ఏఎన్‌ఎం పుష్పావతి ,ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ తీసుకొని వచ్చిన డీఎం ద్వారకనాథ్
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఆస్పత్రి.. సిబ్బంది వర్గపోరుకు వేదికైంది. వారు రోగుల ముందే వాగ్వాదం చేసుకుంటూ, గొడవ పడుతున్నారు. ఈ ఘటనలు ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని ఆరోగ్య ఉపకేంద్రంలో చోటుచేసుకుంటున్నాయి. ప్రొద్దుటూరులో ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. అర్బన్ హెల్త్ సెంటర్లు గతంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉండేవి. 2016 నుంచి అపోలో సంస్థకు అప్పగించారు. ఆ రోజు నుంచి ఉద్యోగులందరూ అపోలో కిందనే పని చేస్తున్నారు. ఒక్కో ఆస్పత్రిలో డాక్టర్‌తో సహా ఏడుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎన్జీఓల ఆధ్వర్యంలో ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్న సమయంలో.. డీఎంహెచ్‌ఓకు పూర్తి అజమాయిషీ ఉండేది. ఆస్పత్రులు అపోలో సంస్థ చేతిలోకి వెళ్లాక డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణ కొరవడినట్లు తెలుస్తోంది.
కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ప్రతి నెలా ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల మొత్తం నేరుగా అపోలో సంస్థకు వెళ్తున్నాయి. సంస్థ నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడుతున్న కారణంగా అపోలో ఉద్యోగులు డీఎంహెచ్‌ఓ, ఇతర జిల్లా అధికారులను లెక్క చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణ లోపించినట్లు పలువురు చెబుతున్నారు. ఇదే అదునుగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే పలువురు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రంలో పని చేసే సిబ్బందిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడి సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి ఆస్పత్రి వాతావరణాన్ని చెడగొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ గొడవల్లో భాగంగా అక్కడ 8 ఏళ్లుగా పని చేస్తున్న పుష్పావతి అనే ఏఎన్‌ఎంను ఉన్నట్టుండి బదిలీ చేశారు. అపోలో సంస్థ ఏర్పాటు కంటే ముందు నుంచి ఏఎన్‌ఎంగా పని చేస్తున్న తనను అన్యాయంగా బదిలీ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె బదిలీకి దారి తీసిన పరిస్థితులను పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అన్యాయంగా బదిలీ
తనకు జరిగిన అన్యాయం గురించి పుష్పావతి ఆదివారం విలేకరుల వద్ద మొరపెట్టుకుంది. బాధితురాలు తెలిపిన కథనం మేరకు.. పుష్పావతి ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీ అర్బన్ హెల్త్‌సెంటర్‌లో సుమారు 8 ఏళ్ల నుంచి ఏఎన్‌ఎంగా పని చేస్తోంది. ఆమె క్యారీ తెచ్చుకోవడంతో మధ్యాహ్నం ఆస్పత్రిలోనే భోజనం చేసి, సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నారు. ఉదయం ఆస్పత్రికి వచ్చిన సిబ్బందిలో ఎక్కువ మంది మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్తారు. అయితే క్యారీ తెచ్చుకోవడం వల్ల ఏఎన్‌ఎం పుష్పావతి మధ్యాహ్నం ఆస్పత్రిలోనే ఉంటోంది. మధ్యాహ్న సమయంలో తాను ఆస్పత్రిలో ఉండటం కొందరికి నచ్చడం లేదని ఆమె చెబుతోంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొందరు ఉద్యోగులు బ్యాచ్‌లుగా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించడమే ఇందుకు కారణమని ఆరోపించింది.
వాళ్ల బాగోతం ఎక్కడ బయట పడతుందోనని భావించి.. ఎలాగైనా ఇక్కడి నుంచి తనను పంపించాలని పథకం పన్నారని వివరించింది. మూడు రోజుల క్రితం కొందరు సిబ్బంది పక్కన పడేసిన కాలం చెల్లిన మందులను తీసుకొని వచ్చి ఫార్మసీ గదిలో ఉంచారని తెలిపింది. ఎందుకు వాటిని తీసేయలేదని తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా పుష్పావతిని కర్నూలు జిల్లాలోని ఆదోనికి బదిలీ చేస్తూ డీఎం ద్వారకనాథ్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన బదిలీ ఉత్తర్వులు తీసుకొని స్వయంగా ప్రొద్దుటూరు వచ్చారు. 10వ తేదీలోగా ఆదోనిలో రిపోర్టు చేసుకోక పోతే ఉద్యోగం పోతుందని డీఎం తనను హెచ్చరించారని ఆమె తెలిపింది. ఉన్నతాధికారులు ప్రొద్దుటూరుకు వచ్చి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె కోరుతోంది.
మీ ఇష్టమొచ్చినట్లు రాసుకోండి
ఆస్పత్రిలోని సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు, పుష్పావతిని ఇబ్బంది పెడుతున్న వైనంపై డీఎం ద్వారకనాథ్‌ను విలేకరులు వివరణ కోరగా.. ‘నేను చెప్పేది ఏం లేదు.. మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండి.. నేను ఇక్కడికి వచ్చిన విషయం మీకు ఎవరు చెప్పారు.. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ’ ఆగ్రహంతో ఊగిపోయారు. పుష్పావతికి బదిలీ జరగలేదని ఒక సారి, ఆదోనికి బదిలీ అయిందని, ఆమె బదిలీ ఉత్తర్వులు తీసుకోలేదని మరోసారి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment