express way
-
కొత్త ఏడాదిలో నూతన ఎక్స్‌ప్రెస్‌వే.. నాలుగు రాష్ట్రాలకు నజరానా!
దేశంలోని నాలుగు రాష్ట్రాలను కలుపుతూ రాబోయే సంవత్సరంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కానుంది. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలను అనుసంధానం చేయనుంది. ఈ రహదారి ఏర్పాటుతో బీహార్ ప్రజలకు అత్యధిక ప్రయోజనం చేకూరనుంది. ఈ వారణాసి-రాంచీ-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఏడు ప్యాకేజీలుగా నిర్మాణం కానుంది. దీనిలోని ఐదు ప్యాకేజీలలో బీహార్‌లోని పలు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే అంచనా వ్యయం రూ.28,500 కోట్లు. ఇది 610 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే. ఇది నాలుగు రాష్ట్రాల మీదుగా వెళుతుంది. దీనిలో 159 కిలోమీటర్ల పొడవైన మార్గం బీహార్ మీదుగా వెళుతుంది. ఈ ప్రత్యేక గ్రీన్‌ఫీల్డ్ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే కోసం బీహార్‌లో 136.7 కిలోమీటర్ల మేరకు అవసరమైన భూమిని గుర్తించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభంతో దీనికి సంబంధించిన నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉంది. నాలుగు, ఐదు ప్యాకేజీల డీపీఆర్ కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. వారణాసి రింగ్ రోడ్‌లోని చందౌలీలో ఉన్న బర్హులి గ్రామం నుండి ఎక్స్‌ప్రెస్‌వే రహదారి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ రహదారి బీహార్‌లోకి ప్రవేశించిన తర్వాత కైమూర్, రోహతాస్, ఔరంగాబాద్, గయ జిల్లాల మీదుగా వెళుతుంది. బీహార్‌లోని నాలుగు జిల్లాలను దాటి జార్ఖండ్‌కు చేరుకుంటుంది. ఇక్కడ ఐదు జిల్లాల గుండా వెళుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నాలుగు జిల్లాల మీదుగా జాతీయ రహదారి- 19కి అనుసంధానమవుతుంది. జార్ఖండ్‌లో ఈ రహదారి పొడవు 187 కిలోమీటర్లు. పశ్చిమ బెంగాల్లో గరిష్టంగా 242 కిలోమీటర్లు. మొదటి ప్యాకేజీలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రారంభమై బీహార్‌లోని కొన్ని ప్రాంతాలతో అనుసంధానమవుతూ ముగుస్తుంది. రెండో ప్యాకేజీలో రహదారి నిర్మాణం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా నుండి ప్రారంభంకానుంది. ఇది ఇక్కడి చందౌలీలో ఉన్న బర్హులీ గ్రామం మీదుగా బీహార్‌లోకి ప్రవేశిస్తుంది. తరువాత ఔరంగాబాద్, గయా జిల్లాల మీదుగా జార్ఖండ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఛత్రా, హజీరాబాగ్, రామ్‌ఘర్, పీటర్‌బార్, బొకారో మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ పురూలియా, బంకురా, ఆరంబాగ్ మీదుగా వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్ వే ఉలుబెరియా వద్ద జాతీయ రహదారి 19 వద్ద ముగుస్తుంది. ఇది కూడా చదవండి: ‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమానికి అనూహ్య స్పందన! -
అబ్బురపరిచే నిర్మాణం.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే
న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అదివారం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వీడియోను విడుదల చేశారు. తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేస్తూ దాని కింద ఇంజినీరింగ్ యొక్క ఘనత.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే.. అత్యాధునికమైన కళాత్మక భవిష్యత్తుకు నాంది.. అని రాశారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన భారతదేశంలోనే మొట్టమొదటి ఎనిమిది లైన్ల హైవే. నేషనల్ హైవే నెంబర్ 8 పై ఉన్న శివ మూర్తి నుండి ప్రారంభమై ఖేర్కి దౌలా వద్ద ముగిసే ఈ నాలుగు లైన్ల ప్యాకేజీ హైవే 563 కి.మీ వెడల్పుతో నిర్మితమైంది.ఈ ప్రాజెక్టు కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏకంగా 1200 చెట్లను తిరిగి నాటారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ హర్యానా మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయి. వీడియోలో చూపిన వివరాల ప్రకారం ద్వారకా నుండి మానేసర్ వరకు 15 నిముషాలు మానేసర్ నుండి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 20 నిముషాలు ద్వారకా నుండి సింఘు సరిహద్దు వరకు 25 నిముషాలు మానేసర్ నుండి సింఘు సరిహద్దు వరకు 45 నిముషాల వరకు ప్రయాణ సమయం ఉంటుందని తెలిపింది కేంద్ర రవాణా శాఖ. ఈ హైవే నిర్మాణం గనుక పూర్తయితే ద్వారకా సెక్టర్ 25లోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ తో కనెక్టివిటీని బాగా పెరుగుతుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా మూడు లైన్ల సర్వీసు రోడ్లను కూడా నిర్మించారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సుమారు రెండు లక్షల టన్నుల ఉక్కును వినియోగించినట్టు ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 30 రేట్లు ఎక్కువ కాగా 20 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీటు వినియోగించగా ఇది దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో వినియోగించిన దానికంటే ఆరు రేట్లు ఎక్కువ కావడం విశేషం. Marvel of Engineering: The Dwarka Expressway! A State-of-the-Art Journey into the Future 🛣#DwarkaExpressway #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/Qhgd77WatW — Nitin Gadkari (@nitin_gadkari) August 20, 2023 ఇది కూడా చదవండి: Manipur Violence: మణిపూర్‌లో సజీవదహనమైన తల్లీకొడుకులు.. -
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వ్యయంపై కాగ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ–గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం అత్యంత ఖరీదైన వ్యవహారంగా కనిపిస్తోందని కాగ్(కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వ్యాఖ్యానించింది. ఒక్కో కిలోమీటర్‌కు నిర్మాణ వ్యయం ప్రభుత్వ కేటాయింపులు రూ.18.20 కోట్లు కాగా వాస్తవ ఖర్చు రూ.250.77 కోట్లకు పెరిగిందని తెలిపింది. అయితే, భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా ఈ 48వ నంబర్ జాతీయ రహదారిని 14 లేన్లుగా నిర్మించేందుకు 2017లో కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే, 8 లేన్ల ఎలివేటెడ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవే కారిడార్‌లో వాహనాల రాకపోకలు సులభంగా జరిగేందుకు గాను తక్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఇవ్వడమే నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమని రోడ్డు రవాణా హైవేల శాఖ చెబుతోందని వివరించింది. ఈ కారణం సహేతుకంగా లేదని కాగ్ పేర్కొంది. కేవలం ఆరు లేన్లకు మాత్రమే ప్రణాళిక రూపొందించి, నిర్మాణం పూర్తి చేశారని తెలిపింది. ఇదే కాకుండా, దేశవ్యాప్తంగా భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన హైవేల నిర్మాణంలో కేటాయింపుల కంటే 58% అధికంగా ఖర్చు చేశారని వివరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర విమర్శులు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపిస్తున్నారు. ఇక, దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. CAG exposed the scam of 6741 crores in building of Dwarka Expressway. If TV media raise these issues & debate on this, BJP will fall like a pack of cards ♠️ pic.twitter.com/81ohaACopW — Baijuu Nambiar CFP®✋ (@baijunambiar) August 14, 2023 ఇది కూడా చదవండి: బీజేపీతో పొత్తుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు -
భారతదేశంలో రాబోయే టాప్ 10 ఎక్స్‌ప్రెస్‌వేలు
-
రూ. 1.5 కోట్ల డ్రీమ్ హౌస్... కూల్చడం ఇష్టం లేక ఇంటినే తరలిస్తున్న రైతు
రొడ్డు విస్తరణలో భాగంగా లేదా హైవే నిర్మించడం కోసం ప్రభుత్వం కొన్ని ఇళ్లను తొలగిస్తుంటుంది. ఇది సర్వ సాధారణం. అందుకు ప్రభుత్వం వారికి నష్ట పరిహారం కూడా ఇస్తుంది. ఐతే అచ్చం అలాంటి పరిస్థితే ఒక రైతుకు ఎదురైంది. కానీ ఆ రైతు అందుకు ససేమిరా అంటే ఏకంగా ఇంటినే తరలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రైతు సుఖ్విందర్ సింగ్ తన డ్రీమ్ హౌస్‌ని కూల్చడం ఇష్టం లేక మొత్తం ఇంటినే తరిలించిందేకు సిద్ధమయ్యాడు. సంగ్రూర్ జిల్లాలోని రోషన్వాలా గ్రామంలో తన స్థలంలో నిర్మించుకున్న ఇల్లు ఉన్న ప్రదేశం ఎక్స్‌ప్రెస్ వే రోడ్డుని నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత్‌మాల ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ఈ రహదారిని ఢిల్లీ, అమృత్సర్ కత్రా ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎక్ప్రెస్ వే హర్యానా, పంజాబ్, జమ్ముకాశ్మీర్ మీదుగా వెళ్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సిఖ్విందర్ సింగ్ అనే రైతుకి తన ఇంటిని కూల్చివేసేందుకు నష్టపరిహారం కూడా చెల్లించింది. ఐతే సుఖ్‌విందర్‌కి తన ఇంటిని కూల్చడం ఇష్టం లేక మొత్తం ఇంటినే మరోక ప్రదేశానికి మార్చాలనుకున్నాడు. అంతేకాదు అతను భవన నిర్మాణ కార్మికుల సహకారంతో సుమారు 250 అడుగుల మేర ఉన్న ఇంటిని 500 అడుగులు దూరం కదిలించేందుకు పనులు కొనసాగిస్తున్నాడు. భవనాన్ని కదిపేందుకు చక్రాల వలే కనిపించే గేర్లను కూడా ఏర్పాటు చేశాడు. ఆ రైతు ఈ ఇంటిని నిర్మించడానికి దాదాపు రూ. 1.5 కోట్లు ఖర్చు అయ్యిందని, అదే సమయంలో ఇంటిని నిర్మించడానికి రెండేళ్లు పట్టిందని చెప్పుకొచ్చాడు. ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్‌ప్రెస్‌వే ప్రతిష్టాత్మకమైన జాతీయ రహదారి ప్రాజెక్టు అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా ఈ రహదారి వల్ల కాశ్మీర్‌కు ప్రయాణించే ప్రయాణికులకు సమయం, డబ్బు, శక్తి ఆదా అవుతుందని చెప్పారు. (చదవండి: చిచ్చు రేపిన తాగుడు అలవాటు... ఖతం చేసి సెల్ఫీ వీడియో!) -
ఘోర ప్రమాదం.. డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొని 8 మంది మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం జరిగింది. రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక సీహెచ్‌సీ హైదర్‌గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని లక్నోలోని ట్రూమా సెంటర్‌కు తరలించామని వెల్లడించారు. ప్రమాదానికి గురైన రెండు బస్సులు బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు. లక్నోకు 30 కిలోమీటర్ల దూరంలో బారబంకి జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ‘లోనికాత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రపుర్ మద్రాహా గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులు బిహార్‌లోని సీతామర్హి, సుపాల్ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయి. పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ’ అని ఓ అధికారి వెల్లడించారు. #WATCH | Accident at Purvanchal expressway near Barabanki in UP leaves 6 persons dead & 18 injured after a speeding double-decker bus collided with a stationary one. 3, reported to be critical, referred to trauma centre in Lucknow. Buses were en route from Bihar to Delhi pic.twitter.com/RUELIchJh9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 25, 2022 ఇదీ చదవండి: Teacher recruitment scam: ‘ఆ మంత్రి డాన్‌లా ప్రవర్తిస్తున్నారు’ -
రూ.36వేల కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే
షాజహాన్‌పూర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని 12 జిల్లాల మీదుగా సాగే ప్రతిష్టాత్మక ఆరు వరసల గంగా ఎక్స్‌ప్రెస్‌వే రహదారి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.36,230 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఉత్తరప్రదేశ్ వాయవ్య ప్రాంత జిల్లాల భవిష్యత్ రూపురేఖలు మారిపోతాయన్నారు. షాజహాన్పూర్లో శనివారం జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడయ్యారని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. యూపీలో మాఫియా భరతం పట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, యోగి ఎంతో ఉపయోగపడే ముఖ్యమంత్రిగా అవతరించారన్నారు. యూపీకి యోగి తోడైతే రాష్ట్ర ప్రజలకు మరెంతో ఉపయోగకరమంటూ, యూపీ+యోగి= ఉపయోగి (UP+ YOGI = U.P.Y.O.G.I) అనే కొత్త నిర్వచనాన్ని చెప్పి ఆదిత్యనాథ్‌పై మోదీ పొగడ్తల వర్షం కురిపించారు. మీరట్, హర్పూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బదాయూ, షాజహాన్‌పూర్, హర్దోయీ, ఉన్నవ్, రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్.. మొత్తంగా 12 జిల్లాల గుండా 594 కి.మీ.ల పొడవైన ఆరు వరసల రహదారిని నిర్మించనున్నారు. ‘ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే ఈ జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం, వాణిజ్యం, పర్యాటక రంగాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. తద్వారా రైతులు, యువత సహా ప్రతి ఒక్కరికి వృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పశ్చిమప్రాంతంలో దేశీ తుపాకులతో మాఫియా రాజ్యమేలింది. కానీ, యోగి ప్రభుత్వమొచ్చాక గత నాలుగున్నరేళ్ల కాలంలో మాఫియా అక్రమ సామ్రాజ్యాలను బుల్డోజర్తో తొక్కించేశారు. గత ప్రభుత్వాలకు అభివృద్ధి, దేశ వారసత్వం అంటే అస్సలు పట్టదు. వారి ధ్యాస అంతా ఓటు బ్యాంక్‌పైనే. కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నెట్వర్క్, నూతన విమానాశ్రయం, కొత్త రైలు మార్గాలతో నవీకరించిన మౌలికసదుపాయాలతో ఆధునిక యూపీ అవతరించబోతోంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ చేసిన యోగ ఉపయోగి వ్యాఖ్యలను ఎస్పీ, బీఎస్పీలు తిప్పికొట్టాయి. ఆయన ‘ఉత్తరప్రదేశ్‌కు పనికిరాడు, నిరుపయోగి’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశాయి. -
రాజకీయ రహదారి!
రహదారులు రాజకీయ రణక్షేత్రంగా మారడమంటే ఇదే! యూపీలో ప్రధాని మోదీ మంగళవారం ఆర్భాటంగా ప్రారంభించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలకు దారి తీస్తోంది. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీలో రూ. 23 వేల కోట్ల పైగా వ్యయంతో నిర్మించిన 341 కి.మీల ఈ కొత్త రహదారి చర్చనీయాంశమైంది. లక్నో నుంచి ఘాజీపూర్, అలాగే బిహార్‌లో బక్సర్ లాంటి చోట్లకు ప్రయాణ సమయాన్ని ఆరేడు గంటల నుంచి ఏకంగా మూడున్నర, నాలుగు గంటలకు తగ్గించే ఈ రహదారి ఘనత ఎవరిది? యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని అధికార బీజేపీ, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ)లు దేనికవే ఈ ప్రాజెక్టు ఘనత తమదేనని చెప్పుకుంటున్నాయి. ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ విజయానికీ, ఆ ప్రాజెక్ట్కూ ఉన్న లంకె అలాంటిది మరి! యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 160 స్థానాలు, అంటే దాదాపు 40 శాతం సీట్లున్నది పూర్వాంచల్‌లోనే! అక్కడి గెలుపోటములను బట్టే పార్టీల అధికార భవితవ్యం! ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు పెట్టనికోటలుగా భావించే 9 జిల్లాల మీదుగా తాజా రహదారి నిర్మాణం జరగడం గమనార్హం. కేంద్రం చేసిన కొత్త రైతు చట్టాలకు యూపీ పశ్చిమ ప్రాంత రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అందుకే, మళ్ళీ అధికారంలోకి రావడానికి తూర్పు యూపీపై బీజేపీ కన్నేసింది. నిజానికి, ఈ ఎక్స్‌ప్రెస్ వే ఆలోచన ఎస్పీది. గత ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ పార్టీ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తీరా ఎన్నికల్లో ఎస్పీ ఓటమి పాలై, బీజేపీ వచ్చాక అనేక మార్పులు, చేర్పులతో, మూడేళ్ళ పైచిలుకు రికార్డు కాలంలో యోగి దీన్ని నిర్మించారు. అసలీ రోడ్డు ఆలోచన, ఆరంభం తమ ఘనతేనని అఖిలేశ్ ఇప్పుడు గోల చేస్తున్నది అందుకే. బీఎస్పీ సైతం ఈ రోడ్డు రేసులో తానూ ఉన్నానంటోంది. ‘పశ్చిమ యూపీలోని నోయిడాను తూర్పు యూపీలోని జిల్లాలతో అనుసంధానించే రహదారి ప్రణాళిక మేము అధికారంలో ఉండగా సిద్ధం చేసినదే. అప్పట్లో కేంద్రంలోని కాంగ్రెస్ అడ్డుపడడంతో మొదలెట్టలేకపోయాం’ అన్నది మాయావతి వాదన. గతంలో బీఎస్పీ సర్కారు కాలంలో నోయిడా – ఆగ్రా (యమునా) ఎక్స్‌ప్రెస్ వే వస్తే, ఎస్పీ పాలనలో ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణమైంది. ఇప్పుడు ముచ్చటగా మూడోదైన పూర్వాంచల్ రహదారి బీజేపీ ఏలుబడిలో వచ్చింది. ఈ మూడూ యుద్ధ విమానాలు దిగడానికి వీలైనవే. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు కట్టిన హైస్పీడ్ రోడ్లే అయినప్పటికీ, చుట్టుపక్కల కొత్త పట్నాలు, వసతులు వస్తే వీటి వల్ల యూపీ ఆర్థిక ముఖచిత్రమే మారనుంది. గత రెండు రహదార్లూ వాటిని నిర్మించిన పార్టీలకు రాజకీయంగా ఆట్టే కలసి రాలేదు. కానీ, తాజా రహదారి తమకు కలిసొస్తుందని బీజేపీ భావన. ‘ఎక్కడ గతుకులు, గుంతలు మొదలవుతాయో, అక్కడ నుంచి ఉత్తర ప్రదేశ్ పరిధిలోకి అడుగుపెట్టినట్టు’ అని జనవ్యవహారం! అలాంటి చోట భవిష్యత్తులో 8 లేన్లకు సైతం విస్తరించే వీలుగా, 9 జిల్లాల మీదుగా, ఆరు లేన్ల భారీ రహదారి నిర్మాణం బీజేపీ సర్కారు విజయమే. దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన తూర్పు యూపీ (పూర్వాంచల్)లో పురోభివృద్ధికీ, పెట్టుబడులు – పారిశ్రామికీకరణ – ఉపాధి కల్పనతో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరగడానికీ ఈ భారీ రహదారి తోడ్పడుతుంది. అనుబంధంగా వేసిన లింకు రోడ్లతో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటకమూ పెరుగుతుందని లెక్క. ఇక, ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా సుల్తాన్పూర్ వద్ద 3.5 కి.మీ మేర నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ అత్యవసర వేళ భారత యుద్ధ విమానాల రాకపోకలకు అనువైనది కావడం విశేషం. ఈ మధ్యే కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇప్పుడీ ఎక్స్‌ప్రెస్ వేల ప్రారంభం, గోరఖ్‌పూర్‌లో ‘ఎయిమ్స్’ – ఇలా వికాస మంత్రంతో ఓటర్ల ఆకర్షణ బీజేపీ వ్యూహం. కానీ, ‘మైనారిటీలకు బీజేపీ వ్యతిరేక’మని ఎస్పీ ఆరోపిస్తోంది. ‘ఎస్పీ ఫక్తు జిన్నావాదీ పార్టీ’ అని బీజేపీ వాదిస్తోంది. ఒకవైపున ప్రియాంక సారథ్యంలో కాంగ్రెస్ ‘మహిళలకు 40 శాతం ఎమ్మెల్యే సీట్లు’ సహా అనేక ప్రకటనలతో ప్రచారం చేస్తోంది. మరోవైపున బీఎస్పీ బ్రాహ్మణవర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి సకల ప్రయత్నాలూ చేస్తోంది. పూటకో సభ, రోజుకో ప్రదర్శన, ప్రకటనలతో అన్ని పార్టీలూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. మాటల యుద్ధమూ మొదలైపోయింది. పూర్వాంచల్ రహదారి ప్రారంభోత్సవ వేళ సాక్షాత్తూ ప్రధాని మోదీ మాటలే అందుకు నిదర్శనం. మాఫియాల చేతి నుంచి అభివృద్ధి పథానికి యూపీ ఇప్పుడు చేరుకుందంటూ రహదారి ప్రారంభాన్ని రాజకీయ వేదికగా ఆయన మలుచుకున్నారు. అఖిలేశ్ సైతం తక్కువ తినలేదు. యోగి లాంటి ‘చిల్లమ్ జీవి’ (చిలుము పీల్చి, మత్తులో జోగేవారు) వల్ల యూపీకి మేలు జరగదని వివాదం రేపారు. ఇంకోపక్క, ప్రియాంకనూ, రాహుల్‌నీ పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘ఘర్ పే లడ్కా హై. మగర్ లడ్ నహీ సక్తా’ (ఇంట్లో మగపిల్లాడున్నాడు. కానీ, పోరాడలేడు) అని బీజేపీ నేత స్మృతీ ఇరానీ వ్యంగ్యం పోయారు. సాటి మహిళపై లింగ దుర్విచక్షణతో వ్యాఖ్యలెలా చేస్తారని ప్రియాంక మండిపడుతున్నారు. వెరసి, యూపీలో వాతావరణం వేడెక్కుతోంది. ఇదిలా ఉండగా పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, గంగ– ఇలా అనేక భారీ రహదార్లతో యూపీ ఇప్పుడు ‘ఎక్స్‌ప్రెస్ వే రాష్ట్రం’ అని కొందరి మాట. మెజారిటీని సంఘటితం చేసే వ్యూహాలకు ఈ వికాస మంత్రమూ కలిసొస్తుందని యోగి నమ్మకం. మళ్ళీ అధికార పీఠం చేరడానికి ఈ రాజకీయ రహదారులు రాచబాటలవుతాయా? -
భారత్‌లో అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సుల్తాన్పూర్ జిల్లా కర్వాల్ ఖేరీ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. యూపీ ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఈ ప్రతిష్టాత్మిక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా పాల్గొన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం ఆరు లేన్లు ఉండగా.. వైమానిక విన్యాసాలకు, యుద్ధవిమానాలు దిగడానికి, టేకాఫ్ కావడానికి వీలుగా రోడ్లను నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల యూపీలోని లక్నో నుంచి బిహార్‌లోని బక్సర్ మధ్య ప్రయాణ సమయం 3 గంటలు తగ్గుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే లక్నోలోని చాంద్ సరాయ్లో ప్రాంతంలో మొదలై ఘాజీపూర్ జిల్లాలోని హైదరియా గ్రామంలో ముగుస్తుంది. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే గా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే నిలిచింది. దీని పొడవు 341 కిలోమీటర్లు. అంతేకాదు ఇది అజంగఢ్, బారాబంకి, అమేథి, సుల్తాన్పూర్, అయోధ్య, అంబేద్కర్‌నగర్, ఘాజీపూర్, మౌ గుండా తదితరప్రాంతాలను కలుపుతూ వెళ్తుంది. చదవండి: Hyderabad: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన 13 ఏళ్ల బాలిక -
యూపీ అభివృద్ధికి ఎక్స్‌ప్రెస్ వే అతిపెద్ద నిదర్శనం: మోదీ
-
ఆర్ఆర్ఆర్.. అంతా కొత్త రోడ్డే
రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించే ప్రతిపాదిత అలైన్‌మెంట్‌కు కాస్త అటూ ఇటుగా నగరం చుట్టూ ఇప్పటికే ఒకదానికి ఒకటి అనుసంధానమవుతూ చిన్న రోడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిని విస్తరిస్తూ పోతే కూడా కొత్త రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. కానీ ఇవన్నీ పట్టణాలు, ఊళ్ల మీదుగా సాగుతున్న రోడ్లు. ఓ క్రమపద్ధతి అంటూ లేకుండా వంకరటింకరగా ఉన్నాయి. దీంతో ఆ పాత రోడ్లను అసలు వినియోగించుకోకుండా పూర్తి కొత్త రోడ్డుగా రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు. సాక్షి, హైదరాబాద్: నగరం చుట్టూ రానున్న రీజనల్ రింగ్ రోడ్డు (338 కిలోమీటర్లు) పూర్తి కొత్త రోడ్డుగా అవతరించనుంది. నగరానికి 50 కి.మీ.నుంచి 70 కి.మీ. దూరంలో... దాదాపు 20 ప్రధాన పట్టణా లను అనుసంధానిస్తూ వలయాకారంలో నిర్మాణం కానున్న ఈ భారీ ఎక్స్‌ప్రెస్‌వే కోసం ఎక్కడా పాత రోడ్లను వినియోగించుకోరు. భూసేకరణ జరిపి పూర్తి కొత్త (గ్రీన్‌ఫీల్డ్ అలైన్మెంట్) రాచబాటగా నిర్మించబోతున్నారు. నగరం చుట్టూ నిర్మితమైన ఔటర్ రింగురోడ్డుకు (162 కిలోమీటర్లు) ఆవల 30 కి.మీ. దూరంలో ఈ కొత్త రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఇందుకు అవసరమైన భూమి మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సిందే. ప్రస్తుతానికి ఉన్న తాత్కాలిక అంచనా ప్రకారం దాదాపు 11 వేల ఎకరాల భూమి అవసరం కానుంది. దీనికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చవుతాయని భావిస్తున్నారు. ఇందులో 50 శాతం మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం భరించనుండగా, మిగతా మొత్తం కేంద్రం ఇస్తుంది. ప్రస్తుతానికి 4 వరుసల ఎక్స్‌ప్రెస్ వే హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు తర్వాత నిర్మితమవుతున్న రెండో ఎక్స్‌ప్రెస్ వే ఇది. మొదటి దశలో దీన్ని నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనున్నారు. ఇందుకోసం వంద మీటర్ల కారిడార్ ఉండేటట్లుగా భూసేకరణ జరపనున్నారు. ఆర్ఆర్ఆర్ వెంబడి వాణిజ్యపరమైన నిర్మాణాలకు స్థలం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఇంకా అధికంగా భూసేకరణను సూచిం చింది. ప్రస్తుతం నగరం చుట్టూ భూముల ధరలు విపరీతంగా పెరిగినందున భూసేకరణ భారం మోయటం కష్టమవటంతో పాటు, చాలా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున.. 100 మీటర్లకే పరిమితం కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది. ఇందులో 11.5 మీటర్ల (వెడల్పు) చొప్పున ఇరువైపులా డబుల్ లేన్లు ఉంటాయి. అలా మొత్తం నాలుగు లేన్ల ప్రధాన క్యారేజ్ వే ఏర్పడుతుంది. దానికి రెండు వైపులా 7 మీటర్ల చొప్పున సర్వీసు రోడ్లు ఉంటాయి. ప్రస్తుతానికి నాలుగు వరుసల రోడ్డునే నిర్మిస్తారు. భవిష్యత్తులో దాన్ని ఎనిమిది లేన్లకు విస్తరిస్తారు. ఆటోలు, ద్విచక్రవాహనాలకు ‘నో ఎంట్రీ’ ఇది ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మితమవుతున్నందున ఈ రోడ్డుపై ఆటోలు, ద్విచక్రవాహనాలకు అనుమతి ఉండదు. వాహనాలు గరిష్ట పరిమితి వేగంతో దూసుకుపోయేలా నిర్మిస్తున్నందున ఆటోలు, ద్విచక్రవాహనాలు అనుమతిస్తే ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అందుకని వాటికి అనుమతి ఉండదు. ఆ వాహనాలు ప్రస్తుతం ఉన్న రోడ్లను మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఏ ఊరు.. ఏ సర్వే నెంబర్.. ఆరునెలల తర్వాతే స్పష్టత దాదాపు మూడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. భారీ ప్రాజెక్టు కావటంతో దీన్ని జాతీయ రహదారిగా గుర్తించాలన్న రాష్ట్రప్రభుత్వ విన్నపానికి అప్పట్లో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ మౌఖిక సానుకూలత వ్యక్తం చేశారు. తొలుత ప్రాజెక్టు మొదటి దశ అయిన సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 152 కి.మీ. మార్గానికి జాతీయ రహదారి హోదా ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. రెండోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఇలాంటి కొన్ని రోడ్లపై సమీక్షి నిర్వహించి, దాదాపు రూ.13 వేల కోట్ల భారీ వ్యయమయ్యే ఆర్ఆర్ఆర్ వల్ల ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా ఉండవన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. అప్పటికి ఈ రోడ్డు అలైన్మెంటుపై ఎలాంటి స్పష్టత లేదు. కేవలం గూగుల్ మ్యాపు ఆధారంగా ఓ ప్రతిపాదన రూపొందించారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి, గతంలో కేంద్రం సూచించిన మార్పులకు రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో... ఈ ప్రతిపాదనను తిరిగి కేంద్రం పరిశీలిస్తోంది. దాదాపు అనుమతులు మంజూరు చేసే దిశగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టత వచ్చింది. త్వరలో లిఖితపూర్వకంగా ఆమోదముద్ర పడనుంది. అలా అనుమతులు వచ్చాక జాతీయ రహదారుల విభాగం అధికారులు అసలైన అలైన్‌మెంట్‌ను రూపొందించనున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లి రోడ్డు ఏయే ప్రాంతాల మీదుగా నిర్మించాలో నిర్ధారించనున్నారు. ఇందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అసలు అలైన్‌మెంట్‌పై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఫీల్డ్ సర్వే చేసిన తర్వాతనే ఊళ్లు, సేకరించాల్సిన భూమి సర్వే నెంబర్ల వివరాలు తెలుస్తాయి. దాదాపు 25 చిన్నాపెద్దా పట్టణాలు, 300 వరకు గ్రామాలను ఇది అనుసంధానిస్తుందని అంచనా. 8 జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం ఈ బృహత్ ఎక్స్‌ప్రెస్‌వే 8 జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానిస్తుంది. ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్– 161, ఎన్‌హెచ్– 44, ఎన్‌హెచ్–765, ఎన్‌హెచ్–765డి, ఎన్‌హెచ్–163, రాజీవ్ రహదారి, నాగార్జున సాగర్ రోడ్డులను అనుసంధానిస్తుంది. ఒక రోడ్డు నుంచి మరో రోడ్డులోకి మారేందుకు నగరంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే రీజినల్ రింగురోడ్డు మీదుగా మళ్లొచ్చు. దీనివల్ల నగరంపై ట్రాఫిక్ భారం తగ్గుతుంది. కనీసం ఆరేళ్లు పట్టే అవకాశం! ఇది పూర్తిగా కొత్త రోడ్డు అయినందున ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు కనీసం ఆరేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అలైన్‌మెంట్‌కు ఆరు నెలల నుంచి ఏడాది సమయం, భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేందుకే కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కల్వర్టులు, వంతెనలతో కూడిన రోడ్డు నిర్మాణం దాదాపు మూడేళ్లకు పైగా పడుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇందులో భూసేకరణ అతిక్లిష్టమైన అంశం. అందులో ఎంత జాప్యం జరిగితే ప్రాజెక్టు అంత నెమ్మదిగా కదులుతుంది. -
ఆ రోడ్డు ఖర్చు భరించలేం : ఢిల్లీ ప్రభుత్వం
సాక్షి, ఢిల్లీ : నగరానికి తూర్పు, పశ్చిమ దిశలలో నిర్మిస్తున్న ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్ రహదారికి అయ్యే భూసేకరణ ఖర్చును భరించలేమని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఖర్చును ప్రాజెక్టు వల్ల లబ్ది పొందే ఆయా రాష్ట్రాలే భరించాలని వాదించింది. వివరాలు.. ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా సిగ్నల్ ఫ్రీ రోడ్లను అభివృద్ధి చేయాలని 2005లో నిర్ణయించారు. ఈ రోడ్డు నగరానికి తూర్పు దిక్కున ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ పిరిధిలోకి వచ్చే ఘజియాబాద్, పరీదాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (గ్రేటర్ నోయిడా), పాల్వాల్ల గుండా వెళ్తుంది. పశ్చిమ దిక్కున కుండ్లి, మానేసర్ల గుండా వెళ్తూ పాల్వాల్‌ను కలుపుతుంది. తూర్పు దిక్కున రహదారి ఉత్తరప్రదేశ్‌లో ఉండగా, పశ్చిమ దిక్కున రహదారి హర్యానాలో ఉంది. 2005లో ఈ ప్రాజెక్టు భూసేకరణ వ్యయాన్ని 844కోట్లుగా అంచనా వేశారు. ఇందులో ఢిల్లీ ప్రభుత్వం 50 శాతం, ఉత్తర ప్రదేశ్, హర్యానాలు చెరో పాతిక శాతం భరించాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే అనూహ్య జాప్యం కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవగా, ఇప్పుడు అంచనా వ్యయం 8462 కోట్లకు చేరింది. 2005 నుంచి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 700 కోట్లు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్, హర్యానాలు తమ వాటా సొమ్మును కొంచెం ఆలస్యంగా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో పెరిగిన వ్యయం కారణంగా మిగిలిన రూ. 3500 కోట్లను ఢిల్లీ ప్రభుత్వం భరించాల్సిందేనని కేంద్రం గత నెలలో అపెక్స్ కోర్టుకు విన్నవించింది. కేంద్రంతో ఏకీభవించిన అపెక్స్ కోర్టు తక్షణం రూ. వెయ్యికోట్లను వాటా ప్రకారం చెల్లించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆప్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ విషయంపై శుక్రవారం ఢిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తూ.. వ్యయాన్ని భరించే స్థోమత ప్రభుత్వానికి లేదని, అంతేకాక ఆలస్యానికి కారణమైన హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలే ఈ వ్యయాన్ని భరించాలని తెలిపారు. రహదారి వెంబడి ఆయా రాష్ట్రాలు టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపడుతున్నాయి కనుక లబ్దిపొందుతుంది వారేనంటూ ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి లబ్ది కలగడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు తమ ప్రభుత్వం వద్ద నిధులు లేవని, ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న దృష్ట్యా ప్రజల మీద వేసిన పర్యావరణ పన్ను ద్వారా వచ్చిన డబ్బు రూ. 900 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఈ నిధులను ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఎక్స్‌ప్రెస్ రహదారి ప్రాజెక్టు నుంచి మినహాయింపును కోరుతూ నెలరోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. -
మెగా కమిషనరేట్
సాక్షి, అమరావతి బ్యూరో (కృష్ణా) : విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిని విస్తరిస్తూ మెగా కమిషనరేట్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిధిలోకి సీఆర్డీఏలోని ప్రాంతాలను తీసుకొస్తూ నూతన కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో జరుగుతున్న సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాంతిభద్రతలపై జరిగిన సమీక్షలో ఈ మేరకు డీజీపీతో చర్చించి అధ్యయనం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే విజయవాడలోని ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి, దోపిడీని ఉపేక్షించవద్దని నగర సీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు. ‘విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి, దోపిడీని ఉపేక్షించ వద్దు.. కాల్‌మనీ లాంటి ఘటనలు నగరంలో మళ్లీ పునరావృతం కావడానికి వీల్లేదు.. ఫిర్యాదు వస్తే సత్వరమే చర్యలు తీసుకోండి.. చట్టవిరుద్ధ కార్యకలాపాలు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపండి’ అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల అంశంపై మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమలరావుతో ముఖాముఖీ నిర్వహించిన సీఎం నగర పరిస్థితులపై మాట్లాడారు. మెగా కమిషనరేట్ ఏర్పాటుకు ప్రతిపాదన.. రాజధాని నగరానికి తగినట్లుగా పోలీసు వ్యవస్థను పటిష్ట పరచడానికి ప్రస్తుత విజయవాడ కమిషరేట్ పరిధిలోకి సీఆర్డీఏ ప్రాంతాన్ని తీసుకువస్తూ ‘మెగా కమిషనరేట్(అమరావతి కమిషరేట్)ను ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని సీపీ ద్వారకా తిరుమలరావు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కృష్ణా ఎస్పీ పరిధిలో ఉన్న ఇబ్రహీంపట్నం నుంచి జగ్గయ్యపేట వరకు కూడా ఈ కమిషరేట్ పరిధిలోకి వస్తుందని, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు రూరల్, గుంటూరు అర్బన్ పోలీసుల పరిధిలోని కొన్ని ప్రాంతాలను విజయవాడ కమిషనరేట్ పరిధిలోకి తేవాల్సి ఉందని తెలిపారు. అలాగే కమిషరేట్‌ను ఆరు సబ్డివిజన్లుగా విభజించి.. ఒక్కో డివిజన్‌కు ఒక్కో ఐపీఎస్ అధికారిని డీసీపీగా నియమించాల్సి ఉంటుందని, అదనంగా మరో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐ పోస్టులతోపాటు కానిస్టేబుళ్లను వివిధ విభాగాలకు కేటాయించాలని ప్రతిపాదించారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ డీజీపీతోపాటు నిపుణుల కమిటీతో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని సీపీకి తెలిపారు. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే.. విజయవాడ నగరం నుంచి చెన్నై–కోల్‌కతా, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారులు వెళ్తున్నాయని.. తద్వార ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కారం కావాలంటే నగరంలో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం ఒక ప్రత్యామ్నాయమని నగర సీపీ ద్వారకా తిరుమలరావు సీఎం వైఎస్ జగన్‌కు ప్రతిపాదించారు. కనకదుర్గ వారథి నుంచి గన్నవరం వరకు నేరుగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల బెంజిసర్కిల్, నిర్మలా జంక్షన్, రమేష్ ఆస్పత్రి సర్కిల్, మహానాడు, రామవరప్పాడు, ఎనికేపాడు, గూడవల్లి, గన్నవరం వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణలోకి వస్తుందన్నారు. మరో ప్రత్యామ్నాయం.. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప వరకు బైపాస్ మార్గాన్ని నిర్మించి దీనిని తాడిగడప కూడలిలోని వంద అడుగుల రోడ్డులో అనుసంధానం చేస్తే నగరంలోని బెంజిసర్కిల్‌పై ఒత్తిడి తగ్గుతుందని సీపీ వివరించారు. విజయవాడ–బందరు హైవేపై మరొకటి.. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై మరో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే మార్గాన్ని నిర్మించాలని, దీనివల్ల ఎన్టీఆర్ సర్కిల్, పటమట, ఆటోనగర్ గేట్, కామయ్యతోపు, కానూరు, తాడిగడప, పోరంకి కూడళ్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను గొల్లపూడి వై జంక్షన్ వరకు పొడిగిస్తే ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తొలిగిపోతాయని తెలిపారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్.. నగరంలో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల వాహనాల రద్దీని అంచనా వేస్తూ ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్స్ పనిచేస్తాయన్నారు. పాదచారుల కోసం.. బెంజిసర్కిల్, రమేష్ హాస్పిటల్ సర్కిళ్లో వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో పాదచారులు రోడ్డు దాటేందుకు ఇక్కట్లు పడుతున్నారని వారి కోసం ఈ రెండు సర్కిళ్లలో సబ్ వేలు ఏర్పాటు చేస్తే రోడ్డు మార్గం దాటేందుకు సులువుగా ఉంటుందని సీపీ వివరించారు. వీటిపైన సీఎం జగన్ స్పందిస్తూ సమగ్ర నివేదికతో రావాలని సూచించారు. అవినీతి, దోపిడీని ఉపేక్షించొద్దు.. విజయవాడ నగరంలో అవినీతి, దోపిడీని ఉపేక్షించొద్దని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నగర పోలీసు కమిషనర్‌కు ఆదేశించారు. నగరంలో ప్రకంపనలు సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అలాంటి ఘటన మళ్లీ పునరావృతం కారాదని హెచ్చరించారు. ఫిర్యాదు వస్తే సత్వరమే చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. కాల్‌మనీ బాధితులకు న్యాయం జరిగిందా అని ఆరా తీశారు. నగరంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
న్యూఢిల్లీ : ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై మణిపురి సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న సంఘటనలో ఏడుగురు మృతి చెందగా, 34 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘దేశంలో ఏ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఏ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లేదని పర్యావరణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేష్ శర్మ సోమవారం రాజ్య సభలో స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) అనే అంతర్జాతీయ సంస్థ ఈ సర్టిఫికేషన్‌ను ప్రదానం చేస్తుందని మంత్రి చెప్పారు. 33 అంశాల ప్రాతిపదికన ఆ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడే బీచ్‌కు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ లభిస్తుంది. అందులో నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, రక్షణ, భద్రతా చర్యలు, పర్యావరణంపై చైతన్యం వంటివి ప్రధాన ప్రాతిపదకలుగా ఉంటాయని తెలిపారు. సమగ్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ కింద దేశంలోని బీచ్‌లను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసే ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం 13 కోస్తా తీర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల సమ్మతి, సంప్రదింపులతో రాష్ట్రానికి ఒక బీచ్‌ను పైలట్ ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేయడం జరుగుతుందని వివరించారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే పనులకు అనుమతులు రావాలి ‘అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పనులకు పర్యావరణ, అటవీ, వన్యప్రాణులు ఇతర అనుమతులు రావలసి ఉంది. అవసరమైన అనుమతులన్నింటినీ పొందిన తర్వాత ఎక్స్‌ప్రెస్‌వే పనులు ప్రారంభమవుతాయి’ అని రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయాన్ని తెలిపారు.చట్టబద్దమైన అనుమతులన్నింటినీ సంపాదించుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన చెప్పారు. రావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధికి సంబంధించి గత ఏడాది ఆగస్టు 13, అక్టోబర్ 23 తేదీలలో తమ మంత్రిత్వ శాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాధికారులతో రెండు దఫాలుగా చర్చలు జరిపినట్లు మంత్రి చెప్పారు. ‘ఎక్స్‌ప్రెస్‌వే మొదట 100 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల రహదారిగా 384 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ దృష్ట్యా దీనిని 8 లేన్ల రహదారిగా విస్తరించే సౌలభ్యం కూడా కల్పించడం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఖర్చులో 50 శాతం భరించడానికి, ఇందులో ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది’ అని మంత్రి చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో చేపడతున్న ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డీపీఆర్ సిద్ధం అయ్యేనాటికి రాష్ట్ర ప్రభఉత్వం 50 శాతం భూమిని సేకరించి ఉంటే ప్రాజెక్ట్‌ను సత్వరమే చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించే నాటికి కనీసం 90 శాతం భూసేకరణ జరిగి ఉండాలని కూడా తెలిపారు. -
రోడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టిన డ్రాగన్
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతి పెద్ద మిలిటరీ శక్తిని కలిగి ఉన్న చైనా ఇప్పుడు రోడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)గా పిలిచే చైనా మిలిటరీని ఒక చోట నుచి మరోక చోటికి త్వరితగతిన తరలించేందుకు ఆ దేశం 2020 నాటికల్లా 13 లక్షల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్ష కిలోమీటర్ల మేర రైల్వే మార్గంతో పాటుగా గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణం చేయగల 10 వేల కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్వే ట్రాక్‌ను చైనా కలిగి ఉన్నట్లు ‘చైనా మిలిటరీ పవర్’నివేదికలో పేర్కొన్నట్లు పెంటగాన్ యూఎస్ కాంగ్రెస్‌కు వెల్లడించింది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నిధుల కేటాయింపులే లక్ష్యంగా బీజింగ్ పనిచేస్తోందని తెలిపింది. రవాణా మార్గాల అభివృద్ధి ద్వారా భవిష్యత్తులో పీఎల్ఏ భారీ ఎత్తున తన బలగాలను వేగంగా తరలించేలా చైనా ప్రణాళికలు రూపొందించింది. దీంతోపాటుగా స్వదేశీ యుద్ధవిమానాలను అభివృద్ధి చేయడంతో పాటుగా దక్షిణ చైనా సముద్ర భాగంలోని ద్వీపాల్లో మిలిటరీ అవుట్‌పోస్టుల నిర్మాణం కూడా చేస్తోంది. చైనాలో ఉన్న విమానాశ్రయాల్లో 1/3 వంతు ఎయిర్‌పోర్టులు అటు మిలిటరీకీ, ఇటు పౌరులకు ఉపయుక్తమైనవిగా ఆ దేశం నిర్మించింది. ఇక అంతరిక్షంలో ఆధిపత్యం కోసం పీఎల్ఏ కసరత్తులు చేస్తోందని పెంటగాన్ కార్యాలయం యూఎస్ కాంగ్రెస్‌కు నివేదించింది. -
పోలీసుల కస్టడీలో యోగేంద్ర యాదవ్
తిరువణ్ణామలై: సేలం–చెన్నై 8 వరుసల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్‌ను తమిళనాడు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తిరువణ్ణామలై జిల్లాలోని చెంగమ్ వద్దకు చేరుకున్న తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనీ, దాడికి పాల్పడ్డారని యోగేంద్ర ట్విట్టర్లో తెలిపారు. ‘ఆందోళనకారుల ఆహ్వానం మేరకు సంఘీభావం తెలిపేందుకు మేమిక్కడికి చేరుకున్నాం. కానీ రైతులను కలుసుకునేందుకు వెళ్లకుండా మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. మాపై దాడిచేస్తూ వ్యాన్లలోకి తోశారు’ అని ట్వీట్ చేశారు. -
మూసీపై ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానికి జీవనాడిగా భాసిల్లుతున్న చారిత్రక మూసీ నదిపై ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు వీలుగా సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. నగరంలో మూసీ ప్రవహిస్తున్న బాపూఘాట్–నల్లచెరువు(ఉప్పల్) మార్గంలో 40 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని, నదికి ఇరువైపులా తీరైన రహదారులను అభివృద్ధి చేయాలని సూచించారు. గురువారం సైఫాబాద్‌లోని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో నది సుందరీకరణ, నగరంలో ఇతర చెరువుల పరిరక్షణపై ఆయా విభాగాల అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. డ్రోన్ కెమెరాలతో సర్వే.. మూసీ నది మొత్తాన్ని డ్రోన్ కెమెరాలు, ఇతర అత్యాధునిక టెక్నాలజీతో సర్వే చేయాలని, ఇందుకయ్యే ఖర్చు, సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. మూసీ నది వెంట ప్రస్తుతం ఉన్న రోడ్లకు అనుబంధంగా రూపకల్పన చేస్తున్న బ్రిడ్జీల డిజైన్లు, నిర్మాణం నగర చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపలున్న చెరువులను దీర్ఘకాల ప్రణాళికలు సిద్ధం చేసి దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ఈ వర్షాకాలం నాటికి 50 చెరువుల అభివృద్ధికి లక్ష్యం నిర్దేశించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 20 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. దుర్గంచెరువు సుందరీకరణ శరవేగంగా సాగుతోందన్నారు. చెరువులు కబ్జా కాకుండా చూసేందుకు కలెక్టర్లతో మాట్లాడాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. మూసీ దుస్థితి ఇదీ.. వికారాబాద్ జిల్లా అనంతగిరి మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రవహించి బాపూఘాట్ వద్ద హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడి నుంచి నగర శివార్లలోని ప్రతాపసింగారం వరకు సుమారు 44 కిలోమీటర్ల మార్గంలో ప్రవహిస్తోంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి 1,400 మిలియన్ లీటర్ల మురుగునీరు నిత్యం నదిలోకి ప్రవేశిస్తోంది. దీంతో నదిలో రసాయన కాలుష్యం పెరుగుతోంది. కాగా మూసీలోకి చేరుతున్న వ్యర్థజలాలను నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్, అంబర్‌పేట్‌లోని జలమండలి మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో 700 మిలియన్ లీటర్లను శుద్ధిచేసి మళ్లీ నదిలోకి వదిలిపెడుతోంది. ఇందుకు ఏటా రూ.10 కోట్లు వెచ్చిస్తోంది. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు పది చోట్ల నూతనంగా మురుగునీటిశుద్ధి కేంద్రాలు, రెండుచోట్ల రీసైక్లింగ్ యూనిట్లు నిర్మించాలని జలమండలి రూ.1,200 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రక్షాళన పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో జాతీయ స్థాయిలో కాలుష్యకారక నదుల్లో మూసీ నాలుగో స్థానంలో నిలవడం నది దుస్థితికి అద్దం పడుతోంది. మూసీ ప్రక్షాళన కాగితాలకే పరిమితం.. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ఏళ్లుగా కాగితాలకే పరిమితమవడంతో ఘన, ద్రవ, రసాయన వ్యర్థాల చేరికతో నది కాలుష్య కాసారమవుతోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రక్షాళనకు బాలారిష్టాలు తప్పడంలేదు. గుజరాత్‌లోని సబర్మతి నది తరహాలో మూసీని ప్రక్షాళన చేయాలన్న రాష్ట్ర సర్కారు సంకల్పం బాగానే ఉన్నా.. ఆచరణలో అడుగు ముందుకు పడటంలేదు. మూసీ తీరప్రాంత అభివృద్ధికి రూ.3 వేల కోట్ల అంచనా వ్యయం, సుందరీకరణకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రక్షాళన పనులు చేపట్టాల్సి ఉన్నా ఆచరణ మాత్రం శూన్యం. ఏడాది క్రితం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి చైర్మన్, సభ్యకార్యదర్శిని నియమించినా ఫలితం కనిపించడంలేదు. -
కారులో ఆరుగురు.. బూడిదే మిగిలింది
ఆగ్రా : ఉత్తర ప్రదేశ్‌లో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై కన్నౌజ్ ప్రాంతం వద్ద ఓ కారు ప్రమాదానికి గురికాగా అందులోని ఆరుగురు సజీవ దహనం అయ్యారు. వీరిలో ఇద్దరు మైనర్లు(2,3 ఏళ్లు) కూడా ఉండటం శోచనీయం. అర్థరాత్రి 2గం 15 ని. ప్రాంతంలో హుషేపూర్ గ్రామం వద్దకు చేరుకుంది. డివైడర్‌ను బలంగా ఢీకొట్టిన కారు పల్టీలు కొడుతూ చాలా దూరం వెళ్లింది. అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులోని వారు దహనం అయ్యారు. వారంతా బిహార్ ఛ్చాత్ వేడుకల్లో పాల్గొని తిరిగి మిథాపూర్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో వినయ్ కుమార్, అభయ్ కుమార్‌లను మాత్రమే గుర్తించగలిగారు. మిగతా వారి దేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తేల్చారు. ఇక ఘటనా స్థలానికి మొదటగా చేరుకున్న కానిస్టేబుల్ ముకుత్ అక్కడి భయానక దృశ్యాల గురించి వివరించారు. ‘‘నేను వెళ్లే సరికి ఓ చిన్నారి మృతదేహం కారు టైర్ కింద కాలుతూ కనిపించింది. కారు లోపల కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు బూడిదగా మారిపోయి ఉన్నారు‘‘ అని ఆయన తెలిపారు. వినయ్ కుమార్, అభయ్ కుమార్‌లు సాకీత్ ప్రాంతంలో నగల షాపును నిర్వహిస్తున్నారని తేలింది. గోపాల్‌గంజ్‌లోని తమ స్నేహితుల వద్దకు వెళ్లి ఛ్చాత్ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగినట్లు వారి తాత విక్రమా సింగ్ తెలిపారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉంది. ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు సజీవ దహనం -
'బాబు రైతులను నట్టేట ముంచారు'
హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న రాజధాని ప్రాంతంలో ఎక్స్ ప్రెస్ హైవేల రూట్ మార్చేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేయడం దారుణమని మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే(ఆర్ రామకృష్ణ) అన్నారు. నాడు మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబునాయుడు ఇప్పుడు రైతులను నమ్మించి నట్టేట ముంచారని ఆరోపించారు. చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా పునరాలోచించాలని హితవు పలికారు. -
‘ఎక్స్‌ప్రెస్ వే’పై కారు బీభత్సం
అత్తాపూర్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఎగిరి అవతలి రోడ్డుపై పడి మరో కారును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ వి.ఉమేందర్ కథనం ప్రకారం... బహదూర్‌పురాకు చెందిన సోహెల్(19) కారు డ్రైవర్. సోమవారం సాయంత్రం 6 గంటలకు తన ఇండికా కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ప్రయాణికులను ఎక్కించుకొని మెహిదీపట్నం వైపు వెళ్తున్నాడు. మార్గం మధ్యలో పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వే పై పిల్లర్ నెంబర్ 239 వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న ఇతని కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరి అవతల రోడ్డుపై వెళ్తున్న పోలో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లలో ఉన్న ఐదుగురికి తీవ్రగాయలయ్యాయి. ఈ ప్రమాదంతో ఎక్స్‌ప్రెస్‌వే పై ట్రాఫిక్ జామ్ అయింది. రాజేంద్రనగర్ పోలీసులు క్షతగాత్రులను ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నాలుగు మార్గాల్లో ఎక్స్‌ప్రెస్-వే
ఈ రూట్లలో... అల్వాల్ - బేగంపేట- మాదాపూర్ ఎల్బీనగర్ - ఆరాంఘర్ - గచ్చిబౌలి కొంపల్లి - బోయిన్పల్లి - ప్యారడైజ్ మాదాపూర్ - గచ్చిబౌలి - బీహెచ్ఈఎల్ - పటాన్చెరు సిటీబ్యూరో: విశ్వ ఖ్యాతి... చూడచక్కని ఆకాశహర్మ్యాలు.. మురికివాడలు లేకుండా వంటి చర్యలతో హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనుకుంటున్న సీఎం కేసీఆర్ ఆలోచనలకనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా ట్రాఫిక్ సమస్యపైనా దృష్టి సారించారు. తొలిదశలో నాలుగు కారిడార్లను ఎక్స్‌ప్రెస్ వేలుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఎక్కడా రెడ్ సిగ్నల్ పడకుండా వీటిని తీర్చిదిద్దనున్నారు. ఇందుకుగాను అవసరమైన మేర ఫ్లైఓవర్లు.. స్పైరల్ మార్గాలను నిర్మించనున్నారు. వరదనీటి పారుదల, డక్టింగ్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. ఇలాంటి సదుపాయాలతో రహదారులను తీర్చిదిద్దేందుకు దిగువ మార్గాలపై దృష్టి సారించారు. ఎంపిక చేసిన ఈ నాలుగు మార్గాల్లో అడ్డంకులు, సిగ్నలింగ్ ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు రూపొందించాలని కన్సల్టెంట్లను ఆహ్వానించనున్నారు. అందుకనుగుణంగా అవసరమైన చర్యల కోసం ప్రభుత్వంతో సమావేశం జరుపనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషన ర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఎక్స్‌ప్రెస్ కారిడార్లపై ఇంజినీరింగ్ అధికారులు, ట్రాఫిక్ విభాగం సీనియర్ అధికారులతో సోమేశ్‌కుమార్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పైమార్గాలను ఎక్స్‌ప్రెస్‌వేలుగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. వీటి ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనున్నారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నందునే పై నాలుగు మార్గాలను ఎంపిక చేశామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫి క్ ఇబ్బందులు లేకుండా చేయాలని భావిస్తున్నామన్నారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని కన్సల్టెంట్లను కోరనున్నామని, వారి నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
నెక్లెస్ రోడ్డుకు కొత్త హంగులు
రూ.3.3కోట్లతో పునర్నిర్మాణం రంగంలోకి దిగిన హెచ్ఎండీఏ అధికారులు సాక్షి, సిటీబ్యూరో:హుస్సేన్‌సాగర్ తీరంలోని నెక్లెస్ రోడ్డును ‘ఎక్స్‌ప్రెస్ వే’ తరహాలో తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ నడుం బిగించింది. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ నెక్లెస్ రోడ్డుకు కొత్త హంగులు అద్దుతున్నారు. 133 కేవీ, 33 కేవీ విద్యుత్ కేబుల్‌ను నెక్లెస్ రోడ్లో భూగర్భనుంచి వేయాల్సి రావడంతో ఆ మార్గంలో తవ్వకాలు జరి పారు. దీంతో గతంలో వేసిన రోడ్డు ఛిద్రమైంది. అంతేగాక ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డంతా దెబ్బతినడంతో వాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్డు తవ్వకం వల్ల జరిగే నష్టాన్ని భరిం చేందుకు ట్రాన్స్‌కో, సీపీడీసీఎల్ ముందుకు వచ్చింది. రోడ్డు కటింగ్ చార్జెస్ కింద రూ.3.3 కోట్లు చెల్లించాయి. ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటూ నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ రోటరీ నుంచి సంజీవయ్య పార్కు వరకు సుమారు 4.2 కిలోమీటర్ల మేర రోడ్‌ను పునర్నిర్మించేందుకు హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ అధికారులు శుక్రవారం రాత్రి పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు 700 మీటర్ల మేర రోడ్డును నిర్మించామని, వాతావరణం అనుకూలిస్తే ఈనెల 25 నాటికి బీటీ రోడ్డు నిర్మాణం పూర్తిచేస్తామని ఎస్ఈ బీఎల్ఎన్ రెడ్డి తెలిపారు. నెక్లెస్ రోడ్డులోని ఇరు మార్గాల్లో ఓ వైపు బీటీ వేస్తున్నామని, మరోవైపు మరమ్మతు పనులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మరమ్మతు పనులు కూడా మూడు దశల్లో చేపడుతున్నట్టు చెప్పారు. మొదట ఒక అడుగున్నర మేర పైపొరను తొలగించి చిప్స్ వేసి ఆ తర్వాత 20ఎంఎం మెటల్ అనంతరం డీబీసీ చేశాక బీటీ వేస్తూ రోడ్డును పటిష్టంగా నిర్మిస్తున్నామన్నారు. ప్రధానంగా విదేశీ పర్యాటకులు, సందర్శకులను విశేషంగా ఆకర్శిస్తున్న సాగర్‌ను వారికి మరింత చేరువ చేసేందుకు నెక్లెస్ రోడ్డును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించామని, అందులో భాగంగానే రోడ్డు నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. కూకట్పల్లి నాలా శుద్ధి హుస్సేన్‌సాగర్ నీటిని శుద్ధి చేయడంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కూకట్పల్లి నాలా ముఖద్వారం వద్ద (హుస్సేన్ సాగర్‌లో కలిసే చోట) పెద్దమొత్తంలో పూడికను తొలగించే పనులు ప్రారంభించారు. ప్రధానంగా బాలానగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి భారీ విషరసాయన వ్యర్థాలను మోసుకు వస్తోన్న కూకట్పల్లి నాలా వాటిని నేరుగా సాగర్‌లో కలిపేస్తోంది. దీంతో నాలా ముఖద్వారం వద్ద సుమారు 500 చదరపు మీటర్ల మేర వ్యర్థాలు పేరుకుపోయాయి. ప్రత్యేక యంత్రాన్ని వినియోగించి ఆ వ్యర్థాలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
‘ఎక్స్‌ప్రెస్ వే’కు గ్రీన్ సిగ్నల్!
మహానగరంలో చేపట్టిన భారీ రోడ్డు ప్రాజెక్ట్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు మోక్షం లభించింది. ఆ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మద్రాసు హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. జాతీయ రహదారుల శాఖకు అండగా నిలబడే విధంగా తీర్పు వెలువడడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైనట్టు అయింది. సాక్షి, చెన్నై: ఉత్తర చెన్నైలోని రోడ్ల మీద వాహనాల్లో వెళ్లాలంటే పద్మవ్యూహాన్ని ఛేదించాల్సిందే. అక్కడి రోడ్లు ఆ మేరకు ఇరుకుగా ఉంటాయి. జాతీయ రహదారి నుంచి తిరువొత్తియూర్ -తండయార్ పేట -రాయపురం మీదుగానే హార్బర్‌కు కంటైనర్ లారీలు వెళ్లాల్సి ఉంది. దీంతో ఈ మార్గంలో ఎప్పుడూ ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పాటుగా రోజుకో ప్రమాదం చోటుచేసుకుంటోంది. ఎక్స్‌ప్రెస్ వే: ఉత్తర చెన్నై పరిధిలోని ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర నౌకాయూన శాఖ చెన్నై హార్బర్ నుంచి భారీ కంటైనర్ల కోసం ప్రత్యేకంగా ఓ మార్గం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జాతీయ రహదారుల శాఖ నేతృత్వంలో రూ.1,816 కోట్ల వ్యయంతో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి నిర్ణయించారు. చెన్నై హార్బర్ నుంచి కూవం నదీ తీరం వెంబడి కోయంబేడు మీదుగా మదుర వాయిల్ వరకు 19 కిలోమీటర్లు ఈ మార్గం నిర్మాణానికి సర్వం సిద్ధం చేశారు. వంతెనల మీదే ఈ మార్గం నిర్మితం అవుతుండడంతో కూవం తీరంలో 700 చోట్ల భారీ స్తంభాలను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. 2013 నాటికి ఈ పనులు ముగించాలన్న లక్ష్యంతో జాతీయ రహదారుల శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ పనులకు 2010 సెప్టెంబర్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. పనులు తొలి నాళ్లలో శరవేగంగా దూసుకెళ్లడంతో నిర్ణీత సమయానికి పూర్తి కావడం తథ్యమన్న ధీమా వ్యక్తమైంది. ఇది పూర్తరుుతే దేశంలోనే అతి పెద్ద హైవేగా ఈ మార్గం నిలుస్తుంది. మోకాలడ్డు: పనులు శర వేగంగా సాగుతున్న సమయం లో రాష్ట్ర ప్రభుత్వం మోకాలొడ్డింది. కూవం నదీ తీరంలో స్తంభాల నిర్మాణం పనులు 25 చోట్ల ముగింపుదశకు చేరు కున్నాయి. మిగిలిన చోట్ల పనులు రాష్ట్ర ప్రజా పనుల శాఖ ఓ ఉత్తర్వు జారీ చేసింది. కూవం నదీలోని మురుగు నీరు సముద్రంలోకి వెళ్లేందుకు వీలు లేని రీతిలో నిర్మాణాలు జరుగుతున్నాయని, తద్వారా అంటువ్యాధులు ప్రబలడం తథ్యమని పేర్కొంటూ, ఆ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయించింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ పనులను తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదన్న ఆరోపణలు మొదలయ్యూరుు. కోర్టుకు : చెన్నై హార్బర్ అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా, ఉత్తర చెన్నైలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి ఈ ఎక్స్‌ప్రెస్ వే ఎంతో దోహదకారి కాబోతోందంటూ కేంద్రం ప్రకటించింది. అర్ధాంతరంగా పనులను నిలుపుదల చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ రహదారుల శాఖ ముఖ్య అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపినా ఫలితం శూన్యం. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయించేందుకు కేంద్రం కోర్టును ఆశ్రయించింది. మద్రాసు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలై నెలలు గడిచినా, విచారణకు మాత్రం ముందుకు సాగలేదు. ఎట్టకేలకు న్యాయమూర్తులు పాల్ వసంతకుమార్, దేవదాసు నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. ఏడాదికి పైగా విచారణ సాగుతూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలను విన్పించారు. కేంద్ర ప్రభుత్వం తరపున వాదనల్ని బెంచ్ వినింది. తీర్పు: విచారణ ముగింపు దశకు చేరుతున్న సమయంలో మరో బెంచ్‌కు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాదులు యత్నించారు. అయితే, పాల్ వసంతకుమార్, దేవదాసుల నేతృత్వంలోని బెంచ్ విచారణను ముగించి గురువారం తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసింది. విచారణ ముగిసిన సమయంలో ఐదో డివిజన్ బెంచ్‌కు పిటిషను మార్చాలని కోరడంలో ఆంతర్యమేమిటంటూ ప్రభుత్వ తరపు న్యాయవాదుల్ని బెంచ్ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న వాదనల్లో వాస్తవాలు లేవని, పని గట్టుకుని మరీ ఆ పనులు నిలుపుదల చేయించినట్టు స్పష్టం అవుతోందని పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్ వే పనుల కారణంగా కూవంకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఈ మార్గం వల్ల మహానగరం మరింత అభివృద్ధి చెందడం ఖాయం అని బెంచ్ అభిప్రాయ పడింది. దేశ ప్రగతికి దోహద పడే పనులు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని, ఇక పనుల్ని జాతీయ రహదారుల శాఖ చేపట్టవచ్చంటూ తీర్పు వెలువరించారు. దీంతో ఆ పనులకు మోక్షం లభించగా, రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది.