‘నిబద్దతతో కూడిన నాయకుడు..’ | Modi's Popularity is on rise in society says minister Dattatreya | Sakshi
Sakshi News home page

‘నిబద్దతతో కూడిన నాయకుడు..’

Published Tue, Jun 6 2017 10:55 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

‘నిబద్దతతో కూడిన నాయకుడు..’ - Sakshi

‘నిబద్దతతో కూడిన నాయకుడు..’

► కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ 
 
హొసూరు : మూడేళ్ల ప్రజాభ్యుదయ పాలనకు నరేంద్రమోదీ పాలన సాకార రూపమని కేంద్ర కార్మిక ఉపాధిశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం హొసూరులోని  ప్రైవేట్‌ భవనంలో జరిగిన బీజేపీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేయలేని ఎన్నో అభివృద్ధి పనులు మోదీ ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత సాధ్యమైందన్నారు. 2009లో బీజేపీ పాలనకు రాక ముందు మోదీ పాపులారిటీ రెండు శాతం కాగా, 2014లో 36 శాతానికి, ప్రస్తుతం ప్రజాసంక్షేమానికి కృషి చేసే నిబద్దతతో కూడిన నాయకుడిగా 44 శాతానికి పెరిగిందని తెలిపారు.

ప్రధాన మంత్రి పసల్‌ బీమాయోజన పథకం, రైతుల పొలాలలో మట్టి నమూనాలు సేకరించి,. ప్రయోగశాలలో పరీక్షలు జరిపి ఆయా పొలాలకు, ప్రాంతాలకు తగిన పంటలు సాగుచేయడానికి తొలుత శ్రీకారం చుట్టిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనన్నారు. అదే సమయంలో ఈ నేషనల్‌ అగ్రి మార్కెట్‌ (ఈ నాం)విధానం ద్వారా కుగ్రామాల్లో సాగు చేసే కూరగాయలు, పళ్లు, పూలు తదితర  వ్యవసాయ ఉత్పత్తులు దూర ప్రాంతాల్లో విక్రయించేందుకు సౌలభ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో  తమిళనాడులో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా రూపుదిద్దుకోనున్నట్లు తెలిపారు.

తర్వాత విలేఖరుల సమావేశంలో హొసూరులో ప్రావిడెడ్‌ ఫండ్‌ కార్యాలయం లేకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందుల పాలవుతున్నారని ఒక విలేఖరి అడగ్గా ఈ విషయం పరిశీలిస్తామని, అదే సమయంలో కార్మికుల ఉద్యోగ భద్రతకు సంక్షేమానికి వివిధ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఢిల్లీలో తమిళనాడుకు చెందిన కావేరి సమస్యపై రైతులు ధర్నా నిర్వహిస్తున్నప్పటికీ  ప్రధాని వారిని కలుసుకొని మాట్లాడలేదన్న విలేఖరి ప్రశ్నకు   సమయాభావం కారణంగా  ప్రధానికి  వీలుపడలేదని,  ఈ విషయంపై సంబంధిత అధికారులు, నాయకులు వారితో మాట్లాడినట్లు తెలిపారు.  ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసైసౌందరరాజుతో పాటు బీజేపీ నాయకులు నరేంద్ర,  మునిరాజు, బాలక్రిష్ణ, వరదరాజు, క్రిష్ణగిరి జిల్లా ఎంపీ అశోక్‌కుమార్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement