tank developments
-
GHMC: కాగితాలపైనే అర్బన్ మిషన్ కాకతీయ పథకం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జలాశయాల అభివృద్ధి.. పునరుద్ధరణ.. కాలుష్యం కోరల నుంచి రక్షించే పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. అర్బన్ మిషన్ కాకతీయ పథకం కింద మహానగరం పరిధిలోని 185 చెరువుల ప్రక్షాళన, సుందరీకరణ పనులు చేపడతామన్న సర్కారు పెద్దల మాటలు నీటిమూటలుగా మారాయి. బల్దియా పరిధిలో మొత్తం 185 జలాశయాలుండగా.. ఈ పథకం కింద సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల క్రితం 18 చెరువులను అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దారు. మిగతా వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేక్స్ డివిజన్ నిధులు లేక అలంకార ప్రాయమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తటాకాలకు శాపం ఇలా.. ► మహానగరంలోని పలు చెరువుల్లో ఇటీవలికాలంలో గుర్రపుడెక్క ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. ► సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధంగా మార్చేస్తున్నాయి. ► ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థ జలాల్లో ఉండే ఫేకల్‌కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతోపాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ► ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో నీటిలో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సీజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం. ► గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం వెలువడుతున్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 770 మి.లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే చెరువులు, మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. సంరక్షించాలి ఇలా.. చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సేవ్ అవర్ అర్బన్లేక్స్ సంస్థ పలు సూచనలు చేసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని చెరువుల్లో పేరుకుపోయిన ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. జలాశయాల ఉపరితలపై ఉద్ధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి. చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి. వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలి. కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలి. (క్లిక్ చేయండి: కమాండ్ కంట్రల్ సెంటర్ వద్ద సరికొత్త బారికేడింగ్) -
‘టెండర్ల’కు చెమటలు
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల ప్రక్షాళనకు కొత్త ప్రభుత్వం మొగ్గుచూపడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖలో అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. బంధుప్రీతితో జరిగిన టెండర్ల కేటాయింపుపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. పాతిక శాతం దాటని పనులకు సంబంధించి టెండర్లను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. జలవనరుల శాఖలో గత ప్రభుత్వ హయాంలో అనుమతించిన టెండర్లను అధికారులు సమీక్షిస్తున్నారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన కాంట్రాక్టులను రద్దు చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో గతంలో కేటాయించిన పనులపై సమీక్షించి నత్తనడకన సాగుతున్న పనులను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నారు. రూ.45 కోట్ల జైకా నిధులతో మున్నేరు అభివృద్ధి.. గత ఏడాది జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ), వరల్డ్ బ్యాంకుల నుంచి వచ్చిన నిధులతో చెరువులు, కాలువల మరమ్మతులు చేపట్టారు. జైకా నుంచి వచ్చిన రూ.45 కోట్ల నిధులతో మున్నేరు మెయిన్ కెనాల్ అభివృద్ధి పనులు, చెరువుల అభివృద్ధి చేపట్టారు. 50 కిలోమీటర్ల పొడవు మున్నేరు కాలువ గట్ల బలోపేతం, ధ్వంసమైన బ్రిడ్జిలను తిరిగి నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్యాకేజ్–1లో ఐదు చెరువులు, ప్యాకేజ్–2లో ఏడు చెరువుల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. వాస్తవంగా ఆన్లైన్ ద్వారా టెండర్లు దాఖలు చేసినప్పటికీ నాటి అధికార పార్టీ నేతలకు చెందిన కాంట్రాక్టర్లకే ఈ పనులు దక్కాయి. మున్నేరు ప్రధాన కాలువ పనులు 20 శాతం పూర్తికాగా.. ప్యాకేజ్ 1, 2లలో పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తూ ఒక నివేదికను సిద్ధం చేశారు. వరల్డ్ బ్యాంకు నిధులతో చెరువుల అభివృద్ధి.. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన సుమారు రూ.100 కోట్లతో పశ్చిమ కృష్ణాలోని 78 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టారు. వరల్డ్ బ్యాంకు నిబంధనల ప్రకారం బాక్స్ టెండర్లు మాత్రమే వేయాల్సి ఉంది. ఇది తెలుగుదేశం నేతలకు వరంగా మారింది. జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులకు తప్ప బయట కాంట్రాక్టర్లకు కనీసం టెండర్ ఫారాలు కూడా దక్కకుండా జాగ్రత్త పడ్డారు. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన నిధులతో రెడ్డిగూడెంలో 9 చెరువులు, గన్నవరంలో మూడు చెరువులు, మైలవరంలో నాలుగు చెరువులు, బాపులపాడులో 10 చెరువులు, ముసునూరులో 7 చెరువులు, చాట్రాయిలో 8 చెరువులు, విసన్నపేటలో 11 చెరువులు, నూజివీడులో 8 చెరువులు, తిరువూరులో 3 చెరువులు, విజయవాడ రూరల్‌లో ఒక చెరువు, కోడూరులో 4 చెరువులు, ఆగిరిపల్లిలో రెండు, ఏకొండూరు, గంపలగూడెంలో 4 చెరువులకు గట్ల బలోపేతం చేసి, పూడికలు తీసి చెరువుల ద్వారా సాగునీటి వసతికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఐదు శాతం అధిక ధరలకు.. తొలుత టెండర్ల ధరలపై 25 శాతం అధిక రేట్లకు టెండర్లు వేశారు. అయితే దీనిపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసి రద్దు చేశారు. దీంతో టెండర్ రేటుపై ఐదు శాతం అధికంగా టెండర్లు దాఖలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ టెండర్లను మంత్రి అనుచరులే దక్కించుకోగా.. 17 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అందులో ఆరు చెరువులకు పనులు ప్రారంభంకాకపోగా, 11 చెరువులకు సంబంధించి 20 శాతంలోపు పనులు జరిగాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలుగు తమ్ముళ్లు పనులు విషయంలో వెనుక్కు తగ్గారు. ప్రస్తుతం ఈ పనుల ప్రస్తుత స్థితిని వివరిస్తూ కమిషనర్ కార్యాలయానికి లేఖ రాస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ టెండర్లు రద్దయితేనే మంచిదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. -
మత్స్య సంపదను కాపాడుకుందాం
మహబూబ్‌నగర్ వ్యవసాయం : మత్స్య సంపద అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పెద్దచెరువులో చేప విత్తనాలు వదిలి అనంతరం ఆయన మాట్లాడారు. వందశాతం రాయితీపై చేపవిత్తనాల పంపిణీకిగాను జిల్లాకు రూ.ఐదు కోట్లు కేటాయించామన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల మరమ్మతును చేపట్టడంతో మత్స్యకారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. వారికి అవసరమైన చేపల మార్కెట్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలో వంద చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మత్స్యకారుల కమ్యూనిటీ భవనాలు, కార్యాలయాల ఏర్పాటుకు యత్నిస్తామన్నారు. పాలమూరులో త్వరలోనే పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంతేగాక పెద్దచెరువును మినీ ట్యాంకు బండ్లా అన్ని విధాలా అభివద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, మత్స్యశాఖ ఏడీ ఖదీర్ అహ్మద్, మత్స్య సంఘం జిల్లా అధ్యక్షుడు మనెమోని సత్యనారాయణ, టీఆర్ఎస్ జిల్లా కో–కన్వీనర్ బెక్కెం జనార్దన్, ముదిరాజ్ సంఘం యువత అధ్యక్షుడు పెద్ద విజయ్‌కుమార్, పార్టీ నాయకులు మనోహర్, నాగులు, ఎర్ర బాలప్ప, గోనెల శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.