
సాక్షి, అమరావతి బ్యూరో (కృష్ణా) : విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిని విస్తరిస్తూ మెగా కమిషనరేట్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిధిలోకి సీఆర్‌డీఏలోని ప్రాంతాలను తీసుకొస్తూ నూతన కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.
కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో జరుగుతున్న సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాంతిభద్రతలపై జరిగిన సమీక్షలో ఈ మేరకు డీజీపీతో చర్చించి అధ్యయనం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే విజయవాడలోని ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి, దోపిడీని ఉపేక్షించవద్దని నగర సీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు.
‘విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి, దోపిడీని ఉపేక్షించ వద్దు.. కాల్‌మనీ లాంటి ఘటనలు నగరంలో మళ్లీ పునరావృతం కావడానికి వీల్లేదు.. ఫిర్యాదు వస్తే సత్వరమే చర్యలు తీసుకోండి.. చట్టవిరుద్ధ కార్యకలాపాలు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపండి’ అంటూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.
శాంతిభద్రతల అంశంపై మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమలరావుతో ముఖాముఖీ నిర్వహించిన సీఎం నగర పరిస్థితులపై మాట్లాడారు.
మెగా కమిషనరేట్ ఏర్పాటుకు ప్రతిపాదన..
రాజధాని నగరానికి తగినట్లుగా పోలీసు వ్యవస్థను పటిష్ట పరచడానికి ప్రస్తుత విజయవాడ కమిషరేట్ పరిధిలోకి సీఆర్‌డీఏ ప్రాంతాన్ని తీసుకువస్తూ ‘మెగా కమిషనరేట్(అమరావతి కమిషరేట్)ను ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని సీపీ ద్వారకా తిరుమలరావు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం కృష్ణా ఎస్పీ పరిధిలో ఉన్న ఇబ్రహీంపట్నం నుంచి జగ్గయ్యపేట వరకు కూడా ఈ కమిషరేట్ పరిధిలోకి వస్తుందని, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు రూరల్, గుంటూరు అర్బన్ పోలీసుల పరిధిలోని కొన్ని ప్రాంతాలను విజయవాడ కమిషనరేట్ పరిధిలోకి తేవాల్సి ఉందని తెలిపారు.
అలాగే కమిషరేట్‌ను ఆరు సబ్‌డివిజన్లుగా విభజించి.. ఒక్కో డివిజన్‌కు ఒక్కో ఐపీఎస్ అధికారిని డీసీపీగా నియమించాల్సి ఉంటుందని, అదనంగా మరో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐ పోస్టులతోపాటు కానిస్టేబుళ్లను వివిధ విభాగాలకు కేటాయించాలని ప్రతిపాదించారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ డీజీపీతోపాటు నిపుణుల కమిటీతో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని సీపీకి తెలిపారు.
ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే..
విజయవాడ నగరం నుంచి చెన్నై–కోల్‌కతా, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారులు వెళ్తున్నాయని.. తద్వార ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కారం కావాలంటే నగరంలో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం ఒక ప్రత్యామ్నాయమని నగర సీపీ ద్వారకా తిరుమలరావు సీఎం వైఎస్ జగన్‌కు ప్రతిపాదించారు.
కనకదుర్గ వారథి నుంచి గన్నవరం వరకు నేరుగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల బెంజిసర్కిల్, నిర్మలా జంక్షన్, రమేష్ ఆస్పత్రి సర్కిల్, మహానాడు, రామవరప్పాడు, ఎనికేపాడు, గూడవల్లి, గన్నవరం వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణలోకి వస్తుందన్నారు.
మరో ప్రత్యామ్నాయం..
గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప వరకు బైపాస్ మార్గాన్ని నిర్మించి దీనిని తాడిగడప కూడలిలోని వంద అడుగుల రోడ్డులో అనుసంధానం చేస్తే నగరంలోని బెంజిసర్కిల్‌పై ఒత్తిడి తగ్గుతుందని సీపీ వివరించారు.
విజయవాడ–బందరు హైవేపై మరొకటి..
విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై మరో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే మార్గాన్ని నిర్మించాలని, దీనివల్ల ఎన్టీఆర్ సర్కిల్, పటమట, ఆటోనగర్ గేట్, కామయ్యతోపు, కానూరు, తాడిగడప, పోరంకి కూడళ్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు. కనకదుర్గ ఫ్‌లై ఓవర్‌ను గొల్లపూడి వై జంక్షన్ వరకు పొడిగిస్తే ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తొలిగిపోతాయని తెలిపారు.
ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్..
నగరంలో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల వాహనాల రద్దీని అంచనా వేస్తూ ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్స్ పనిచేస్తాయన్నారు.
పాదచారుల కోసం..
బెంజిసర్కిల్, రమేష్ హాస్పిటల్ సర్కిళ్లో వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో పాదచారులు రోడ్డు దాటేందుకు ఇక్కట్లు పడుతున్నారని వారి కోసం ఈ రెండు సర్కిళ్లలో సబ్ వేలు ఏర్పాటు చేస్తే రోడ్డు మార్గం దాటేందుకు సులువుగా ఉంటుందని సీపీ వివరించారు. వీటిపైన సీఎం జగన్ స్పందిస్తూ సమగ్ర నివేదికతో రావాలని సూచించారు.
అవినీతి, దోపిడీని ఉపేక్షించొద్దు..
విజయవాడ నగరంలో అవినీతి, దోపిడీని ఉపేక్షించొద్దని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగర పోలీసు కమిషనర్‌కు ఆదేశించారు. నగరంలో ప్రకంపనలు సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అలాంటి ఘటన మళ్లీ పునరావృతం కారాదని హెచ్చరించారు. ఫిర్యాదు వస్తే సత్వరమే చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
కాల్‌మనీ బాధితులకు న్యాయం జరిగిందా అని ఆరా తీశారు. నగరంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.