ప్రతిభకు పట్టం | Talent to be crowned | Sakshi
Sakshi News home page

ప్రతిభకు పట్టం

Published Fri, Mar 11 2016 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

ప్రతిభకు పట్టం

ప్రతిభకు పట్టం

గాంధీయన్ యంగ్ టెక్నలాజికల్ ఇన్నోవేషన్ అవార్డుకు గోదాసు నర్సింహ ఎంపిక
గుర్రపుడెక్కను తొలగించే యంత్రాన్ని రూపొందించిన నర్సింహ    

 
భూదాన్ పోచంపల్లి: లక్ష్యసాధనకు సృజనాత్మకతతోపాటు విభిన్న ఆలోచనలు తోడైతే నూతన వస్తువులు ఆవిష్కృతమవుతాయని నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్ కి చెందిన మత్స్య కార్మికుడు గోదాసు నర్సింహ నిరూపించాడు. చేపలు పట్టడానికి చెరువుల్లో ప్రతిబంధకంగా మారిన గుర్రపు డెక్కను తొలగించే యంత్రాన్ని రూపొందించాడు. ఆయన ప్రతి భను గుర్తించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్  ఇండియా అనే సంస్థ ఈ నెల 13న ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో ‘గాంధీయన్ యంగ్ టెక్నలాజికల్ ఇన్నోవేషన్’ అవార్డును ప్రదానం చేయనుంది. దేశవ్యాప్తంగా పది మందికి ఈ అవార్డు దక్కింది. వీరిలో తెలంగాణ నుంచి నర్సింహ ఒక్కరే
ఎంపిక కావడం విశేషం.
 
యంత్ర తయారీ ఇలా..: నర్సింహ స్థానిక మత్స్య కార్మిక సంఘంలో సభ్యుడు. మూసీ నీటి వల్ల గ్రామ చెరువులో గుర్రపుడెక్క విపరీతంగా పెరిగి, చేపలు పట్టడానికి ఆటంకంగా మారింది. వలలు తెగిపోయి నష్టం జరిగేది. గుర్రపుడెక్కను తొలగించడానికి 50 మంది రెండు నెలలపాటు కష్టపడాల్సి వచ్చేది. ఈ క్రమంలో గుర్రపుడెక్కను కత్తిరించే యంత్రానికి రూపకల్పన చేశాడు. కేవలం ఐదుగురితో పది రోజుల్లో చేసి చూపాడు. ఫలితంగా ఖర్చు, సమయం ఎంతో ఆదా అయింది. ఇతని ప్రతిభ ను గుర్తిం చిన నాబార్డ్ రూ.2.50 లక్షల
ఆర్థికసాయం చేసింది.
 
నిరంతర శోధన..: గుర్రపుడెక్కను కత్తిరించే యంత్రం తయారీతోనే సంతృప్తి చెందక... నూతన యంత్రాలను రూపొందించేందుకు నర్సింహ నిరంతర శోధన చేస్తున్నారు. ఇందులో భాగంగా నీటిని తోడే యంత్రం, గోదామ్ లిఫ్టర్, రొటేటింగ్ క్రేన్, గ్రేన్ సెపరేటర్ యంత్రాలను తయారు చేశారు. మత్స్యకార్మిక కుటుంబానికి చెందిన గోదాసు అంజయ్య, సత్తమ్మ చిన్న కుమారుడు గోదాసు నర్సింహ. చిన్నతనంలోనే అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందారు. అప్పటి నుంచి తన అన్న కిష్టయ్య వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం 1987లో నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరాడు. తన కిష్టమైన మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరాలనుకున్నా.. డబ్బులు లేక సివిల్ ఇంజనీరింగ్‌లో చేరి ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో చదువుకున్నాడు. ఆ తర్వాత ఆర్థికస్థోమత లేక ఉన్నత చదువులకు దూరమయ్యాడు. గత ఏడాది మార్చిలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో గోదాసు నర్సింహ తాను రూపొందించిన గుర్రపుడెక్కను తొలగించే యంత్రాన్ని ప్రదర్శించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీచే ప్రశంసలు పొందాడు. స్వచ్ఛభారత్ విభాగంలో ఎంపిక కావడంతో నర్సింహను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా అభినందించారు. 2014లో  ‘రైతునేస్తం’ పురస్కారం అందుకున్నాడు. నేడు నేను ఈ స్థాయిలో ఉండడానికి పల్లె సృజన అనే సంస్థ కారణ మని, నాలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిందని నర్సింహ అన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందజేస్తే కాలుష్యరహిత సోలార్ కారు తయారు చేస్తానని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement