ఎంపీ కవితతో భేటీలో మెదక్ డయాసిస్ బిషప్ సొలొమోన్‌రాజ్ ప్రశంస
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మెదక్ డయాసిస్ బిషప్ రెవరెండ్ డాక్టర్ ఎ.సి.సొలొమోన్ రాజ్ అభినందించారు. క్రైస్తవ సమాజం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమని కొనియాడారు. కానీ ఈ ఫలాలు ప్రతి క్రైస్తవుడికి అందినప్పుడే వారు అభివృద్ధి చెందుతారని ఆయన అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను బిషప్ శుక్రవారమిక్కడ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మెదక్ డయాసిస్‌కు మొదటి బిషప్‌గా బాధ్యతలు స్వీకరించిన సొలొమోన్ రాజ్‌ను ఎంపీ కవిత అభినందించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని మతాల వారినీ సమదృష్టితో చూస్తోందన్నారు. హిందువుల పండుగలకు ఇచ్చిన ప్రాధాన్యమే, ముస్లింలు, క్రై స్తవుల పండుగలకూ ఇస్తున్నామని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారూ తెలంగాణలో నివసిస్తున్నారని, వారి ఆచార, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, గొప్పదనాన్ని భావితరాలకు వారసత్వంగా అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని చర్చిల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి బిషప్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కో-ఆప్షన్ సభ్యుడు డాక్టర్ విద్యాస్రవంతి ఉదయ్‌కుమార్, సీఎస్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ఫ్రొఫెసర్ జొనాథన్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజీవ్ సాగర్, సీఎస్‌ఐ గారిసన్ చర్చ్ పాస్టోరేట్ స్టివార్డ్ ఇ.సుందర్‌రావు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.దేవసుందరం పాల్గొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు భేష్
Published Sat, Nov 19 2016 3:03 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM
Advertisement
Advertisement