World Bank funds
-
భారత్‌కు ప్రపంచ బ్యాంకు సాయం ఎంతంటే!
వాషింగ్టన్: మహమ్మారి కరోనాపై పోరుకు ప్రపంచ బ్యాంకు భారత్‌కు ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,600 కోట్లు) అత్యవసర సాయం ప్రకటించింది. ఈమేరకు భారత్ చేసిన అభ్యర్థనపై వరల్డ్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సమావేశం అనంతరం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు వరల్డ్ బ్యాంకు ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాలకు 1.9 బిలియన్ డాలర్ల అత్యవసర సాయం ప్రకటించగా.. దాంట్లో అత్యధికంగా భారత్‌కు 1 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టు వరల్డ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. స్క్రీనింగ్, కాంటాక్ట్ కేసుల ట్రేసింగ్, లేబొరేటరీ డయాగ్నోస్టిక్స్, వైద్యులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, నూతన ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు ఈ నిధులు వినియోగించనున్నారు. (చదవండి: ముందు జాగ్రత్తే మందు..) ఇక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోవిడ్-19 నిర్మూలనకు నిధులు కేటాయించిన ప్రపంచ బ్యాంకు దక్షిణాసియాలో భారత్ తర్వాత.. పాకిస్తాన్‌కు 200 మిలియన్ డాలర్లు, ఆఫ్గనిస్థాన్‌కు 100 మిలియన్ డాలర్లు, మాల్దీవులకు 7.3 మిలియన్ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ పురోగతికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రానున్న15 నెలల్లో 160 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై ప్రణాళికలు వేస్తున్నామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ మొత్తాన్ని దారిద్య్ర నిర్మూలనపై, నిరుపేదలను ఆదుకునేందుకు, పర్యావరణ పరిరక్షణకు ఖర్చు చేస్తామని పేర్కొంది. కాగా, భారత్‌లో ఇప్పటివరకు 2500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 76 మంది చనిపోయారు. (చదవండి: ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు) -
బాబు అవినీతితో ప్రపంచబ్యాంకు బెంబేలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. పర్యావరణ, సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్ర దుష్ప్రభావం చూపేలా అమరావతిలో ప్రాజెక్టులు చేపట్టారని విమర్శించారు. కిలోమీటర్ రోడ్డుకు ఏకంగా రూ. 32 కోట్ల చొప్పున కాంట్రాక్టు కట్టబెట్టడం ఎక్కడైనా ఉందా? అని విస్మయం వ్యక్తం చేశారు. రైతులు, మేధావులు, ఎన్జీవోల ఫిర్యాదులపై స్పందించి ప్రపంచబ్యాంకు బృందం నిర్వహించిన తనిఖీల్లో చంద్రబాబు బండారం బట్టబయలైందని తెలిపారు. దాంతో అమరావతికి రుణమిచ్చే ముందు సమగ్ర దర్యాప్తు చేయాలని నిర్ణయించిందన్నారు. కానీ అది దేశ సార్వభౌమాధికారానికి భంగకరమని కేంద్ర ప్రభుత్వం భావించిందని మంత్రి వివరించారు. కేంద్రం సూచనల మేరకే అమరావతికి రుణ సహాయం ప్రతిపాదనను ప్రపంచబ్యాంకు రద్దు చేసుకుందని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో సోమవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ అమరాతికి రుణ సహాయం చేసే ప్రతిపాదనను ప్రపంచబ్యాంకు ఉపసంహరించుకున్న అంశంలో తమ ప్రభుత్వ ప్రమేయమేమీ లేదంటూ వాస్తవాలను వివరించారు. తమ ప్రభుత్వ అభివృద్ధి నమూనాకు సానుకూలంగా స్పందించిన ప్రపంచబ్యాంకు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు 328 మిలియన్ డాలర్ల రుణ సహాయం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని ఆయన శాసనసభకు తెలిపారు. భూములివ్వని రైతుల పొలాలను తగులబెట్టారు.. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది ల్యాండ్ పూలింగ్ కాదని ల్యాండ్ ఫూలింగ్ అని మంత్రి వ్యాఖ్యానించారు. అధికార రహస్యాలను పరిరక్షిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని విరుచుకుపడ్డారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి తన బినామీల పేరిట భారీగా భూములు కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులను బెదిరించారని, వారి తోటలను టీడీపీ నేతలే తగులబెట్టించారని మండిపడ్డారు. అమరావతిలో రోడ్ల నిర్మాణానికి టెండర్లలో టీడీపీ ప్రభుత్వం యథేచ్ఛగా అవినీతికి పాల్పడిందన్నారు. 5, 6, 7 ప్యాకేజీల టెండర్లను తమ సన్నిహిత సంస్థ ఎన్సీసీ సంస్థకు దక్కేలా చంద్రబాబు వ్యవహారం నడిపారని వివరించారు. ప్రపంచబ్యాంకు తక్కువ వడ్డీకి రుణం ఇస్తుంటే అమరావతి బాండ్ల పేరుతో అధిక వడ్డీకి రూ. 2 వేల కోట్లు బాండ్లు ఎందుకు సేకరించారని ప్రశ్నించారు. తమ సన్నిహితులైన బడా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసమే బాండ్లు జారీ చేశారని విమర్శించారు. తనిఖీలతో బండారం బట్టబయలు అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) నుంచి దాదాపు రూ. 5 వేల కోట్ల రుణాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో అనుమతిచ్చిందని బుగ్గన తెలిపారు. అందులో ప్రపంచబ్యాంకు రూ. 2,100 కోట్లు, ఏఐఐబీ రూ. 1,500 కోట్లు రుణాన్ని సమకూర్చితే... ఏపీ ప్రభుత్వం తన వాటాగా రూ. 1,500 కోట్లు కేటాయించేలా నిర్ణయించారని వివరించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తూ, పర్యావరణం, మానవహక్కులకు భంగం కలిగిస్తూ సాగించిన కుంభకోణంపై పెద్ద సంఖ్యలో రైతులు, మేధావులు, ఎన్జీవోలు ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. దాంతో ప్రపంచబ్యాంకు నియమించిన తనిఖీల బృందం అమరావతి ప్రాంతాన్ని సందర్శించిందని చెప్పారు. పర్యావరణ, సామాజిక, ఆర్థిక రంగాలపై పడే ప్రభావాన్ని మదింపు చేసి 2017, సెప్టెంబరు 27న తన తొలి నివేదిక, నవంబరు 27న రెండో నివేదిక, 2018, జూన్ 26న మూడో నివేదికను, 2019, మార్చి 29న తన తుది నివేదికను ప్రపంచబ్యాంకుకు సమర్పించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు మీద చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నదానికీ, రైతులు, ఎన్జీవోలు చెబుతున్న అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ప్రపంచబ్యాంకు తనిఖీల బృందం నిర్ధారించిందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల జరిగే నష్టాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండనుందని, పర్యావరణ, సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని కూడా తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో లోతుగా దర్యాప్తు నిర్వహించాలని ఈ తనిఖీల బృందం సిఫార్సు చేసిందన్నారు. అంతవరకు రుణ మంజూరు చేయకూడదని నిర్ణయించిందని తెలిపారు. అది దేశ సార్వభౌమాధికారానికి భంగకరం అమరావతి ప్రాజెక్టుపై సమగ్ర దర్యాప్తు జరపాలన్న ప్రపంచబ్యాంకు తనిఖీల కమిటీ సిఫార్సుపై తమ ప్రభుత్వ వైఖరి ఏమిటని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ 2019, జూలై 1న తమను అడిగిందని బుగ్గన తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినందున ఈ విషయంలో నిర్ణయం తీసుకోడానికి తమకు నెలరోజులు గడువు కావాలని కేంద్రాన్ని కోరామని ఆయన వివరించారు. కానీ ప్రపంచబ్యాంకు దర్యాప్తునకు అనుమతించాలా వద్దా అనేదానిపై జూలై 15లోగా తమ వైఖరి తెలపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిందన్నారు. దాంతో దీనిపై కేంద్ర ఆర్థిక శాఖే తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని మంత్రి బుగ్గన వెల్లడించారు. ఓ ప్రాజెక్టుకు రుణసహాయం చేసేముందే దర్యాప్తు చేయడం దేశ సార్వభౌమాధికారానికి భంగకరమైన అంశంగా కేంద్ర ప్రభుత్వం భావించిందని మంత్రి బుగ్గన తెలిపారు. ఇంతకుముందు దేశంలో ఏ ప్రాజెక్టు విషయంలో కూడా ఇలా చేయలేదని కేంద్రం గుర్తించిందన్నారు. అందుకే అమరావతి ప్రాజెక్టుకు రుణ సహాయం ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సమాచారమివ్వడంతో ప్రపంచబ్యాంకు సమ్మతించందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే అమరావతికి రుణసహాయం ప్రతిపాదనపై ప్రపంచబ్యాంకు వెనక్కితగ్గిందని చంద్రబాబు, టీడీపీ నేతలు, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా అధిపతులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి మీరిచ్చింది రూ. 277 కోట్లే మేము రూ. 500 కోట్లు కేటాయించాం శాసన మండలిలో మంత్రి బుగ్గన గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరిట విరాళాల కోసం తిరుపతిలో హుండీ ఏర్పాటు చేసిందని, ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపక్ష పార్టీ సభ్యులను ప్రశ్నించారు. శాసన మండలిలో జరిగిన బడ్జెట్‌పై చర్చకు మంత్రి బుగ్గన సోమవారం సమాధానం ఇచ్చారు. ‘అమరావతి అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు వాపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో మొత్తం రూ. 277 కోట్లు కేటాయిస్తే తాము ఈ ఏడాది రూ. 500 కోట్లు కేటాయించాం. రాజధాని నిర్మాణం ప్లాన్ కోసమని మలేసియా, సింగపూర్, కొరియా, జపాన్, కొలంబో, టర్కీ, లండన్ తదితర దేశాల్లో తిరిగి ఆఖరుకు ప్లాన్ తయారీకి రాజమౌళికి అప్పగించారు’ అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేకపోయిన రుణమాఫీ రెండు విడతల సొమ్మును ఇవ్వాలని అడిగే హక్కు ప్రతిపక్షానికి లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకం కోసం రూ. 8,750 కోట్లు కేటాయించిందని, సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీకి చెందిన 67 మంది సభ్యులు అప్పటి సీఎం చంద్రబాబును కలిస్తే ఇచ్చేది లేదన్నారని, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మాత్రం ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కూడా నియోజకవర్గానికి రూ. కోటి కేటాయించి తన ఉదారతను చాటుకున్నారని గుర్తు చేశారు. అభివృద్ధి అజెండాకు ప్రపంచబ్యాంకు తోడ్పాటు రాష్ట్ర అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ అజెండా, నిబద్ధత పట్ల ప్రపంచబ్యాంకు అత్యంత సానుకూలంగా స్పందించిందని మంత్రి బుగ్గన తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగ అభివృద్ధికి ప్రపంచబ్యాంకు కొత్తగా 328 మిలియన్ డాలర్ల సహాయాన్ని మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ మేరకు 2019, జూన్ 27న ఒప్పందం కుదిరిందని తెలిపారు. తమ ప్రభుత్వ సుపరిపాలన అజెండా, అభివృద్ధికర పని విధానంపట్ల ప్రపంచబ్యాంకు హర్షం వ్యక్తం చేసిందని చెప్పారు. ప్రభుత్వ వ్యూహాలు, విధానాలు, కార్యక్రమాలు, నవరత్న పథకాల విధానాలు ప్రపంచబ్యాంకు అభివృద్ధి ప్రాధాన్యతలతో పూర్తిగా సరిపోలాయని ప్రపంచబ్యాంకు పేర్కొందన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే ఇతర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని కూడా హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. -
‘టెండర్ల’కు చెమటలు
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల ప్రక్షాళనకు కొత్త ప్రభుత్వం మొగ్గుచూపడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖలో అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. బంధుప్రీతితో జరిగిన టెండర్ల కేటాయింపుపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. పాతిక శాతం దాటని పనులకు సంబంధించి టెండర్లను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. జలవనరుల శాఖలో గత ప్రభుత్వ హయాంలో అనుమతించిన టెండర్లను అధికారులు సమీక్షిస్తున్నారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన కాంట్రాక్టులను రద్దు చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో గతంలో కేటాయించిన పనులపై సమీక్షించి నత్తనడకన సాగుతున్న పనులను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నారు. రూ.45 కోట్ల జైకా నిధులతో మున్నేరు అభివృద్ధి.. గత ఏడాది జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ), వరల్డ్ బ్యాంకుల నుంచి వచ్చిన నిధులతో చెరువులు, కాలువల మరమ్మతులు చేపట్టారు. జైకా నుంచి వచ్చిన రూ.45 కోట్ల నిధులతో మున్నేరు మెయిన్ కెనాల్ అభివృద్ధి పనులు, చెరువుల అభివృద్ధి చేపట్టారు. 50 కిలోమీటర్ల పొడవు మున్నేరు కాలువ గట్ల బలోపేతం, ధ్వంసమైన బ్రిడ్జిలను తిరిగి నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్యాకేజ్–1లో ఐదు చెరువులు, ప్యాకేజ్–2లో ఏడు చెరువుల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. వాస్తవంగా ఆన్లైన్ ద్వారా టెండర్లు దాఖలు చేసినప్పటికీ నాటి అధికార పార్టీ నేతలకు చెందిన కాంట్రాక్టర్లకే ఈ పనులు దక్కాయి. మున్నేరు ప్రధాన కాలువ పనులు 20 శాతం పూర్తికాగా.. ప్యాకేజ్ 1, 2లలో పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తూ ఒక నివేదికను సిద్ధం చేశారు. వరల్డ్ బ్యాంకు నిధులతో చెరువుల అభివృద్ధి.. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన సుమారు రూ.100 కోట్లతో పశ్చిమ కృష్ణాలోని 78 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టారు. వరల్డ్ బ్యాంకు నిబంధనల ప్రకారం బాక్స్ టెండర్లు మాత్రమే వేయాల్సి ఉంది. ఇది తెలుగుదేశం నేతలకు వరంగా మారింది. జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులకు తప్ప బయట కాంట్రాక్టర్లకు కనీసం టెండర్ ఫారాలు కూడా దక్కకుండా జాగ్రత్త పడ్డారు. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన నిధులతో రెడ్డిగూడెంలో 9 చెరువులు, గన్నవరంలో మూడు చెరువులు, మైలవరంలో నాలుగు చెరువులు, బాపులపాడులో 10 చెరువులు, ముసునూరులో 7 చెరువులు, చాట్రాయిలో 8 చెరువులు, విసన్నపేటలో 11 చెరువులు, నూజివీడులో 8 చెరువులు, తిరువూరులో 3 చెరువులు, విజయవాడ రూరల్‌లో ఒక చెరువు, కోడూరులో 4 చెరువులు, ఆగిరిపల్లిలో రెండు, ఏకొండూరు, గంపలగూడెంలో 4 చెరువులకు గట్ల బలోపేతం చేసి, పూడికలు తీసి చెరువుల ద్వారా సాగునీటి వసతికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఐదు శాతం అధిక ధరలకు.. తొలుత టెండర్ల ధరలపై 25 శాతం అధిక రేట్లకు టెండర్లు వేశారు. అయితే దీనిపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసి రద్దు చేశారు. దీంతో టెండర్ రేటుపై ఐదు శాతం అధికంగా టెండర్లు దాఖలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ టెండర్లను మంత్రి అనుచరులే దక్కించుకోగా.. 17 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అందులో ఆరు చెరువులకు పనులు ప్రారంభంకాకపోగా, 11 చెరువులకు సంబంధించి 20 శాతంలోపు పనులు జరిగాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలుగు తమ్ముళ్లు పనులు విషయంలో వెనుక్కు తగ్గారు. ప్రస్తుతం ఈ పనుల ప్రస్తుత స్థితిని వివరిస్తూ కమిషనర్ కార్యాలయానికి లేఖ రాస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ టెండర్లు రద్దయితేనే మంచిదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. -
భారత వృద్ధిపై ప్రపంచ బ్యాంకు ఆశాభావం
వాషింగ్టన్: భారత వృద్ధి రేటు బలపడుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3%కి చేరుకోవడంతోపాటు తదుపరి రెండు సంవత్సరాల్లో 7.5%కి చేరుతుందని ప్రపంచ బ్యాంకు తాజా అంచనాలను వ్యక్తీకరించింది. ప్రైవేటు వ్యయాలు బలంగా ఉండడం, ఎగుమతుల్లో వృద్ధి కీలక చోదకాలని తెలిపింది. డీమోనిటైజేషన్, జీఎస్టీ కారణంగా ఏర్పడిన తాత్కాలిక అవరోధాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది. అయితే, దేశీయ సమస్యలు, అదే సమయంలో కొద్ది మేర అంతర్జాతీయ సమస్యల ప్రభావం భారత భవిష్యత్తు వృద్ధి అంచనాలపై ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడింది. జీఎస్టీని అమలు చేయడం, బ్యాంకుల రీక్యాపిట లైజేషన్ అన్నవి భారత వృద్ధి పెరిగేందుకు దోహదపడుతున్నట్టు అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో తయారీ రంగం, సాగు, సేవల రంగాల తీరు బలంగా ఉంటుందని పేర్కొంది. వినియోగం 7% వృద్ధి చెందుతుందని, వృద్ధిని ఎక్కువగా ముందుకు నడిపించేంది ఇదేనని తెలిపింది. -
జనం నెత్తిపై ‘బాండ్ల’ కుంపటి
సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంకుతో సహా జాతీయ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో బాండ్లు జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ వడ్డీ అయినప్పటికీ బాండ్ల జారీ ద్వారానే అప్పులు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రాజెక్టు కోసం విదేశీ, స్వదేశీ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటే ఈ సొమ్మును అదే ప్రాజెక్టుకు ఖర్చు చేయాలి. ఇతర అవసరాలకు మళ్లించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వీలుండదు. ఈ నిబంధన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అస్సలు నచ్చలేదు. బాండ్ల జారీ ద్వారా అప్పులు చేస్తే ఇష్టానుసారంగా ఆ డబ్బును వాడుకోవచ్చని నిర్ణయానికొచ్చారు. అందుకే బాండ్ల ద్వారానే అప్పులు తీసుకురావాలని ఆదేశించారు. సీఆర్డీఏ ప్రామిసరీ నోట్ ఆర్థిక శాఖ ఒప్పుకోకపోయినా అమరావతి బాండ్ల జారీకే ముఖ్యమంత్రి మొగ్గు చూపారు. ఆర్థిక శాఖ చేసిన సూచనలను పట్టించుకోలేదు. అమరావతి బాండ్ల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేస్తోందో అంతే మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అంటే బాండ్ల ద్వారా రూ.2,000 కోట్ల అప్పులు చేస్తుండగా అసలు కాకుండా వడ్డీ, దళారీ ఫీజు కలిపి పదేళ్లలో రూ.2,000.80 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అసలు బాండ్లు అంటే మేము ఇంత వడ్డీ చెల్లిస్తామంటూ అప్పులు ఇచ్చే సంస్థకు ప్రామిసరీ నోటు రాసివ్వడం లాంటిదే. అమరావతి బాండ్ల జారీలో 10.32 శాతం వడ్డీ ఇస్తామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) ప్రామిసరీ నోటు రాసిచ్చేసింది. ఎక్కడా లేనివిధంగా ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని చెప్పడం, అప్పుతోపాటు వడ్డీకి సైతం గ్యారెంటీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అమరావతి బాండ్లకు అప్పు ఇవ్వడానికి చాలా సంస్థలు ముందుకొచ్చాయి. ఏడాదికి 10.32 శాతం వడ్డీ అంటే.. రూ.2,000 కోట్ల అప్పునకు ఏడాదికి వడ్డీ కింద రూ.247.68 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీని ప్రతి మూడు నెలలకోసారి ఆరేళ్ల పాటు చెల్లించాలి. ఏడాదికి రూ.247.68 కోట్ల చొప్పున ఆరేళ్లలో వడ్డీ కింద రూ.1,486.08 కోట్లు చెల్లించక తప్పదు. ఆ తరువాత ఏడాది నుంచి అసలు అప్పులో 20 శాతం అంటే రూ.400 కోట్లతోపాటు వడ్డీ కింద రూ.198.14 కోట్లు చెల్లించాలి. ఆ మరుసటి ఏడాది మరో రూ.400 కోట్ల అసలుతోపాటు వడ్డీ కింద రూ.148.60 కోట్లు చెల్లించాలి. ఆ తరువాత ఏడాది అసలు రూ.400 కోట్లతోపాటు వడ్డీ కింద రూ.99.07 కోట్లు కట్టాలి. చివరి ఏడాది అసలు రూ.400 కోట్లతోపాటు వడ్డీ కింద రూ.49.53 కోట్లు చెల్లించాలి. అంటే మొత్తం అసలు రూ.2,000 కోట్లతోపాటు వడ్డీ కింద రూ.1,981.42 కోట్లు, బ్రోకరేజీ సంస్థ ఫీజు, జీఎస్టీ కలిపి రూ.19.40 కోట్లు చెల్లించాలి. బాండ్ల ద్వారా ఎంత అప్పు తీసుకుంటున్నామో అంతే మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఆర్థిక శాఖ సూచనలు బేఖాతర్ 8 శాతం కంటే ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవద్దని సీఆర్డీఏకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. హడ్కో దగ్గర తీసుకునే అప్పులపైనా వడ్డీ 8 శాతం లోపే ఉండాలని, ఈ మేరకు హడ్కోతో సంప్రదింపుల జరపాలని సూచించింది. వడ్డీ శాతాన్ని హడ్కో తగ్గించకపోతే ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి ప్రభుత్వ గ్యారెంటీతో 8 శాతం కంటే తక్కువ వడ్డీకి అప్పులు ఇప్పిస్తామని స్పష్టం చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని, అలా చేస్తే కేంద్రం ఇచ్చే పన్ను రాయితీతో 6 శాతం కంటే తక్కువ వడ్డీకే ఆ బాండ్ల ద్వారా అప్పులు వస్తాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అప్పుల కోసం ఆర్థిక శాఖ పలు మార్గాలను సూచించినప్పటికీ ప్రభుత్వం మాత్రం అత్యధిక వడ్డీకి అమరావతి బాండ్లు జారీ చేయడం వెనుక లోగుట్టు ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరో ఆరు నెలల్లో టీడీపీ ప్రభుత్వం పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో అందిన చోటల్లా అప్పులు చేసి కమీషన్లు దండుకోవడమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రభుత్వ పెద్దలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు రాష్ట్రాలను చూసైనా నేర్చుకోరా? ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే రెవెన్యూ లోటుతో సతమతమవుతోంది. మరోవైపు ప్రభుత్వం గత నాలుగేళ్లలో భారీగా అప్పులు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి బాండ్ల పేరుతో అత్యధిక వడ్డీ చెల్లించేందుకు ముఖ్యమంత్రి సిద్ధపడడాన్ని ఉన్నతాధికారులు తప్పుపడుతున్నారు. ‘‘పొరుగు రాష్ట్రం తెలంగాణలోని జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ లేకుండానే బాండ్లు జారీ చేస్తే కేవలం 9.38 శాతం వడ్డీకే అప్పులు ఇవ్వడానికి పలు సంస్థలు ముందుకొచ్చాయి. కర్ణాటక ప్రభుత్వం 5.85 శాతం వడ్డీకే అప్పులు తెచ్చుకుంటోంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ ఏకంగా మనమే కూపన్ రేటుగా అమరావతి బాండ్లకు 10.32 శాతం వడ్డీని ఎలా నిర్ధారిస్తారు?’’ అని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అమరావతి బాండ్ల దళారీకి ఇస్తున్న ఫీజు కూడా తెలంగాణాతో పోల్చి చూస్తే భారీగా ఉంది. జీహెచ్ఎంసీ బాండ్లలో బ్రోకరేజీ సంస్థకు అప్పులో 0.1 శాతం ఫీజు చెల్లిస్తుండగా, అమరావతి బాండ్లలో బ్రోకరేజీ సంస్థకు 0.85 శాతం చెల్లిస్తుండడం గమనార్హం. -
పంచాయతీల్లోనే అన్ని సేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం కింద సమగ్ర సేవా కేంద్రా (వన్‌స్టాప్ షాప్)లను పంచాయతీ కార్యాలయాల్లోనే ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ-పంచాయత్ వ్యవస్థను కూడా సమగ్ర సేవా కేంద్రాల్లోనే విలీనం చేయనున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఎంపిక చేసిన 150 మండలాల్లో ఈ ఏడాది వెయ్యి సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో మిగిలిన గ్రామాలకూ విస్తరించనున్నారు. వన్‌స్టాప్ షాప్‌ల ఏర్పాటు బాధ్యతలను ప్రభుత్వం శ్రీనిధి బ్యాంకుకు అప్పగిస్తూ రూ. 64 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అన్ని సేవలూ ఒకేచోట.. గ్రామీణ ప్రజలకు ఈ-పంచాయత్, మీసేవ, శ్రీనిధి కియోస్క్‌ల నుంచి ప్రస్తుతం లభిస్తున్న సేవలన్నింటినీ ఇకపై ఒకేచోట లభ్యమయ్యేలా సమగ్ర సేవా కేంద్రాలను ఆయా సంస్థలకు అనుసంధానం చేయనున్నారు. అంతేకాకుండా ఓఎస్‌ఎస్‌ల నుంచే ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన బ్యాంకు ఖాతాలను తెరుచుకునే సదుపాయం కల్పిస్తున్నారు. స్వయం సహాయక గ్రూపులకు పావలా వడ్డీ రుణాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, ఉపాధిహామీ కూలీలకు వేతన చెల్లింపులు, ఆసరా పెన్షనర్లకు పింఛను సొమ్ము.. తదితర చెల్లింపులన్నీ ఇక్కడ్నుంచే లభ్యమవుతాయి. అన్నిరకాల ధ్రువపత్రాల కోసం దరఖాస్తులను ఓఎస్‌ఎస్‌ల నుంచే సమర్పించవచ్చు. పొదుపు ఖాతాలు, నగదు జమ, డిపాజిట్లు, అన్ని రకాల చెల్లింపులు.. తదితర సేవలను సెప్టెంబర్ నుంచి ఓఎస్‌ఎస్‌ల నుంచే గ్రామంలోని ప్రజలందరూ పొందవచ్చు. నిర్వహణ బాధ్యత వీఎల్ఈలకే.. వన్‌స్టాప్ షాప్‌ల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక గ్రూపుల నుంచి మహిళల (విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రైనర్)ను ఎంపిక చేస్తారు. వీఎల్ఈ నియామకానికి ఇంటర్ విద్యార్హత కాగా, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. నియామక ప్రక్రియను పారదర్శకంగా చేసేందుకు అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
నిధులున్నా..తీరని దాహం
కందుకూరు రూరల్, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా కోట్ల రూపాయల నిధులున్నా..గ్రామీణ ప్రజల దాహార్తి తీరడం లేదు. మంచినీటి పథకాల పనులు ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. కందుకూరు నియోజకవర్గ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 21 గ్రామాలకు ప్రపంచబ్యాంకు నిధులు రూ. 9.96 కోట్లు మంజూరు చేశారు. 2011-12 సంవత్సరాల్లో నిధులు విడుదల చేశారు. తీవ్ర మంచినీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలను ఎంపిక చేసి నిధులు కేటాయించారు. మంజూరై ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కుదుర్చుకున్న అగ్రిమెంట్లు పూర్తయి, రెండో సారి చేసుకున్న అగ్రిమెంట్ కాలం కూడా ముగుస్తున్నా పథకాలు మాత్రం పూర్తికావడం లేదు. కందుకూరు మండలంలో ఆరు గ్రామాలకు రూ. 4.17 కోట్లు మంజూరయ్యాయి. 2012లో మదనగోపాలపురానికి రూ. 30 లక్షలు, అనంతసాగరంలో రూ. 36లక్షలతో నిర్మిస్తున్న మంచినీటి పథకాల పనుల్లో కేవలం ట్యాంకులు మాత్రమే నిర్మించి రంగులు వేసి అలంకారప్రాయంగా వదిలేశారు. ఇంకా పైపు లైన్ల పనులు మొదలు పెట్టలేదు. 42011 జూన్‌లో జి.మేకపాడుకు రూ.51.40 లక్షలు మంజూరయ్యాయి. అప్పటి నుంచి టెండర్ల ప్రక్రియ పెండింగ్‌లో పడి ఎట్టకేలకు రెండు నెలల నుంచి పనులు ప్రారంభించారు. ఓవర్ హెడ్ ట్యాంకు పునాదుల స్థాయిలో ఉంది. 4పలుకూరుకు రూ.2.78 కోట్లు మంజూరైతే ఇప్పటి వరకు టెండర్లు పూర్తి కాలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం దగ్గర పడుతుండడంతో తిరిగి నిధుల మార్పు జరిగితేగానీ టెండర్లు పిలిచే అవకాశం ఉండదని అధికారులు చెప్తున్నారు. 4గుడ్లూరు మండలంలో తొమ్మిది గ్రామాలకు రూ. 3.48 కోట్లు మంజూరయ్యాయి. చేవూరు రూ. 50 లక్షలు, మొగుళ్లూరు రూ.40.04 లక్షలు, పరకొండపాడు రూ. 45 లక్షలు, అడవిరాజుపాలెం రూ. 50 లక్షలు, కొత్తపేట రూ. 40 లక్షల, నాయుడపాలెం రూ. 20 లక్షలు, ఏలూరుపాడు రూ.30 లక్షలు, నరసాపురం రూ.45 లక్షలు, దప్పళంపాడు రూ. 28.44 లక్షలు మంజూరయ్యాయి. దప్పళంపాడు పథకం పూర్తి కాగా నరసాపురంలో ఇంకా ట్యాంకు నిర్మాణానికి స్థల గుర్తింపు పనిలోనే ఉన్నాయి. మిగిలిన ఏడు గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులు పూర్తికాగా నీరు సరఫరా అయ్యే స్కీమ్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఆయా గ్రామాలకు నీటి వసతి ఉన్న ప్రాంతాల నుంచి మోటార్ల ద్వారా ట్యాంకులకు నీరు సరఫరా అయ్యేందుకు స్కీమ్ పనులు మధ్యలోనే నిలిచిపోగా, కొన్ని పైపు లైన్ల దశలో ఉన్నాయి. 4ఉలవపాడు మండలంలోని మూడు గ్రామాలకు రూ. 1.20 కోట్లు మంజూరయ్యాయి. రూ. 45 లక్షలతో జరుగుతున్న వీరేపల్లి మంచినీటి పథకం పైపులైన్లు నిర్మాణం దశలో ఉండగా, బద్దిపూడిలో రూ. 45 లక్షలతో జరుగుతున్న పనులు నీటి పథకం పనులు మోటార్ ఏర్పాటు పెండింగ్‌లో ఉండడం వల్ల నిలిచిపోయింది. ఇక పెదపల్లెపాలేనికి రూ. 30.87 లక్షలు మంజూరుగా ఇంకా టెండర్లు పిలవకపోవడంతో పథకం నిలిచిపోయింది. తిరిగి టెండర్లు పిలవడం కష్టమేనని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే టెండర్లు నిలిచిపోయాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. వలేటివారిపాలెం మండలంలోని పోలేనిపాలెం, పోలినేనిచెరువు గ్రామాల్లో రూ. 49 లక్షలతో నిర్మిస్తున్న మంచినీటి పథకం పనులు జరుగుతూనే ఉన్నాయి. ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి పైపులైన్లు వేస్తున్నారు. లింగసముద్రం మండలంలోని కొత్తపేట, వాకమాళ్లవారిపాలెంలో రూ. 60.46 లక్షలతో పథకాలు నిర్మిస్తున్నారు. కొత్తపేట పథకం పూర్తికాగా, వాకమాళ్లవారిపాలెంలో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించి పైపు లైన్లు అసంపూర్తిగా ఏర్పాటు చేశారు. పథకం పనులు పూర్తి స్థాయిలో కాలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మంచినీటికి నానా అవస్థలు పడుతున్నారు. బిల్లుల కోసమే ట్యాంకులకు రంగులు.. పథకాలకు సంబంధించిన ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి రంగులు వేసి అలంకారప్రాయంగా ఉంచారు. ట్యాంకులకు నీరు సరఫరా అయ్యే బోర్ల పనులు పూర్తి కాలేదు. గ్రామంలో ప్రతి బజారుకు పైపులైన్లు ఏర్పాటు చేసి కుళాయిలు నిర్మించాల్సి ఉండగా ఆ పనులను వదిలే శారు. బిల్లుల మంజూరు కోసమే హడావిడిగా ట్యాంకులు నిర్మించి రంగులు వేశారని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. నిర్మించిన ట్యాంకులకు క్యూరింగ్ కూడా సక్రమంగా చేయకుండా రంగులేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనుల వద్దే ఉండి పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు వారి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మంచినీరు అందడం కష్టమే... మంచినీటి పథకాలకు సంబంధించిన బోర్లు ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పుష్కళంగా నీరుండే ప్రాంతాల్లో బోర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు ఆలోచించడం లేదు. కందుకూరు మండలంలోని అనంతసాగరంలో ఓవర్‌హెడ్ ట్యాంకుకు నీరు నింపేందుకు గ్రామం వద్ద ఉన్న కుంటలో మోటార్లు ఏర్పాటు చేశారు. అంత కు ముందు ట్యాంకు వద్దే బోరు వేసినా చుక్క నీరు పడకపోవడంతో కుంట వద్ద వేస్తున్నారు. అక్కడ నీరు తాగేందుకు ఉపయోగపడవని గ్రామస్తులు చెప్తున్నారు. లక్షలు వెచ్చించి పథకాలు నిర్మించినా నీరు అందకపోతే ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా అదే కుంట వద్ద డెరైక్ట్ పంపింగ్ ద్వారా పైపు లైన్లు ఏర్పాటు చేశారు. నీరు సక్రమంగా అందక ఆ పథకం మూలనపడింది. ఈ విషయం తెలిసి కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అక్కడే బోరు వేయడం గమనార్హం. ఇక పోతే మదనగోపాలపురంలో కూడా పక్కనే మన్నేరులో బోర్లు ఏర్పాటు చేసి నీరు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ కూడా ఇసుక అక్రమ తవ్వకాలు జరగడంతో భూగర్భజలాలు అడుగంటి ప్రస్తుతం ఉన్న మంచినీటి పథకాలకు నీరందడం లేదు. లోతుగా బోర్లు వేస్తే నీరు ఉప్పగా మారుతాయని చెప్తున్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతంలో బోర్లు వేసి నీటి సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పనులు జరుగుతున్నాయి: విశ్వనాథరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి డీఈ ప్రపంచ బ్యాంక్ నిధులతో మంచినీటి పథకాల పనులు జరుగుతున్నాయి. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. ఈ ఏడాది నవంబర్ లోపు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.