moderisation
-
GHMC: కాగితాలపైనే అర్బన్ మిషన్ కాకతీయ పథకం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జలాశయాల అభివృద్ధి.. పునరుద్ధరణ.. కాలుష్యం కోరల నుంచి రక్షించే పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. అర్బన్ మిషన్ కాకతీయ పథకం కింద మహానగరం పరిధిలోని 185 చెరువుల ప్రక్షాళన, సుందరీకరణ పనులు చేపడతామన్న సర్కారు పెద్దల మాటలు నీటిమూటలుగా మారాయి. బల్దియా పరిధిలో మొత్తం 185 జలాశయాలుండగా.. ఈ పథకం కింద సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల క్రితం 18 చెరువులను అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దారు. మిగతా వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేక్స్ డివిజన్ నిధులు లేక అలంకార ప్రాయమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తటాకాలకు శాపం ఇలా.. ► మహానగరంలోని పలు చెరువుల్లో ఇటీవలికాలంలో గుర్రపుడెక్క ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. ► సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధంగా మార్చేస్తున్నాయి. ► ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థ జలాల్లో ఉండే ఫేకల్‌కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతోపాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ► ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో నీటిలో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సీజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం. ► గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం వెలువడుతున్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 770 మి.లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే చెరువులు, మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. సంరక్షించాలి ఇలా.. చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సేవ్ అవర్ అర్బన్లేక్స్ సంస్థ పలు సూచనలు చేసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని చెరువుల్లో పేరుకుపోయిన ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. జలాశయాల ఉపరితలపై ఉద్ధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి. చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి. వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలి. కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలి. (క్లిక్ చేయండి: కమాండ్ కంట్రల్ సెంటర్ వద్ద సరికొత్త బారికేడింగ్) -
రెండంతస్తుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణపై దక్షిణమధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. ఎయిర్‌పోర్టు తరహాలో చర్లపల్లి రైల్వేస్టేషన్ పునర్నిర్మాణానికి తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా విమానాశ్రయం తరహాలో తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్ల పునర్ అభివృద్ధికి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తిరుపతి స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌కు ఒకట్రెండు రోజుల్లో టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్‌లో 4వ టర్మినల్‌గా ఇప్పటికే విస్తరణ పనులు చేపట్టిన చర్లపల్లి స్టేషన్‌ను సైతం ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2023 జూన్ నాటికి చర్లపల్లి స్టేషన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు పనుల్లో వేగం పెంచినట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ అభయ్‌కుమార్ గుప్తా తెలిపా రు. అన్ని సదుపాయాలతో వినియోగంలోకి రానున్న చర్లపల్లి స్టేషన్ నుంచి కాజీపేట్, విజయవాడ రూట్లో వెళ్లే రైళ్లను నడుపనున్నట్లు పేర్కొన్నారు. సేవలు ఇలా.... చర్లపల్లి స్టేషన్‌ను రెండంతస్తుల్లో పునర్ నిర్మించనున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రయాణికుల విశ్రాంతి గదులు, హోటళ్లు, రైల్వే అధికారుల కార్యాలయాలు తదితర సదుపాయాలు ఉంటాయి. విమానాశ్రయంలో లాగా ప్రయాణికులు ప్రవేశద్వారం నుంచి నేరుగా ప్లాట్‌ఫామ్‌కు చేరుకొనేలా మొదటి అంతస్తు ఉంటుంది. మొదటి విడతలో మొత్తం 8 లైన్లతో ప్లాట్‌ఫాంలను విస్తరిస్తారు. దశలవారీగా ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరగనుంది. అన్ని ప్లాట్‌ఫాంలకు చేరుకొనేలా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. “రైళ్ల నిర్వహణకు పిట్లైన్లు, ఇక్కడి నుంచి రైళ్లను నడిపేందుకు ప్రత్యేక మార్గాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. చర్లపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణం కూడా తుది దిశకు వచ్చింది’ అని డీఆర్ఎం వివరించారు. ఎయిర్‌పోర్టు తరహాలో స్టేషన్ పునర్ అభివృద్ధికి ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునర్ అభివృద్ధి కోసం ఒకట్రెండు రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. చర్లపల్లి నుంచే వందేభారత్... సెమీ హైస్పీడ్‌గా పేరొందిన వందేభారత్ రైళ్లను చర్లపల్లి నుంచే నడపనున్నారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చర్లపల్లి నుంచి విశాఖ, ముంబై తదితర మార్గాల్లో వందేభారత్ నడపాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైల్వేలోని అన్ని జోన్లకు దశలవారీగా వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఆధునికీకరణకు గ్రహణం
- ఖరారు కాని మిడ్‌పెన్నార్ సౌత్‌కెనాల్ టెండర్లు - పోటీపడుతున్న ప్రముఖ సంస్థలు - అధిక రేట్లకు దక్కించుకునేందుకు అధికార పార్టీ కాంట్రాక్టర్ల ఎత్తుగడ అనంతపురం సెంట్రల్ : కరువు జిల్లాకు అదనంగా నీరు తెచ్చే ఉద్దేశంతో చేపట్టిన తుంగభద్ర ఎగువకాలువ (హెచ్చెల్సీ) ఆధునికీకరణ పనులకు అధికార పార్టీ నేతలు అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్నారు. ఇందుకు ఉన్నత స్థాయిలో ‘అధికార’ మాయాజాలం కూడా తోడైంది. అస్మదీయులకు రూ.వందల కోట్ల పనులు కట్టబెట్టేందుకు నిబంధనలు సైతం ‘తుంగ’లో తొక్కుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే పనులకు సంబంధించిన టెండర్లను ఖరారు చేయాల్సి ఉన్నా.. నేటికీ అతీగతీ లేదు. ఫలితంగా ఆధునికీకరణ పనుల్లో మరింత జాప్యం జరగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. వీటిలో మిడ్‌పెన్నార్ సౌత్‌కెనాల్ ఆధునికీకరణకు సంబంధించి రెండు ప్యాకేజీల (43, 44 ప్యాకేజీలు) పనులు అనివార్య కారణాల వల్ల ఆగిపోయాయి. అప్పట్లో 43వ ప్యాకేజీకి (0 నుంచి 40 కిలోమీటరు వరకు) రూ.66.43 కోట్లు అంచనా వ్యయం కాగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రూ.8.15 కోట్ల విలువైన పనులు చేసి తప్పుకున్నారు. 44వ ప్యాకేజీ పనుల (40 నుంచి 84 కిలోమీటరు వరకు) అంచనా వ్యయం రూ.50.40 కోట్లు కాగా.. రూ. 7.07 కోట్ల పనులు చేసి కాంట్రాక్టర్ తప్పుకున్నారు. మళ్లీ రీటెండర్లు ఈ పనులకు అధికారులు రీటెండర్లు ఆహ్వానించారు. పనుల అంచనా మొత్తాన్ని అమాంతం పెంచేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగైదు రెట్లు పెంచడం విమర్శలకు దారితీస్తోంది. అంచనా వ్యయం రూ.66.43 కోట్లు ఉన్న 43వ ప్యాకేజీ పనులను రూ. 237.24 కోట్లకు పెంచారు. రూ. 50.40 కోట్లు ఉన్న 44వ ప్యాకేజీ పనులను రూ. 184.64 కోట్లకు పెంచారు. దీని వెనుక పెద్ద కథే ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాటికీ.. నేటికీ పోల్చిచూస్తే అన్ని ధరలూ పెరిగి ఉంటాయి. మహా అయితే డబుల్ రేట్లకు పెంచినా పెద్దగా విమర్శలు రాకపోయి ఉండొచ్చు. ఏకంగా నాలుగైదు రెట్లు అంచనా వ్యయాన్ని పెంచడం చర్చనీయాంశమైంది. వీటితో పాటు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) ఆధునికీకరణ పనుల కోసం రూ.330 కోట్లకు టెండర్లు పిలిచారు. అస్మదీయులకు కట్టబెట్టేందుకే... ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలుకాక మునుపే కాలువ పనులకు టెండర్లు పిలిచారు. అనూహ్య రీతిలో బడా కాంట్రాక్టు సంస్థలు పోటీ పడ్డాయి. మెజార్టీ సంస్థలు మూడు పనుల టెండర్లలోనూ పాల్గొన్నాయి. ఇందులో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంస్థ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా అస్మదీయులకు పనులు కట్టబెట్టేందుకు అధికార పెద్దలు నెలలుగా నాన్చుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. సమయం పడుతుంది హెచ్చెల్సీ సౌత్, జీబీసీ ఆధునికీకరణ పనులకు సంబంధించిన టెండర్లను పరిశీలిస్తున్నాం. పరిశీలన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపుతాం. అక్కడ టెండర్లను ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. - టీవీ శేషగిరిరావు, హెచ్చెల్సీ ఎస్ఈ