జైకా నిధులా...ఆగాల్సిందే
► ప్రతిపాదనల్లో సాంకేతిక లోపాలతో పనుల మంజూరులో జాప్యం
► కొత్త ఆర్థిక సంవత్సరంలోనే పనులు జరిగే అవకాశం
విజయనగరం గంటస్తంభం: జైకా నిధులతో ప్రాజెక్టుల అభివృద్ధి జరగాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో సాంకేతికపరమైన లోపాలు ఉండడంతో పనుల మంజూరులో జాప్యం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులు మూడు,నాలుగు నెలల్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం నాటికి అంతా ఒక కొలిక్కి రావచ్చనే సమాచారం ప్రస్తుతం షికారు చేస్తుంది. జిల్లాలో తోటపల్లి తరహా భారీ ప్రాజెక్టుతో పాటు పలు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని ప్రాజెక్టులు నుంచి పూర్తిస్థారుు విస్తీర్ణానికి సాగునీరు అందని పరిస్థితి. ప్రాజెక్టుల చెంత నిర్మాణాలు, కాలువలు ఆధ్వానంగా ఉండడం ఇందుకు కారణం. నీరు చెట్టు పథకంలో మట్టి పనులు చేసినప్పటికీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో అలా పడి ఉన్నారుు.
నిధుల కోసం జపం..
ఈ నేపథ్యంలో అధికారులు పనుల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల జరగడం లేదు. జపాన్ ఇంటిగ్రేటెడ్ కోపరేటవ్ ఏజెన్సీ(జైకా) సాయం చేస్తుండడంతో జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు ఆధునీకికరణ పనులకు ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఆండ్ర ప్రాజెక్టు పనులకు రూ.37 కోట్లు, వెంగళరాయసాగర్‌కు రూ.70 కోట్లు, వట్టిగెడ్డకు రూ.40 కోట్లు, పెదంకాలం ప్రాజెక్టు అభివృద్ధికి రూ.20 కోట్లతో ప్రతిపాదనలు గతేడాది పంపారు. కానీ నిధులు మాత్రం ఇంతవరకు మంజూరు కాలేదు.
నిధులు రాకపోవడానికి కారణాలేంటి..?
ప్రతిపాదనలు పంపి ఏడాది కావస్తున్నా ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడానికి కారణాలు అనేకం. అధికారులు పంపిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలమండలికి పంపడంలో జాప్యం, వారు జైకాకు నివేదించడం, జైకా బృందం రాష్ట్రానికి వచ్చి ప్రాజెక్టులు పరిశీలించడంలో విపరీతమైన జాప్యం కారణంగా నిధులు మంజూరు కాలేదు. ఎట్టకేలకు జైకా బృందం పక్షం రోజలు క్రితం జిల్లాకు వచ్చి ప్రాజెక్టులు పరిశీలించింది. దీంతో నిధులు విడుదల అవుతాయని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం వరి కోతలు జరుగుతుండడం, భూమి గట్టి పడుతుండడంతో జనవరి నుంచి పనులు ఆరంభించవచ్చని అధికారులు భావించారు. కానీ పరిస్థితి వేరేలా ఉంది. ప్రాజెక్టులు పరిశీలన చేసిన జైకా బృందం క్షేత్రస్థారుు పరిస్థితికి, ముందుగా ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు మధ్య తేడాని గమనించించింది. ప్రతిపాదనల్లో సాంకేతిక సమస్యలున్నాయని, మార్పు చేసి తిరిగి పంపించాలని సూచించింది.
ఈ మేరకు జలవనరులశాఖ అధికారులు ప్రతిపాదనలు మార్చి పంపిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు కేంద్ర జలమండలి (సీడబ్ల్యూసీ)కి వెళ్లి అక్కడ నుంచి జైకాకు వెళ్లాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. వారు పరిశీలించి పనులకు నిధులు మంజూరు చేస్తే తర్వాత టెండర్ల పక్రియ జరుగుతుంది. ఇదంతా జరిగేసరికి రెండు, మూడు నెలలు సమయం పడుతుంది. ఈ ఏడాదిలో మరి నిధులు రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ వచ్చినా పనులు చేసే సరికి సమయం పడుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే అవకాశముందంటున్నారు.
అంతా అనుకున్నట్లు జరిగితే సాగునీరు...
ఈ నేపథ్యంలో వచ్చే ఖరీఫ్ నాటికి ఈ ప్రాజెక్టుల కింద సాగునీరు అందే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే నిధులు విడుదలవుతాయని అధికారులు భావించారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టుల అధునీకీకరణ జరిగి నీరందుతుందని అనుకున్నారు. కానీ ఆపరిస్థితి లేదు. పోనీ వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరందాలంటే మార్చి, ఏప్రిల్ నాటికి పనులు ప్రారంభమై జూన్ నాటికి పూర్తి కావాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా రైతులు కల వచ్చే ఏడాది కూడా నెరవేరదు. వాస్తవానికి ఈ నాలుగు ప్రాజెక్టులు సక్రమంగా లేకపోవడం వల్ల ఈ ఏడాది సగం విస్తీర్ణానికి కూడా నీరంద లేదు. 15 వేల ఎకరాలకుపైగా సాగు నీరందకుండా పోరుుంది. కావున ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి నిధులు వచ్చేట్లు చేస్తే రైతులకు సాగునీటి చింత తీరుతుంది.