌బాషాపై గెలుపొందారు. ఇదే లోకసభ నియోజకవర్గం నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి ఎంపీగా గెలవడంతో ముగ్గురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంలను ఢిల్లీకి పంపిన ఘనత నరసరావుపేటకి దక్కింది. నేదురుమల్లి తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీగా గెలుపొందారు. వీరు ముగ్గురు కాంగ్రెస్–ఐ పార్టీ తరపున గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి గెలుపొందారు. మోదుగుల స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు మాత్రం అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందినవారు.2019లో జరిగిన చివరి సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన లావు శ్రీకృష్ణదేవరాయులు వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇలా గత ఆరు ఎన్నికల్లో ఐదుమంది పల్నాడు ప్రాంతానికి చెందని వారు ఎంపీగా గెలుస్తున్నారు. నెల్లూరు సెంటిమెంట్ రాజకీయంగా నరసరావుపేటకి నెల్లూరుకి అవినాభావసంబంధం ఉన్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1999 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని పల్నాడు ప్రాంత వాసులు గెలిపించారు. తరువాత ఎన్నికల్లో అదే నెల్లూరు నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డిని నరసరావుపేట పార్లమెంట్ ఓటర్లు 86,255 ఓట్ల భారీ మెజారీ్టతో గెలిపించారు. ఇలా ఇప్పటివరకు నెల్లూరు నుంచి వచ్చి పోటీ చేసిన నేతలకు నరసరావుపేట ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. త్వరలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ నెల్లూరు జిల్లా వాసి మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వైఎస్సార్సీపీ తరపున పోటీలో ఉంటున్నారు. దీంతో మరోసారి నెల్లూరు సెంటిమెంట్ పనిచేసి అనిల్‌కుమార్ యాదవ్ గెలుపు పక్కా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అనిల్‌కుమార్ యాదవ్‌కు బ్రహ్మరథం బీసీల అడ్డా అయిన నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఇంతవరకు ఒక్క బీసీ అభ్యర్థి కూడా ఎంపీగా గెలుపొందలేదు. బీసీలను రాజకీయంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ వర్గానికి చెందిన పి.అనిల్‌కుమార్ యాదవ్‌ను పోటీలో ఉంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఆయన గెలుపు పక్కా అనే టాక్ వినిపిస్తోంది. -
సింహపురిలో రాజకీయ చరిత్రను తిరగరాసిన వైఎస్సార్సీపీ
కందుకూరు: కందుకూరు నియోజకవర్గ రాజకీయ చరిత్రను వైఎస్సార్సీపీ పూర్తిగా తిరగరాసింది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయంలో సంచలనాలకు తెరలేపింది. అదే కోవలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త రాజకీయాలకు నాంది పలికింది. కందుకూరు నుంచి దశాబ్దాలుగా రెండు సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులే పోటీ పడుతుండగా ఆ సంప్రదాయాన్ని తిరగరా సింది. తొలిసారి వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో నూత న శకాన్ని మొదలుపెట్టింది. 1951లో కందుకూరు నియోజకవర్గం ఏర్పడింది. ఆ తరువాత నుంచి 2019 ఎన్నికల వరకు మొత్తం పదిహేనుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో ఒక్కసారి మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ రెండు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు మాత్రమే పోటీ పడుతూ వస్తున్నారు. అది కూడా రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులే ప్రధానంగా నియోజకవర్గ రాజకీయాన్ని శాసించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే టీడీపీ తరుఫున తొలిసారి బీసీ అభ్యర్థి మోరుబోయిన మాలకొండయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ అప్పటి నుంచి 2019 వరకు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ రాజకీయ చరిత్రను తిరగరాసే నిర్ణయాన్ని ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధిష్టానం తీసుకుంది. శనివారం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కందుకూరు నియోజకవర్గం నుంచి బీసీ(యాదవ) వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌యాదవ్‌కు అవకాశం కల్పించింది. దీంతో దాదాపు 8 దశాబ్దాల కందుకూరు రాజకీయ చరిత్రలో రెండోసారి బీసీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్‌యాదవ్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. కాగా టీడీపీ మాత్రం తన పాత సంప్రదాయా న్ని కొనసాగిస్తూ మరోసారి కమ్మ సామా జిక వర్గానికి చెందిన ఇంటూరి నాగేశ్వరరావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. కందుకూరు నుంచే రాజకీయ ప్రస్థానం ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి బుర్రా మధుసూదన్‌యాదవ్ తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. కందుకూరు మండలం కంచరగుంటకు చెందిన బుర్రా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడ్డారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2012 నుంచి 2014 వరకు పార్టీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. అయితే అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 40వేలకు పైగా ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించి ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కనిగిరి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం మరోసారి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కందుకూరు నుంచే ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడైతే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో అదే నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తలపడనున్నారు. వైఎస్సార్సీపీ అండతో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుర్రా తన సొంత నియోజకవర్గమైన కందుకూరులో వెనుకబడిన వర్గ అభ్యర్థిగా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. సంతోషం వ్యక్తం చేస్తున్న బీసీలు కందుకూరు రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తూ బీసీ వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌యాదవ్‌ను ఎమ్మెల్యే అభ్యర్థి గా ఎంపిక చేయడంపై నియోజకవర్గంలోని బీసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 8 దశాబ్దాల నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని వైఎస్సార్సీపీ చేసిందని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బీసీల పట్ల నిబద్ధతకు ఇది ఒక నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 80వేల మంది ఓటర్లు బీసీలు ఉన్నారు. వారంతా ఏకతాటిపైకి వచ్చి బీసీ వర్గానికి చెందిన బుర్రాకు అండగా ఉంటామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో వచ్చే ఎన్నికల తరువాత నియోజకవర్గ రాజకీయంలో సరికొత్త శకం ప్రారంభం కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
బాబుగారూ... ఉద్ధరణ ఇదేనా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘రాష్ట్రంలో 100 అసెంబ్లీ స్థానాలు బీసీలకే.... తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే సీఎం పీఠం బడుగులకే...బీసీల తలరాతలు మారాలి... వారే ఫైళ్ల మీద సంతకాలు చేయాలి...’ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలివి. బీసీలను ఉద్ధరించేది తమ పార్టీయేనని, బీసీలంతా టీడీపీ వైపే ఉంటారని ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. కానీ బాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదని, దీనికి మన జిల్లానే నిదర్శనంగా నిలుస్తుందనే చర్చ జోరుగా నడుస్తోంది. జిల్లా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న బీసీ నేతలు, కార్యకర్తల పరిస్థితి దయనీయంగా ఉందని స్వయంగా ఆ పార్టీ శ్రేణులే వాపోతున్నాయి. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి పసుపు జెండా భుజాన మోస్తున్న మాకు ఒరిగిందేమీ లేదని బీసీ వర్గాలకు చెందిన తెలుగుతమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కాగా మిగిలిన నాలుగు (మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు) స్థానాల్లోనూ అగ్రవర్ణాలకు చెందిన నేతలే ఇన్చార్జులుగా ఉన్నారని, అగ్రవర్ణాలకే టికెట్లిచ్చేందుకు రంగం సిద్ధమవుతోందని, ఈసారి కూడా బీసీలకు ఒక్కసీటైనా ఇచ్చేది అనుమానమేనని, ఇన్నాళ్లూ తాము పడిన శ్రమ ఏమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. సమర్థ నాయకులు లేని పక్షంలో ఎవరికిచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని, బీసీలకు అసెంబ్లీ స్థానం కేటాయించే అవకాశం ఉన్నా, అందుకు సమర్థవంతమైన నాయకులున్నా పార్టీ అధినాయకత్వం వారిని పట్టించుకోవడం లేదని అంటున్నారు. అన్నింటా వారే... జిల్లాలో జనరల్ నియోజకవర్గాలయిన ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జులుగా ప్రస్తుతం అగ్రవర్ణాలకు చెందిన నేతలే ఉన్నారు. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, పాలేరు నుంచి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కొత్తగూడెంలో కోనేరు చిన్నిలను ఇన్చార్జులుగా అధికారికంగా ప్రకటించారు. ఖమ్మం పార్లమెంటు నుంచి ఎలాగూ నామా నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో టికెట్లు కూడా వీరికే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీసీ వర్గాలకు చెందిన తెలుగుతమ్ముళ్లలో ఆవేదన వ్యక్తమవుతోంది. