కేంద్రం నిర్ణయంతో బీడి పరిశ్రమకు దెబ్బ
నిజామాబాద్ ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్: బీడీకట్టలపై పుర్రెగుర్తు సైజును తగ్గించేందుకు కృషి చేయాలని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆదివారం దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో దత్తాత్రేయను ఆమె కలసి ఒక లేఖను అందించారు. ఈ నెల 1 నుంచి బీడీకట్టలపై పుర్రెగుర్తు సైజును 85 శాతం ముద్రించాలన్న నిబంధన అమలులోకి వచ్చిందని, ఈ నిబంధనను నిలిపివేయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. దేశవ్యాప్తంగా 80 లక్షల మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, ఒక్క తెలంగాణలో 7 లక్షల మంది బీడీ పరిశ్రమలో ఉన్నారని, ఈ పరిశ్రమలో ఎక్కువమంది మహిళలే పనిచేస్తున్నారని తెలిపారు. బీడీ వినియోగాన్ని తగ్గించాలన్నా, పరిశ్రమను నిషేధించాలన్నా ముందుగా ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీవనోపాధి గురించి ఆలోచించాలని, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఓఎల్) సూచించిందని కవిత గుర్తు చేశారు.
ప్రధానితో మాట్లాడతా: దత్తాత్రేయ
లక్షల మంది జీవనోపాధికి సంబంధించిన విషయమైనందున పుర్రె గుర్తు సైజు తగ్గింపు గురించి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని మంత్రి దత్తాత్రేయ హామీ ఇచ్చారు. ఆరోగ్య మంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళతానని తన వెంట ఎంపీ కవితను కూడా తీసుకుపోతానని దత్తాత్రేయ మీడియాకు వివరించారు. మంత్రిని కలిసినవారిలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రూప్‌సింగ్ తెలంగాణ జాగృతి రైతు విభాగం కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
భట్టి విమర్శల్లో పస లేదు
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చేసిన విమర్శల్లో పస లేదని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ బావుందని దేశమంతా కితాబు ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం వాస్తవాలు విస్మరించి మాట్లాడుతున్నారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో కవిత మాట్లాడుతూ.. భట్టి మాటల్లో నిజం ఉంటే అసెంబ్లీకి హాజరయ్యేవారని, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాకే పలాయనం చిత్తగించారని వ్యాఖ్యానించారు.