four lines road
-
ఆర్ఆర్ఆర్.. అంతా కొత్త రోడ్డే
రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించే ప్రతిపాదిత అలైన్‌మెంట్‌కు కాస్త అటూ ఇటుగా నగరం చుట్టూ ఇప్పటికే ఒకదానికి ఒకటి అనుసంధానమవుతూ చిన్న రోడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిని విస్తరిస్తూ పోతే కూడా కొత్త రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. కానీ ఇవన్నీ పట్టణాలు, ఊళ్ల మీదుగా సాగుతున్న రోడ్లు. ఓ క్రమపద్ధతి అంటూ లేకుండా వంకరటింకరగా ఉన్నాయి. దీంతో ఆ పాత రోడ్లను అసలు వినియోగించుకోకుండా పూర్తి కొత్త రోడ్డుగా రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు. సాక్షి, హైదరాబాద్: నగరం చుట్టూ రానున్న రీజనల్ రింగ్ రోడ్డు (338 కిలోమీటర్లు) పూర్తి కొత్త రోడ్డుగా అవతరించనుంది. నగరానికి 50 కి.మీ.నుంచి 70 కి.మీ. దూరంలో... దాదాపు 20 ప్రధాన పట్టణా లను అనుసంధానిస్తూ వలయాకారంలో నిర్మాణం కానున్న ఈ భారీ ఎక్స్‌ప్రెస్‌వే కోసం ఎక్కడా పాత రోడ్లను వినియోగించుకోరు. భూసేకరణ జరిపి పూర్తి కొత్త (గ్రీన్‌ఫీల్డ్ అలైన్మెంట్) రాచబాటగా నిర్మించబోతున్నారు. నగరం చుట్టూ నిర్మితమైన ఔటర్ రింగురోడ్డుకు (162 కిలోమీటర్లు) ఆవల 30 కి.మీ. దూరంలో ఈ కొత్త రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఇందుకు అవసరమైన భూమి మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సిందే. ప్రస్తుతానికి ఉన్న తాత్కాలిక అంచనా ప్రకారం దాదాపు 11 వేల ఎకరాల భూమి అవసరం కానుంది. దీనికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చవుతాయని భావిస్తున్నారు. ఇందులో 50 శాతం మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం భరించనుండగా, మిగతా మొత్తం కేంద్రం ఇస్తుంది. ప్రస్తుతానికి 4 వరుసల ఎక్స్‌ప్రెస్ వే హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు తర్వాత నిర్మితమవుతున్న రెండో ఎక్స్‌ప్రెస్ వే ఇది. మొదటి దశలో దీన్ని నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనున్నారు. ఇందుకోసం వంద మీటర్ల కారిడార్ ఉండేటట్లుగా భూసేకరణ జరపనున్నారు. ఆర్ఆర్ఆర్ వెంబడి వాణిజ్యపరమైన నిర్మాణాలకు స్థలం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఇంకా అధికంగా భూసేకరణను సూచిం చింది. ప్రస్తుతం నగరం చుట్టూ భూముల ధరలు విపరీతంగా పెరిగినందున భూసేకరణ భారం మోయటం కష్టమవటంతో పాటు, చాలా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున.. 100 మీటర్లకే పరిమితం కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది. ఇందులో 11.5 మీటర్ల (వెడల్పు) చొప్పున ఇరువైపులా డబుల్ లేన్లు ఉంటాయి. అలా మొత్తం నాలుగు లేన్ల ప్రధాన క్యారేజ్ వే ఏర్పడుతుంది. దానికి రెండు వైపులా 7 మీటర్ల చొప్పున సర్వీసు రోడ్లు ఉంటాయి. ప్రస్తుతానికి నాలుగు వరుసల రోడ్డునే నిర్మిస్తారు. భవిష్యత్తులో దాన్ని ఎనిమిది లేన్లకు విస్తరిస్తారు. ఆటోలు, ద్విచక్రవాహనాలకు ‘నో ఎంట్రీ’ ఇది ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మితమవుతున్నందున ఈ రోడ్డుపై ఆటోలు, ద్విచక్రవాహనాలకు అనుమతి ఉండదు. వాహనాలు గరిష్ట పరిమితి వేగంతో దూసుకుపోయేలా నిర్మిస్తున్నందున ఆటోలు, ద్విచక్రవాహనాలు అనుమతిస్తే ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అందుకని వాటికి అనుమతి ఉండదు. ఆ వాహనాలు ప్రస్తుతం ఉన్న రోడ్లను మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఏ ఊరు.. ఏ సర్వే నెంబర్.. ఆరునెలల తర్వాతే స్పష్టత దాదాపు మూడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. భారీ ప్రాజెక్టు కావటంతో దీన్ని జాతీయ రహదారిగా గుర్తించాలన్న రాష్ట్రప్రభుత్వ విన్నపానికి అప్పట్లో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ మౌఖిక సానుకూలత వ్యక్తం చేశారు. తొలుత ప్రాజెక్టు మొదటి దశ అయిన సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 152 కి.