ఓ పనైపోయింది..బాబు
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : గత రెండు నెలలుగా తీరికలేకుండా ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది. గతంలో ఎన్నడు లేని విధంగా వరుసగా మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒకేసారి ప్రాణం మీదికొచ్చినట్లయింది. అసలే రాష్ట్ర విభజన నేఫథ్యంలో రెగ్యులర్ విధులతో సమయం పెరిగిన ఉద్యోగులకు, ఎన్నికల విధులు మరింత సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది.
ఎన్నికల నేపథ్యంలో దాదాపు మున్సిపాల్ ఎన్నికల్లో 16 వేల మంది ఉద్యోగులు,స్థానిక సంస్థల ఎన్నికల్లో 30 వేల మంది,సార్వత్రిక ఎన్నికల్లో 20 వేల మంది ఉద్యోగులు ఉదయం నుంచి అర్ధరాత్రి పొద్దుపోయే వరకు పనిచేశారు. దీంతో చాలా మంది ఉద్యోగులు అనారోగ్యం పాలయ్యారు. అయినా కొందరు విధులు నిర్వర్తించారు. మరికొంత మంది ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఇరిగేషన్ ఈఈ ప్రశాంత్ రెడ్డి, బోధన్ తహశీల్ధార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సాల్మన్‌రాజ్ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఏజేసీకి ఆనారోగ్యం
అదే విధంగా అదనపు జేసీ శేషాద్రి ఎన్నికల విధుల్లో నిమగ్నమై పని ఒత్తిడిలో భా గంగా ఆయన అనారోగ్యపాలైన విషయం తెలిసిందే. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగం,స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగించడంతో ఉద్యోగులకు ఒక్కసారి పనిభారం పెరిగినట్లయింది.బ్యాలెట్ బాక్సులు తరలించడం,ఓటర్ల జాబితా,వాటిని పోలింగ్ కేంద్రాల వారీగా తయారు చేయటం,ఓటరు స్లిప్పులు పంచడం,శిక్షణ,సిబ్బంది నియామకం,పోలింగ్ కేంద్రాల ఏర్పాటు,వాటికి అవసరమైన సామాగ్రి,కేంద్రంలో మౌలిక వసతులు, ఈవీఎంలను తరలించడం, బ్యాలెట్ బాక్సులకోసం స్ట్రాంగ్ రూం ఏర్పాటు, వాటి భద్రతా ఏర్పాట్లు, కౌటింగ్ కేంద్రాల నిర్వహణ, పోలింగ్ లెక్కించడం తదితర పనులలో రెండు నెలలుగా నిమగ్నమయ్యారు.
సార్వత్రిక సమరం శుక్రవారం ముగియడంతో ఉద్యోగులు ఇప్పడు ఇప్పుడ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.శుక్రవారం అర్ధరాత్రి వరకు పనిచేసిన ఉద్యోగులు శనివారం ఉదయం కార్యాలయాలకు కాస్త ఆలస్యంగా వచ్చారు.అందరి ముఖాల్లో ఓ పనైపోయిందిరా బాబు అన్నట్లు ఉద్యోగులు ఒకరితో ఒకరు చర్చించుకున్న దృశ్యాలు చాలా శాఖల్లో కనపడ్డాయి.