రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించే ప్రతిపాదిత అలైన్‌మెంట్‌కు కాస్త అటూ ఇటుగా నగరం చుట్టూ ఇప్పటికే ఒకదానికి ఒకటి అనుసంధానమవుతూ చిన్న రోడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిని విస్తరిస్తూ పోతే కూడా కొత్త రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. కానీ ఇవన్నీ పట్టణాలు, ఊళ్ల మీదుగా సాగుతున్న రోడ్లు. ఓ క్రమపద్ధతి అంటూ లేకుండా వంకరటింకరగా ఉన్నాయి. దీంతో ఆ పాత రోడ్లను అసలు వినియోగించుకోకుండా పూర్తి కొత్త రోడ్డుగా రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు.
సాక్షి, హైదరాబాద్: నగరం చుట్టూ రానున్న రీజనల్ రింగ్ రోడ్డు (338 కిలోమీటర్లు) పూర్తి కొత్త రోడ్డుగా అవతరించనుంది. నగరానికి 50 కి.మీ.నుంచి 70 కి.మీ. దూరంలో... దాదాపు 20 ప్రధాన పట్టణా లను అనుసంధానిస్తూ వలయాకారంలో నిర్మాణం కానున్న ఈ భారీ ఎక్స్‌ప్రెస్‌వే కోసం ఎక్కడా పాత రోడ్లను వినియోగించుకోరు. భూసేకరణ జరిపి పూర్తి కొత్త (గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్) రాచబాటగా నిర్మించబోతున్నారు. నగరం చుట్టూ నిర్మితమైన ఔటర్ రింగురోడ్డుకు (162 కిలోమీటర్లు) ఆవల 30 కి.మీ. దూరంలో ఈ కొత్త రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఇందుకు అవసరమైన భూమి మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సిందే. ప్రస్తుతానికి ఉన్న తాత్కాలిక అంచనా ప్రకారం దాదాపు 11 వేల ఎకరాల భూమి అవసరం కానుంది. దీనికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చవుతాయని భావిస్తున్నారు. ఇందులో 50 శాతం మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం భరించనుండగా, మిగతా మొత్తం కేంద్రం ఇస్తుంది.
ప్రస్తుతానికి 4 వరుసల ఎక్స్‌ప్రెస్ వే
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు తర్వాత నిర్మితమవుతున్న రెండో ఎక్స్‌ప్రెస్ వే ఇది. మొదటి దశలో దీన్ని నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనున్నారు. ఇందుకోసం వంద మీటర్ల కారిడార్ ఉండేటట్లుగా భూసేకరణ జరపనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వెంబడి వాణిజ్యపరమైన నిర్మాణాలకు స్థలం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఇంకా అధికంగా భూసేకరణను సూచిం చింది. ప్రస్తుతం నగరం చుట్టూ భూముల ధరలు విపరీతంగా పెరిగినందున భూసేకరణ భారం మోయటం కష్టమవటంతో పాటు, చాలా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున.. 100 మీటర్లకే పరిమితం కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది. ఇందులో 11.5 మీటర్ల (వెడల్పు) చొప్పున ఇరువైపులా డబుల్ లేన్లు ఉంటాయి. అలా మొత్తం నాలుగు లేన్ల ప్రధాన క్యారేజ్ వే ఏర్పడుతుంది. దానికి రెండు వైపులా 7 మీటర్ల చొప్పున సర్వీసు రోడ్లు ఉంటాయి. ప్రస్తుతానికి నాలుగు వరుసల రోడ్డునే నిర్మిస్తారు. భవిష్యత్తులో దాన్ని ఎనిమిది లేన్లకు విస్తరిస్తారు.
ఆటోలు, ద్విచక్రవాహనాలకు ‘నో ఎంట్రీ’
ఇది ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మితమవుతున్నందున ఈ రోడ్డుపై ఆటోలు, ద్విచక్రవాహనాలకు అనుమతి ఉండదు. వాహనాలు గరిష్ట పరిమితి వేగంతో దూసుకుపోయేలా నిర్మిస్తున్నందున ఆటోలు, ద్విచక్రవాహనాలు అనుమతిస్తే ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అందుకని వాటికి అనుమతి ఉండదు. ఆ వాహనాలు ప్రస్తుతం ఉన్న రోడ్లను మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ఏ ఊరు.. ఏ సర్వే నెంబర్.. ఆరునెలల తర్వాతే స్పష్టత
దాదాపు మూడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. భారీ ప్రాజెక్టు కావటంతో దీన్ని జాతీయ రహదారిగా గుర్తించాలన్న రాష్ట్రప్రభుత్వ విన్నపానికి అప్పట్లో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ మౌఖిక సానుకూలత వ్యక్తం చేశారు. తొలుత ప్రాజెక్టు మొదటి దశ అయిన సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 152 కి.మీ. మార్గానికి జాతీయ రహదారి హోదా ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. రెండోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఇలాంటి కొన్ని రోడ్లపై సమీక్షి నిర్వహించి, దాదాపు రూ.13 వేల కోట్ల భారీ వ్యయమయ్యే ఆర్‌ఆర్‌ఆర్ వల్ల ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా ఉండవన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. అప్పటికి ఈ రోడ్డు అలైన్‌మెంటుపై ఎలాంటి స్పష్టత లేదు. కేవలం గూగుల్ మ్యాపు ఆధారంగా ఓ ప్రతిపాదన రూపొందించారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి, గతంలో కేంద్రం సూచించిన మార్పులకు రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో... ఈ ప్రతిపాదనను తిరిగి కేంద్రం పరిశీలిస్తోంది.
దాదాపు అనుమతులు మంజూరు చేసే దిశగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టత వచ్చింది. త్వరలో లిఖితపూర్వకంగా ఆమోదముద్ర పడనుంది. అలా అనుమతులు వచ్చాక జాతీయ రహదారుల విభాగం అధికారులు అసలైన అలైన్‌మెంట్‌ను రూపొందించనున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లి రోడ్డు ఏయే ప్రాంతాల మీదుగా నిర్మించాలో నిర్ధారించనున్నారు. ఇందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అసలు అలైన్‌మెంట్‌పై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఫీల్డ్ సర్వే చేసిన తర్వాతనే ఊళ్లు, సేకరించాల్సిన భూమి సర్వే నెంబర్ల వివరాలు తెలుస్తాయి. దాదాపు 25 చిన్నాపెద్దా పట్టణాలు, 300 వరకు గ్రామాలను ఇది అనుసంధానిస్తుందని అంచనా.
8 జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం
ఈ బృహత్ ఎక్స్‌ప్రెస్‌వే 8 జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానిస్తుంది. ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్– 161, ఎన్‌హెచ్– 44, ఎన్‌హెచ్–765, ఎన్‌హెచ్–765డి, ఎన్‌హెచ్–163, రాజీవ్ రహదారి, నాగార్జున సాగర్ రోడ్డులను అనుసంధానిస్తుంది. ఒక రోడ్డు నుంచి మరో రోడ్డులోకి మారేందుకు నగరంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే రీజినల్ రింగురోడ్డు మీదుగా మళ్లొచ్చు. దీనివల్ల నగరంపై ట్రాఫిక్ భారం తగ్గుతుంది.
కనీసం ఆరేళ్లు పట్టే అవకాశం!
ఇది పూర్తిగా కొత్త రోడ్డు అయినందున ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు కనీసం ఆరేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అలైన్‌మెంట్‌కు ఆరు నెలల నుంచి ఏడాది సమయం, భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేందుకే కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కల్వర్టులు, వంతెనలతో కూడిన రోడ్డు నిర్మాణం దాదాపు మూడేళ్లకు పైగా పడుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇందులో భూసేకరణ అతిక్లిష్టమైన అంశం. అందులో ఎంత జాప్యం జరిగితే ప్రాజెక్టు అంత నెమ్మదిగా కదులుతుంది.
Comments
Please login to add a commentAdd a comment