సిబ్బంది శల్యసారథ్యం
పట్టుబడని ప్రధాన బుకీలు
విజయవాడ సిటీ : పోలీసు కమిషనరేట్‌లో రౌడీలు, గూండాలు, అసాంఘికశక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని నిలువరించాల్సిన కమిషనర్ టాస్క్‌ఫోర్స్(సీటీఎఫ్) వర్గపోరుతో సతమతమవుతోంది. ఇక్కడి సిబ్బంది.. దాడులకంటే ప్రత్యర్థి వర్గం నుంచి నిందితులను తప్పించేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. వర్గపోరును ఆసరాగా చేసుకుని క్రికెట్ బుకీలు టాస్క్‌ఫోర్స్‌కు చిక్కకుండా సులువుగా తప్పించుకుంటున్నారు. కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న దాడుల్లో ప్రధాన బుకీలు పట్టుబడకుండా తప్పించుకోవడం వెనుక ఓ వర్గం హస్తముందనే అనుమానాన్ని ప్రత్యర్థి వర్గం వ్యక్తం చేస్తోంది. పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే మార్గాలను తమవారే చెప్పడంతో ప్రధాన బుకీలను పట్టుకోలేక.. చిన్న చిన్న ఫంటర్ల (ఆటగాళ్లు)తో సరిపెడుతున్నట్టు ఓ వర్గం ఆవేదన. కోస్తా జిల్లాల్లో క్రికెట్ బెట్టింగ్‌లకు ఇక్కడి ప్రధాన బుకీలే కారణం. నగరంతో పాటు ఆయా జిల్లాల్లో పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని వీరు బెట్టింగ్‌ల దందా నిర్వహిస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా దందా నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తుంటే.. వందలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కొంతమంది వ్యసనపరులు అందిన చోటల్లా అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు.
అసలు బుకీలు ఎక్కడ!
ఆటగాళ్ల ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే, బుకీల పరిస్థితి మాత్రం ‘మూడు ఫోర్లు-ఆరు సిక్సర్లు’ చందంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచ కప్ మొదలైనప్పుడు పత్రికల్లో కథనాలు వచ్చాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. అనేక మందిని అరెస్టు చేసి లక్షలాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ప్రధాన బుకీలుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు బిల్డప్ ఇచ్చారు. కొత్తవారిని తీసుకొచ్చి ప్రధాన బుకీలని చెప్పిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. పేరుమోసిన బుకీలను మాత్రం పట్టుకోలేకపోయారు. అదేమంటే వారు ఇక్కడ ఉండటం లేదంటూ సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. కాని క్రికెట్ బెట్టింగ్‌లు కట్టే ఫంటర్లను ఎవరిని అడిగినా చెబుతారు వారెక్కడి నుంచి బెట్టింగ్‌ల దందా నిర్వహిస్తున్నారనేది. ఇది టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియని విషయమేమీ కాదు. కాకుంటే ఎప్పటికప్పుడు ఇక్కడ పనిచేసే సిబ్బంది సమాచారంతో దాడులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నట్టు చెప్పొచ్చు.
విభజన ఎఫెక్ట్ : గతంలో ఒకే అధికారి కింద టాస్క్‌ఫోర్స్ ఉండేది. సూపర్ న్యూమర్ పోస్టుల కారణంగా పెద్ద సంఖ్యలో అధికారుల రాకతో ఇద్దరు అధికారులను నియమించి రెండుగా విభజించారు. సెంట్రల్ జోన్‌లోని కృష్ణలంక పోలీసు స్టేషన్‌తోపాటు వెస్ట్‌జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లను ఒక అధికారి, సెంట్రల్ జోన్‌లోని మిగిలిన స్టేషన్లతోపాటు ఈస్ట్‌జోన్ పరిధిలోని పోలీసు స్టేషన్లకు ఒక అధికారి పర్యవేక్షించే విధంగా విభజించారు. ఇదే సమయంలో ఇక్కడి అధికారులు, సిబ్బందిని కూడా జోన్లవారీగా కేటాయించారు. గతంలో ఒకే అధికారి కింద పనిచేసినప్పుడు సిబ్బంది మొత్తం కలిసే ఉండేవారు. బుకీల ద్వారా వచ్చే మామూళ్ల మొత్తం అందరికీ చేరేది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక జోన్ పూర్తిగా ఫంటర్లకే పరిమితమైతే, రెండో జోన్ ఫంటర్లతోపాటు ప్రధాన బుకీలకు కేంద్రంగా ఉంది. ఫంటర్ల ద్వారా బుకీలను పట్టుకునే ప్రయత్నాలకు మరో జోన్ సిబ్బంది బ్రేక్ వేస్తున్నారు. క్రమం తప్పని మామూళ్లే దీనికి కారణమని తెలిసింది. వందలాది కుటుంబాల జీవితాలను ఛిన్నాభిన్నం చేసే వ్యక్తులను వర్గపోరుతో చిక్కకుండా చేస్తున్న టాస్క్‌ఫోర్స్ చర్యలను పలువురు విమర్శిస్తున్నారు.
టాస్క్‌ఫోర్స్‌లో వర్గ పోరు
Published Tue, Mar 3 2015 1:07 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement