
వాషింగ్టన్: మహమ్మారి కరోనాపై పోరుకు ప్రపంచ బ్యాంకు భారత్‌కు ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,600 కోట్లు) అత్యవసర సాయం ప్రకటించింది. ఈమేరకు భారత్ చేసిన అభ్యర్థనపై వరల్డ్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సమావేశం అనంతరం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు వరల్డ్ బ్యాంకు ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాలకు 1.9 బిలియన్ డాలర్ల అత్యవసర సాయం ప్రకటించగా.. దాంట్లో అత్యధికంగా భారత్‌కు 1 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టు వరల్డ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. స్క్రీనింగ్, కాంటాక్ట్ కేసుల ట్రేసింగ్, లేబొరేటరీ డయాగ్నోస్టిక్స్, వైద్యులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్, నూతన ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు ఈ నిధులు వినియోగించనున్నారు.
(చదవండి: ముందు జాగ్రత్తే మందు..)
ఇక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోవిడ్-19 నిర్మూలనకు నిధులు కేటాయించిన ప్రపంచ బ్యాంకు దక్షిణాసియాలో భారత్ తర్వాత.. పాకిస్తాన్‌కు 200 మిలియన్ డాలర్లు, ఆఫ్గనిస్థాన్‌కు 100 మిలియన్ డాలర్లు, మాల్దీవులకు 7.3 మిలియన్ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ పురోగతికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రానున్న15 నెలల్లో 160 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై ప్రణాళికలు వేస్తున్నామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ మొత్తాన్ని దారిద్య్ర నిర్మూలనపై, నిరుపేదలను ఆదుకునేందుకు, పర్యావరణ పరిరక్షణకు ఖర్చు చేస్తామని పేర్కొంది. కాగా, భారత్‌లో ఇప్పటివరకు 2500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 76 మంది చనిపోయారు.
(చదవండి: ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు)
Comments
Please login to add a commentAdd a comment