ప్రధానిగా మోదీకి డిస్టింక్షన్‌ | PM Narendra Modi remains popular leader | Sakshi
Sakshi News home page

ప్రధానిగా మోదీకి డిస్టింక్షన్‌

Published Sun, Aug 9 2020 3:43 AM | Last Updated on Sun, Aug 9 2020 1:17 PM

PM Narendra Modi remains popular leader - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేని ప్రజాదరణ ఉందని మరోసారి తేలింది. ప్రధానిగా మోదీనే అత్యుత్తమం అని ‘ఇండియా టుడే – కార్వీ ఇన్‌సైట్స్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వే తాజాగా తేల్చింది. ప్రధానిగా మోదీ పనితీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో 30% మంది, బావుందని 48%, సాధారణంగా ఉందని 17% అభిప్రాయపడ్డారు. 5% మాత్రం మోదీ పనితీరు బాగాలేదన్నారు.

ఒకవైపు, దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా, మరోవైపు, దేశ ఆర్థిక రంగ కుంగుబాటు, ఇంకోవైపు చైనాతో తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న క్లిష్ట సమయంలో జరిగిన ఈ సర్వేలో.. దేశ ప్రజలు మోదీపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. ఫిబ్రవరి 2016 – ఆగస్టు 2020 మధ్య నిర్వహించిన 10 సర్వేలను పోలిస్తే.. మోదీకి ప్రజాదరణ గణనీయంగా పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రధానమంత్రిగా మోదీని ప్రజలు డిస్టింక్షన్‌లో పాస్‌ చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి çఏడాదైన విషయం తెలిసిందే. మోదీ ప్రజాదరణ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో అత్యధికంగా(4 పాయింట్‌ స్కేల్‌పై 3.14గా) ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తర భారతంలో 4 పాయింట్‌ స్కేల్‌పై 3.01గా, తూర్పు భారత్‌లో 3.02గా, దక్షిణ భారతంలో 2.99గా ఉంది. మతాల వారీగా చూస్తే హిందువుల్లో 3.13, ముస్లింల్లో 2.33 గా మోదీపై ప్రజాదరణ ఉంది.

కులాలవారీగా మోదీ ఓబీసీ, ఎంబీసీల్లో అత్యధికంగా 3.08, దళితుల్లో 3.01, అగ్రవర్ణాల్లో 2.99 స్కోరు సాధించడం గమనార్హం. ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ పనితీరు చాలా బావుందని కేవలం 9% మంది అభిప్రాయపడగా, బావుందని 35%, సాధారణమని 32%, బాగాలేదని 21% మంది తెలిపారు. కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకురాగలిగే నేత రాహుల్‌ గాంధీయేనని 23% మంది పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రియాంకాగాంధీకి 14%, మన్మోహన్‌ సింగ్‌కు 18%, సోనియా గాంధీకి 14% మంది ఓటేశారు.  

సర్వే లోని ఇతర ముఖ్యాంశాలు..
► కరోనా తమను తీవ్రంగా దెబ్బతీసిందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఆదాయం పూర్తిగా పడిపోయిందని 63%, ఉద్యోగం/వ్యాపారం పోయిందని 22%, పెద్దగా మార్పేమీ లేదన్న వారు 15%.

► ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమికి 316 సీట్లు..కాంగ్రెస్‌ కూటమికి 93, ఇతరులకు 134 సీట్లు వస్తాయి.

► మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు పనితీరు చాలా బావుందని 24%, బావుందని 48%, సంతృప్తి కానీ, అసంతృప్తి కానీ లేదని 19%, అసంతృప్తి అని 8%, ఏమీ చెప్పలేమని 1% చెప్పారు.

► మోదీ ప్రభుత్వ అతిపెద్ద విజయం జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అని 16%, రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు అని 13% అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతిరహిత పాలన అని 9%, మౌలిక వసతుల వృద్ధి అని 11% అభిప్రాయపడ్డారు.

► కరోనాను సరిగ్గా నియంత్రించలేకపోవడం మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమని 25%, నిరుద్యోగమని 23%, వలస కార్మికుల సంక్షోభమని 14% మంది తెలిపారు.

► ఆర్థిక రంగ పునరుత్తేజానికి కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ తమ ఆర్థిక స్థితిగతులను మారుస్తుందని 55% మంది విశ్వాసం వ్యక్తం చేయడం విశేషం.

► లాక్‌డౌన్‌తో ప్రభుత్వం చెప్పినట్లు లక్షలాది ప్రాణాలు నిలిచాయన్నది వాస్తవమని 34% మంది తెలిపారు. ఆర్థిక తిరోగమనానికి దారి తీసిందని 25%..ఆర్థిక తిరోగమనానికి దారితీసినా ఎక్కువ ప్రాణాలు కాపాడిందని 38% మంది చెప్పారు.


► వలస కార్మికుల దుస్థితికి బాధ్యులు.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అని 43%, రాష్ట్ర ప్రభుత్వాలు అని 14%, యాజమాన్యాలు అని 13%, సరైన సమాచారం లేకపోవడం అని 12%, కేంద్రం అని 10%, చెప్పలేమని 8% మంది చెప్పారు.

► తూర్పు లద్దాఖ్‌లో చైనాకు సరైన గుణపాఠం చెప్పిందని 69%, సరిగ్గా వ్యవహరించలేదని 15%, ప్రభుత్వం సమాచారం దాచి పెట్టిందని 10% తెలిపారు.  

► చైనా వస్తువుల బహిష్కరణకు 90 శాతం మంది మద్దతు పలికారు. 7 శాతం మంది నో అన్నారు. చైనా యాప్స్‌ను నిషేధించడం, కాంట్రాక్టులు రద్దు చేయడం సరైన విధానమేనని 91% స్పష్టం చేశారు.  

► కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ పనితీరు అత్యుత్తమంగా ఉందని 8%, బావుందని 33%, యావరేజ్‌ అని 35%, బాగాలేదని 20% మంది చెప్పారు.

► పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతిస్తామని 50% మంది స్పష్టం చేశారు.


బెస్ట్‌ పీఎం మోదీయే..
అత్యుత్తమ భారత ప్రధాని ఎవరన్న ప్రశ్నకు.. 44% మోదీకి, 14% వాజ్‌పేయికి, 12% ఇందిరా గాంధీకి, 7% నెహ్రూకి, 7% మంది మన్మోహన్‌కు ఓటేశారు. తదుపరి ప్రధానిగా 66% మోదీనే ఎన్నుకున్నారు. 8% రాహుల్‌కి, 5% సోనియాకి, 4% అమిత్‌షాకు ఓటేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement