Minister Dattatreya
-
కాంగ్రెస్ జీఎస్టీ ఎందుకు తేలేదంటే ?
► 542 మొబైల్ నంబర్లు జీఎస్టీ నమోదుకు కేటాయింపు ► తెలంగాణ జీఎస్టీ నెంబర్ 7901243032 ► అస్తవ్యస్తమైన పన్ను విధానాన్ని సవరించాం- మంత్రి హైదరాబాద్: దేశంలో అస్తవ్యస్తమైన పన్నుల విధానాన్ని మొదటిసారిగా మోదీ ప్రభుత్వం సవరించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. 17 రకాల పన్నుల స్థానంలో జీఎస్టీ అనే ఏకీకృత పన్నుల వ్యవస్థను కేంద్రం తీసుకొచ్చిందని ఆయన అన్నారు. జీఎస్టీ అమలుతో చెక్ పోస్టులు ఎత్తేస్తుండంతో సరుకు రవాణా వేగవంతం అవుతుందని అన్నారు. గతంలో వసూలు చేసిన పన్నుల్లో 40 శాతమే ఖజానాకు చేరేదని చెప్పారు. జీఎస్టీతో రెండు రాష్ట్రాలకు అత్యధిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. వస్తు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు గతంలో చెల్లించే 2 శాతం పన్నును ఇప్పుడ కేంద్రం చెల్లిస్తుందని, జీఎస్టీతో ద్రవ్యోల్బణం తగ్గుతుందని ధరలు తగ్గుతాయని వివరించారు. ఒక దేశం.. ఒకేపన్ను నినాదంతో 1500 శ్లాబులో ఉన్న పన్నులను జీఎస్టీతో 4 శ్లాబులకు తెచ్చినట్లు మంత్రి చెప్పారు. తిండిగింజలు, కూరగాయలు, పిండి పదార్ధాలు వంటి ఆహార పదార్ధాలు పేదలకు సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బీడీ, మైకా, భవన నిర్మాణ కార్మికులకు అందించరే సెస్ కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా లభిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 40వేల మంది వ్యాపారులు 20లక్షల ఆదాయం లోపు ఉన్న వారేనని, వీరిపై జీఎస్టీ ప్రభావం ఉండదన్నారు. జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులకు మేలు కలుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా జీఎస్టీ వెబ్ పోర్టల్ రూపొందిస్తున్నారని అన్నారు. 542 మొబైల్ నంబర్లు జీఎస్టీ నమోదుకు కేటాయిస్తున్నారంటూ జీఎస్టీ నమోదు నెంబరు +917961243239, తెలంగాణ జీఎస్టీ నెంబర్ 7901243032 కేటాయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధాన లోపం కారణంగా జీఎస్టీ సాధించలేకపోయిందని మంత్రి విమర్శించారు. ఆ పార్టీ కనీస రాజకీయ పరిణతిని ప్రదర్శించడంలో విఫలమైందని అన్నారు. వామపక్షాలు కాంగ్రెస్ కు వంతపాడటం దురదృష్టకరమని దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ జోన్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కమిషనర్ సంనీల్ జైన్ మాట్లాడుతూ.. జీఎస్టీపై ఆరు నెలలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఏపీ, తెలంగాణలో విస్తృతంగా ప్రచారం నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలోని 146 కార్యాలయాల్లో జీఎస్టీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జీఎస్టీ నమోదు చేసుకునేందుకు ప్రత్యేకంగా 542 సెల్ నెంబర్లు అధికారులకు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ రూపంలో రూ.50వేల కోట్లు వసూలు చేశామన్నారు. 1244 రకాల వస్తువుల్లో 81 శాతం వస్తువులు 18 శాతం పన్ను పరిధిలో ఉన్నాయని ఆయన చెప్పారు. -
‘నిబద్దతతో కూడిన నాయకుడు..’
► కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హొసూరు : మూడేళ్ల ప్రజాభ్యుదయ పాలనకు నరేంద్రమోదీ పాలన సాకార రూపమని కేంద్ర కార్మిక ఉపాధిశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం హొసూరులోని ప్రైవేట్ భవనంలో జరిగిన బీజేపీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేయలేని ఎన్నో అభివృద్ధి పనులు మోదీ ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత సాధ్యమైందన్నారు. 2009లో బీజేపీ పాలనకు రాక ముందు మోదీ పాపులారిటీ రెండు శాతం కాగా, 2014లో 36 శాతానికి, ప్రస్తుతం ప్రజాసంక్షేమానికి కృషి చేసే నిబద్దతతో కూడిన నాయకుడిగా 44 శాతానికి పెరిగిందని తెలిపారు. ప్రధాన మంత్రి పసల్ బీమాయోజన పథకం, రైతుల పొలాలలో మట్టి నమూనాలు సేకరించి,. ప్రయోగశాలలో పరీక్షలు జరిపి ఆయా పొలాలకు, ప్రాంతాలకు తగిన పంటలు సాగుచేయడానికి తొలుత శ్రీకారం చుట్టిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనన్నారు. అదే సమయంలో ఈ నేషనల్ అగ్రి మార్కెట్ (ఈ నాం)విధానం ద్వారా కుగ్రామాల్లో సాగు చేసే కూరగాయలు, పళ్లు, పూలు తదితర వ్యవసాయ ఉత్పత్తులు దూర ప్రాంతాల్లో విక్రయించేందుకు సౌలభ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా రూపుదిద్దుకోనున్నట్లు తెలిపారు. తర్వాత విలేఖరుల సమావేశంలో హొసూరులో ప్రావిడెడ్ ఫండ్ కార్యాలయం లేకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందుల పాలవుతున్నారని ఒక విలేఖరి అడగ్గా ఈ విషయం పరిశీలిస్తామని, అదే సమయంలో కార్మికుల ఉద్యోగ భద్రతకు సంక్షేమానికి వివిధ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఢిల్లీలో తమిళనాడుకు చెందిన కావేరి సమస్యపై రైతులు ధర్నా నిర్వహిస్తున్నప్పటికీ ప్రధాని వారిని కలుసుకొని మాట్లాడలేదన్న విలేఖరి ప్రశ్నకు సమయాభావం కారణంగా ప్రధానికి వీలుపడలేదని, ఈ విషయంపై సంబంధిత అధికారులు, నాయకులు వారితో మాట్లాడినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసైసౌందరరాజుతో పాటు బీజేపీ నాయకులు నరేంద్ర, మునిరాజు, బాలక్రిష్ణ, వరదరాజు, క్రిష్ణగిరి జిల్లా ఎంపీ అశోక్‌కుమార్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు. -
కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలు.
-
కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలు
⇒ మేళాలో ప్రొటోకాల్ వివాదం ⇒ సర్దిచెప్పిన మంత్రి ఈటల కరీంనగర్‌సిటీ: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం వేదికగా జరిగిన డీజీ ధన్ మేళాలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. మేళాలో భాగంగా సభావేదికపై ఉన్న ఫ్లెక్సీ లో ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు లేకపోగా ప్రొటోకాల్‌పరంగా ఆహ్వానించ కుండా అవమానపరిచారంటూ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేశారు. సభా వేదిక కింది నుంచి అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిలిచి అవమానపరుస్తారా అంటూ మండిపడ్డారు. ఆహ్వానం మేరకు అక్కడ నుంచి వేదికను ఆసీనులవుతూనే రసమయి బాలకిషన్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటో కాల్ పాటించకుండా ప్రజా ప్రతినిధులను అగౌరవపరుస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. అందుకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఘాటు గానే స్పందించడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక దశలో కలె క్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలుగా పరిస్థితి మారిపోయింది. తనకు కలెక్టర్‌తో క్షమాపణ చెప్పిం చాలంటూ కేంద్ర మంత్రి దత్తాత్రేయతో రస మయి గట్టిగానే అడిగాడు. ఇంతలో మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. తర్వాత మాట్లాడుకుందామని చెప్పడంతో సద్దుమణిగింది. అనంతరం ఈటల తన ప్రసంగంలో చివరగా ప్రజాప్రతినిధులను అగౌరవపర చడం సరైన సంప్రదాయం కాదని అన్నారు. ఇక్కట చోటు చేసుకున్న సంఘటనపై సమీక్షించు కుంటామని చెప్పారు. -
ఆర్థిక ఉగ్రవాదంపై పోరు మొదలైంది
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తిరుపతి రూరల్: పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక ఉగ్రవాదంపై ప్రధాని మోదీ పోరు ప్రారంభించారని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తిరుపతిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక అసమానతలను తొలగించి, అవినీతి రహిత ఆర్థిక, రాజకీయ వ్యవస్థను నిర్మించేందుకే ఇలాంటి విప్లవాత్మక చర్యకు ప్రధాని పూనుకున్నారని తెలిపారు. పెద్దనోట్ల రద్దు తర్వాత కశ్మీర్ ప్రశాంతంగా ఉండటమే ఈ విజయానికి నిదర్శనమన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి రప్పించే సత్తా మోదీకి మాత్రమే ఉందన్నారు. వేజ్‌బోర్డు పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియాను కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
శ్రీవారి సేవలో దత్తాత్రేయ
తిరుమల: ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుడిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
బడ్జెట్లో వైద్యానికి రూ.6 వేల కోట్లేనా?
కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ విమర్శ సాక్షి, హైదరాబాద్: లక్షా 30 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో వైద్యానికి కేవలం రూ.6 వేల కోట్లే కేటాయించారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని చిన్నచూపు చూస్తోందని అన్నారు. ఈ మొత్తాన్ని పెంచాలని సూచించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవంలో దత్తాత్రేయ మాట్లాడారు. వైద్యసేవల్లో నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్సహా వివిధ రకాల వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు వేల రూపాయల ఖర్చు చేసి ప్రైవేటులో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్యరంగాన్ని మెరుగుపర్చేందుకు కేంద్రం ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో హెల్త్ రికార్డ్సు మొత్తం కంప్యూటరైజేషన్ చేస్తున్నామన్నారు. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలని ప్రధానమంత్రి నిర్ణయించారన్నారు. వైద్యులు ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రి నెలకొల్పాలన్నా... ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలన్నా తాను సహకరిస్తానన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ వివేక్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, మాజీ డీఎంఈ పుట్టా శ్రీనివాస్, కేర్ ఆసుపత్రి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు సి.రామకృష్ణ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం నిర్ణయంతో బీడి పరిశ్రమకు దెబ్బ
నిజామాబాద్ ఎంపీ కవిత సాక్షి, హైదరాబాద్: బీడీకట్టలపై పుర్రెగుర్తు సైజును తగ్గించేందుకు కృషి చేయాలని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆదివారం దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో దత్తాత్రేయను ఆమె కలసి ఒక లేఖను అందించారు. ఈ నెల 1 నుంచి బీడీకట్టలపై పుర్రెగుర్తు సైజును 85 శాతం ముద్రించాలన్న నిబంధన అమలులోకి వచ్చిందని, ఈ నిబంధనను నిలిపివేయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. దేశవ్యాప్తంగా 80 లక్షల మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, ఒక్క తెలంగాణలో 7 లక్షల మంది బీడీ పరిశ్రమలో ఉన్నారని, ఈ పరిశ్రమలో ఎక్కువమంది మహిళలే పనిచేస్తున్నారని తెలిపారు. బీడీ వినియోగాన్ని తగ్గించాలన్నా, పరిశ్రమను నిషేధించాలన్నా ముందుగా ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీవనోపాధి గురించి ఆలోచించాలని, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఓఎల్) సూచించిందని కవిత గుర్తు చేశారు. ప్రధానితో మాట్లాడతా: దత్తాత్రేయ లక్షల మంది జీవనోపాధికి సంబంధించిన విషయమైనందున పుర్రె గుర్తు సైజు తగ్గింపు గురించి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని మంత్రి దత్తాత్రేయ హామీ ఇచ్చారు. ఆరోగ్య మంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళతానని తన వెంట ఎంపీ కవితను కూడా తీసుకుపోతానని దత్తాత్రేయ మీడియాకు వివరించారు. మంత్రిని కలిసినవారిలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రూప్సింగ్ తెలంగాణ జాగృతి రైతు విభాగం కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భట్టి విమర్శల్లో పస లేదు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చేసిన విమర్శల్లో పస లేదని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ బావుందని దేశమంతా కితాబు ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం వాస్తవాలు విస్మరించి మాట్లాడుతున్నారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో కవిత మాట్లాడుతూ.. భట్టి మాటల్లో నిజం ఉంటే అసెంబ్లీకి హాజరయ్యేవారని, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాకే పలాయనం చిత్తగించారని వ్యాఖ్యానించారు. -
గ్రామాల్లో అంబేడ్కర్ జయంతి వేడుకలు
ఏప్రిల్ 14 నుంచి 24 వరకు.. అభివృద్ధికి {పత్యేక కార్యక్రమాలు కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి వేడుకల సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి 24 వరకు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల బలోపేతానికి ‘గ్రామ్ ఉదయ్ సే లేకర్ భారత్ ఉదయ్ తక్’ అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొనేలా చేయడంతో పాటు సభలు, సమావేశాల ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించనున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల బలోపేతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. ఏపీలో కాల్‌మనీ వల్ల జరిగిన అకృత్యాలు దేశంలో ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతో ముద్ర బ్యాంక్ ద్వారా రూ.1.8 లక్షల కోట్ల రుణాలు అందజేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. గత యూపీఏ హయాంలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉండేదని, ప్రధాని నరేంద్ర మోదీ బ్లాక్‌మార్కెట్‌ను పూర్తిగా అరికట్టడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేసేందుకు ఈ-మార్కెటింగ్ వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. హెచ్‌సీయూ ఘటనపై నో కామెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తాను మాట్లాడబోనని దత్తాత్రేయ స్పష్టం చేశారు. హెచ్‌సీయూ తన శాఖ పరిధిలోకి రాదని, సంబంధిత శాఖ వారే స్పందిస్తారని అన్నారు. ‘హెచ్ఆర్డీకి గతంలో మీరు రాసిన లేఖలకు సమాధానం వచ్చిందా?’ అని విలేకరుల అడగ్గా.. ‘హెచ్‌సీయూ విద్యార్థుల సస్పెన్షన్ వ్యవహారం కోర్టులో ఉంది. దీనిపై మాట్లాడదలచుకోలేదు’ అని చెప్పారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ హైదరాబాద్ పర్యటనపై ‘నో కామెంట్’ అంటూ దాటవేశారు. ఎన్డీఏ ప్రభుత్వ పారదర్శక పాలనను ఓర్వలేని కొన్ని దుష్టశక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నాయని దత్తాత్రేయ మండిపడ్డారు. -
రూ.3 లక్షల కోట్లతో రహదారుల అభివృద్ధి
అన్ని చోట్లా నాలుగులేన్ల రోడ్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి,సిటీబ్యూరో: మౌలిక సదుపాయాలు, రహదారుల అభివృద్ధికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. దేశవ్యాప్తంగా రూ.3 లక్షల కోట్లతో రహదారులను అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా బేగంపేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు నాలుగులేన్ల రహదారులు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రహదారుల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు వెచ్చించడం సంతోషదాయకమన్నారు. శాసన మండలి చెర్మైన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ, రహదారి భద్రతా బిల్లు నెపంతో కేంద్రం రాష్ట్రాల అధికారాలను లాక్కొనేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఈ కుట్రను సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధం కావాలన్నారు. రహదారి భద్రతా బిల్లు రూపంలో అన్ని రకాల రవాణా సేవలను కేంద్రీకృతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యోగసంఘాలు మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారి భద్రతా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. అన్ని జిలా ్లల్లో రవాణాశాఖకు సొంత భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. సీటుబెల్టు, హెల్మెట్ పట్ల వివిధ రూపాల్లో ఇప్పటికే పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రవాణాశాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన రోడ్డు భద్రతా సీడీని, సావనీర్‌ను ఆవిష్కరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్‌గౌడ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, జేటీసీలు పాండురంగారావు, రఘునాథ్, రవాణాశాఖ టెక్నికల్ అధికారుల సంఘం ఆల్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షులు అశ్వాక్ అహ్మద్, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.