కాంగ్రెస్ జీఎస్టీ ఎందుకు తేలేదంటే ?
► 542 మొబైల్ నంబర్లు జీఎస్టీ నమోదుకు కేటాయింపు
► తెలంగాణ జీఎస్టీ నెంబర్ 7901243032
► అస్తవ్యస్తమైన పన్ను విధానాన్ని సవరించాం- మంత్రి
హైదరాబాద్: దేశంలో అస్తవ్యస్తమైన పన్నుల విధానాన్ని మొదటిసారిగా మోదీ ప్రభుత్వం సవరించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. 17 రకాల పన్నుల స్థానంలో జీఎస్టీ అనే ఏకీకృత పన్నుల వ్యవస్థను కేంద్రం తీసుకొచ్చిందని ఆయన అన్నారు. జీఎస్టీ అమలుతో చెక్ పోస్టులు ఎత్తేస్తుండంతో సరుకు రవాణా వేగవంతం అవుతుందని అన్నారు. గతంలో వసూలు చేసిన పన్నుల్లో 40 శాతమే ఖజానాకు చేరేదని చెప్పారు. జీఎస్టీతో రెండు రాష్ట్రాలకు అత్యధిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. వస్తు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు గతంలో చెల్లించే 2 శాతం పన్నును ఇప్పుడ కేంద్రం చెల్లిస్తుందని, జీఎస్టీతో ద్రవ్యోల్బణం తగ్గుతుందని ధరలు తగ్గుతాయని వివరించారు.
ఒక దేశం.. ఒకేపన్ను నినాదంతో 1500 శ్లాబులో ఉన్న పన్నులను జీఎస్టీతో 4 శ్లాబులకు తెచ్చినట్లు మంత్రి చెప్పారు. తిండిగింజలు, కూరగాయలు, పిండి పదార్ధాలు వంటి ఆహార పదార్ధాలు పేదలకు సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బీడీ, మైకా, భవన నిర్మాణ కార్మికులకు అందించరే సెస్ కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా లభిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 40వేల మంది వ్యాపారులు 20లక్షల ఆదాయం లోపు ఉన్న వారేనని, వీరిపై జీఎస్టీ ప్రభావం ఉండదన్నారు. జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులకు మేలు కలుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా జీఎస్టీ వెబ్ పోర్టల్ రూపొందిస్తున్నారని అన్నారు.
542 మొబైల్ నంబర్లు జీఎస్టీ నమోదుకు కేటాయిస్తున్నారంటూ జీఎస్టీ నమోదు నెంబరు +917961243239, తెలంగాణ జీఎస్టీ నెంబర్ 7901243032 కేటాయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధాన లోపం కారణంగా జీఎస్టీ సాధించలేకపోయిందని మంత్రి విమర్శించారు. ఆ పార్టీ కనీస రాజకీయ పరిణతిని ప్రదర్శించడంలో విఫలమైందని అన్నారు. వామపక్షాలు కాంగ్రెస్ కు వంతపాడటం దురదృష్టకరమని దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ జోన్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కమిషనర్ సంనీల్ జైన్ మాట్లాడుతూ.. జీఎస్టీపై ఆరు నెలలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
ఏపీ, తెలంగాణలో విస్తృతంగా ప్రచారం నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలోని 146 కార్యాలయాల్లో జీఎస్టీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జీఎస్టీ నమోదు చేసుకునేందుకు ప్రత్యేకంగా 542 సెల్ నెంబర్లు అధికారులకు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ రూపంలో రూ.50వేల కోట్లు వసూలు చేశామన్నారు. 1244 రకాల వస్తువుల్లో 81 శాతం వస్తువులు 18 శాతం పన్ను పరిధిలో ఉన్నాయని ఆయన చెప్పారు.