kandukur constituency
-
సింహపురిలో రాజకీయ చరిత్రను తిరగరాసిన వైఎస్సార్సీపీ
కందుకూరు: కందుకూరు నియోజకవర్గ రాజకీయ చరిత్రను వైఎస్సార్సీపీ పూర్తిగా తిరగరాసింది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయంలో సంచలనాలకు తెరలేపింది. అదే కోవలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త రాజకీయాలకు నాంది పలికింది. కందుకూరు నుంచి దశాబ్దాలుగా రెండు సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులే పోటీ పడుతుండగా ఆ సంప్రదాయాన్ని తిరగరా సింది. తొలిసారి వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో నూత న శకాన్ని మొదలుపెట్టింది. 1951లో కందుకూరు నియోజకవర్గం ఏర్పడింది. ఆ తరువాత నుంచి 2019 ఎన్నికల వరకు మొత్తం పదిహేనుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో ఒక్కసారి మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ రెండు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు మాత్రమే పోటీ పడుతూ వస్తున్నారు. అది కూడా రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులే ప్రధానంగా నియోజకవర్గ రాజకీయాన్ని శాసించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే టీడీపీ తరుఫున తొలిసారి బీసీ అభ్యర్థి మోరుబోయిన మాలకొండయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ అప్పటి నుంచి 2019 వరకు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ రాజకీయ చరిత్రను తిరగరాసే నిర్ణయాన్ని ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధిష్టానం తీసుకుంది. శనివారం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కందుకూరు నియోజకవర్గం నుంచి బీసీ(యాదవ) వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌యాదవ్‌కు అవకాశం కల్పించింది. దీంతో దాదాపు 8 దశాబ్దాల కందుకూరు రాజకీయ చరిత్రలో రెండోసారి బీసీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్‌యాదవ్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. కాగా టీడీపీ మాత్రం తన పాత సంప్రదాయా న్ని కొనసాగిస్తూ మరోసారి కమ్మ సామా జిక వర్గానికి చెందిన ఇంటూరి నాగేశ్వరరావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. కందుకూరు నుంచే రాజకీయ ప్రస్థానం ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి బుర్రా మధుసూదన్‌యాదవ్ తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. కందుకూరు మండలం కంచరగుంటకు చెందిన బుర్రా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడ్డారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2012 నుంచి 2014 వరకు పార్టీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. అయితే అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 40వేలకు పైగా ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించి ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కనిగిరి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం మరోసారి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కందుకూరు నుంచే ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడైతే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో అదే నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తలపడనున్నారు. వైఎస్సార్సీపీ అండతో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుర్రా తన సొంత నియోజకవర్గమైన కందుకూరులో వెనుకబడిన వర్గ అభ్యర్థిగా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. సంతోషం వ్యక్తం చేస్తున్న బీసీలు కందుకూరు రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తూ బీసీ వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌యాదవ్‌ను ఎమ్మెల్యే అభ్యర్థి గా ఎంపిక చేయడంపై నియోజకవర్గంలోని బీసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 8 దశాబ్దాల నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని వైఎస్సార్సీపీ చేసిందని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బీసీల పట్ల నిబద్ధతకు ఇది ఒక నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 80వేల మంది ఓటర్లు బీసీలు ఉన్నారు. వారంతా ఏకతాటిపైకి వచ్చి బీసీ వర్గానికి చెందిన బుర్రాకు అండగా ఉంటామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో వచ్చే ఎన్నికల తరువాత నియోజకవర్గ రాజకీయంలో సరికొత్త శకం ప్రారంభం కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన డా.వి.పెంచలయ్య
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కందుకూరుకు చెందిన డా.వి.పెంచలయ్య బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డా.పెంచలయ్యకు సీఎం జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో డా.పెంచలయ్యతో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు వి.అరవింద, డాక్టర్ వి.ఐశ్వర్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: విశాఖలో ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు పోటీలు -
టీడీపీలో వర్గపోరు
కందుకూరు: కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. నామినేటెడ్ పదువుల వ్యవహారంలో మొదలైన వర్గపోరు రోజు రోజుకూ తారాస్థాయికి చేరుతోంది. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా మొదలైన నేతల మధ్య విభేదాలు ఇటీవల వేరుకుంపట్లు పెట్టుకునే స్థాయికి దారితీసింది. ఇంతకాలం అంతర్గతంగా సాగుతున్న నేతల మధ్య విభేదాలు ఇటీవల జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ జన్మదిన వేడుకల సందర్బంగా ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలోనే బుధవారం కందుకూరులో మంత్రుల పర్యటన సమయంలోనూ మరోసారి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే దివి శివరాంని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పార్టీలోని ఓ వర్గం బుధవారం ఉదయం శివరాం ఇంట్లో ఏర్పాటు చేసిన మంత్రుల అల్పాహార విందు కార్యక్రమానికి హాజరుకాలేదు. వీరిలో ప్రధానంగా పార్టీ సీనియర్ నాయకులైన ఘట్టమనేని చెంచురామయ్య, కండ్రా హరిబాబు, ఎంపీపీ అనూరాధ భర్త గుళ్లా శ్రీను, జెడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్, చల్లా నాగేశ్వరరావు, కొడాలి కోటేశ్వరరావు, సోమినేని రవీంద్ర, పొడపాటి శ్రీను, చంద్రమౌళి తదితర నాయకులున్నారు. తమవర్గం వరకు జనార్థన్‌కు మద్దతుగా భారీ కార్ల ర్యాలీ ఏర్పాటు చేసుకున్నారు. ఒంగోలు నుంచి జనార్థన్‌కు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన నాయకులు కందుకూరులో మాత్రం శివరాం ఇంటికి వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయారు. శివరాం ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డి, పైడికాయల మాణిక్యాలరావు, రావెల కిశోర్‌బాబులు, నారాయణలతోపాటు ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దామచర్ల జానార్ధన్, బాలవీరాంజనేయస్వామి, కరణం బలరాం తదితర నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శివరాం వర్గానికి చెందిన కొందరు నాయకులు మాత్రమే హాజరయ్యారు. ఇటీవల శివరాం వైఖరిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న మరోవర్గం నాయకులు కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరుపై మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో తనకు వ్యతిరేకంగా సొంతంగా కార్యక్రమాలు చేసుకుపోతున్న అసమ్మతి వర్గం నాయకులను బుజ్జగించే ప్రయత్నాలు శివరాం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే శివరాం సోదరుడు, పార్టీ సీనియర్ నాయకుడైన దివి లింగయ్యనాయుడు సైతం మంత్రి కామినేని పాల్గొన్న బి.జె.పి. కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం గమనార్హం. దీంతో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలతో నాయకులు మరోసారి బజారుకెక్కారు. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ... తెలుగుదేశం పార్టీలో వర్గపోరుకు నామినేటెడ్ పదవుల భర్తీనే ప్రధాన కారణం. మార్కెట్‌యార్డు చైర్మన్ పదవి ఆశించిన పలువురు సీనియర్ నాయకులు శివరాం అనుసరించిన వైఖరితో తీవ్ర ఆవేదన చెందారు. ఈ పదవిని శివరాం తన ప్రధాన అనుచరుడైన తల్లపనేని వెంకటేశ్వర్లుకు కట్టబెట్టడమే ప్రధాన కారణం. పలు కాంట్రాక్టులతోపాటు అన్ని విషయాల్లో ఒక్క తల్లపనేనికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడంపై సీనియర్ నాయకులు గతకొంత కాలంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయినప్పటికీ ఆయన వైఖరిలో మార్పురాకపోవడంతో అసమ్మతి స్వరం పెరుగుతూ వస్తోంది. -
