తల వాసుపోతోంది
♦ ఒకవైపు వర్గపోరు..మరోవైపు నిలదీతలు
♦ తగ్గుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడి ప్రభ
♦ అందరినీ సమన్వయ పర్చలేకపోతున్నారనే ఆరోపణలు
♦ రాయచోటి..ప్రొద్దుటూరు.. బద్వేల్.. జమ్మలమడుగు
♦ క్రమంతప్పకుండా ఆరోపణలు చేస్తున్న నేతలు
♦ జిల్లా నేతనే టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు
సాక్షి ప్రతినిధి, కడప: ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరి మూడేళ్లే.. అయినా పార్టీ క్రియాశీలక రాజకీయాలకు కేంద్రబిందువు అయ్యారు. రాజకీయాల్లో చాలామందికి జూనియర్ అయినప్పటీకీ అధిష్టానం అండదండలతో జిల్లా పీఠం చేజిక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో మిగతా నేతలతో పాటు పార్టీశ్రేణులతో సమన్వయం కొరవడింది. క్రమంతప్పకుండా ఏదో ఒక ప్రాంతంలో తమ్ముళ్లకు ఆయన టార్గెట్ అవుతున్నారు. ఈక్రమంలో తీవ్ర పదజాలాన్ని తెలుగుతమ్ముళ్లు ప్రయోగిస్తున్నారు. అధికారం ఉంది అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదని మొదట్లో పరిశీలకులు భావించారు.
అయితే నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, పనుల వివాదాలను తీర్చలేక అధ్యక్షుడికి తలబొప్పి కడుతోందని పలువురు పేర్కొంటున్నారు. నేతలను సమన్వయపర్చడంలో శ్రీనివాసులురెడ్డి (వాసు) విఫలం కావడంతో అధికార పార్టీలో పెద్దఎత్తున దుమారం రేగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీని ఏకతాటిపై నడిపించడం అధ్యక్షుడికి శిరోభారంగా మారింది.
వర్గపోరూ....అనుభవలేమి...
టీడీపీ జిల్లా అధ్యక్షుడికి ఓవైపు అనుభవలేమి వెంటాడుతుండగా మరోవైపు వర్గపోరు పట్టిపీడిస్తున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సొంత నియోజకవర్గం రాయచోటి నుంచే కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గీయులను మహానాడుకు ముందస్తు ఆహ్వానం లేకుండా చేయడమే అందుకు కారణం. టీడీపీ కుటుంబ పెద్దగా అందరినీ కలుపుకొని పోవాల్సింది పోయి, సొంత నియోజకవర్గంలోనే వర్గాలను ప్రోత్సహించారనే ఆరోపణలు భుజానకెత్తుకున్నారు. ఈవ్యవహారం అటుండగానే ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి తీవ్ర పదజాలంతో అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు.
ఇష్టారాజ్యంగా పార్టీని నడిపిస్తున్నారని ఆరోపణలు చేశారు. మరోవైపు తాజాగా బద్వేల్ టీడీపీ అభ్యర్థి విజయజ్యోతి ఏకంగా శ్రీనివాసులరెడ్డిని ప్రొద్దుటూరులో నిలదీశారు. టీడీపీ కార్యకర్తలకు సమన్యాయం ఎందుకు చేయరని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరిన జయరాములులకు నీరు-చెట్టు పనుల్లో ప్రాధాన్యత ఇచ్చారని వాపోయారు. తాను ప్రాతిపాదించిన పనులకు అడ్డంకులు ఎందుకు అంటూ నిలదీశారు. మీ శైలిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆమె స్పష్టం చేశారు. వీటితోపాటు జమ్మలమడుగులో వర్గపోరూ తీవ్రరూపం దాల్చింది. జిల్లా అధ్యక్షుడిగా గాడిలో పెట్టాల్సిన ఆయన అటువైపు చూసేందుకే జంకుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కడప పరిధిలో వివిధ కాంట్రాక్టులు కేటాయింపుల్లో ఒక సామాజికవర్గానికి మినహా, ఇతరులకు అవకాశం కల్పించలేదని ఫిర్యాదుల పరంపర అధిష్టానానికి చేరాయని సమాచారం. అధికంగా ఉన్న ముస్లీం, కాపు సామాజికవర్గాన్ని పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలు వెళ్లినట్లు తెలుస్తోంది.
పనిచేయని లోకేష్ ఆదేశాలు
టీడీపీలో వర్గపోరు ఉండకూడదు.. కేడర్ కలిసికట్టుగా పనిచేయాలని రెండు నెలల క్రితం టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లాలో పర్యటించి దిశ నిర్దేశం చేశారు. అప్పట్లో నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టి మార్గదర్శకాలు జారీచేశారు. అయినప్పటీకీ పార్టీలో ఏమాత్రం మార్పులేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు టీడీపీ నేతల పరిస్థితి ఉండిపోయిందని పలువురు విమర్శిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నేతృత్వంలో ఓవర్గం, వైరివర్గంగా మరికొందరు ఉండిపోయారని పలువురు పేర్కొంటున్నారు. అన్నీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. మొత్తానికీ జిల్లా టీడీపీ పీఠం బాధ్యతలు శిరోభారంగా తయారైయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.