బడ్జెట్లో వైద్యానికి రూ.6 వేల కోట్లేనా?
కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ విమర్శ
సాక్షి, హైదరాబాద్: లక్షా 30 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో వైద్యానికి కేవలం రూ.6 వేల కోట్లే కేటాయించారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని చిన్నచూపు చూస్తోందని అన్నారు. ఈ మొత్తాన్ని పెంచాలని సూచించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవంలో దత్తాత్రేయ మాట్లాడారు. వైద్యసేవల్లో నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌సహా వివిధ రకాల వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు వేల రూపాయల ఖర్చు చేసి ప్రైవేటులో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్యరంగాన్ని మెరుగుపర్చేందుకు కేంద్రం ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో హెల్త్ రికార్డ్సు మొత్తం కంప్యూటరైజేషన్ చేస్తున్నామన్నారు. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలని ప్రధానమంత్రి నిర్ణయించారన్నారు. వైద్యులు ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రి నెలకొల్పాలన్నా... ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలన్నా తాను సహకరిస్తానన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ వివేక్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, మాజీ డీఎంఈ పుట్టా శ్రీనివాస్, కేర్ ఆసుపత్రి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు సి.రామకృష్ణ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.