ఓటమి భయం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా తెలుగుదేశం నాయకులను ఓటమి భయం వెంటాడుతోంది. పార్టీ గెలుపు కోసం ఎలాంటి చర్యలకై నా సిద్ధపడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం నేతలు, రాత్రి సమయాల్లో గ్రామాలకు వెళ్లి బేరాలు కుదుర్చుకుంటున్నారు. విచ్చల విడిగా డబ్బు వెదజల్లుతున్నారు. పార్టీ అధిష్టానం చెప్పినట్టు ఆస్తులు అమ్ముకొనైనా, డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. అయితే ప్రజలకు గత టీడీపీ పాలనలో జరిగిన అరాచకాలు గుర్తుకు వస్తున్నాయి. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలు సైతం ప్రచారానికి వెనుకంజ వేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులతో ప్రచారం అయిందనిపిస్తున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి అంశాన్ని పక్కన పెడితే, తెలుగుదేశం హయాంలో జరిగిన హత్యలు, లూటీలను నెమరువేసుకుని, ‘అమ్మో మళ్లీ ఈ నాయకులేనా’ అని ఆందోళన చెందుతున్నారు. కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పాలనలో రెండు, మూడు హత్యలు వరుసగా జరిగాయి. నిరసనగా దుకాణాలు మూయించారు. మూయని దుకాణాల్లో లూటీలు చేయించారు. పలు ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేయించారు. ఆ సమయంలో కూడా ప్రస్తుతం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివి శివరాం ఎమ్మెల్యేగా వున్నారు. మళ్లీ అదే అభ్యర్థి ఈ ఎన్నికల్లో పోటీకి దిగడంతో ఆ నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఏఎంసీ చైర్మన్ పోకల కొండయ్య ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీలో కొనసాగాలా వద్దా అని పునరాలోచనలో పడ్డారు. మొదట ఒకటి రెండు సార్లు ప్రచారంలో పాల్గొన్నా, దివి శివరాం మాట్లాడే విధానాన్ని భరించలేక వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇటీవల ఆయన ఒక పత్రికా విలేకరిపై కూడా నానా దుర్భాషలాడిన విషయం విదితమే. అడ్డూ అదుపు లేకుండా మాట్లాడటం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య అంటూ అనేక మంది ఆయనకు దూరమైన విషయం ఒకటైతే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోలూటీల పర్వం మళ్లీ కొనసాగుతుందనే ఆందోళనలో ఉన్నారు. తొలుత ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ భావించారు. అయితే ఆయనకు సీటు దక్కనీయకుండా చేయడంలో దివి శివరాం విజయం సాధించారు. దీంతో దామచర్ల వర్గం శివరాంకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఎన్నికల ఖర్చును పక్కవారిపై రుద్దే ప్రయత్నం చేయడంతో కొంత మంది నాయకులు కూడా ఆయనకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రచారం కూడా అంతంత మాత్రంగానే చేస్తున్న ఆయన ఈ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొంటారో వేచి చూడాల్సి ఉంది. -
నిధులున్నా..తీరని దాహం
కందుకూరు రూరల్, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా కోట్ల రూపాయల నిధులున్నా..గ్రామీణ ప్రజల దాహార్తి తీరడం లేదు. మంచినీటి పథకాల పనులు ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. కందుకూరు నియోజకవర్గ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 21 గ్రామాలకు ప్రపంచబ్యాంకు నిధులు రూ. 9.96 కోట్లు మంజూరు చేశారు. 2011-12 సంవత్సరాల్లో నిధులు విడుదల చేశారు. తీవ్ర మంచినీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలను ఎంపిక చేసి నిధులు కేటాయించారు. మంజూరై ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కుదుర్చుకున్న అగ్రిమెంట్లు పూర్తయి, రెండో సారి చేసుకున్న అగ్రిమెంట్ కాలం కూడా ముగుస్తున్నా పథకాలు మాత్రం పూర్తికావడం లేదు. కందుకూరు మండలంలో ఆరు గ్రామాలకు రూ. 4.17 కోట్లు మంజూరయ్యాయి. 2012లో మదనగోపాలపురానికి రూ. 30 లక్షలు, అనంతసాగరంలో రూ. 36లక్షలతో నిర్మిస్తున్న మంచినీటి పథకాల పనుల్లో కేవలం ట్యాంకులు మాత్రమే నిర్మించి రంగులు వేసి అలంకారప్రాయంగా వదిలేశారు. ఇంకా పైపు లైన్ల పనులు మొదలు పెట్టలేదు. 42011 జూన్‌లో జి.మేకపాడుకు రూ.51.40 లక్షలు మంజూరయ్యాయి. అప్పటి నుంచి టెండర్ల ప్రక్రియ పెండింగ్‌లో పడి ఎట్టకేలకు రెండు నెలల నుంచి పనులు ప్రారంభించారు. ఓవర్ హెడ్ ట్యాంకు పునాదుల స్థాయిలో ఉంది. 4పలుకూరుకు రూ.2.78 కోట్లు మంజూరైతే ఇప్పటి వరకు టెండర్లు పూర్తి కాలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం దగ్గర పడుతుండడంతో తిరిగి నిధుల మార్పు జరిగితేగానీ టెండర్లు పిలిచే అవకాశం ఉండదని అధికారులు చెప్తున్నారు. 4గుడ్లూరు మండలంలో తొమ్మిది గ్రామాలకు రూ. 3.48 కోట్లు మంజూరయ్యాయి. చేవూరు రూ. 50 లక్షలు, మొగుళ్లూరు రూ.40.04 లక్షలు, పరకొండపాడు రూ. 45 లక్షలు, అడవిరాజుపాలెం రూ. 50 లక్షలు, కొత్తపేట రూ. 40 లక్షల, నాయుడపాలెం రూ. 20 లక్షలు, ఏలూరుపాడు రూ.30 లక్షలు, నరసాపురం రూ.45 లక్షలు, దప్పళంపాడు రూ. 