టీడీపీలో వర్గపోరు
కందుకూరు: కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. నామినేటెడ్ పదువుల వ్యవహారంలో మొదలైన వర్గపోరు రోజు రోజుకూ తారాస్థాయికి చేరుతోంది. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా మొదలైన నేతల మధ్య విభేదాలు ఇటీవల వేరుకుంపట్లు పెట్టుకునే స్థాయికి దారితీసింది. ఇంతకాలం అంతర్గతంగా సాగుతున్న నేతల మధ్య విభేదాలు ఇటీవల జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ జన్మదిన వేడుకల సందర్బంగా ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి.
ఈ క్రమంలోనే బుధవారం కందుకూరులో మంత్రుల పర్యటన సమయంలోనూ మరోసారి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే దివి శివరాంని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పార్టీలోని ఓ వర్గం బుధవారం ఉదయం శివరాం ఇంట్లో ఏర్పాటు చేసిన మంత్రుల అల్పాహార విందు కార్యక్రమానికి హాజరుకాలేదు. వీరిలో ప్రధానంగా పార్టీ సీనియర్ నాయకులైన ఘట్టమనేని చెంచురామయ్య, కండ్రా హరిబాబు, ఎంపీపీ అనూరాధ భర్త గుళ్లా శ్రీను, జెడ్‌పీటీసీ కంచర్ల శ్రీకాంత్, చల్లా నాగేశ్వరరావు, కొడాలి కోటేశ్వరరావు, సోమినేని రవీంద్ర, పొడపాటి శ్రీను, చంద్రమౌళి తదితర నాయకులున్నారు.
తమవర్గం వరకు జనార్థన్‌కు మద్దతుగా భారీ కార్ల ర్యాలీ ఏర్పాటు చేసుకున్నారు. ఒంగోలు నుంచి జనార్థన్‌కు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన నాయకులు కందుకూరులో మాత్రం శివరాం ఇంటికి వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయారు. శివరాం ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డి, పైడికాయల మాణిక్యాలరావు, రావెల కిశోర్‌బాబులు, నారాయణలతోపాటు ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దామచర్ల జానార్ధన్, బాలవీరాంజనేయస్వామి, కరణం బలరాం తదితర నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శివరాం వర్గానికి చెందిన కొందరు నాయకులు మాత్రమే హాజరయ్యారు.
ఇటీవల శివరాం వైఖరిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న మరోవర్గం నాయకులు కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరుపై మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో తనకు వ్యతిరేకంగా సొంతంగా కార్యక్రమాలు చేసుకుపోతున్న అసమ్మతి వర్గం నాయకులను బుజ్జగించే ప్రయత్నాలు శివరాం మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే శివరాం సోదరుడు, పార్టీ సీనియర్ నాయకుడైన దివి లింగయ్యనాయుడు సైతం మంత్రి కామినేని పాల్గొన్న బి.జె.పి. కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం గమనార్హం. దీంతో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలతో నాయకులు మరోసారి బజారుకెక్కారు.
నామినేటెడ్ పదవుల భర్తీలోనూ...
తెలుగుదేశం పార్టీలో వర్గపోరుకు నామినేటెడ్ పదవుల భర్తీనే ప్రధాన కారణం. మార్కెట్‌యార్డు చైర్మన్ పదవి ఆశించిన పలువురు సీనియర్ నాయకులు శివరాం అనుసరించిన వైఖరితో తీవ్ర ఆవేదన చెందారు. ఈ పదవిని శివరాం తన ప్రధాన అనుచరుడైన తల్లపనేని వెంకటేశ్వర్లుకు కట్టబెట్టడమే ప్రధాన కారణం. పలు కాంట్రాక్టులతోపాటు అన్ని విషయాల్లో ఒక్క తల్లపనేనికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడంపై సీనియర్ నాయకులు గతకొంత కాలంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయినప్పటికీ ఆయన వైఖరిలో మార్పురాకపోవడంతో అసమ్మతి స్వరం పెరుగుతూ వస్తోంది.