కందుకూరు రూరల్, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా కోట్ల రూపాయల నిధులున్నా..గ్రామీణ ప్రజల దాహార్తి తీరడం లేదు. మంచినీటి పథకాల పనులు ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. కందుకూరు నియోజకవర్గ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 21 గ్రామాలకు ప్రపంచబ్యాంకు
నిధులు రూ. 9.96 కోట్లు మంజూరు చేశారు.
2011-12 సంవత్సరాల్లో నిధులు విడుదల చేశారు. తీవ్ర మంచినీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలను ఎంపిక చేసి నిధులు కేటాయించారు. మంజూరై ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కుదుర్చుకున్న అగ్రిమెంట్లు పూర్తయి, రెండో సారి చేసుకున్న అగ్రిమెంట్ కాలం కూడా ముగుస్తున్నా పథకాలు మాత్రం పూర్తికావడం లేదు.
కందుకూరు మండలంలో ఆరు గ్రామాలకు రూ. 4.17 కోట్లు మంజూరయ్యాయి. 2012లో మదనగోపాలపురానికి రూ. 30 లక్షలు, అనంతసాగరంలో రూ. 36లక్షలతో నిర్మిస్తున్న మంచినీటి పథకాల పనుల్లో కేవలం ట్యాంకులు మాత్రమే నిర్మించి రంగులు వేసి అలంకారప్రాయంగా వదిలేశారు. ఇంకా పైపు లైన్ల పనులు మొదలు పెట్టలేదు.
42011 జూన్‌లో జి.మేకపాడుకు రూ.51.40 లక్షలు మంజూరయ్యాయి.
అప్పటి నుంచి టెండర్ల ప్రక్రియ పెండింగ్‌లో పడి ఎట్టకేలకు రెండు నెలల నుంచి పనులు ప్రారంభించారు. ఓవర్ హెడ్ ట్యాంకు పునాదుల స్థాయిలో ఉంది.
4పలుకూరుకు రూ.2.78 కోట్లు మంజూరైతే ఇప్పటి వరకు టెండర్లు పూర్తి కాలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం దగ్గర పడుతుండడంతో తిరిగి నిధుల మార్పు జరిగితేగానీ టెండర్లు పిలిచే అవకాశం ఉండదని అధికారులు చెప్తున్నారు.
4గుడ్లూరు మండలంలో తొమ్మిది గ్రామాలకు రూ. 3.48 కోట్లు మంజూరయ్యాయి. చేవూరు రూ. 50 లక్షలు, మొగుళ్లూరు రూ.40.04 లక్షలు, పరకొండపాడు రూ. 45 లక్షలు, అడవిరాజుపాలెం రూ. 50 లక్షలు, కొత్తపేట రూ. 40 లక్షల, నాయుడపాలెం రూ. 20 లక్షలు, ఏలూరుపాడు రూ.30 లక్షలు, నరసాపురం రూ.45 లక్షలు, దప్పళంపాడు రూ. 28.44 లక్షలు మంజూరయ్యాయి.
దప్పళంపాడు పథకం పూర్తి కాగా నరసాపురంలో ఇంకా ట్యాంకు నిర్మాణానికి స్థల గుర్తింపు పనిలోనే ఉన్నాయి. మిగిలిన ఏడు గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులు పూర్తికాగా నీరు సరఫరా అయ్యే స్కీమ్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఆయా గ్రామాలకు నీటి వసతి ఉన్న ప్రాంతాల నుంచి మోటార్ల ద్వారా ట్యాంకులకు నీరు సరఫరా అయ్యేందుకు స్కీమ్ పనులు మధ్యలోనే నిలిచిపోగా, కొన్ని పైపు లైన్ల దశలో ఉన్నాయి.
4ఉలవపాడు మండలంలోని మూడు గ్రామాలకు రూ. 1.20 కోట్లు మంజూరయ్యాయి. రూ. 45 లక్షలతో జరుగుతున్న వీరేపల్లి మంచినీటి పథకం పైపులైన్లు నిర్మాణం దశలో ఉండగా, బద్దిపూడిలో రూ. 45 లక్షలతో జరుగుతున్న పనులు నీటి పథకం పనులు మోటార్ ఏర్పాటు పెండింగ్‌లో ఉండడం వల్ల నిలిచిపోయింది. ఇక పెదపల్లెపాలేనికి రూ. 30.87 లక్షలు మంజూరుగా ఇంకా టెండర్లు పిలవకపోవడంతో పథకం నిలిచిపోయింది. తిరిగి టెండర్లు పిలవడం కష్టమేనని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెప్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే టెండర్లు నిలిచిపోయాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. వలేటివారిపాలెం మండలంలోని పోలేనిపాలెం, పోలినేనిచెరువు గ్రామాల్లో రూ. 49 లక్షలతో నిర్మిస్తున్న మంచినీటి పథకం పనులు జరుగుతూనే ఉన్నాయి. ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి పైపులైన్లు వేస్తున్నారు. లింగసముద్రం మండలంలోని కొత్తపేట, వాకమాళ్లవారిపాలెంలో రూ. 60.46 లక్షలతో పథకాలు నిర్మిస్తున్నారు. కొత్తపేట పథకం పూర్తికాగా, వాకమాళ్లవారిపాలెంలో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించి పైపు లైన్లు అసంపూర్తిగా ఏర్పాటు చేశారు. పథకం పనులు పూర్తి స్థాయిలో కాలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మంచినీటికి నానా అవస్థలు పడుతున్నారు.
బిల్లుల కోసమే ట్యాంకులకు రంగులు..
పథకాలకు సంబంధించిన ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి రంగులు వేసి అలంకారప్రాయంగా ఉంచారు. ట్యాంకులకు నీరు సరఫరా అయ్యే బోర్ల పనులు పూర్తి కాలేదు. గ్రామంలో ప్రతి బజారుకు పైపులైన్లు ఏర్పాటు చేసి కుళాయిలు నిర్మించాల్సి ఉండగా ఆ పనులను వదిలే శారు. బిల్లుల మంజూరు కోసమే హడావిడిగా ట్యాంకులు నిర్మించి రంగులు వేశారని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు.
నిర్మించిన ట్యాంకులకు క్యూరింగ్ కూడా సక్రమంగా చేయకుండా రంగులేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనుల వద్దే ఉండి పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు వారి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
మంచినీరు అందడం కష్టమే...
మంచినీటి పథకాలకు సంబంధించిన బోర్లు ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పుష్కళంగా నీరుండే ప్రాంతాల్లో బోర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు ఆలోచించడం లేదు. కందుకూరు మండలంలోని అనంతసాగరంలో ఓవర్‌హెడ్ ట్యాంకుకు నీరు నింపేందుకు గ్రామం వద్ద ఉన్న కుంటలో మోటార్లు ఏర్పాటు చేశారు. అంత కు ముందు ట్యాంకు వద్దే బోరు వేసినా చుక్క నీరు పడకపోవడంతో కుంట వద్ద వేస్తున్నారు. అక్కడ నీరు తాగేందుకు ఉపయోగపడవని గ్రామస్తులు చెప్తున్నారు.
లక్షలు వెచ్చించి పథకాలు నిర్మించినా నీరు అందకపోతే ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా అదే కుంట వద్ద డెరైక్ట్ పంపింగ్ ద్వారా పైపు లైన్లు ఏర్పాటు చేశారు. నీరు సక్రమంగా అందక ఆ పథకం మూలనపడింది. ఈ విషయం తెలిసి కూడా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అక్కడే బోరు వేయడం గమనార్హం. ఇక పోతే మదనగోపాలపురంలో కూడా పక్కనే మన్నేరులో బోర్లు ఏర్పాటు చేసి నీరు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ కూడా ఇసుక అక్రమ తవ్వకాలు జరగడంతో భూగర్భజలాలు అడుగంటి ప్రస్తుతం ఉన్న మంచినీటి పథకాలకు నీరందడం లేదు. లోతుగా బోర్లు వేస్తే నీరు ఉప్పగా మారుతాయని చెప్తున్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతంలో బోర్లు వేసి నీటి సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పనులు జరుగుతున్నాయి: విశ్వనాథరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఇన్‌చార్జి డీఈ
ప్రపంచ బ్యాంక్ నిధులతో మంచినీటి పథకాల పనులు జరుగుతున్నాయి. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. ఈ ఏడాది నవంబర్ లోపు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.
నిధులున్నా..తీరని దాహం
Published Tue, Feb 11 2014 5:09 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement