సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని జలాశయాల అభివృద్ధి.. పునరుద్ధరణ.. కాలుష్యం కోరల నుంచి రక్షించే పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. అర్బన్ మిషన్ కాకతీయ పథకం కింద మహానగరం పరిధిలోని 185 చెరువుల ప్రక్షాళన, సుందరీకరణ పనులు చేపడతామన్న సర్కారు పెద్దల మాటలు నీటిమూటలుగా మారాయి.
బల్దియా పరిధిలో మొత్తం 185 జలాశయాలుండగా.. ఈ పథకం కింద సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల క్రితం 18 చెరువులను అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దారు. మిగతా వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేక్స్ డివిజన్ నిధులు లేక అలంకార ప్రాయమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తటాకాలకు శాపం ఇలా..
► మహానగరంలోని పలు చెరువుల్లో ఇటీవలికాలంలో గుర్రపుడెక్క ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది.
► సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధంగా మార్చేస్తున్నాయి.
► ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థ జలాల్లో ఉండే ఫేకల్‌కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతోపాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది.
► ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో నీటిలో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సీజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం.
► గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం వెలువడుతున్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 770 మి.లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే చెరువులు, మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది.
సంరక్షించాలి ఇలా..
చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సేవ్ అవర్ అర్బన్‌లేక్స్ సంస్థ పలు సూచనలు చేసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని చెరువుల్లో పేరుకుపోయిన ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. జలాశయాల ఉపరితలపై ఉద్ధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి. చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.
గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి. వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలి. కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలి. (క్లిక్ చేయండి: కమాండ్ కంట్రల్ సెంటర్ వద్ద సరికొత్త బారికేడింగ్)
Comments
Please login to add a commentAdd a comment