Factionalism
-
ఆ ఆస్పత్రిలో ఏం జరుగుతోంది?
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఆస్పత్రి.. సిబ్బంది వర్గపోరుకు వేదికైంది. వారు రోగుల ముందే వాగ్వాదం చేసుకుంటూ, గొడవ పడుతున్నారు. ఈ ఘటనలు ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని ఆరోగ్య ఉపకేంద్రంలో చోటుచేసుకుంటున్నాయి. ప్రొద్దుటూరులో ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. అర్బన్ హెల్త్ సెంటర్లు గతంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉండేవి. 2016 నుంచి అపోలో సంస్థకు అప్పగించారు. ఆ రోజు నుంచి ఉద్యోగులందరూ అపోలో కిందనే పని చేస్తున్నారు. ఒక్కో ఆస్పత్రిలో డాక్టర్‌తో సహా ఏడుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎన్జీఓల ఆధ్వర్యంలో ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్న సమయంలో.. డీఎంహెచ్ఓకు పూర్తి అజమాయిషీ ఉండేది. ఆస్పత్రులు అపోలో సంస్థ చేతిలోకి వెళ్లాక డీఎంహెచ్ఓ పర్యవేక్షణ కొరవడినట్లు తెలుస్తోంది. కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ప్రతి నెలా ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల మొత్తం నేరుగా అపోలో సంస్థకు వెళ్తున్నాయి. సంస్థ నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడుతున్న కారణంగా అపోలో ఉద్యోగులు డీఎంహెచ్ఓ, ఇతర జిల్లా అధికారులను లెక్క చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా డీఎంహెచ్ఓ పర్యవేక్షణ లోపించినట్లు పలువురు చెబుతున్నారు. ఇదే అదునుగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే పలువురు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రంలో పని చేసే సిబ్బందిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడి సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి ఆస్పత్రి వాతావరణాన్ని చెడగొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ గొడవల్లో భాగంగా అక్కడ 8 ఏళ్లుగా పని చేస్తున్న పుష్పావతి అనే ఏఎన్ఎంను ఉన్నట్టుండి బదిలీ చేశారు. అపోలో సంస్థ ఏర్పాటు కంటే ముందు నుంచి ఏఎన్ఎంగా పని చేస్తున్న తనను అన్యాయంగా బదిలీ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె బదిలీకి దారి తీసిన పరిస్థితులను పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అన్యాయంగా బదిలీ తనకు జరిగిన అన్యాయం గురించి పుష్పావతి ఆదివారం విలేకరుల వద్ద మొరపెట్టుకుంది. బాధితురాలు తెలిపిన కథనం మేరకు.. పుష్పావతి ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీ అర్బన్ హెల్త్‌సెంటర్‌లో సుమారు 8 ఏళ్ల నుంచి ఏఎన్ఎంగా పని చేస్తోంది. ఆమె క్యారీ తెచ్చుకోవడంతో మధ్యాహ్నం ఆస్పత్రిలోనే భోజనం చేసి, సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నారు. ఉదయం ఆస్పత్రికి వచ్చిన సిబ్బందిలో ఎక్కువ మంది మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్తారు. అయితే క్యారీ తెచ్చుకోవడం వల్ల ఏఎన్ఎం పుష్పావతి మధ్యాహ్నం ఆస్పత్రిలోనే ఉంటోంది. మధ్యాహ్న సమయంలో తాను ఆస్పత్రిలో ఉండటం కొందరికి నచ్చడం లేదని ఆమె చెబుతోంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొందరు ఉద్యోగులు బ్యాచ్‌లుగా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించడమే ఇందుకు కారణమని ఆరోపించింది. వాళ్ల బాగోతం ఎక్కడ బయట పడతుందోనని భావించి.. ఎలాగైనా ఇక్కడి నుంచి తనను పంపించాలని పథకం పన్నారని వివరించింది. మూడు రోజుల క్రితం కొందరు సిబ్బంది పక్కన పడేసిన కాలం చెల్లిన మందులను తీసుకొని వచ్చి ఫార్మసీ గదిలో ఉంచారని తెలిపింది. ఎందుకు వాటిని తీసేయలేదని తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా పుష్పావతిని కర్నూలు జిల్లాలోని ఆదోనికి బదిలీ చేస్తూ డీఎం ద్వారకనాథ్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన బదిలీ ఉత్తర్వులు తీసుకొని స్వయంగా ప్రొద్దుటూరు వచ్చారు. 10వ తేదీలోగా ఆదోనిలో రిపోర్టు చేసుకోక పోతే ఉద్యోగం పోతుందని డీఎం తనను హెచ్చరించారని ఆమె తెలిపింది. ఉన్నతాధికారులు ప్రొద్దుటూరుకు వచ్చి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె కోరుతోంది. మీ ఇష్టమొచ్చినట్లు రాసుకోండి ఆస్పత్రిలోని సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు, పుష్పావతిని ఇబ్బంది పెడుతున్న వైనంపై డీఎం ద్వారకనాథ్‌ను విలేకరులు వివరణ కోరగా.. ‘నేను చెప్పేది ఏం లేదు.. మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండి.. నేను ఇక్కడికి వచ్చిన విషయం మీకు ఎవరు చెప్పారు.. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ’ ఆగ్రహంతో ఊగిపోయారు. పుష్పావతికి బదిలీ జరగలేదని ఒక సారి, ఆదోనికి బదిలీ అయిందని, ఆమె బదిలీ ఉత్తర్వులు తీసుకోలేదని మరోసారి చెప్పుకొచ్చారు. -
అనంతపురంలో భగ్గుమన్న పాత కక్షలు
-
మూడు స్థానాల్లో.. అసమ్మతే
సాక్షి, జనగామ: శాసనసభ రద్దు.. అభ్యర్థుల ప్రకటన తర్వాత జోరు మీదున్న టీఆర్ఎస్ పార్టీకి అసమ్మతి నాయకులు బ్రేకులు వేస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశించి భంగపడిన వారు పార్టీ ప్రకటించిన అభ్యర్థులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో గులాబీ పార్టీలో వర్గపోరు ముదురుతోంది. ఎర్రబెల్లి సీటుకు తక్కళ్లపల్లి ఎసరు.. పాలకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారైన ఎర్రబెల్లి దయాకర్‌రావు సీటుకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు ఎసరు పెడుతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన తక్కళ్లపల్లి సమీకరణలతో పోటీ నుంచి విరమించుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ఖరారు కావడంతో రవీందర్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈనెల 9వ తేదీన రవీందర్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని పాలకుర్తిలో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. పాలకుర్తి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తాజాగా దేవరుప్పుల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం పెట్టి దయాకర్‌రావు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరారు. రవీందర్రావు కామెంట్స్ నియోజకవర్గంలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రతాప్.. స్టేషన్ ఘన్‌పూర్‌లో మొదటి నుంచి ప్రత్యేకవర్గంగా కొనసాగుతున్న రాజారపు ప్రతాప్ ఏకంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ ప్రకటించిన తాటికొండ రాజయ్య అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేస్తున్న ఆయన శుక్రవారం జిల్లా కేంద్రం నుంచి స్టేషన్ ఘన్పూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అవినీతిపరులు, రాసలీలులు నడిపే వ్యక్తి మనకు వద్దంటూ ప్రకటించారు. స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థిత్వంపై పార్టీ పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ప్రతాప్ నిర్వహించిన ర్యాలీ స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజకీయ వేడి పెంచింది. ముత్తిరెడ్డికి అసమ్మతి సెగ.. జనగామ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి నియోజకవర్గంలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. యువజన విభాగం రాష్ట్ర నాయకుడు గుడి వంశీధర్‌రెడ్డి అనుచరులు ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించి అసమ్మతి గళాన్ని వినిపించారు. నర్మెటకు చెందిన పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, రాగమళ్ల పరమేష్, మండల శ్రీములు బహిరంగంగానే ముత్తిరెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్వీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందుకూరి ప్రభాకర్, వేముల లక్ష్మణ్ గౌడ్‌తోపాటు పలువురు వేరు కుంపటి పెట్టుకున్నారు. మొదటి తరం తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారని, ముత్తిరెడ్డి ఉద్యమకారులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరో పిస్తున్నారు. జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ముత్తిరెడ్డి అనుచరులు యూత్ విభాగం నాయకులు రెట్టింపు మెజార్టీతో గెలిస్తామని సవాల్ చేస్తున్నారు. అటు అసమ్మతి ఇటు ముత్తిరెడ్డి అనుచరు ల సవాల్ ప్రతిసవాళ్లతో జిల్లా కేంద్రంలో రాజ కీయ వేడి పెరిగింది. మూడు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్లో ఆధిపత్య పోరు సాగుతోంది. -
ఫ్యాక్షన్.. యాక్షన్
దేవరకొండ : కత్తితో కాదురా.. కంటి చూపుతో చంపేస్తానని ఓ సినిమాలో హీరో డైలాగ్. కానీ మనం సినిమాలో నటిచడంలేదు. ఫ్యాక్షన్ ఏరియాలో అంతకంటే లేం. అయినా ఆ ఫ్యాక్షన్ పరివాహక గ్రామాల.. యాక్షన్ ప్రభావం మాత్రం మన జిల్లాకూ పాకుతోంది. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉండే ఫ్యాక్షన్ తరహా యాక్షన్ ఇప్పు డు మనకూ విస్తరిస్తోంది.. జిల్లాలోనే కంబాలపల్లి పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆ వాతావరణమే. సోమవారం రాత్రి నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం చింతలపాలెం ఉప సర్పంచ్ ధర్మానాయక్‌ను అతికిరాతకంగా బాంబులతో మట్టుబెట్టారు. ఈ ఉదంతం ఫ్యాక్షన్ సంస్కృతికి అద్దం పడుతోంది. కక్ష సాధించడానికి వంద ఎకరాలు అమ్ముకోవడానికైనా.. కన్నవాళ్లు, మనోళ్లు అనే తేడా లేకుండా చంపుకోవడానికైనా.. తెగించే విష సంస్కృతి ఫ్యాక్షన్ది. ప్ర త్యర్థుల నుంచి తమ వారిని రక్షించుకోవడానికి రా ష్ట్రాలు, దేశాలు దాటించైనా.. కక్ష సాధించేందుకు కా పుకాసే పరిస్థితి ఫ్యాక్షన్ గ్రామాలది. ఈ దుస్థితి ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నా ఇప్ప టి వరకు తెలంగాణలో మాత్రం కనిపించేంది కాదు. కానీ.. కంబాలపల్లిలో.. 52 మందిపై రౌడీషీట్ కేసులు, 22 వర్గదాడులు, ఏడాది పొడవునా కక్షసాధింపు, కవ్వింపు చర్యలు ఇదీ కంబాలపల్లి గ్రామం. నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలో ఆంధ్రా ప్రాంత ఫ్యాక్షన్‌ను కాస్త ఒంటపట్టించుకున్న గ్రామం ఇది. ఇప్పటి వరకు ఎన్నోసార్లు బాంబుదాడులు, వర్గదాడులు జరిగాయి. ఎంతో మందిపై కేసులు నమోదయ్యా యి. గత మేలో కూడా గ్రామంలో వర్గదాడులు జరి గాయి. ప్రస్తుతం ఇక్కడ కొంత మార్పు కనిపిస్తోంది. ఇక్కడ గొడవలకు చెక్ పెట్టేందుకు పోలీసుల ప్రయత్నం ఫలించింది. గ్రామంలో కవ్వింపు చర్యలకు పాల్పడే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, గ్రామంలో జరి గే పరిస్థితిని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం, గొడవలకు దిగే ప్రధాన వ్యక్తులకు గ్రామ బహిష్కరణ నోటీసులు ఇవ్వడంతో ఈ పరిస్థితిలో కొంతమార్పు కనిపిస్తోంది. అక్కడి ప్రభావమే.. కంబాలపల్లి అయినా, తిరుమలగిరి అయినా, పీఏపల్లి అయినా ఇవ్వన్నీ కృష్ణా పరివాహక ప్రాంతాలే కావడంతో ఆ ఫ్యాక్షన్ ప్రభావం ఇక్కడి గ్రామాలపై పడుతోంది. ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు, భయపెట్టేందుకు ఫ్యాక్షన్ గ్రామాల్లో నాటు బాంబులు విసురుకునే సంస్కృతిని ఇక్కడి గ్రామాలు కూడా అనుసరిస్తున్నాయి. పోలీసులు దృష్టి సారించాలి.. కంబాలపల్లిలో ఏళ్లుగా కొనసాగుతున్న ఫ్యాక్షన్ తరహా గొడవలకు చెక్ పెట్టేందుకు పోలీసులు తీసుకున్న చర్యలను అభినందించాలి. గతంలో ఎస్పీగా పనిచేసిన ప్రకాశ్‌రెడ్డి ఈ గ్రామంలో గొడవలు జరగకుండా.. కౌన్సిలింగ్ ఇవ్వడం, గ్రామాల్లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో ఏ గొడవ జరిగినా ఇరు వర్గాలను బాధ్యులను చేయడం వంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఇటువంటి ఫ్యాక్షన్ గ్రామాలపై పోలీసులు ఎప్పుడు ఓ కన్నేసి ఉంచితేనే అటువంటి విష సంస్కృతి నుంచి జిల్లాను కాపాడుకోవచ్చు. -
ఉగాది వేళ టీడీపీ వర్గపోరు
ఎమ్మెల్యే బుచ్చయ్య వర్సెస్ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సం అట్టర్‌ఫ్లాప్ 36 మందికి ఆరుగురు కార్పొరేటర్లు మాత్రమే హాజరు సాక్షి, రాజమహేంద్రవరం : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున రాజమహేంద్రవరం నగర టీడీపీలో లుకలుకలు బట్టబయలయ్యాయి. ఆది నుంచి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణల మధ్య వర్గపోరు నడుస్తోంది. దీనికి తోడు గత ఏడాది వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేరికతో మూడో గ్రూపు తయారైనట్టైంది. ఆదిరెడ్డికి చెక్ చెప్పేందుకు ఎమ్మెల్యే గోరంట్ల చేయని ప్రయత్నమంటూ లేదు. ఇందులో భాగంగా గన్నికృష్ణతో ఉన్న విభేదాలను కూడా గోరంట్ల పక్కన పెట్టి ఆయన్ను కలుపుకుపోతున్నారు. గత నెల 8న జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఆదిరెడ్డి వర్గానికి చెందిన కార్పొరేటర్లు అవినీతికి పాల్పడుతున్నారంటూ పరోక్షంగానే విమర్శించారు. దీంతో ఆదిరెడ్డి, గోరంట్ల మధ్య ఉన్న విభేదాలు బుధవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలయ్యాయి. బుధవారం ఆనం కళాకేంద్రం వద్ద ఉన్న సిటీ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించ తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ముందుగా గన్నికృష్ణ వచ్చి గోరంట్ల రాక కోసం ఎదురు చూసి, ఆయన వచ్చాకా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం అక్కడకు వచ్చిన ఆదిరెడ్డి తనకు సమాచారం ఇవ్వకుండానే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారని, పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గోరంట్ల ప్రధాన అనుచరుడైన డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబుకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి మధ్య సమాచారం ఇచ్చామని ఒకరు, ఇవ్వలేదని ఒకరు వాగ్యుద్ధం జరిగి ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఆదిరెడ్డికి, గోరంట్లకు మధ్య కూడా వాగ్వాదం జరిగింది. కార్యక్రమం అట్టర్‌ఫ్లాప్.. టీడీపీ 36వ ఆవిర్భావ దినోత్సవం అట్టర్‌ప్లాప్ అయింది. ఎన్నికలు తర్వాత నుంచీ కూడా నగర టీడీపీ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. ఎమ్మెల్యే గోరంట్లే రూరల్, సిటీలలో పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. నగర అధ్యక్షుడు కూడా లేకపోవడంతో పార్టీ క్యాడర్ ఛిన్నాభిన్నమైంది. పలువురు నేతలు స్తబ్ధుగా ఉంటున్నారు. కార్పొరేటర్లు కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది కార్యకర్తలు, నేతలు మాత్రమే హాజరయ్యారు. నగరపాలక సంస్థలో 50 మందికిగాను టీడీపీకి 36 మంది కార్పొరేట్లు ఉంటే ఈ కార్యక్రమానికి కేవలం ఆరుగురు మాత్రమే హాజరయ్యారంటే పార్టీలో వర్గ విభేదాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆదిరెడ్డి, గోరంట్ల మధ్య నడుస్తున్న వర్గ పోరు వచ్చే ఎన్నికల్లో పార్టీ పుట్టిముంచుతుందన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. -
తల వాసుపోతోంది
♦ ఒకవైపు వర్గపోరు..మరోవైపు నిలదీతలు ♦ తగ్గుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడి ప్రభ ♦ అందరినీ సమన్వయ పర్చలేకపోతున్నారనే ఆరోపణలు ♦ రాయచోటి..ప్రొద్దుటూరు.. బద్వేల్.. జమ్మలమడుగు ♦ క్రమంతప్పకుండా ఆరోపణలు చేస్తున్న నేతలు ♦ జిల్లా నేతనే టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు సాక్షి ప్రతినిధి, కడప: ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరి మూడేళ్లే.. అయినా పార్టీ క్రియాశీలక రాజకీయాలకు కేంద్రబిందువు అయ్యారు. రాజకీయాల్లో చాలామందికి జూనియర్ అయినప్పటీకీ అధిష్టానం అండదండలతో జిల్లా పీఠం చేజిక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో మిగతా నేతలతో పాటు పార్టీశ్రేణులతో సమన్వయం కొరవడింది. క్రమంతప్పకుండా ఏదో ఒక ప్రాంతంలో తమ్ముళ్లకు ఆయన టార్గెట్ అవుతున్నారు. ఈక్రమంలో తీవ్ర పదజాలాన్ని తెలుగుతమ్ముళ్లు ప్రయోగిస్తున్నారు. అధికారం ఉంది అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదని మొదట్లో పరిశీలకులు భావించారు. అయితే నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, పనుల వివాదాలను తీర్చలేక అధ్యక్షుడికి తలబొప్పి కడుతోందని పలువురు పేర్కొంటున్నారు. నేతలను సమన్వయపర్చడంలో శ్రీనివాసులురెడ్డి (వాసు) విఫలం కావడంతో అధికార పార్టీలో పెద్దఎత్తున దుమారం రేగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీని ఏకతాటిపై నడిపించడం అధ్యక్షుడికి శిరోభారంగా మారింది. వర్గపోరూ....అనుభవలేమి... టీడీపీ జిల్లా అధ్యక్షుడికి ఓవైపు అనుభవలేమి వెంటాడుతుండగా మరోవైపు వర్గపోరు పట్టిపీడిస్తున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సొంత నియోజకవర్గం రాయచోటి నుంచే కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గీయులను మహానాడుకు ముందస్తు ఆహ్వానం లేకుండా చేయడమే అందుకు కారణం. టీడీపీ కుటుంబ పెద్దగా అందరినీ కలుపుకొని పోవాల్సింది పోయి, సొంత నియోజకవర్గంలోనే వర్గాలను ప్రోత్సహించారనే ఆరోపణలు భుజానకెత్తుకున్నారు. ఈవ్యవహారం అటుండగానే ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి తీవ్ర పదజాలంతో అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు. ఇష్టారాజ్యంగా పార్టీని నడిపిస్తున్నారని ఆరోపణలు చేశారు. మరోవైపు తాజాగా బద్వేల్ టీడీపీ అభ్యర్థి విజయజ్యోతి ఏకంగా శ్రీనివాసులరెడ్డిని ప్రొద్దుటూరులో నిలదీశారు. టీడీపీ కార్యకర్తలకు సమన్యాయం ఎందుకు చేయరని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరిన జయరాములులకు నీరు-చెట్టు పనుల్లో ప్రాధాన్యత ఇచ్చారని వాపోయారు. తాను ప్రాతిపాదించిన పనులకు అడ్డంకులు ఎందుకు అంటూ నిలదీశారు. మీ శైలిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆమె స్పష్టం చేశారు. వీటితోపాటు జమ్మలమడుగులో వర్గపోరూ తీవ్రరూపం దాల్చింది. జిల్లా అధ్యక్షుడిగా గాడిలో పెట్టాల్సిన ఆయన అటువైపు చూసేందుకే జంకుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కడప పరిధిలో వివిధ కాంట్రాక్టులు కేటాయింపుల్లో ఒక సామాజికవర్గానికి మినహా, ఇతరులకు అవకాశం కల్పించలేదని ఫిర్యాదుల పరంపర అధిష్టానానికి చేరాయని సమాచారం. అధికంగా ఉన్న ముస్లీం, కాపు సామాజికవర్గాన్ని పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలు వెళ్లినట్లు తెలుస్తోంది. పనిచేయని లోకేష్ ఆదేశాలు టీడీపీలో వర్గపోరు ఉండకూడదు.. కేడర్ కలిసికట్టుగా పనిచేయాలని రెండు నెలల క్రితం టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లాలో పర్యటించి దిశ నిర్దేశం చేశారు. అప్పట్లో నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టి మార్గదర్శకాలు జారీచేశారు. అయినప్పటీకీ పార్టీలో ఏమాత్రం మార్పులేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు టీడీపీ నేతల పరిస్థితి ఉండిపోయిందని పలువురు విమర్శిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నేతృత్వంలో ఓవర్గం, వైరివర్గంగా మరికొందరు ఉండిపోయారని పలువురు పేర్కొంటున్నారు. అన్నీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. మొత్తానికీ జిల్లా టీడీపీ పీఠం బాధ్యతలు శిరోభారంగా తయారైయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మంత్రి ఇలాకాలో గ్రూపుల గోల
చీపురుపల్లి టీడీపీలో భగ్గుమన్న విభేదాలు ఎంపీపీ, జెడ్పీటీసీ మధ్య తీవ్రస్థాయిలో వర్గపోరు కుమ్ములాడుకునే స్థాయిలో విభేదాలు చీపురుపల్లి : నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షా త్తూ రాష్ట్ర మంత్రి కిమిడి వృణాళిని సొంత నియోజకవర్గ కేంద్రంలో పార్టీకి చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ రెండు వర్గాలుగా విడిపోయి కుమ్ములాటకు దిగుతున్నారు. జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ రౌతు కాంతమ్మ భర్త మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు మధ్య ఎంతో కాలంగా ఉన్న అంతర్గత విభేధాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. పా ర్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మంత్రి కిమి డి వృణాళిని సమక్షంలో జెడ్పీటీసీ, ఎంపీపీ వర్గీయు లు కుమ్ములాటకు దిగే స్థాయికి ఇరువర్గాల మధ్య విబేధాలు పెరిగిపోయాయి. దీంతో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా.. ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. అయితే తొలి నుంచి ఈ రెండు వర్గాల మధ్య సయో ధ్య అంతంతమాత్రంగానే ఉంది. బయటకు మాత్రం ఇరువర్గాల నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శి స్తూ.. వస్తున్నారు. తాజాగా జరిగిన సంస్థాగత ఎన్నికలు ఇరువర్గాల మధ్య బహిరంగ కయ్యానికి వేదికయ్యాయి. పట్టణ పార్టీ అధ్యక్షుని పదవి లో చాలా కా లంగా మండల పార్టీ అధ్యక్షుడు రౌతు నారాయణరా వు కొనసాగుతున్నారు. కొద్ది కాలం క్రితమే పార్టీలోకి వచ్చిన జెడ్పీటీసీ మీసాల వరహా ల నాయుడు తన అనుచరుడు, వార్డు మెంబరు గవిడి సురేష్‌కు ఆ పద వి కావాలని పట్టుబట్టారు. దీన్ని రౌతు వర్గీయులు వ్య తిరేకించారు. దీంతో మంత్రి మృణాళిని ఎదుటే యు ద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇరువర్గాలు కిందకు దిగే పరిస్థితులు కనిపించడం లేదు. జెడ్పీటీసీ వర్గీయులు అక్కడితో ఆ గకుండా మండల పార్టీ అధ్యక్షుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు పదవుల కోసం ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేయడంతో విషయం మ రింత వేడెక్కింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి, పార్టీలో ఉంటారో ఉండరో తెలియని వారికి ఎలా పద వులు ఇస్తామని, ఏళ్ల తరబడి పార్టీ కోసం శ్రమిస్తున్నామని రౌతు వర్గం బహిరంగంగా వ్యాఖ్యానిస్తోంది. ప్రస్తుతం ఎంతోమంది నాయకులు పార్టీలు మారి తిరిగి వచ్చిన వారేనని, ఏ పార్టీలో ఉన్నామన్నది కా దు, ఉన్న పార్టీ కోసం ఎంతవరకు పని చేస్తున్నామన్నది ముఖ్యమని, అంతేకాకుండా మేజర్ పంచాయతీ తమ చేతిలో ఉందని, ఇక్కడ ఏ పదవి అయినా తమకే సొంతం అంటూ వరహాలనాయుడు వర్గీయులు అం టున్నారు. ఒకటి, రెండు రోజుల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సిన నేపథ్యంలో మంత్రి వృణాళిని ఏ విధంగా స్పందిస్తారోనని ఆ పార్టీ క్యాడర్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మంత్రి గారూ....సంస్థాగత ఎన్నికలు జరిపించండి పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు ఉల్లంఘించిన నేపథ్యంలో మంత్రి మృణాళిని చొరవ తీసుకుని ఆమె సమక్షంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని జెడ్పీటీసీ మీసాల వర్గీయులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చే స్తూనే మంత్రి మృణాళిని నిర్ణయాన్ని తప్పక పాటిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరహాలనాయుడు వర్గీయులు గవిడి నాగరాజు, గవిడి సురేష్, నారాయణరావు, రొ బ్బి గణేశ్‌తో పాటు రఘు పాత్రుని చంద్రశేఖర్, రొబ్బి రమణ, రొబ్బి చిన్ని, ఆదికృష్ణ, శ్రీరాములు, బోడసిం గి సత్యం తదితరులు మాట్లాడారు. చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షుడితో పాటు పట్టణ అధ్యక్షుని స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశా రు. సోమవారం పట్టణంలోని నటరాజ్ ఫంక్షన్ హాలు లో జరిగిన సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సమావేశానికి ముందు మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, దన్నా న రామచంద్రుడు, దన్నాన శ్రీరాములు, రౌతు కాము నాయుడు, రౌతు నారాయణరావు సమక్షంలో పార్టీ మండల అధ్యక్షునిగా రౌతు కామునాయుడును, పట్ట ణ పార్టీ అధ్యక్షునిగా గవిడి సురేష్‌ను నిర్ణయిం చడం జరిగిందన్నారు. అయితే అదే విషయాన్ని మంత్రి మృ ణాళిని సభా వేదికపై చదివి వినిస్తున్న తరుణంలో ఎ న్నికపై రౌతు కామునాయుడు, రౌతు నారాయణరావు అభ్యంతరం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పట్ట ణ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఎప్పుడో జరిగిపోయిందని, అధిష్టానానికి కూడా పంపించామని వారు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు, ఆరుగురు ఎంపీటీసీలు ఉన్నారని, వారికి కూడా ఎప్పుడు ఎన్నిక ఎప్పుడు జరిగిందో తెలియదన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్ర జాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. -
టాస్క్‌ఫోర్స్‌లో వర్గ పోరు
సిబ్బంది శల్యసారథ్యం పట్టుబడని ప్రధాన బుకీలు విజయవాడ సిటీ : పోలీసు కమిషనరేట్‌లో రౌడీలు, గూండాలు, అసాంఘికశక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని నిలువరించాల్సిన కమిషనర్ టాస్క్‌ఫోర్స్(సీటీఎఫ్) వర్గపోరుతో సతమతమవుతోంది. ఇక్కడి సిబ్బంది.. దాడులకంటే ప్రత్యర్థి వర్గం నుంచి నిందితులను తప్పించేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. వర్గపోరును ఆసరాగా చేసుకుని క్రికెట్ బుకీలు టాస్క్‌ఫోర్స్‌కు చిక్కకుండా సులువుగా తప్పించుకుంటున్నారు. కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న దాడుల్లో ప్రధాన బుకీలు పట్టుబడకుండా తప్పించుకోవడం వెనుక ఓ వర్గం హస్తముందనే అనుమానాన్ని ప్రత్యర్థి వర్గం వ్యక్తం చేస్తోంది. పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే మార్గాలను తమవారే చెప్పడంతో ప్రధాన బుకీలను పట్టుకోలేక.. చిన్న చిన్న ఫంటర్ల (ఆటగాళ్లు)తో సరిపెడుతున్నట్టు ఓ వర్గం ఆవేదన. కోస్తా జిల్లాల్లో క్రికెట్ బెట్టింగ్‌లకు ఇక్కడి ప్రధాన బుకీలే కారణం. నగరంతో పాటు ఆయా జిల్లాల్లో పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని వీరు బెట్టింగ్‌ల దందా నిర్వహిస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా దందా నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తుంటే.. వందలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కొంతమంది వ్యసనపరులు అందిన చోటల్లా అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అసలు బుకీలు ఎక్కడ! ఆటగాళ్ల ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే, బుకీల పరిస్థితి మాత్రం ‘మూడు ఫోర్లు-ఆరు సిక్సర్లు’ చందంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచ కప్ మొదలైనప్పుడు పత్రికల్లో కథనాలు వచ్చాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. అనేక మందిని అరెస్టు చేసి లక్షలాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ప్రధాన బుకీలుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు బిల్డప్ ఇచ్చారు. కొత్తవారిని తీసుకొచ్చి ప్రధాన బుకీలని చెప్పిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. పేరుమోసిన బుకీలను మాత్రం పట్టుకోలేకపోయారు. అదేమంటే వారు ఇక్కడ ఉండటం లేదంటూ సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. కాని క్రికెట్ బెట్టింగ్‌లు కట్టే ఫంటర్లను ఎవరిని అడిగినా చెబుతారు వారెక్కడి నుంచి బెట్టింగ్‌ల దందా నిర్వహిస్తున్నారనేది. ఇది టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియని విషయమేమీ కాదు. కాకుంటే ఎప్పటికప్పుడు ఇక్కడ పనిచేసే సిబ్బంది సమాచారంతో దాడులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నట్టు చెప్పొచ్చు. విభజన ఎఫెక్ట్ : గతంలో ఒకే అధికారి కింద టాస్క్‌ఫోర్స్ ఉండేది. సూపర్ న్యూమర్ పోస్టుల కారణంగా పెద్ద సంఖ్యలో అధికారుల రాకతో ఇద్దరు అధికారులను నియమించి రెండుగా విభజించారు. సెంట్రల్ జోన్‌లోని కృష్ణలంక పోలీసు స్టేషన్‌తోపాటు వెస్ట్‌జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లను ఒక అధికారి, సెంట్రల్ జోన్‌లోని మిగిలిన స్టేషన్లతోపాటు ఈస్ట్‌జోన్ పరిధిలోని పోలీసు స్టేషన్లకు ఒక అధికారి పర్యవేక్షించే విధంగా విభజించారు. ఇదే సమయంలో ఇక్కడి అధికారులు, సిబ్బందిని కూడా జోన్లవారీగా కేటాయించారు. గతంలో ఒకే అధికారి కింద పనిచేసినప్పుడు సిబ్బంది మొత్తం కలిసే ఉండేవారు. బుకీల ద్వారా వచ్చే మామూళ్ల మొత్తం అందరికీ చేరేది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక జోన్ పూర్తిగా ఫంటర్లకే పరిమితమైతే, రెండో జోన్ ఫంటర్లతోపాటు ప్రధాన బుకీలకు కేంద్రంగా ఉంది. ఫంటర్ల ద్వారా బుకీలను పట్టుకునే ప్రయత్నాలకు మరో జోన్ సిబ్బంది బ్రేక్ వేస్తున్నారు. క్రమం తప్పని మామూళ్లే దీనికి కారణమని తెలిసింది. వందలాది కుటుంబాల జీవితాలను ఛిన్నాభిన్నం చేసే వ్యక్తులను వర్గపోరుతో చిక్కకుండా చేస్తున్న టాస్క్‌ఫోర్స్ చర్యలను పలువురు విమర్శిస్తున్నారు. -
టీడీపీలో వర్గపోరు
కందుకూరు: కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. నామినేటెడ్ పదువుల వ్యవహారంలో మొదలైన వర్గపోరు రోజు రోజుకూ తారాస్థాయికి చేరుతోంది. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా మొదలైన నేతల మధ్య విభేదాలు ఇటీవల వేరుకుంపట్లు పెట్టుకునే స్థాయికి దారితీసింది. ఇంతకాలం అంతర్గతంగా సాగుతున్న నేతల మధ్య విభేదాలు ఇటీవల జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ జన్మదిన వేడుకల సందర్బంగా ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలోనే బుధవారం కందుకూరులో మంత్రుల పర్యటన సమయంలోనూ మరోసారి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే దివి శివరాంని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పార్టీలోని ఓ వర్గం బుధవారం ఉదయం శివరాం ఇంట్లో ఏర్పాటు చేసిన మంత్రుల అల్పాహార విందు కార్యక్రమానికి హాజరుకాలేదు. వీరిలో ప్రధానంగా పార్టీ సీనియర్ నాయకులైన ఘట్టమనేని చెంచురామయ్య, కండ్రా హరిబాబు, ఎంపీపీ అనూరాధ భర్త గుళ్లా శ్రీను, జెడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్, చల్లా నాగేశ్వరరావు, కొడాలి కోటేశ్వరరావు, సోమినేని రవీంద్ర, పొడపాటి శ్రీను, చంద్రమౌళి తదితర నాయకులున్నారు. తమవర్గం వరకు జనార్థన్‌కు మద్దతుగా భారీ కార్ల ర్యాలీ ఏర్పాటు చేసుకున్నారు. ఒంగోలు నుంచి జనార్థన్‌కు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన నాయకులు కందుకూరులో మాత్రం శివరాం ఇంటికి వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయారు. శివరాం ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డి, పైడికాయల మాణిక్యాలరావు, రావెల కిశోర్‌బాబులు, నారాయణలతోపాటు ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దామచర్ల జానార్ధన్, బాలవీరాంజనేయస్వామి, కరణం బలరాం తదితర నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శివరాం వర్గానికి చెందిన కొందరు నాయకులు మాత్రమే హాజరయ్యారు. ఇటీవల శివరాం వైఖరిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న మరోవర్గం నాయకులు కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరుపై మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో తనకు వ్యతిరేకంగా సొంతంగా కార్యక్రమాలు చేసుకుపోతున్న అసమ్మతి వర్గం నాయకులను బుజ్జగించే ప్రయత్నాలు శివరాం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే శివరాం సోదరుడు, పార్టీ సీనియర్ నాయకుడైన దివి లింగయ్యనాయుడు సైతం మంత్రి కామినేని పాల్గొన్న బి.జె.పి. కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం గమనార్హం. దీంతో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలతో నాయకులు మరోసారి బజారుకెక్కారు. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ... తెలుగుదేశం పార్టీలో వర్గపోరుకు నామినేటెడ్ పదవుల భర్తీనే ప్రధాన కారణం. మార్కెట్‌యార్డు చైర్మన్ పదవి ఆశించిన పలువురు సీనియర్ నాయకులు శివరాం అనుసరించిన వైఖరితో తీవ్ర ఆవేదన చెందారు. ఈ పదవిని శివరాం తన ప్రధాన అనుచరుడైన తల్లపనేని వెంకటేశ్వర్లుకు కట్టబెట్టడమే ప్రధాన కారణం. పలు కాంట్రాక్టులతోపాటు అన్ని విషయాల్లో ఒక్క తల్లపనేనికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడంపై సీనియర్ నాయకులు గతకొంత కాలంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయినప్పటికీ ఆయన వైఖరిలో మార్పురాకపోవడంతో అసమ్మతి స్వరం పెరుగుతూ వస్తోంది. -
టీడీపీలో వర్గపోరు షురూ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో టీడీపీ వర్గపోరు రోజురోజుకీ శ్రుతిమించుతోంది. వర్గపోరు వీధికెక్కుతోంది. ఒకరిపై ఒకరు తిట్ల పురాణం అందుకుంటున్నారు. ఇందుకు బెరైడ్డి రాజశేఖరరెడ్డి రాక వేదిక కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలోకి బెరైడ్డి రాజశేఖరరెడ్డి రీ-ఎంట్రీకి అధిష్టానం ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఆయన రాక జిల్లా పార్టీలోని మెజార్టీ వర్గానికి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీలోకి వస్తే సర్వనాశనం అవుతుందని ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. రౌడీషీటు, హత్య కేసులో నిందితుడిని పార్టీలో ఎలా చేర్చుకుంటామని ప్రశ్నించారు. అయితే, ప్రస్తుతం టీడీపీలో ఉన్నది 90 శాతం క్రిమినల్సేనని... బెరైడ్డి ప్రజాబలం ఉన్న నేత అని ఆ పార్టీ సీనియర్ నేత రాంభూపాల్ చౌదరి వ్యాఖ్యానించారు. మొత్తం మీద జిల్లాలో టీడీపీ రాజకీయం కాస్తా బజారుకెక్కింది. పట్టు పెంచుకునేందుకే.. రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. జిల్లాలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే హవా నడిచింది. జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకుగానూ కేవలం మూడు స్థానాలకే టీడీపీ పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త నాయకత్వం అవసరమనేది అధిష్టానం ఆలోచనగా ఉంది. ఇందుకోసం వైఎస్సార్ సీపీ నాయకత్వంపై దృష్టి సారించిన టీడీపీ.. ఇందుకు అనుకూలంగా అక్కడి నుంచి సంకేతాలు లేకపోవడంతో మరో ప్రత్యామ్నాయాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఇందుకోసం గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి, బయటకు వెళ్లిన బెరైడ్డి రాజశేఖరరెడ్డిని తీసుకోవాలని భావించింది. మరోవైపు ఆయన కూడా టీడీపీలోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ అధిష్టానానికి సంకేతాలు కూడా పంపారు. అయితే, ఆయన మీద ఉన్న రౌడీషీటుతో పాటు హత్యాయత్నం కేసులు అడ్డంకిగా మారుతున్నాయి. అయినప్పటికీ ఆయనను చేర్చుకునేందుకే పార్టీ అధిష్టానం మొగ్గుచూపడం ఇప్పుడు జిల్లా పార్టీలోని నేతలకు మింగుడు పడటం లేదు. ఈ వ్యవహారంలో పార్టీ అధిష్టానం ఆలోచన మరోలా ఉందనే చర్చ సాగుతోంది. కేఈ వర్గానికి చెక్ పెట్టేందుకేనా? రౌడీషీటుతో పాటు హత్యాయత్నం కేసులో ఆరోపణలున్న వ్యక్తిని పార్టీలోకి తిరిగి చేర్చుకోవడంలో ప్రస్తుతం ఉన్న నేతల ఏకపక్ష ధోరణికి చెక్ పెట్టేందుకేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందులోనూ జిల్లా నుంచి గెలిచి ఉపముఖ్యమంత్రి పదవి దక్కించుకుని పెద్దన్నగా ఉన్న కేఈ వర్గం ఆధిపత్యాన్ని కట్టడి చేసేందుకే అధిష్టానం బెరైడ్డిని తెరమీదకు తెస్తుందన్న వాదన వినిపిస్తోంది. జిల్లాలో కేవలం ఒక వర్గానిదే ఆధిపత్యం ఉంటే ఇబ్బందులు వస్తాయని.. మరో వర్గాన్ని ప్రోత్సహించడం ద్వారా ఒక వర్గాన్ని కట్టడి చేయాలనేది అధిష్టానం ఆలోచనగా ఉంది. అందుకే బెరైడ్డి రాకను కేఈ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే తాను టీడీపీలోకి వస్తానన్న విషయాన్ని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి స్వయంగా బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఫోన్ చేసి చెప్పినా.. సరే చూద్దాంలే అన్నట్టు సమాచారం. కేఈ నుంచి సానుకూలత ఏ మాత్రం వ్యక్తం కాలేదని తన సన్నిహితుల వద్ద బెరైడ్డి కూడా వాపోయినట్టు తెలిసింది. బెరైడ్డిని చేర్చుకోవడం ద్వారా.. జిల్లాలో ఉన్న ఫ్రధాన సామాజిక వర్గానికి చేరువయ్యేందుకూ ఇది దోహదపడుతుందనేది అధిష్టానం వ్యూహాంగా ఉందని సమాచారం. అయితే, ఈ పరిణామాలను మాత్రం మెజార్టీ తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోవడం లేదు. గతంలో ఎన్నడూ లేని గ్రూపు రాజకీయాలకు అధిష్టానమే తెరలేపుతోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కలిసి పార్టీ అధినేతను కలిసి బెరైడ్డి రాకను తామంతా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేయాలని భావిస్తున్నారు. అయినప్పటికీ బెరైడ్డిని చేర్చుకునేందుకే అధిష్టానం మొగ్గుచూపితే.. సహాయ నిరాకరణ చేయడం ద్వారా తమ పట్టును చాటి చెప్పాలనేది కూడా కూడా బెరైడ్డి రాకను వ్యతిరేకిస్తున్న వర్గం భావిస్తోంది. మొత్తం మీద బెరైడ్డి రాక కాస్తా జిల్లా టీడీపీని కుదిపేస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత జిల్లా టీడీపీలో వర్గపోరు మరింత ప్రస్ఫుటంగా బహిర్గతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన వర్గపోరు
రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపి నేతలలో వర్గపోరు తీవ్రమైంది. టీడీపి నేతలు మునిసిపల్ వైస్ చైర్మన్ మాబూసాబ్, పసుపులేటి నాగరాజుల మధ్య ఘర్షణ మొదలైంది. మాబూసాబ్ రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు. ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు జోక్యం చేసుకొని వారికి సర్ధిచెబుతున్నారు. రాజీనామా చేయవద్దని మాబూసాబ్కు నచ్చచెబుతున్నారు. ** -
టీఆర్ఎస్ కార్యకర్తల కుమ్ములాట
నల్లగొండ తెలంగాణా రాష్ట్ర సమితిలో వర్గపోరు బహిర్గతమైంది. బు దవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు కుమ్ములాడుకున్నారు. జయంతి ఉత్సవాలకు ముఖ్య అతి థిగా పాల్గొనడానికి నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం రాక కోసం ఎదురు చూస్తుండగా కార్యకర్తల మ ధ్య వాగ్వాదం, తోపులాట జరి గింది. పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేం దర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డి మరింకొంత మంది ఫొటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశా రు. కాగా ఆ పార్టీ నాయకులు దు బ్బాక నర్సింహారెడ్డి ఫొటో ఫ్లెక్సీలో పెట్టలేదని ఆయన అనుచరులు జహంగిర్‌తో పాటు మరి కొందరు ఫ్లెక్సీని చింపి జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. కాగా బండా నరేందర్‌రెడ్డికి సంబంధించిన వర్గీయులు ఫరీదుద్దీన్, జమాల్‌ఖాద్రి, దుబ్బాక నర్సింహారెడ్డి వర్గాయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య బాహాబాహీ చోటు చేసుకోవడంతో తోపులాట జరి గిం ది. కాగా ఇరువర్గాల వారిని దుబ్బా క నర్సింహారెడ్డి, బండా నరేందర్‌రెడ్డిలు సర్థిచెప్పారు. ఘనంగా జయశంకర్ జయంతి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా జరుపుకున్నా రు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డిలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మైనం శ్రీనివాస్, వెంకటాచారి, మాలె శరణ్యరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, సిం గం రామ్మోహన్ పాల్గొన్నారు. -
ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపండి
కర్నూలు : ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ జె.వి.రాముడు రాయలసీమ పోలీసు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు కర్నూలుకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో రాయలసీమ అధికారులతో సమావేశమయ్యారు. పోలీసు శాఖలో ఇటీవల బదిలీలు చేపట్టడం.. రాయలసీమలో అందరూ కొత్త ఎస్పీలు కావడంతో సమావేశంలో వారితో జిల్లాల్లోని శాంతి భద్రతలపై చర్చించారు. ఫ్యాక్షనిస్టుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. శాంతి భధ్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించవద్దని సూచించారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలన్నారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నమోదైన ఎర్ర చందనం అక్రమ రవాణా కేసుల విషయంపై ఆరా తీశారు. అటవీ శాఖ అధికారుల సమన్వయంతో కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, అనంతపురం డీఐజీ బాలకృష్ణ, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప, తిరుపతి అర్బన్ ఎస్పీలు ఆకే రవికృష్ణ, శ్రీనివాసరావు, రాజశేఖర్‌బాబు, నవీన్ గులాఠి, గోపీనాథ్ జట్టీ తదితరులు పాల్గొన్నారు. -
పల్నాట వర్గపోరు
సాక్షి, గుంటూరు: బెల్లంకొండ మండలంలో రెండురోజుల్లో రెండుచోట్ల నాటు బాంబులు పేలిన సంఘటనలు పోలీసు యంత్రాంగానికి పెద్దషాక్‌నిచ్చాయి. దీంతో పోలీసులు ఆయా గ్రామాల్లో ప్రతి ఇల్లు సోదా చేస్తున్నారు. పల్నాడులో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. గ్రామాలను దత్తత తీసుకుని శాంతిభద్రతలను సునిశితంగా పరిశీలించేందుకు ‘విలేజ్ పోలీసు’ కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఇంతలో బాంబుపేలుళ్లు సంభవించడం పోలీసులకు పెద్దసవాల్‌గా మారింది. కారంపూడి మండలం నరమాలపాడు గ్రామంలో కిందటి ఏడాది నవంబర్ 22న ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో రామడుగు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. అదేఏడాది ఆగస్టు 21న దుర్గిమండలం కంచరగుంట గ్రామంలో శ్రీపతి చెన్నయ్య అనే వ్యక్తిని ప్రత్యర్థులు హతమార్చారు. తాజాగా మూడు రోజుల కిందట బెల్లంకొండ మండలం మన్నెసుల్తాన్‌పాలెం, గంగిరెడ్డిపాలెంలో వర్గపోరు మొదలై రాళ్లు రువ్వుకున్నారు. కర్రలు, బరిశెలతో దాడులు చేసుకున్న రెండువర్గాలు రాత్రిళ్లు నాటుబాంబులు విసురుకున్నారు. ఈ ఘటనలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో గురజాల, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, నరసరావుపేట, రాజుపాలెం మండలాల్లోని పలు ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీసు పహరా ముమ్మరం చేశారు. నాకాబందీతో తనిఖీలు ముమ్మరం.. పల్నాడు ఫ్యాక్షన్ దాడులపై రూరల్ జిల్లా ఎస్పీ జె. సత్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడారు. బెల్లంకొండ మండలంలో జరిగిన దాడుల్లో బాంబులు ఉపయోగించలేదన్నా రు. పొలాల్లో పందులు రాకుండా వాడే సీమటపాకాయలను రైతులు అప్పుడప్పుడు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అటువంటి పేలు డు సామగ్రి కూడా గ్రామాల్లో ఉండకూడద ని, సమస్యాత్మక గ్రామాల్లో నాకాబందీ కార్యక్రమం ద్వారా ఇంటింటా తనిఖీలు చేయిస్తున్నామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. -
‘పచ్చ’ పార్టీలోకొత్త రచ్చ
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రెండు కళ్ల సిద్ధాంతం, సమన్యాయం, కోతి - రొట్టెల కథ అంటూ రాష్ట్ర విభజనపై పూటకో మాట మాట్లాడుతున్న చంద్రబాబు నిర్వాకంతో జనాభిమానం కోల్పోతున్న టీడీపీని జిల్లాలో నేతల వర్గపోరు మరింత కుంగదీసేలా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఉప్పు - నిప్పుగా ఉంటున్న పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి, మురళీమోహన్ మధ్య ఉన్న విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. అనపర్తిలో రెండురోజుల క్రితం పంపిణీ అయిన ఓ కరపత్రం పార్టీలో కొత్త చిచ్చు రేపుతోంది. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ తెలుగుదేశంపార్టీలో మాత్రం అప్పుడే సీట్ల సిగపట్లు బజారుకెక్కుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి సినీనటుడు మురళీమోహన్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి మధ్య తీవ్రస్థాయిలో పోరు జరిగింది. అదే పరిస్థితి మరోసారి పునరావృతం అవుతుందా అంటే ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు అవుననే అంటున్నారు. రెండు రోజుల క్రితం అనపర్తి నియోజకవర్గంలో రాత్రిపూట పంపిణీ అయిన కరపత్రాలు, వాటిపై పార్టీ జిల్లా నాయకుడు, మాజీ సర్పంచ్ నల్లమిల్లి వీర్రెడ్డి మంగళవారం విలేకర్ల సమావేశంలో స్పందించిన తీరు ఇందుకు బలం చేకూరుస్తోంది. రాజమండ్రి ఎంపీగా పోటీచేసి గత ఎన్నికల్లో ఓడిపోయిన సినీ నటుడు మురళీమోహన్, అనపర్తి సీటు ఆశిస్తున్న జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డికి వ్యతిరేకంగా కేపీఆర్ వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నియోజకవర్గంలో కరపత్రాలు పంచిపెట్టారు. తమ ప్రాంతాన్ని నాశనం చేయడానికి పూనుకున్న కేస్టిక్సోడా తయారీ ప్లాంట్ యాజమాన్యం చెప్పుచేతల్లో మురళీమోహన్ నడుస్తున్నారని, ప్లాంట్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి తనయుడు)కి టీడీపీ సీటు రాకుండా చేయాలని మురళీమోహన్, సంస్థ మధ్య ఒప్పందం కుదిరిందని ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో మూలారెడ్డితో పాటు చివరి వరకు అనపర్తి సీటు కోసం గట్టి ప్రయత్నం చేసిన నల్లమిల్లి వీర్రెడ్డి, తేతల్లి ఉపేంద్రరెడ్డిలలో ఒకరికి సీటు ఇప్పించేలా మురళీమోహన్‌తో మంతనాలు సాగించారనేది ఆ కరపత్రం సారాంశం. ఈ కరపత్రాల వెనుక తన అభ్యర్థిత్వాన్ని గత ఎన్నికలప్పటి నుంచి వ్యతిరేకిస్తోన్న మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి హస్తం ఉందనే అనుమానం వీర్రెడ్డి వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో అనపర్తి టిక్కెట్టుపై జరిగిన పోరు నేపథ్యాన్ని ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అనపర్తి నుంచి మూలారెడ్డి అసెంబ్లీకి, రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి మురళీమోహన్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి శేషారెడ్డికి భారీ మెజార్టీ రావడంతో మూలారెడ్డిని మురళీమోహన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ నేపథ్యంలో వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆ ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య మరోసారి వివాదం ముదురి పాకాన పడుతోందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అనపర్తి నుంచి బరిలోకి దిగాలని మాజీ ఎమ్మెల్యే తనయుడు రామకృష్ణారెడ్డి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో చివరి వరకు ప్రయత్నించిన వీర్రెడ్డి ఈసారి కూడా అదే స్థాయి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో టిక్కెట్టు ఎవరికి దక్కుతుందనే విషయం పక్కనబెడితే పార్టీలో అంతర్యుద్ధం అటు మురళీమోహన్‌కు, ఇటు పార్టీ జిల్లా నాయకత్వానికి మింగుడుపడటం లేదు.కేస్టిక్ సోడా తయారీ యాజమాన్య తొత్తుగా తనను పేర్కొనడాన్ని, రామకృష్ణారెడ్డికి సీటు రాకుండా సంస్థతో ఒప్పందం కుదిరిందని, వచ్చే ఎన్నికల్లో అనపర్తిలో తన మొత్తం ఖర్చు ఆ సంస్థ భరిస్తుందని కరపత్రాలు వేయాల్సిన అవసరం మరెవరికీ లేదని వీర్రెడ్డి భావిస్తున్నారు. మురళీమోహన్ను రాజకీయంగా దెబ్బతీయాలని, ప్రజావ్యతిరేకతను తనకు మూటగట్టి టిక్కెట్టు రాకుండా అడ్డుకోవాలనే దుర్బుద్ధితోనే ఈ కుట్ర జరిగిందని వీర్రెడ్డి పేర్కొంటున్నారు. ఇదంతా తమ పార్టీ వారి పనే అనే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం ఇందుకు అద్దం పడుతోంది. 2009లో చివరి వరకూ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేసినా, మూలారెడ్డి గెలుపునకు కృషిచేశానని కూడా వీర్రెడ్డి చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా 2014లో కూడా తాను అనపర్తి నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్నానని చెప్పడం గమనార్హం. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తనకు కష్టపడి పనిచేసే నాయకునిగా గుర్తింపు ఉందని కూడా వీర్రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ టికెట్ తనకు లభిస్తుందన్న భయంతో కరపత్రాల ద్వారా తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు దిగజారడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కరపత్రాలు వెనక సీట్ల సిగపట్లే కీలకపాత్ర పోషించాయని పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.