ఆధునికీకరణకు గ్రహణం
ఆధునికీకరణకు గ్రహణం
Published Wed, Apr 26 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
- ఖరారు కాని మిడ్‌పెన్నార్ సౌత్‌కెనాల్ టెండర్లు
- పోటీపడుతున్న ప్రముఖ సంస్థలు
- అధిక రేట్లకు దక్కించుకునేందుకు అధికార పార్టీ కాంట్రాక్టర్ల ఎత్తుగడ
అనంతపురం సెంట్రల్ : కరువు జిల్లాకు అదనంగా నీరు తెచ్చే ఉద్దేశంతో చేపట్టిన తుంగభద్ర ఎగువకాలువ (హెచ్చెల్సీ) ఆధునికీకరణ పనులకు అధికార పార్టీ నేతలు అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్నారు. ఇందుకు ఉన్నత స్థాయిలో ‘అధికార’ మాయాజాలం కూడా తోడైంది. అస్మదీయులకు రూ.వందల కోట్ల పనులు కట్టబెట్టేందుకు నిబంధనలు సైతం ‘తుంగ’లో తొక్కుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే పనులకు సంబంధించిన టెండర్లను ఖరారు చేయాల్సి ఉన్నా.. నేటికీ అతీగతీ లేదు. ఫలితంగా ఆధునికీకరణ పనుల్లో మరింత జాప్యం జరగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. వీటిలో మిడ్‌పెన్నార్ సౌత్‌కెనాల్ ఆధునికీకరణకు సంబంధించి రెండు ప్యాకేజీల (43, 44 ప్యాకేజీలు) పనులు అనివార్య కారణాల వల్ల ఆగిపోయాయి. అప్పట్లో 43వ ప్యాకేజీకి (0 నుంచి 40 కిలోమీటరు వరకు) రూ.66.43 కోట్లు అంచనా వ్యయం కాగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రూ.8.15 కోట్ల విలువైన పనులు చేసి తప్పుకున్నారు. 44వ ప్యాకేజీ పనుల (40 నుంచి 84 కిలోమీటరు వరకు) అంచనా వ్యయం రూ.50.40 కోట్లు కాగా.. రూ. 7.07 కోట్ల పనులు చేసి కాంట్రాక్టర్ తప్పుకున్నారు.
మళ్లీ రీటెండర్లు
ఈ పనులకు అధికారులు రీటెండర్లు ఆహ్వానించారు. పనుల అంచనా మొత్తాన్ని అమాంతం పెంచేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగైదు రెట్లు పెంచడం విమర్శలకు దారితీస్తోంది. అంచనా వ్యయం రూ.66.43 కోట్లు ఉన్న 43వ ప్యాకేజీ పనులను రూ. 237.24 కోట్లకు పెంచారు. రూ. 50.40 కోట్లు ఉన్న 44వ ప్యాకేజీ పనులను రూ. 184.64 కోట్లకు పెంచారు. దీని వెనుక పెద్ద కథే ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాటికీ.. నేటికీ పోల్చిచూస్తే అన్ని ధరలూ పెరిగి ఉంటాయి. మహా అయితే డబుల్ రేట్లకు పెంచినా పెద్దగా విమర్శలు రాకపోయి ఉండొచ్చు. ఏకంగా నాలుగైదు రెట్లు అంచనా వ్యయాన్ని పెంచడం చర్చనీయాంశమైంది. వీటితో పాటు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) ఆధునికీకరణ పనుల కోసం రూ.330 కోట్లకు టెండర్లు పిలిచారు.
అస్మదీయులకు కట్టబెట్టేందుకే...
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలుకాక మునుపే కాలువ పనులకు టెండర్లు పిలిచారు. అనూహ్య రీతిలో బడా కాంట్రాక్టు సంస్థలు పోటీ పడ్డాయి. మెజార్టీ సంస్థలు మూడు పనుల టెండర్లలోనూ పాల్గొన్నాయి. ఇందులో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీకి సంబంధించిన కన్‌స్ట్రక‌్షన్ సంస్థ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా అస్మదీయులకు పనులు కట్టబెట్టేందుకు అధికార పెద్దలు నెలలుగా నాన్చుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
సమయం పడుతుంది
హెచ్చెల్సీ సౌత్, జీబీసీ ఆధునికీకరణ పనులకు సంబంధించిన టెండర్లను పరిశీలిస్తున్నాం. పరిశీలన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపుతాం. అక్కడ టెండర్లను ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా జరగడానికి కొంత సమయం పడుతుంది.
- టీవీ శేషగిరిరావు, హెచ్చెల్సీ ఎస్‌ఈ
Advertisement
Advertisement