‘వారసత్వం’ ఇక నిరంతరం
- టీజీబీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత
- కొన్ని కార్మిక సంఘాలు శని గ్రహాల్లా వ్యవహరిస్తున్నారుు
సాక్షి, కొత్తగూడెం: సింగరేణి కార్మికుల కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఇక నిరంతరం కొనసాగుతుందని, ఇందుకోసం ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో విసృ్తతంగా పర్యటించిన కవిత.. స్థానిక వెంకటేశ్‌ఖని 7 ఇంక్‌లైన్‌లో టీబీజీకేఎస్ సీనియర్ నేత వెంకట్రావ్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. కార్మికుల కష్టసుఖాల్లో పాలుపంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారిని కంటికి రెప్పలా కాపాడుతామని సీఎం కేసీఆర్ అనుక్షణం చెప్తుంటారని కవిత తెలిపారు. అందుకనుగుణంగానే 19 ఏళ్లుగా అమలుకు నోచుకోని సింగరేణి కార్మిక కుటుంబాలు వారసత్వ ఉద్యోగాలు పొందే హక్కును పునరుద్ధరించిందని చెప్పారు.
కార్మికుల సంక్షేమం, వారసత్వ ఉద్యోగాల నియామక పునరుద్ధరణ ప్రక్రియలో వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. అరుునా, యూనియన్ల రూపంలో ఉండే కొన్ని శనిగ్రహాలు న్యాయస్థానాలను ఆశ్రరుుంచి, ఈ ప్రక్రియ మొత్తాన్ని అడ్డుకునే ప్రమాదం ఉండటంతో.. ఆచితూచి అడుగు వేయాల్సి వచ్చిందని కవిత వివరించారు. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుతున్న టీబీజీకేఎస్‌ను వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించాలని కవిత కోరారు. అలాగే, 1997-2001 మధ్య ఎలాంటి నష్టపరిహారం తీసుకోకుండా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన 150 వీఆర్‌ఎస్ కార్మికుల కుటుంబాలకు సైతం వారసత్వ ఉద్యోగాలిస్తామని కవిత వెల్లడించారు. ఈ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.