ఉగాది వేళ టీడీపీ వర్గపోరు
ఉగాది వేళ టీడీపీ వర్గపోరు
Published Wed, Mar 29 2017 11:31 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
ఎమ్మెల్యే బుచ్చయ్య వర్సెస్ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
పార్టీ ఆవిర్భావ దినోత్సం అట్టర్‌ఫ్లాప్
36 మందికి ఆరుగురు కార్పొరేటర్లు మాత్రమే హాజరు
సాక్షి, రాజమహేంద్రవరం : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున రాజమహేంద్రవరం నగర టీడీపీలో లుకలుకలు బట్టబయలయ్యాయి. ఆది నుంచి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణల మధ్య వర్గపోరు నడుస్తోంది. దీనికి తోడు గత ఏడాది వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేరికతో మూడో గ్రూపు తయారైనట్టైంది. ఆదిరెడ్డికి చెక్ చెప్పేందుకు ఎమ్మెల్యే గోరంట్ల చేయని ప్రయత్నమంటూ లేదు. ఇందులో భాగంగా గన్నికృష్ణతో ఉన్న విభేదాలను కూడా గోరంట్ల పక్కన పెట్టి ఆయన్ను కలుపుకుపోతున్నారు. గత నెల 8న జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఆదిరెడ్డి వర్గానికి చెందిన కార్పొరేటర్లు అవినీతికి పాల్పడుతున్నారంటూ పరోక్షంగానే విమర్శించారు. దీంతో ఆదిరెడ్డి, గోరంట్ల మధ్య ఉన్న విభేదాలు బుధవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలయ్యాయి. బుధవారం ఆనం కళాకేంద్రం వద్ద ఉన్న సిటీ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించ తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ముందుగా గన్నికృష్ణ వచ్చి గోరంట్ల రాక కోసం ఎదురు చూసి, ఆయన వచ్చాకా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం అక్కడకు వచ్చిన ఆదిరెడ్డి తనకు సమాచారం ఇవ్వకుండానే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారని, పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గోరంట్ల ప్రధాన అనుచరుడైన డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబుకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి మధ్య సమాచారం ఇచ్చామని ఒకరు, ఇవ్వలేదని ఒకరు వాగ్యుద్ధం జరిగి ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఆదిరెడ్డికి, గోరంట్లకు మధ్య కూడా వాగ్వాదం జరిగింది.
కార్యక్రమం అట్టర్‌ఫ్లాప్..
టీడీపీ 36వ ఆవిర్భావ దినోత్సవం అట్టర్‌ప్లాప్ అయింది. ఎన్నికలు తర్వాత నుంచీ కూడా నగర టీడీపీ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. ఎమ్మెల్యే గోరంట్లే రూరల్, సిటీలలో పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. నగర అధ్యక్షుడు కూడా లేకపోవడంతో పార్టీ క్యాడర్ ఛిన్నాభిన్నమైంది. పలువురు నేతలు స్తబ్ధుగా ఉంటున్నారు. కార్పొరేటర్లు కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది కార్యకర్తలు, నేతలు మాత్రమే హాజరయ్యారు. నగరపాలక సంస్థలో 50 మందికిగాను టీడీపీకి 36 మంది కార్పొరేట్లు ఉంటే ఈ కార్యక్రమానికి కేవలం ఆరుగురు మాత్రమే హాజరయ్యారంటే పార్టీలో వర్గ విభేదాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆదిరెడ్డి, గోరంట్ల మధ్య నడుస్తున్న వర్గ పోరు వచ్చే ఎన్నికల్లో పార్టీ పుట్టిముంచుతుందన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.
Advertisement
Advertisement