‘పచ్చ’ పార్టీలోకొత్త రచ్చ
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రెండు కళ్ల సిద్ధాంతం, సమన్యాయం, కోతి - రొట్టెల కథ అంటూ రాష్ట్ర విభజనపై పూటకో మాట మాట్లాడుతున్న చంద్రబాబు నిర్వాకంతో జనాభిమానం కోల్పోతున్న టీడీపీని జిల్లాలో నేతల వర్గపోరు మరింత కుంగదీసేలా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఉప్పు - నిప్పుగా ఉంటున్న పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి, మురళీమోహన్ మధ్య ఉన్న విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. అనపర్తిలో రెండురోజుల క్రితం పంపిణీ అయిన ఓ కరపత్రం పార్టీలో కొత్త చిచ్చు రేపుతోంది. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ తెలుగుదేశంపార్టీలో మాత్రం అప్పుడే సీట్ల సిగపట్లు బజారుకెక్కుతున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికలప్పుడు రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి సినీనటుడు మురళీమోహన్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి మధ్య తీవ్రస్థాయిలో పోరు జరిగింది. అదే పరిస్థితి మరోసారి పునరావృతం అవుతుందా అంటే ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు అవుననే అంటున్నారు. రెండు రోజుల క్రితం అనపర్తి నియోజకవర్గంలో రాత్రిపూట పంపిణీ అయిన కరపత్రాలు, వాటిపై పార్టీ జిల్లా నాయకుడు, మాజీ సర్పంచ్ నల్లమిల్లి వీర్రెడ్డి మంగళవారం విలేకర్ల సమావేశంలో స్పందించిన తీరు ఇందుకు బలం చేకూరుస్తోంది. రాజమండ్రి ఎంపీగా పోటీచేసి గత ఎన్నికల్లో ఓడిపోయిన సినీ నటుడు మురళీమోహన్, అనపర్తి సీటు ఆశిస్తున్న జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డికి వ్యతిరేకంగా కేపీఆర్ వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నియోజకవర్గంలో కరపత్రాలు పంచిపెట్టారు.
తమ ప్రాంతాన్ని నాశనం చేయడానికి పూనుకున్న కేస్టిక్‌సోడా తయారీ ప్లాంట్ యాజమాన్యం చెప్పుచేతల్లో మురళీమోహన్ నడుస్తున్నారని, ప్లాంట్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి తనయుడు)కి టీడీపీ సీటు రాకుండా చేయాలని మురళీమోహన్, సంస్థ మధ్య ఒప్పందం కుదిరిందని ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో మూలారెడ్డితో పాటు చివరి వరకు అనపర్తి సీటు కోసం గట్టి ప్రయత్నం చేసిన నల్లమిల్లి వీర్రెడ్డి, తేతల్లి ఉపేంద్రరెడ్డిలలో ఒకరికి సీటు ఇప్పించేలా మురళీమోహన్‌తో మంతనాలు సాగించారనేది ఆ కరపత్రం సారాంశం. ఈ కరపత్రాల వెనుక తన అభ్యర్థిత్వాన్ని గత ఎన్నికలప్పటి నుంచి వ్యతిరేకిస్తోన్న మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి హస్తం ఉందనే అనుమానం వీర్రెడ్డి వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో అనపర్తి టిక్కెట్టుపై జరిగిన పోరు నేపథ్యాన్ని ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో అనపర్తి నుంచి మూలారెడ్డి అసెంబ్లీకి, రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి మురళీమోహన్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి శేషారెడ్డికి భారీ మెజార్టీ రావడంతో మూలారెడ్డిని మురళీమోహన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ నేపథ్యంలో వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆ ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య మరోసారి వివాదం ముదురి పాకాన పడుతోందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అనపర్తి నుంచి బరిలోకి దిగాలని మాజీ ఎమ్మెల్యే తనయుడు రామకృష్ణారెడ్డి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.
గత ఎన్నికల్లో చివరి వరకు ప్రయత్నించిన వీర్రెడ్డి ఈసారి కూడా అదే స్థాయి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో టిక్కెట్టు ఎవరికి దక్కుతుందనే విషయం పక్కనబెడితే పార్టీలో అంతర్యుద్ధం అటు మురళీమోహన్‌కు, ఇటు పార్టీ జిల్లా నాయకత్వానికి మింగుడుపడటం లేదు.కేస్టిక్ సోడా తయారీ యాజమాన్య తొత్తుగా తనను పేర్కొనడాన్ని, రామకృష్ణారెడ్డికి సీటు రాకుండా సంస్థతో ఒప్పందం కుదిరిందని, వచ్చే ఎన్నికల్లో అనపర్తిలో తన మొత్తం ఖర్చు ఆ సంస్థ భరిస్తుందని కరపత్రాలు వేయాల్సిన అవసరం మరెవరికీ లేదని వీర్రెడ్డి భావిస్తున్నారు. మురళీమోహన్‌ను రాజకీయంగా దెబ్బతీయాలని, ప్రజావ్యతిరేకతను తనకు మూటగట్టి టిక్కెట్టు రాకుండా అడ్డుకోవాలనే దుర్బుద్ధితోనే ఈ కుట్ర జరిగిందని వీర్రెడ్డి పేర్కొంటున్నారు.
ఇదంతా తమ పార్టీ వారి పనే అనే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం ఇందుకు అద్దం పడుతోంది. 2009లో చివరి వరకూ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేసినా, మూలారెడ్డి గెలుపునకు కృషిచేశానని కూడా వీర్రెడ్డి చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా 2014లో కూడా తాను అనపర్తి నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్నానని చెప్పడం గమనార్హం. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తనకు కష్టపడి పనిచేసే నాయకునిగా గుర్తింపు ఉందని కూడా వీర్రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ టికెట్ తనకు లభిస్తుందన్న భయంతో కరపత్రాల ద్వారా తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు దిగజారడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కరపత్రాలు వెనక సీట్ల సిగపట్లే కీలకపాత్ర పోషించాయని పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.