మీ. మార్గానికి జాతీయ రహదారి హోదా ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. రెండోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఇలాంటి కొన్ని రోడ్లపై సమీక్షి నిర్వహించి, దాదాపు రూ.13 వేల కోట్ల భారీ వ్యయమయ్యే ఆర్ఆర్ఆర్ వల్ల ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా ఉండవన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. అప్పటికి ఈ రోడ్డు అలైన్మెంటుపై ఎలాంటి స్పష్టత లేదు. కేవలం గూగుల్ మ్యాపు ఆధారంగా ఓ ప్రతిపాదన రూపొందించారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి, గతంలో కేంద్రం సూచించిన మార్పులకు రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో... ఈ ప్రతిపాదనను తిరిగి కేంద్రం పరిశీలిస్తోంది. దాదాపు అనుమతులు మంజూరు చేసే దిశగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టత వచ్చింది. త్వరలో లిఖితపూర్వకంగా ఆమోదముద్ర పడనుంది. అలా అనుమతులు వచ్చాక జాతీయ రహదారుల విభాగం అధికారులు అసలైన అలైన్‌మెంట్‌ను రూపొందించనున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లి రోడ్డు ఏయే ప్రాంతాల మీదుగా నిర్మించాలో నిర్ధారించనున్నారు. ఇందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అసలు అలైన్‌మెంట్‌పై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఫీల్డ్ సర్వే చేసిన తర్వాతనే ఊళ్లు, సేకరించాల్సిన భూమి సర్వే నెంబర్ల వివరాలు తెలుస్తాయి. దాదాపు 25 చిన్నాపెద్దా పట్టణాలు, 300 వరకు గ్రామాలను ఇది అనుసంధానిస్తుందని అంచనా. 8 జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం ఈ బృహత్ ఎక్స్‌ప్రెస్‌వే 8 జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానిస్తుంది. ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్– 161, ఎన్‌హెచ్– 44, ఎన్‌హెచ్–765, ఎన్‌హెచ్–765డి, ఎన్‌హెచ్–163, రాజీవ్ రహదారి, నాగార్జున సాగర్ రోడ్డులను అనుసంధానిస్తుంది. ఒక రోడ్డు నుంచి మరో రోడ్డులోకి మారేందుకు నగరంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే రీజినల్ రింగురోడ్డు మీదుగా మళ్లొచ్చు. దీనివల్ల నగరంపై ట్రాఫిక్ భారం తగ్గుతుంది. కనీసం ఆరేళ్లు పట్టే అవకాశం! ఇది పూర్తిగా కొత్త రోడ్డు అయినందున ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు కనీసం ఆరేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అలైన్‌మెంట్‌కు ఆరు నెలల నుంచి ఏడాది సమయం, భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేందుకే కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కల్వర్టులు, వంతెనలతో కూడిన రోడ్డు నిర్మాణం దాదాపు మూడేళ్లకు పైగా పడుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇందులో భూసేకరణ అతిక్లిష్టమైన అంశం. అందులో ఎంత జాప్యం జరిగితే ప్రాజెక్టు అంత నెమ్మదిగా కదులుతుంది. -
1,076 కి.మీ జాతీయ రహదారులు 24,000కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారి భారీ ఎత్తున నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో ఒకేసారి రూ. 24 వేల కోట్లతో ఏకంగా 1,076 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల జాతీయ రహదా రులను నిర్మించ నుంది. ఈ రోడ్ల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టేం దుకు ప్రణాళిక రచిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే రెండేళ్లలోనే ఈ పనులు పూర్తికానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసేందుకు... దేశవ్యాప్తంగా రోడ్ నెట్‌వర్క్‌ను పెంచడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావి స్తోంది. చాలా ప్రాంతాల్లో పరి శ్రమలు ఏర్పాటు కావటానికి మౌలికవసతుల కొరతే అడ్డం కిగా మారింది. మంచి రోడ్ నెట్వర్క్ ఏర్పాటైతే కొత్త ప్రాంతాల్లోనూ భారీగా పెట్టుబ డులు పెట్టేందుకు సంస్థలు ముందు కొస్తాయి. ఈ నేపథ్యంలో భారత్ మాలా ప్రాజెక్టు కింద భారీగా రోడ్ల అభివృద్ధికి కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రూ. 27 వేల కోట్ల మేర రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేసేందుకు సమాయత్తమవు తోంది. ఇందులో రూ. 24 వేల కోట్లతో నాలుగు వరుసల రోడ్లను నిర్మించనుండగా మరో రూ. 3 వేల కోట్లతో జాతీయ రహదారులను వెడల్పు చేయనుంది. చదవండి: (బీజేపీలో చేరతా : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి) భూసేకరణ వేగంగా జరిగితే.. రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని కేంద్రం సూచించింది. అందుకయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించనుంది. కావాల్సిన భూము లను సేకరించి కేంద్రానికి కేటాయిస్తే వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా తేల్చిచెప్పారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. -
నారాయణపేట... నాలుగు లైన్ల బాట
నారాయణపేట: ఇటీవలే మనుగడలోకి వచ్చిన నారాయణపేట జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రూ.18.65 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. మండలంలోని సింగారం చౌరస్తా నుంచి యాద్గీర్ రోడ్డులోని ఎర్రగుట్ట సీమీపం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆర్టీసీ బస్టాండ్ వద్ద శంకుస్థాపన చేశారు. రూ.18.65 కోట్లతో రోడ్డు నిర్మాణం సింగారం చౌరస్తా నుంచి యాద్గీర్‌రోడ్డు ఎర్రగుట్ట సమీపం వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. ఇందుకు గాను 2018 అక్టోబర్ 17న జీఓ 566ను ఆర్అండ్బీ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు రూ.18.65 కోట్ల అంచనా వ్యయం కాగా.. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఈ పనులకు సంబంధించి ఈనెల 11వ తేదీన అగ్రిమెంట్ కాగా.. ఏడాదిలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వాహనదారులకు ఊరట నారాయణపేట నూతన జిల్లాలో అభివృద్ధికి తొలి అడుగు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంతో ఆరంభమైంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సింగారం చౌరస్తా మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా మారనుంది. మక్తల్ నుంచి సింగారం చౌరస్తా 26 కిలోమీటర్లు, మరికల్ నుంచి సింగారం చౌరస్తా 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే మద్దూర్, కోస్గి మండలాల వారికి సైతం భూనేడ్ నుంచి వస్తే వారికి నారాయణపేట అందుకున్నట్లుంది. సింగారం నుంచి 5 కిలోమీటర్ల వరకు నాలుగులైన్ల రోడ్డు విస్తరణ జరుగుతుండడంతో ఈ ప్రాంత వాహనదారులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న నారాయణపేటలో అంతరాష్ట్ర రహదారిగా నాలుగు లైన్ల విస్తరణ జరగుతుండడంతో ఆటు కర్ణాటక, ఇటు తెలంగాణ ప్రాంత వాహనదారులకు ఊరట లభించనుంది. ఇక పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా హైదరాబాద్, రాయచూర్ ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా వ్యవస్థ మెరుగుపడినట్లేనని భావిస్తున్నారు. డివైడర్లు.. పచ్చదనం నాలుగులైన్ల రోడ్డు 100 ఫీట్ల వెడల్పుతో 5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా మధ్యలో డివైడర్, బట్లర్ఫ్లై లైట్లు ఏర్పాటుచేసి మొక్కలు నాటనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే ప్రాంతం సుందరంగా మారుతుందని భావిస్తున్నారు. ‘పేట’ అభివృద్ధికి శుభపరిణామం నారాయణపేట కొత్త జిల్లాలో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం అభివృద్ధికి శుభపరిణామని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే వ్యాపార, విద్య రంగాలకు అనువుగా మారుతుందని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు నారాయణపేట కేంద్రబిందువుగా ఉందని.. బంగారం, చేనేత రంగాలు ఇక్కడ ప్రసిద్ధి గాంచాయని వివరించారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లాలను అగ్రగామిగా నిలిపేందుకు చేస్తున్న కృషికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, మార్కెట్ చైర్మన్ సరాఫ్ నాగరాజు, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. -
ఎక్స్‌ప్రెస్‌లొస్తే ఒట్టు..
భిక్కనూరు : ఆ ఊరికి బస్సుల్లేవని పిల్లనివ్వడం లేదు..నిజమే వింతగా అనిపించినప్పటికీ భిక్కనూరు మండలానికి ఇలాంటి చిక్కొకటి వచ్చిపడింది. మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు భిక్కనూరు రాష్ట్రంలోనే ఆదర్శమండలంగా పేరొందింది. నాలుగులైన్ల రోడ్డు ఏర్పాటు కానప్పుడు ప్రతి ఆర్టీసీ బస్సు భిక్కనూరు మీదుగా వెళ్లేది. ఏ రాత్రయినా భిక్కనూరు రావాలంటే బస్సులుండేవి. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. జంకుతున్నారు.. భిక్కనూరు పిల్లనివ్వాలంటే జంకే రోజులొచ్చాయి. ఎప్పుడైతే నిజామాబాద్, హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్డు వచ్చిందో భిక్కనూరును చూసేవారే కరువయ్యారు. ఎక్స్‌ప్రెస్ బస్సు కనిపిస్తే ఒట్టు.. ఒకప్పుడు నాల్గులైన్ల రోడ్డును భిక్కనూరు మీదుగా వెళ్ల వద్దని కొందరూ అభ్యంతరం చెప్పడంతో ఎన్‌హెచ్ అధికారులు భిక్కనూరుకు బైపాస్‌ను ఏర్పాటు చేశారు. దీంతో భిక్కనూరు మండల కేంద్రానికి ఎక్స్‌ప్రెస్ బస్సులు రావడం తగ్గాయి. దీంతో ప్రజలు పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టడం నిరాహారదీక్షలు చేశారు. హామీలు రెండ్రోజులకే.. ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టి బస్సులను అడ్డుకుంటే ఆర్టీసీ అధికారులు వచ్చి బస్సులున్నింటిని భిక్కనూరు మీదుగా వెళ్తాయని హామీ ఇచ్చి వెళ్తారు. ఆ తర్వాత రెండు, మూడురోజుల భిక్కనూరు మీదుగా వెళ్తాయి. అనంతరం షరామూమాలే.. బైపాస్ రోడ్డు మీద దిగి భిక్కనూరుకు నడుచుకుంటూ వస్తున్నారు. ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లు భిక్కనూరులో స్టాప్ ఉన్నప్పటికి బస్సులను భిక్కనూరు మీదుగా తీసుకెళ్లడం లేదు. కొందరూ ప్రయాణికులు డ్రైవర్లను, కండక్టర్లను నిలదీయడంతో ఆ ఒక్క బస్సు మాత్రమే భిక్కనూరు మీదుగా వెళ్తుంది. తర్వాత మళ్లీ మామూలే. ప్రతిరోజూ గొడవ పడలేం.. ప్రతిరోజు ఏం గొడవ పెట్టుకుంటాం మా ఖర్మ.. అనుకుంటూ ప్రయాణికులు భిక్కనూరు స్టాప్ దగ్గర దిగి ఊళ్లోకి నడుచుకుంటూ వస్తున్నారు. పిల్లాపాపలను ఎత్తుకొని అంతదూరం నడుచుకుంటూ ఊళ్లోకి రావడం నరకాన్ని తలపిస్తోంది మహిళలు అంటున్నారు. కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్–1 నిజామాబాద్–2 నిర్మల్, ఆదిలాబాద్, బైంసా, బాన్స్వాడ, హైదరాబాద్ డిపోలకు చెందిన బస్సులు ప్రధానంగా వెళ్తాయి. కామారెడ్డి డిపోకు చెందిన కొన్ని ఎక్స్‌ప్రెస్ బస్సులు కూడా భిక్కనూరు మండల కేంద్రం మీదుగా వెళ్లడంలేదు. ఎక్స్‌ప్రెస్‌లు ఆగట్లేదు.. ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రయాణం అంటే భయమేస్తోంది. భిక్కనూరు నుంచి వేరే గ్రామాలకు వెళ్లాలంటే బస్సుల కోసం మం డల కేంద్రంలో గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తుంది. ఇక కామారెడ్డి హైదరా బాద్ వైపునుంచి బస్సులు బైపాస్ గుండా వెళ్లడంతో అక్కడి దిగి రావడం ఇబ్బందికరంగా ఉంది. – లక్ష్మీనారాయణ ప్రయాణికుడు భిక్కనూరు. చాలా కష్టంగా ఉంది.. మీ భిక్కనూరుకు పిల్లను ఇద్దామంటే బస్సులు రావు ఎలా ఇ స్తాం అని అంటున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులు రావు ఆర్డినరీ బస్సుల్లో వెళ్దామంటే నిల్చోవడానికే జాగా ఉండదు. ఏమి చేస్తాం ఆటోల్లో పోవాల్సి వస్తుంది. అన్ని బస్సులు భిక్కనూరు మీదుగా పోయేలా చేయాలి. అప్పుడే మాకు బస్సుల కష్లాలు పోతాయి. –ప్రమీల, బీడీ కార్మికురాలు భిక్కనూరు. -
రూ.3 లక్షల కోట్లతో రహదారుల అభివృద్ధి
అన్ని చోట్లా నాలుగులేన్ల రోడ్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి,సిటీబ్యూరో: మౌలిక సదుపాయాలు, రహదారుల అభివృద్ధికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. దేశవ్యాప్తంగా రూ.3 లక్షల కోట్లతో రహదారులను అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా బేగంపేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు నాలుగులేన్ల రహదారులు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రహదారుల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు వెచ్చించడం సంతోషదాయకమన్నారు. శాసన మండలి చెర్మైన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ, రహదారి భద్రతా బిల్లు నెపంతో కేంద్రం రాష్ట్రాల అధికారాలను లాక్కొనేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఈ కుట్రను సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధం కావాలన్నారు. రహదారి భద్రతా బిల్లు రూపంలో అన్ని రకాల రవాణా సేవలను కేంద్రీకృతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యోగసంఘాలు మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారి భద్రతా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. అన్ని జిలా ్లల్లో రవాణాశాఖకు సొంత భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. సీటుబెల్టు, హెల్మెట్ పట్ల వివిధ రూపాల్లో ఇప్పటికే పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రవాణాశాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన రోడ్డు భద్రతా సీడీని, సావనీర్‌ను ఆవిష్కరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్‌గౌడ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, జేటీసీలు పాండురంగారావు, రఘునాథ్, రవాణాశాఖ టెక్నికల్ అధికారుల సంఘం ఆల్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షులు అశ్వాక్ అహ్మద్, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.