కందుకూరులో 1989 తరువాత మళ్లీ బీసీకి అవకాశం
యాదవ సామాజిక వర్గానికి చెందిన బుర్రాకు టికెట్
మరోసారి కమ్మ సామాజిక వర్గానికే టీడీపీ ప్రాధాన్యం
కందుకూరు: కందుకూరు నియోజకవర్గ రాజకీయ చరిత్రను వైఎస్సార్‌సీపీ పూర్తిగా తిరగరాసింది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయంలో సంచలనాలకు తెరలేపింది. అదే కోవలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త రాజకీయాలకు నాంది పలికింది. కందుకూరు నుంచి దశాబ్దాలుగా రెండు సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులే పోటీ పడుతుండగా ఆ సంప్రదాయాన్ని తిరగరా సింది. తొలిసారి వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో నూత న శకాన్ని మొదలుపెట్టింది. 1951లో కందుకూరు నియోజకవర్గం ఏర్పడింది. ఆ తరువాత నుంచి 2019 ఎన్నికల వరకు మొత్తం పదిహేనుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
అందులో ఒక్కసారి మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ రెండు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు మాత్రమే పోటీ పడుతూ వస్తున్నారు. అది కూడా రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులే ప్రధానంగా నియోజకవర్గ రాజకీయాన్ని శాసించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే టీడీపీ తరుఫున తొలిసారి బీసీ అభ్యర్థి మోరుబోయిన మాలకొండయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ అప్పటి నుంచి 2019 వరకు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ రాజకీయ చరిత్రను తిరగరాసే నిర్ణయాన్ని ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అధిష్టానం తీసుకుంది.
శనివారం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కందుకూరు నియోజకవర్గం నుంచి బీసీ(యాదవ) వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌యాదవ్‌కు అవకాశం కల్పించింది. దీంతో దాదాపు 8 దశాబ్దాల కందుకూరు రాజకీయ చరిత్రలో రెండోసారి బీసీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్‌యాదవ్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. కాగా టీడీపీ మాత్రం తన పాత సంప్రదాయా న్ని కొనసాగిస్తూ మరోసారి కమ్మ సామా జిక వర్గానికి చెందిన ఇంటూరి నాగేశ్వరరావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.
కందుకూరు నుంచే రాజకీయ ప్రస్థానం
ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి బుర్రా మధుసూదన్‌యాదవ్ తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. కందుకూరు మండలం కంచరగుంటకు చెందిన బుర్రా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడ్డారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2012 నుంచి 2014 వరకు పార్టీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. అయితే అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 40వేలకు పైగా ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించి ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కనిగిరి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం మరోసారి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కందుకూరు నుంచే ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడైతే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో అదే నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తలపడనున్నారు. వైఎస్సార్‌సీపీ అండతో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుర్రా తన సొంత నియోజకవర్గమైన కందుకూరులో వెనుకబడిన వర్గ అభ్యర్థిగా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.
సంతోషం వ్యక్తం చేస్తున్న బీసీలు
కందుకూరు రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తూ బీసీ వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌యాదవ్‌ను ఎమ్మెల్యే అభ్యర్థి గా ఎంపిక చేయడంపై నియోజకవర్గంలోని బీసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 8 దశాబ్దాల నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని వైఎస్సార్‌సీపీ చేసిందని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బీసీల పట్ల నిబద్ధతకు ఇది ఒక నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 80వేల మంది ఓటర్లు బీసీలు ఉన్నారు. వారంతా ఏకతాటిపైకి వచ్చి బీసీ వర్గానికి చెందిన బుర్రాకు అండగా ఉంటామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో వచ్చే ఎన్నికల తరువాత నియోజకవర్గ రాజకీయంలో సరికొత్త శకం ప్రారంభం కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment