
వాషింగ్టన్: భారత వృద్ధి రేటు బలపడుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3%కి చేరుకోవడంతోపాటు తదుపరి రెండు సంవత్సరాల్లో 7.5%కి చేరుతుందని ప్రపంచ బ్యాంకు తాజా అంచనాలను వ్యక్తీకరించింది. ప్రైవేటు వ్యయాలు బలంగా ఉండడం, ఎగుమతుల్లో వృద్ధి కీలక చోదకాలని తెలిపింది. డీమోనిటైజేషన్, జీఎస్టీ కారణంగా ఏర్పడిన తాత్కాలిక అవరోధాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది.
అయితే, దేశీయ సమస్యలు, అదే సమయంలో కొద్ది మేర అంతర్జాతీయ సమస్యల ప్రభావం భారత భవిష్యత్తు వృద్ధి అంచనాలపై ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడింది. జీఎస్టీని అమలు చేయడం, బ్యాంకుల రీక్యాపిట లైజేషన్ అన్నవి భారత వృద్ధి పెరిగేందుకు దోహదపడుతున్నట్టు అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో తయారీ రంగం, సాగు, సేవల రంగాల తీరు బలంగా ఉంటుందని పేర్కొంది. వినియోగం 7% వృద్ధి చెందుతుందని, వృద్ధిని ఎక్కువగా ముందుకు నడిపించేంది ఇదేనని తెలిపింది.