సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల ప్రక్షాళనకు కొత్త ప్రభుత్వం మొగ్గుచూపడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖలో అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. బంధుప్రీతితో జరిగిన టెండర్ల కేటాయింపుపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. పాతిక శాతం దాటని పనులకు సంబంధించి టెండర్లను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.
జలవనరుల శాఖలో గత ప్రభుత్వ హయాంలో అనుమతించిన టెండర్లను అధికారులు సమీక్షిస్తున్నారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన కాంట్రాక్టులను రద్దు చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో గతంలో కేటాయించిన పనులపై సమీక్షించి నత్తనడకన సాగుతున్న పనులను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నారు.
రూ.45 కోట్ల జైకా నిధులతో మున్నేరు అభివృద్ధి..
గత ఏడాది జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ), వరల్డ్ బ్యాంకుల నుంచి వచ్చిన నిధులతో చెరువులు, కాలువల మరమ్మతులు చేపట్టారు. జైకా నుంచి వచ్చిన రూ.45 కోట్ల నిధులతో మున్నేరు మెయిన్ కెనాల్ అభివృద్ధి పనులు, చెరువుల అభివృద్ధి చేపట్టారు. 50 కిలోమీటర్ల పొడవు మున్నేరు కాలువ గట్ల బలోపేతం, ధ్వంసమైన బ్రిడ్జిలను తిరిగి నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్యాకేజ్–1లో ఐదు చెరువులు, ప్యాకేజ్–2లో ఏడు చెరువుల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. వాస్తవంగా ఆన్‌లైన్ ద్వారా టెండర్లు దాఖలు చేసినప్పటికీ నాటి అధికార పార్టీ నేతలకు చెందిన కాంట్రాక్టర్లకే ఈ పనులు దక్కాయి. మున్నేరు ప్రధాన కాలువ పనులు 20 శాతం పూర్తికాగా.. ప్యాకేజ్ 1, 2లలో పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తూ ఒక నివేదికను సిద్ధం చేశారు.
వరల్డ్ బ్యాంకు నిధులతో చెరువుల అభివృద్ధి..
వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన సుమారు రూ.100 కోట్లతో పశ్చిమ కృష్ణాలోని 78 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టారు. వరల్డ్ బ్యాంకు నిబంధనల ప్రకారం బాక్స్ టెండర్లు మాత్రమే వేయాల్సి ఉంది. ఇది తెలుగుదేశం నేతలకు వరంగా మారింది. జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులకు తప్ప బయట కాంట్రాక్టర్లకు కనీసం టెండర్ ఫారాలు కూడా దక్కకుండా జాగ్రత్త పడ్డారు.
వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన నిధులతో రెడ్డిగూడెంలో 9 చెరువులు, గన్నవరంలో మూడు చెరువులు, మైలవరంలో నాలుగు చెరువులు, బాపులపాడులో 10 చెరువులు, ముసునూరులో 7 చెరువులు, చాట్రాయిలో 8 చెరువులు, విసన్నపేటలో 11 చెరువులు, నూజివీడులో 8 చెరువులు, తిరువూరులో 3 చెరువులు, విజయవాడ రూరల్‌లో ఒక చెరువు, కోడూరులో 4 చెరువులు, ఆగిరిపల్లిలో రెండు, ఏకొండూరు, గంపలగూడెంలో 4 చెరువులకు గట్ల బలోపేతం చేసి, పూడికలు తీసి చెరువుల ద్వారా సాగునీటి వసతికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
ఐదు శాతం అధిక ధరలకు..
తొలుత టెండర్ల ధరలపై 25 శాతం అధిక రేట్లకు టెండర్లు వేశారు. అయితే దీనిపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసి రద్దు చేశారు. దీంతో టెండర్ రేటుపై ఐదు శాతం అధికంగా టెండర్లు దాఖలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ టెండర్లను మంత్రి అనుచరులే దక్కించుకోగా.. 17 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అందులో ఆరు చెరువులకు పనులు ప్రారంభంకాకపోగా, 11 చెరువులకు సంబంధించి 20 శాతంలోపు పనులు జరిగాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలుగు తమ్ముళ్లు పనులు విషయంలో వెనుక్కు తగ్గారు. ప్రస్తుతం ఈ పనుల ప్రస్తుత స్థితిని వివరిస్తూ కమిషనర్ కార్యాలయానికి లేఖ రాస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ టెండర్లు రద్దయితేనే మంచిదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment