Mission Kakatiya Ponds
-
GHMC: కాగితాలపైనే అర్బన్ మిషన్ కాకతీయ పథకం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జలాశయాల అభివృద్ధి.. పునరుద్ధరణ.. కాలుష్యం కోరల నుంచి రక్షించే పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. అర్బన్ మిషన్ కాకతీయ పథకం కింద మహానగరం పరిధిలోని 185 చెరువుల ప్రక్షాళన, సుందరీకరణ పనులు చేపడతామన్న సర్కారు పెద్దల మాటలు నీటిమూటలుగా మారాయి. బల్దియా పరిధిలో మొత్తం 185 జలాశయాలుండగా.. ఈ పథకం కింద సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల క్రితం 18 చెరువులను అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దారు. మిగతా వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేక్స్ డివిజన్ నిధులు లేక అలంకార ప్రాయమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తటాకాలకు శాపం ఇలా.. ► మహానగరంలోని పలు చెరువుల్లో ఇటీవలికాలంలో గుర్రపుడెక్క ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. ► సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధంగా మార్చేస్తున్నాయి. ► ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థ జలాల్లో ఉండే ఫేకల్‌కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతోపాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ► ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో నీటిలో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సీజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం. ► గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం వెలువడుతున్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 770 మి.లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే చెరువులు, మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. సంరక్షించాలి ఇలా.. చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సేవ్ అవర్ అర్బన్లేక్స్ సంస్థ పలు సూచనలు చేసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని చెరువుల్లో పేరుకుపోయిన ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. జలాశయాల ఉపరితలపై ఉద్ధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి. చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి. వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలి. కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలి. (క్లిక్ చేయండి: కమాండ్ కంట్రల్ సెంటర్ వద్ద సరికొత్త బారికేడింగ్) -
చెరువులను పరిశీలించిన కలెక్టర్
సాక్షి, మెదక్: మిషన్ కాకతీయ చెరువుల పూడికతీత పనులు నత్తనడకన సాగడంపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ కె.ధర్మారెడ్డి స్పందించారు. శుక్రవారం మెదక్ మండలం, పట్టణంలోని చెరువులను ఆయన పరిశీలించి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ మూడవ, నాల్గవ విడత చెరువుల పూడికతీత పనుల జాప్యంపై ‘నత్తనడక’ శీర్షికతో ‘సాక్షి’ శుక్రవారం కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ మెదక్ మండలం మద్దులవాయి గ్రామంలోని చందం చెరువును పరిశీలించారు. మూడవ విడత మిషన్ కాకతీయలో భాగంగా చందం చెరువు పూడికతీత ఇతర అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈ పనులను పరిశీలించిన కలెక్టర్ ధర్మారెడ్డి పనుల అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పూడికతీత, చెరువు కట్టతోపాటు ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎక్కడా నాణ్యతా లోపాలు లేకుండా చూడాలని ఇరిగేషన్ ఈఈ ఏసయ్య, ఇతర అధికారులను ఆదేశించారు. మెదక్ పట్టణంలోని మద్దులవాయి చెరువును కలెక్టర్ పరిశీలించారు. మిషన్ కాకతీయ కింద చేపడుతున్న పనులను పరిశీలించారు. తూము అభివృద్ధి, బతుకమ్మ ఘాట్ నిర్మాణం పనులను కలెక్టర్ పరిశీలించారు. రూ.72.98 లక్షలతో మిషన్ కాకతీయ కింద మల్లం చెరువు పూడికతీత ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఇరిగేషన్ ఈఈ ఏసయ్య కలెక్టర్‌కు