రూ.3 లక్షల కోట్లతో రహదారుల అభివృద్ధి
అన్ని చోట్లా నాలుగులేన్ల రోడ్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ
సాక్షి,సిటీబ్యూరో: మౌలిక సదుపాయాలు, రహదారుల అభివృద్ధికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. దేశవ్యాప్తంగా రూ.3 లక్షల కోట్లతో రహదారులను అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా బేగంపేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు నాలుగులేన్ల రహదారులు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా రహదారుల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు వెచ్చించడం సంతోషదాయకమన్నారు. శాసన మండలి చెర్మైన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ, రహదారి భద్రతా బిల్లు నెపంతో కేంద్రం రాష్ట్రాల అధికారాలను లాక్కొనేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఈ కుట్రను సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధం కావాలన్నారు. రహదారి భద్రతా బిల్లు రూపంలో అన్ని రకాల రవాణా సేవలను కేంద్రీకృతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యోగసంఘాలు మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని కోరారు.
రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారి భద్రతా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. అన్ని జిలా ్లల్లో రవాణాశాఖకు సొంత భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. సీటుబెల్టు, హెల్మెట్ పట్ల వివిధ రూపాల్లో ఇప్పటికే పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రవాణాశాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన రోడ్డు భద్రతా సీడీని, సావనీర్‌ను ఆవిష్కరించారు.
సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్‌గౌడ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, జేటీసీలు పాండురంగారావు, రఘునాథ్, రవాణాశాఖ టెక్నికల్ అధికారుల సంఘం ఆల్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షులు అశ్వాక్ అహ్మద్, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.