gurrapudekka
-
GHMC: కాగితాలపైనే అర్బన్ మిషన్ కాకతీయ పథకం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జలాశయాల అభివృద్ధి.. పునరుద్ధరణ.. కాలుష్యం కోరల నుంచి రక్షించే పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. అర్బన్ మిషన్ కాకతీయ పథకం కింద మహానగరం పరిధిలోని 185 చెరువుల ప్రక్షాళన, సుందరీకరణ పనులు చేపడతామన్న సర్కారు పెద్దల మాటలు నీటిమూటలుగా మారాయి. బల్దియా పరిధిలో మొత్తం 185 జలాశయాలుండగా.. ఈ పథకం కింద సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల క్రితం 18 చెరువులను అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దారు. మిగతా వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేక్స్ డివిజన్ నిధులు లేక అలంకార ప్రాయమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తటాకాలకు శాపం ఇలా.. ► మహానగరంలోని పలు చెరువుల్లో ఇటీవలికాలంలో గుర్రపుడెక్క ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. ► సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధంగా మార్చేస్తున్నాయి. ► ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థ జలాల్లో ఉండే ఫేకల్‌కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతోపాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ► ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో నీటిలో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సీజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం. ► గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం వెలువడుతున్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 770 మి.లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే చెరువులు, మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. సంరక్షించాలి ఇలా.. చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సేవ్ అవర్ అర్బన్లేక్స్ సంస్థ పలు సూచనలు చేసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని చెరువుల్లో పేరుకుపోయిన ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. జలాశయాల ఉపరితలపై ఉద్ధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి. చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి. వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలి. కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలి. (క్లిక్ చేయండి: కమాండ్ కంట్రల్ సెంటర్ వద్ద సరికొత్త బారికేడింగ్) -
Kolleru Lake: ఎగువ నుంచి భారీగా కొల్లేరుకు వరద నీరు
కైకలూరు: కొల్లేరు సరస్సు ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు ఎగువ నుంచి కొల్లేరుకు వరద నీరు చేరుతోంది. కొల్లేరుకు చేరిన వరద నీరు సముద్రానికి చేరే మార్గమధ్యంలో అక్రమ చేపల చెరువులు అడ్డు వస్తున్నాయి. దీనికి తోడు గుర్రపుడెక్క తోడవడంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు పాకుతోంది. కొల్లేరు గ్రామాల్లో పలు అక్రమ చేపల చెరువులకు గండ్లు పడటంతో రహదారులు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో కొల్లేరు ప్రక్షాళన అంశం మరోసారి తెరపైకి వస్తోంది. మండవల్లి మండలం పెనుమాకలంక, ఇంగిలింపాకలంక గ్రామస్తుల ప్రధాన మార్గమైన పెదఎడ్లగాడి – పెనుమాలంక రహదారి కొల్లేరు వరద నీటికి మునిగింది. దశాబ్దాలుగా ఇదే సమస్య కొల్లేరు గ్రామాల ప్రజలను పట్టి వేధిస్తోంది. పెద ఎడ్లగాడి వంతెన దిగువన ఈ గ్రామాలు ఉండటంతో వరద నీరు వెనక్కి వచ్చి ముంచెత్తుతోంది. పెదఎడ్లగాడి వద్ద 8.6 అడుగుల నీటి మట్టం నమోదైంది. అదే విధంగా కైకలూరు–ఏలూరు రహదారిలో ఇరువైపులా కొల్లేరు నీరు గట్లను తాకుతోంది. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదకరంగా ఇనుప వంతెన... సర్కారు కాల్వపై ఇనుప వంతెన ప్రమాదకరంగా మారింది. వరదల సమయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 67 డ్రెయిన్ల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతుంది. కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేయడానికి పందిరిపల్లిగూడెం వద్ద ఇనుప వంతెనను గ్రామస్తులు నిర్మించారు. ఇటీవల వంతెనపై రేకులు దెబ్బతిన్నాయి. దీనికి తోడు కింద నుంచి ప్రవాహ వేగం పెరిగింది. టోల్గేట్దారులు భారీ వాహనాలను సైతం వంతెనపై అనుమతిస్తున్నారు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. అడ్డు వస్తున్న చేపల చెరువులు కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి చేరవేసే క్రమంలో అక్రమ చేపల చెరువు గట్లు అడ్డు వస్తున్నాయి. తెలుగుదేశం పాలనలో కొల్లేరులో అక్రమ చేపల చెరువులను తవ్వేశారు. అడ్డుకున్న అటవీ సిబ్బందిపై టీడీపీ నేతల అండతో దాడులు సైతం చేశారు. కొల్లేరులో డ్రెయిన్లు సైతం అక్రమించారు. ఈ కారణంగా వరదల సమయంలో చేరుతున్న నీరు కిందకు చేరడం లేదు. పెద ఎడ్లగాడి వంతెన వద్ద 8 అడుగులు నీటి మట్టం ఉంటే, దిగువన ఉన్న ఉప్పుటేరు వంతెన వద్ద కేవలం 4 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువ నుంచి నీరు కిందకు రావడానికి చేపల చెరువుల గట్లు అడ్డుపడుతున్నాయి. గుర్రపుడెక్కతో చిక్కులు ఎగువ నుంచి కొట్టుకువస్తున్న గుర్రపుడెక్కతో ప్రతీ ఏటా సమస్య ఉత్పన్నమవుతోంది. కొల్లేరుకు చేరుతున్న నీటిని సముద్రానికి చేరవేయడానికి పెద ఎడ్లగాడి వంతెన మార్గంగా ఉంది. ఈ వంతెనకు ఉన్న 56 ఖానాలలో ఇప్పుడు గుర్రపుడెక్క పేరుకుపోయింది. మేటలు వేసిన గుర్రపుడెక్క కారణంగా నీరు వెనక్కి మల్లుతుంది. ఈ కారణంగా పెదఎడ్లగాడి నుంచి పెనుమాకలంక చేరే రహదారి నీట మునిగింది. సాదరణంగా వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత పైనుంచి చేరుతున్న నీటితో కొల్లేరుకు వరద పోటు వస్తుంది. గుర్రపు డెక్క తొలగిస్తాం పెదఎడ్లగాడి వద్ద గుర్రపుడెక్కను మనుషులతో తొలగిస్తాం. దీనికి రూ.8 లక్షలు నిధులు మంజూరయ్యాయి. పొక్లయిన్‌తో తొలిగిస్తుంటే వంతెన పాడవుతుందని ఆర్అండ్బీ అధికారులు అడ్డు చెబుతున్నారు. దీంతో మనుషులను పెడుతున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 8.6 అడుగులు నీటి మట్టం నమోదయ్యింది. 12 అడుగులకు చేరితే మరింత ప్రమాదం. పరిస్థితిని సమీక్షిస్తున్నాం. – బి.ఇందిరా, డ్రెయినేజీ జేఈఈ, కైకలూరు -
ప్రతిభకు పట్టం
గాంధీయన్ యంగ్ టెక్నలాజికల్ ఇన్నోవేషన్ అవార్డుకు గోదాసు నర్సింహ ఎంపిక గుర్రపుడెక్కను తొలగించే యంత్రాన్ని రూపొందించిన నర్సింహ భూదాన్ పోచంపల్లి: లక్ష్యసాధనకు సృజనాత్మకతతోపాటు విభిన్న ఆలోచనలు తోడైతే నూతన వస్తువులు ఆవిష్కృతమవుతాయని నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్ కి చెందిన మత్స్య కార్మికుడు గోదాసు నర్సింహ నిరూపించాడు. చేపలు పట్టడానికి చెరువుల్లో ప్రతిబంధకంగా మారిన గుర్రపు డెక్కను తొలగించే యంత్రాన్ని రూపొందించాడు. ఆయన ప్రతి భను గుర్తించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా అనే సంస్థ ఈ నెల 13న ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో ‘గాంధీయన్ యంగ్ టెక్నలాజికల్ ఇన్నోవేషన్’ అవార్డును ప్రదానం చేయనుంది. దేశవ్యాప్తంగా పది మందికి ఈ అవార్డు దక్కింది. వీరిలో తెలంగాణ నుంచి నర్సింహ ఒక్కరే ఎంపిక కావడం విశేషం. యంత్ర తయారీ ఇలా..: నర్సింహ స్థానిక మత్స్య కార్మిక సంఘంలో సభ్యుడు. మూసీ నీటి వల్ల గ్రామ చెరువులో గుర్రపుడెక్క విపరీతంగా పెరిగి, చేపలు పట్టడానికి ఆటంకంగా మారింది. వలలు తెగిపోయి నష్టం జరిగేది. గుర్రపుడెక్కను తొలగించడానికి 50 మంది రెండు నెలలపాటు కష్టపడాల్సి వచ్చేది. ఈ క్రమంలో గుర్రపుడెక్కను కత్తిరించే యంత్రానికి రూపకల్పన చేశాడు. కేవలం ఐదుగురితో పది రోజుల్లో చేసి చూపాడు. ఫలితంగా ఖర్చు, సమయం ఎంతో ఆదా అయింది. ఇతని ప్రతిభ ను గుర్తిం చిన నాబార్డ్ రూ.2.50 లక్షల ఆర్థికసాయం చేసింది. నిరంతర శోధన..: గుర్రపుడెక్కను కత్తిరించే యంత్రం తయారీతోనే సంతృప్తి చెందక... నూతన యంత్రాలను రూపొందించేందుకు నర్సింహ నిరంతర శోధన చేస్తున్నారు. ఇందులో భాగంగా నీటిని తోడే యంత్రం, గోదామ్ లిఫ్టర్, రొటేటింగ్ క్రేన్, గ్రేన్ సెపరేటర్ యంత్రాలను తయారు చేశారు. మత్స్యకార్మిక కుటుంబానికి చెందిన గోదాసు అంజయ్య, సత్తమ్మ చిన్న కుమారుడు గోదాసు నర్సింహ. చిన్నతనంలోనే అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందారు. అప్పటి నుంచి తన అన్న కిష్టయ్య వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం 1987లో నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరాడు. తన కిష్టమైన మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరాలనుకున్నా.. డబ్బులు లేక సివిల్ ఇంజనీరింగ్‌లో చేరి ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో చదువుకున్నాడు. ఆ తర్వాత ఆర్థికస్థోమత లేక ఉన్నత చదువులకు దూరమయ్యాడు. గత ఏడాది మార్చిలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో గోదాసు నర్సింహ తాను రూపొందించిన గుర్రపుడెక్కను తొలగించే యంత్రాన్ని ప్రదర్శించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీచే ప్రశంసలు పొందాడు. స్వచ్ఛభారత్ విభాగంలో ఎంపిక కావడంతో నర్సింహను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా అభినందించారు. 2014లో ‘రైతునేస్తం’ పురస్కారం అందుకున్నాడు. నేడు నేను ఈ స్థాయిలో ఉండడానికి పల్లె సృజన అనే సంస్థ కారణ మని, నాలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిందని నర్సింహ అన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందజేస్తే కాలుష్యరహిత సోలార్ కారు తయారు చేస్తానని చెప్పారు.