వివరించారు. పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్బంగా మల్లం చెరువు శిఖం ఆక్రమణకు గురికావడాన్ని గుర్తించిన కలెక్టర్ వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను ఆదేశించారు. మల్లం చెరువు శిఖంలో కొత్తగా కడుతున్న నిర్మాణాలను నిలిపివేయాలన్నారు. ఇకపై చెరువు ఆక్రమణకు గురికాకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని తహసీల్దార్ యాదగిరికి సూచించారు. మెదక్ పట్టణంతోపాటు జిల్లాలోని పలు చెరువుల శిఖం భూములు అన్యాక్రాంతానికి గురికావడం, శిఖంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంపైనా గతంలో ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించింది. -
‘మిషన్’కు ఏడాది
వర్షాలు లేక ఎండిపోయిన చెరువులు నెరవేరని ప్రభుత్వ లక్ష్యం ముసుగు తొలగని పైలాన్ మిషన్-2పై రాజకీయ నీడ వరంగల్: చిన్న నీటి వనరుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయింది. జిల్లాలో చిన్న నీటి వనరుల విభాగంలో 5,839 చెరువులు ఉన్నాయి. వీటి కింద 3,55,187 ఎకరాల సాగు భూమి ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఈ చెరువులను అభివృద్ధి చేయూలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. మిషన్ కాకతీయ కింద మొదటి దశలో 1,075 చెరువులను గుర్తించారు. వీటి పునద్ధరణకు ప్రభుత్వం రూ.418కోట్లు కేటాయించింది. ఇందులో 1,063 చెరువులకు ఈ ప్రొక్యూర్‌మెంటు పద్ధతిలో టెండర్లు నిర్వహించగా కాంట్రాక్టర్లు పోటీపడి పనులు దక్కించుకున్నారు. వీటిలో రెవెన్యూ, అటవీ శాఖల అభ్యంతరాల వల్ల కొన్ని చెరువుల పనులను అధికారులు చేపట్టలేక పోయారు. గత ఏడాది చేపట్టిన పునరుద్ధరణలో 26 చెరువులు 100 శాతం పూర్తి కాగా, 566 చెరువులు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని చెరువుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పనులు చేపట్టిన 881 చెరువులకు అధికారులు చెల్లింపులు కూడా చేశారు. మొదటి విడతలో చేపట్టిన చెరువుల నుంచి సుమారు 1,05,86,843 క్యూబిక్ మీటర్ల మట్టిని పూడిక తీసినట్టు అధికారులు పేర్కొన్నారు. వట్టిపోయిన చెరువులు మిషన్ కాకతీయ మొదటి విడతలో చేపట్టిన చెరువుల్లో ఎక్కువ శాతం నీళ్లు లేక ఎండిపోయూయి. మిషన్-1 పనులను 2015 జనవరిలో ప్రారంభించాలని ప్రభుత్వం భావించినా అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఫలితంగా సాధ్యం కాలేదు. వివిధ కారణాల వల్ల చెరువుల నిధుల కేటాయింపుల్లో ఆలస్యం కావడం, రుతుపవనాలు జూన్‌లోనే వచ్చి వర్షాలు పడడంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. చెరువులు మరమ్మతులు చేసినప్పటికీ అనుకున్న వర్షపాతం లేక పోవడం వల్ల ములుగు, మహబూబాబాద్ ఐబీ డివిజన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో చెరువులు నీళ్లు లేక బోసిపోయాయి. అధికారులు చెరువుల మరమ్మతులు పూర్తయినట్లు చెబుతున్నా ఆయా చెరువులు పూర్తి స్థాయిలో పునరుద్ధరణకు నోచుకోలేదు. మిషన్-2లో 1268 చెరువులు మిషన్-2లో 1095 చెరువులను పునరుద్ధరించేందుకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపగా.. 493 చెరువులకు పరిపాలన మంజూరు వచ్చింది. ఇందులో 334 చెరువులకు సాంకేతిక అనుమతి లభించగా 298 చెరువులకు టెండర్లు నిర్వహించారు. టెండర్లలో చెరువుల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు 123 చెరువుల పనులు చేసేందుకు అగ్రిమెంటు ప్రక్రియ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. ఈ విడత పనులపై రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో టెండర్ల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నుట్ల ప్రచారం జరుగుతోంది. అలంకారప్రాయంగా ‘మిషన్’ పైలాన్ మిషన్ కాకతీయ చిహ్నంగా రూ.42లక్షలతో నిర్మించిన పైలాన్ ఏడాదిగా ఆవిష్కరణకు నోచుకోవడం లేదు. కేంద్ర మంత్రి ఉమాభారతి పర్యటన రెండుసార్లు ఖరారై వారుుదాపడింది. ఈ పైలాన్ ఆవిష్కరణ కొలిక్కి రాకపోవడం, సమయం మించిపోతుండడంతో ప్రభుత్వం చెరువుల పనులు ప్రారంభించింది. మిషన్ కాకతీయ రెండో దశ మొదలైనా పైలాన్‌ను ప్రారంభించపోవడంపై విమర్శలు వస్తున్నాయి.