బాబుగారూ... ఉద్ధరణ ఇదేనా?
బాబుగారూ... ఉద్ధరణ ఇదేనా?
Published Sun, Mar 9 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘రాష్ట్రంలో 100 అసెంబ్లీ స్థానాలు బీసీలకే.... తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే సీఎం పీఠం బడుగులకే...బీసీల తలరాతలు మారాలి... వారే ఫైళ్ల మీద సంతకాలు చేయాలి...’ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలివి. బీసీలను ఉద్ధరించేది తమ పార్టీయేనని, బీసీలంతా టీడీపీ వైపే ఉంటారని ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. కానీ బాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదని, దీనికి మన జిల్లానే నిదర్శనంగా నిలుస్తుందనే చర్చ జోరుగా నడుస్తోంది. జిల్లా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న బీసీ నేతలు, కార్యకర్తల పరిస్థితి దయనీయంగా ఉందని స్వయంగా ఆ పార్టీ శ్రేణులే వాపోతున్నాయి. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి పసుపు జెండా భుజాన మోస్తున్న మాకు ఒరిగిందేమీ లేదని బీసీ వర్గాలకు చెందిన తెలుగుతమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కాగా మిగిలిన నాలుగు (మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు) స్థానాల్లోనూ అగ్రవర్ణాలకు చెందిన నేతలే ఇన్‌చార్జులుగా ఉన్నారని, అగ్రవర్ణాలకే టికెట్లిచ్చేందుకు రంగం సిద్ధమవుతోందని, ఈసారి కూడా బీసీలకు ఒక్కసీటైనా ఇచ్చేది అనుమానమేనని, ఇన్నాళ్లూ తాము పడిన శ్రమ ఏమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. సమర్థ నాయకులు లేని పక్షంలో ఎవరికిచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని, బీసీలకు అసెంబ్లీ స్థానం కేటాయించే అవకాశం ఉన్నా, అందుకు సమర్థవంతమైన నాయకులున్నా పార్టీ అధినాయకత్వం వారిని పట్టించుకోవడం లేదని అంటున్నారు.
అన్నింటా వారే...
జిల్లాలో జనరల్ నియోజకవర్గాలయిన ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలకు ఇన్‌చార్జులుగా ప్రస్తుతం అగ్రవర్ణాలకు చెందిన నేతలే ఉన్నారు. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, పాలేరు నుంచి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కొత్తగూడెంలో కోనేరు చిన్నిలను ఇన్‌చార్జులుగా అధికారికంగా ప్రకటించారు. ఖమ్మం పార్లమెంటు నుంచి ఎలాగూ నామా నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో టికెట్లు కూడా వీరికే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీసీ వర్గాలకు చెందిన తెలుగుతమ్ముళ్లలో ఆవేదన వ్యక్తమవుతోంది. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి... డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్‌గా పనిచేసి, ఎమ్మెల్యేగా గతంలో పోటీచేసిన అనుభవమున్న బీసీ వర్గానికి చెందిన బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారని, పార్టీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్నారని, ఆయనతో పాటు ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకుడిగా పేరున్న మదార్‌సాబ్ కూడా ఎమ్మెల్యేగా పోటీచేసే స్థాయి ఉన్న నాయకుడేనని, పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్ జిల్లా నుంచి పిలిపించుకున్న అతికొద్ది మంది నాయకులలో ఆయన ఒకరని,
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉందని, వీరున్నప్పటికీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీసీలకు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పాలేరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా బాలసాని లక్ష్మీనారాయణ పేరును పరిశీలించవచ్చని, పాల్వంచ రామారావు అనే బీసీ నాయకుడున్నారని, ముదిగొండ మండలానికి చెందిన ఆయన జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడుగా ఉన్నారని, గతంలో పాలేరు నియోజకవర్గంలో ఉన్న ముదిగొండ మండలం మధిర నియోజకవర్గంలోకి వెళ్లినా రామారావుకు పాలేరులో మంచి సంబంధాలే ఉన్నాయని, దశాబ్దాల తరబడి పార్టీలో పనిచేస్తున్నారని వీరి పేర్లు పరిశీలించవచ్చనేది తమ్ముళ్ల అభిప్రాయం. వీరితో పాటు కూసుమంచి మండలానికి చెందిన కూరపాటి వెంకటేశ్వర్లు కూడా ఎమ్మెల్యే బరిలో ఉండదగిన వ్యక్తే అని, చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇందరున్నా ఆ నియోజకవర్గంలోనూ ఇన్‌చార్జి పదవి బీసీలకివ్వలేదని అంటున్నారు. కొత్తగూడెం విషయానికి వస్తే అక్కడ ఇన్‌చార్జిగా కోనేరు చిన్నిని ప్రకటించారు. టికెట్ కూడా ఆయనకే ఇచ్చే అవకాశాలున్నాయి. కానీ పాల్వంచ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బరపాటి వాసు అనే బీసీ నాయకుడు పార్టీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని, ఆయనతో పాటు రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి హోదాలో బాలకృష్ణగౌడ్, మరో నేత సంతోష్‌గౌడ్ ఉన్నారని, వీరినీ పక్కనపెట్టేశారని తమ్ముళ్లు వాపోతున్నారు.
బీసీలకు ఇవ్వకపోగా....
జిల్లా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న బీసీలను జెండాలు మోసే కార్యకర్తలుగా ఉపయోగించుకోవాలి తప్ప నాయకులుగా ఎదగనీయకూడదనే భావనతో ఇటు జిల్లా నాయకత్వం, అటు రాష్ట్ర పార్టీ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే బీసీల మధ్య పోటీ పెడితే వారే కొట్టుకుంటారని, అప్పుడు ఇతర వర్గాలకు టికెట్ ఇవ్వచ్చనే ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారనే చర్చ కూడా నడుస్తోంది. పాలేరు నియోజకవర్గం నుంచి బాలసాని లక్ష్మీనారాయణ పేరును పరిశీలించే అవకాశం ఉందన్న ఆలోచనతో ఆయనకు పోటీగా ల్యాంకో సంస్థలో పనిచేస్తున్న ఉన్నతోద్యోగి కందిమళ్ల వెంకట నాగప్రసాద్‌ను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి ఆయనది ఆశ్వారావుపేట నియోజకవర్గం. హంగూ, ఆర్భాటాలతో పార్టీలో చేర్పించి, చేరిన రోజే రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి పదవిని ఇప్పించారు. కేవలం ఒక వర్గానికి చెందిన బాలసాని లక్ష్మీనారాయణను పాలేరు నియోజకవర్గానికి రానీయకుండా వ్యూహాత్మకంగా అడ్డుకునేందుకే నాగప్రసాద్‌ను మరో వర్గం బరిలో నిలిపింది తప్ప బీసీలకు అసెంబ్లీ టికెట్ ఇప్పిద్దామన్న ఆలోచన మాత్రం వారికి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నాళ్లు పార్టీని పట్టుకుని వేలాడినా ఫలితం లేదనే భావనతో జిల్లాలోని బీసీ కేడర్ పార్టీకి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
Advertisement
Advertisement