28.44 లక్షలు మంజూరయ్యాయి. దప్పళంపాడు పథకం పూర్తి కాగా నరసాపురంలో ఇంకా ట్యాంకు నిర్మాణానికి స్థల గుర్తింపు పనిలోనే ఉన్నాయి. మిగిలిన ఏడు గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులు పూర్తికాగా నీరు సరఫరా అయ్యే స్కీమ్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఆయా గ్రామాలకు నీటి వసతి ఉన్న ప్రాంతాల నుంచి మోటార్ల ద్వారా ట్యాంకులకు నీరు సరఫరా అయ్యేందుకు స్కీమ్ పనులు మధ్యలోనే నిలిచిపోగా, కొన్ని పైపు లైన్ల దశలో ఉన్నాయి. 4ఉలవపాడు మండలంలోని మూడు గ్రామాలకు రూ. 1.20 కోట్లు మంజూరయ్యాయి. రూ. 45 లక్షలతో జరుగుతున్న వీరేపల్లి మంచినీటి పథకం పైపులైన్లు నిర్మాణం దశలో ఉండగా, బద్దిపూడిలో రూ. 45 లక్షలతో జరుగుతున్న పనులు నీటి పథకం పనులు మోటార్ ఏర్పాటు పెండింగ్‌లో ఉండడం వల్ల నిలిచిపోయింది. ఇక పెదపల్లెపాలేనికి రూ. 30.87 లక్షలు మంజూరుగా ఇంకా టెండర్లు పిలవకపోవడంతో పథకం నిలిచిపోయింది. తిరిగి టెండర్లు పిలవడం కష్టమేనని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే టెండర్లు నిలిచిపోయాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. వలేటివారిపాలెం మండలంలోని పోలేనిపాలెం, పోలినేనిచెరువు గ్రామాల్లో రూ. 49 లక్షలతో నిర్మిస్తున్న మంచినీటి పథకం పనులు జరుగుతూనే ఉన్నాయి. ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి పైపులైన్లు వేస్తున్నారు. లింగసముద్రం మండలంలోని కొత్తపేట, వాకమాళ్లవారిపాలెంలో రూ. 60.46 లక్షలతో పథకాలు నిర్మిస్తున్నారు. కొత్తపేట పథకం పూర్తికాగా, వాకమాళ్లవారిపాలెంలో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించి పైపు లైన్లు అసంపూర్తిగా ఏర్పాటు చేశారు. పథకం పనులు పూర్తి స్థాయిలో కాలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మంచినీటికి నానా అవస్థలు పడుతున్నారు. బిల్లుల కోసమే ట్యాంకులకు రంగులు.. పథకాలకు సంబంధించిన ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి రంగులు వేసి అలంకారప్రాయంగా ఉంచారు. ట్యాంకులకు నీరు సరఫరా అయ్యే బోర్ల పనులు పూర్తి కాలేదు. గ్రామంలో ప్రతి బజారుకు పైపులైన్లు ఏర్పాటు చేసి కుళాయిలు నిర్మించాల్సి ఉండగా ఆ పనులను వదిలే శారు. బిల్లుల మంజూరు కోసమే హడావిడిగా ట్యాంకులు నిర్మించి రంగులు వేశారని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. నిర్మించిన ట్యాంకులకు క్యూరింగ్ కూడా సక్రమంగా చేయకుండా రంగులేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనుల వద్దే ఉండి పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు వారి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మంచినీరు అందడం కష్టమే... మంచినీటి పథకాలకు సంబంధించిన బోర్లు ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పుష్కళంగా నీరుండే ప్రాంతాల్లో బోర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు ఆలోచించడం లేదు. కందుకూరు మండలంలోని అనంతసాగరంలో ఓవర్‌హెడ్ ట్యాంకుకు నీరు నింపేందుకు గ్రామం వద్ద ఉన్న కుంటలో మోటార్లు ఏర్పాటు చేశారు. అంత కు ముందు ట్యాంకు వద్దే బోరు వేసినా చుక్క నీరు పడకపోవడంతో కుంట వద్ద వేస్తున్నారు. అక్కడ నీరు తాగేందుకు ఉపయోగపడవని గ్రామస్తులు చెప్తున్నారు. లక్షలు వెచ్చించి పథకాలు నిర్మించినా నీరు అందకపోతే ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా అదే కుంట వద్ద డెరైక్ట్ పంపింగ్ ద్వారా పైపు లైన్లు ఏర్పాటు చేశారు. నీరు సక్రమంగా అందక ఆ పథకం మూలనపడింది. ఈ విషయం తెలిసి కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అక్కడే బోరు వేయడం గమనార్హం. ఇక పోతే మదనగోపాలపురంలో కూడా పక్కనే మన్నేరులో బోర్లు ఏర్పాటు చేసి నీరు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ కూడా ఇసుక అక్రమ తవ్వకాలు జరగడంతో భూగర్భజలాలు అడుగంటి ప్రస్తుతం ఉన్న మంచినీటి పథకాలకు నీరందడం లేదు. లోతుగా బోర్లు వేస్తే నీరు ఉప్పగా మారుతాయని చెప్తున్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతంలో బోర్లు వేసి నీటి సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పనులు జరుగుతున్నాయి: విశ్వనాథరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి డీఈ ప్రపంచ బ్యాంక్ నిధులతో మంచినీటి పథకాల పనులు జరుగుతున్నాయి. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. ఈ ఏడాది నవంబర్ లోపు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.