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి... డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్‌గా పనిచేసి, ఎమ్మెల్యేగా గతంలో పోటీచేసిన అనుభవమున్న బీసీ వర్గానికి చెందిన బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారని, పార్టీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్నారని, ఆయనతో పాటు ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకుడిగా పేరున్న మదార్‌సాబ్ కూడా ఎమ్మెల్యేగా పోటీచేసే స్థాయి ఉన్న నాయకుడేనని, పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్ జిల్లా నుంచి పిలిపించుకున్న అతికొద్ది మంది నాయకులలో ఆయన ఒకరని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉందని, వీరున్నప్పటికీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీసీలకు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పాలేరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా బాలసాని లక్ష్మీనారాయణ పేరును పరిశీలించవచ్చని, పాల్వంచ రామారావు అనే బీసీ నాయకుడున్నారని, ముదిగొండ మండలానికి చెందిన ఆయన జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడుగా ఉన్నారని, గతంలో పాలేరు నియోజకవర్గంలో ఉన్న ముదిగొండ మండలం మధిర నియోజకవర్గంలోకి వెళ్లినా రామారావుకు పాలేరులో మంచి సంబంధాలే ఉన్నాయని, దశాబ్దాల తరబడి పార్టీలో పనిచేస్తున్నారని వీరి పేర్లు పరిశీలించవచ్చనేది తమ్ముళ్ల అభిప్రాయం. వీరితో పాటు కూసుమంచి మండలానికి చెందిన కూరపాటి వెంకటేశ్వర్లు కూడా ఎమ్మెల్యే బరిలో ఉండదగిన వ్యక్తే అని, చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇందరున్నా ఆ నియోజకవర్గంలోనూ ఇన్చార్జి పదవి బీసీలకివ్వలేదని అంటున్నారు. కొత్తగూడెం విషయానికి వస్తే అక్కడ ఇన్చార్జిగా కోనేరు చిన్నిని ప్రకటించారు. టికెట్ కూడా ఆయనకే ఇచ్చే అవకాశాలున్నాయి. కానీ పాల్వంచ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బరపాటి వాసు అనే బీసీ నాయకుడు పార్టీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని, ఆయనతో పాటు రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి హోదాలో బాలకృష్ణగౌడ్, మరో నేత సంతోష్‌గౌడ్ ఉన్నారని, వీరినీ పక్కనపెట్టేశారని తమ్ముళ్లు వాపోతున్నారు. బీసీలకు ఇవ్వకపోగా.... జిల్లా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న బీసీలను జెండాలు మోసే కార్యకర్తలుగా ఉపయోగించుకోవాలి తప్ప నాయకులుగా ఎదగనీయకూడదనే భావనతో ఇటు జిల్లా నాయకత్వం, అటు రాష్ట్ర పార్టీ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే బీసీల మధ్య పోటీ పెడితే వారే కొట్టుకుంటారని, అప్పుడు ఇతర వర్గాలకు టికెట్ ఇవ్వచ్చనే ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారనే చర్చ కూడా నడుస్తోంది. పాలేరు నియోజకవర్గం నుంచి బాలసాని లక్ష్మీనారాయణ పేరును పరిశీలించే అవకాశం ఉందన్న ఆలోచనతో ఆయనకు పోటీగా ల్యాంకో సంస్థలో పనిచేస్తున్న ఉన్నతోద్యోగి కందిమళ్ల వెంకట నాగప్రసాద్‌ను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి ఆయనది ఆశ్వారావుపేట నియోజకవర్గం. హంగూ, ఆర్భాటాలతో పార్టీలో చేర్పించి, చేరిన రోజే రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి పదవిని ఇప్పించారు. కేవలం ఒక వర్గానికి చెందిన బాలసాని లక్ష్మీనారాయణను పాలేరు నియోజకవర్గానికి రానీయకుండా వ్యూహాత్మకంగా అడ్డుకునేందుకే నాగప్రసాద్‌ను మరో వర్గం బరిలో నిలిపింది తప్ప బీసీలకు అసెంబ్లీ టికెట్ ఇప్పిద్దామన్న ఆలోచన మాత్రం వారికి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నాళ్లు పార్టీని పట్టుకుని వేలాడినా ఫలితం లేదనే భావనతో జిల్లాలోని బీసీ కేడర్ పార్టీకి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. -
వచ్చే ఎన్నికల్లో బీసీలకే మేయర్ పీఠం
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: హైదరాబాద్ నగర 25వ మేయర్‌గా బీసీ అభ్యర్థి రానున్నారు. వచ్చే నవంబర్-డిసెంబర్లో జరుగనున్న ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీసీ అభ్యర్థి అధిష్టించనున్నారు. ఆయా కార్పొరేషన్ల మేయర్ల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ పదవిని బీసీ- జనరల్‌కు కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో బీసీలను ఈ పదవి వరించనుండటంతో ప్రస్తుత బీసీ కార్పొరేటర్లలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. డెబ్బై లక్షలకు పైగా జనాభా ఉన్న గ్రేటర్‌కు మేయర్‌గా వ్యవహరించే అవకాశం రానున్నందున.. బీసీ వర్గాలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మేయర్‌ను నేరుగా ప్రజలే ఎన్నుకునేవారు. జీహెచ్ఎంసీ ఏర్పాటైనప్పటి నుంచి పరోక్ష పద్ధతిలో (గెలిచిన కార్పొరేటర్లనుంచి) ఎన్నుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఆవిర్భావం అయ్యాక తొలిసారిగా ఓసీ- జనరల్‌కు అవకాశం లభించింది. కాంగ్రెస్- ఎంఐఎం కూటమి ఒప్పందం మేరకు ఇద్దరికి అవకాశం లభించింది. కాంగ్రెస్ నుంచి బండ కార్తీకరెడ్డి తొలి రెండేళ్లు మేయర్‌గా పనిచేయగా.. ఆమె తర్వాత మాజిద్ 24వ మేయర్‌గా పదవిలో కొనసాగుతున్నారు. -
‘ఐ’ననూ ఎంపిక!
సాక్షి ప్రతినిధి, గుంటూరు :రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని అభిప్రాయ సేకరణ చేస్తే, ఈసారి పార్లమెంటు నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని, ఒక ముస్లిం, ఒక బీసీ అభ్యర్థికి సీటు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీని ప్రకారం జిల్లాలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని 17 అసెంబ్లీ సెగ్మంట్లలో ముగ్గురు బీసీలు, మరో ముగ్గురు ముస్లింలకు సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం, బీసీల వివరాలు సేకరిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పార్టీ పరిస్థితి మూడో స్థానానికి దిగజా రిందని తెలిసినప్పటికీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ (రాగా) సూచనల మేరకు పరిశీలకులు జిల్లాలో అభిప్రాయ సేకరణ చేశారు. సిట్టింగ్‌లు, ఇన్చార్జీల్లో కలవరం ... నరసరావుపేట లోక్‌సభ పరిశీలకునిగా నియమితులైన కర్ణాటక మాజీ మంత్రి శివమూర్తి తొలి విడత అభిప్రాయ సేకరణను పూర్తిచేశారు. ‘రాగా’ సూచన మేరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే, జిల్లాలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మంట్లలో ముగ్గురు బీసీలు, ముగ్గురు ముస్లింలకు సీట్లు కేటాయించాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో ముగ్గురు బీసీలకు, ఇద్దరు మైనార్టీలకు కాంగ్రెస్ సీట్లు కేటాయించింది. రేపల్లె నుంచి మోపిదేవి వెంకట రమణ, మంగళగిరి నుంచి కాండ్రు కమల, గురజాల నుంచి డాక్టర్ వెంకటేశ్వర్లుకు బీసీ వర్గాల నుంచి సీట్లు లభించాయి. మైనార్టీల నుంచి గుంటూరు ఒన్‌లో మస్తాన్ వలీ, పెదకూరపాడులో నూర్జహాన్‌లకు సీట్లు లభించాయి. అభ్యర్థుల ఎంపికలో పరిశీలకులు అనుసరిస్తున్న విధానాలు కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. అభిప్రాయ సేకరణను నియోజకవర్గ కేంద్రాలతో సరిపెట్టకుండా మండల కేంద్రాల్లోనూ నిర్వహించనున్నట్టు పార్టీ బాధ్యులు చెబుతున్నారు. నాలుగు అసెంబ్లీ సెగ్మంట్లలో ఒక్కొక్క పేరు ... నియోజకవర్గ కేంద్రాల్లో ముగిసిన అభిప్రాయ సేకరణ ప్రకారం సత్తెనపల్లి, పెదకూరపాడు,నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్క పేరు చెప్పినట్టు తెలిసింది. సత్తెనపల్లి- ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, పెదకూరపాడు- జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పక్కాల సూరిబాబు, నరసరావుపేట- ఎమ్మెల్యే కాసు కృష్ణారెడ్డి, వినుకొండ- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావులకు వ్యతిరేకంగా మరో పేరును నాయకులు, కార్యకర్తలు ప్రస్తావించలేదని తెలిసింది. అయినప్పటికీ ఈ నియోజకవర్గాల్లో బీసీలు, మైనార్టీల నుంచి అర్హులైన అభ్యర్థుల వివరాలను పరిశీలకులు నమోదు చేసుకున్నట్టు తెలిసింది. ఏఐసీసీ సమావేశాల తరువాతనే మిగిలిన రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లలోని మండల కేం ద్రాల్లో అభిప్రాయ సేకరణను ఏఐసీసీ సమావేశాల తరువాత నిర్వహించనున్నట్టు తెలిసింది. ఆ పర్యటన వివరాలను కూడా గోప్యంగా ఉంచే యత్నంలో జిల్లా నాయకులున్నారు. -
భవిష్యత్తులో బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని భవిష్యత్తులో ఏదో ఓ రోజు వెనకబడిన కులస్థులు(బీసీ)లకు దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (విహెచ్) జోస్యం చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వస్తున్న దశలో హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు పదేపదే డిమాండ్ చేయడం సరికాదని ఆయన వాఖ్యానించారు. తమకు హైదరాబాద్, భద్రచలంతో కూడిన తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాని రాయల్ తెలంగాణను తాము ఎప్పటికి ఒప్పుకోనే ప్రసక్తి లేదని వీహెచ్ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది... ఆ నేపథ్యంలో రాష్ట్ర విభజన అడ్డుకుంటామని ఆ క్రమంలో అవసరమైతే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను వీహెచ్ ఈ సందర్బంగా ఖండించారు. అశోక్ బాబు చేసిన వ్యాఖ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదంటూ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నేతలను ఈ సందర్బంగా వీహెచ్ ప్రశ్నించారు.