New roads
-
తెలంగాణ కు కేంద్ర ప్రభుత్వ భూములు ప్రకటించిన కేంద్రం
-
రూ.1,045 కోట్లతో కొత్త రోడ్లు
సాక్షి, అమరావతి/దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా పెద్దఎత్తున కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టబోతోంది. ప్రధానంగా పట్టణాలతో వాటి సమీపంలోని గ్రామాలను కలిపే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. 20 రోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండే 202 రోడ్లను రూ.784.22 కోట్లతో పూర్తిస్థాయిలో మరమ్మతులతో పాటు పునర్నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీటికి అదనంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 916.22 కిలోమీటర్ల పొడవున మరో 115 తారు రోడ్లను కొత్తగా నిర్మించనుంది. వీటికితోడు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రోడ్ల మార్గమధ్యంలో ఉండే 72 పెద్దస్థాయి వంతెనలను కూడా పునర్నిర్మించనుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెండ్రోజుల క్రితం ఆదేశాలు జారీచేశారు. ఈ 72 వంతెనల పొడవే 6.670 కిలోమీటర్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇక కొత్తగా నిర్మించ తలపెట్టిన 916.22 కి.మీ. రోడ్ల నిర్మాణానికి రూ.576.15 కోట్లు.. 72 వంతెనల నిర్మాణానికి ఇంకో రూ.469.29 కోట్లు కలిపి ఈ విడతలో మొత్తం రూ.1,045.44 కోట్లు ఖర్చుకానుంది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ: డిప్యూటీ సీఎం ఇక కొత్తగా 115 తారురోడ్ల నిర్మాణంతో పాటు 72 పెద్దస్థాయి వంతెనల పునర్నిర్మాణానికి సంబంధించి మొత్తం 187 అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పనులకు సంబంధించి ఆర్థి క శాఖ నుంచి పరిపాలన ఆమోదం లభించిన అనంతరమే ఉత్తర్వులు వెలువడ్డాయని, టెండర్ల ప్రక్రియను వేగంగా పూర్తిచేసి వీలైనంత త్వరగా పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రోడ్ల అభివృద్ధికి ఒకేసారి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. రోడ్ల అభివృద్ధి పనులతోపాటు వంతెనల నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ప్రజలకు రహదారి కష్టాలు తీరుతాయన్నారు. -
శరవేగంగా డబుల్‌లైన్
ఆకివీడు: నాలుగు జిల్లాల్ని అనుసంధానం చేసే ఎన్‌హెచ్ 165 డెల్టా ప్రాంతానికి కీలకంగా మారింది. పామర్రు–(పీపీ) రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ రోడ్డును జాతీయ రహదారుల శాఖ రెండు దశాబ్దాల క్రితం విలీనం చేసుకుంది. అయితే రహదారి విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. తొమ్మిదేళ్ల క్రితం ఈ రోడ్డు అభివృద్ధికి అప్పటి కేంద్ర మంత్రి ఆకివీడులో భూమి పూజ చేశారు. పామర్రు నుంచి దిగమర్రు వరకూ 107 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లైన్లగా విస్తరించేందుకు రూ.1,275 కోట్లు కేటాయించారు. రహదారి విస్తరణ కోసం సరిహద్దు భూముల సేకరణపై కొంత మంది రైతులు, స్థల యజమానులు కోర్టుకు వెళ్ళడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. 90 కల్వర్టుల నిర్మాణం పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వరకూ రహదారి విస్తరణ పనుల్ని వేగవంతం చేశారు. నిర్మాణ పనుల్ని రెండు ప్రాజెక్టులుగా విడదీసి, పామర్రు–ఆకివీడు వరకూ రూ.273 కోట్లతో పనుల్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల పరిధిలో 90 కల్వర్టులు, 16 వంతెనలు, 2 మేజర్ బ్రిడ్జిల నిర్మాణం వేగంగా జరుగుతుంది. పలు చోట్ల రహదారి విస్తరణ పనుల్ని చేపట్టారు. గుడివాడ, ఆకివీడు వద్ద ఉప్పుటేరుపై మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఉప్పుటేరు నుంచి దిగమర్రుపై కోర్టు వివాదం ఆకివీడు ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణపై కోర్టు వివాదం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న రహదారికి రెట్టింపు భూమి సేకరించాల్సి ఉంది. కొన్ని చోట్ల మూడు లైన్లకు అనుకూలంగా జాతీయ రహదారి భూమి ఉంది. మరికొన్ని చోట్ల రెండు లైన్ల రోడ్డే ఉంది. దీంతో ఆకివీడు, ఉండి, భీమవరం, వీరవాసరం, లంకలకోడేరు ప్రాంతాల్లో భూసేకరణకు ఎన్‌హెచ్ అధికారులు చర్యలు చేపట్టారు. భూ యజమానులకు, ఎన్‌హెచ్ అధికారుల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని యజమానులు కోర్టును ఆశ్రయించారు. ఎన్‌హెచ్ 165 నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులు ఈ ప్రాంతంలో చేపట్టడం ద్వారా రహదారి మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు పేర్కొంటున్నారు. దిగమర్రు వరకు రహదారి పనులు పూర్తయితే అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు రహదారి అనుసంధానమవుతుందని పేర్కొంటున్నారు. దీని ద్వారా పశ్చిమ, కృష్ణా డెల్టా ప్రాంతాలు అనుసంధానమయ్యే అవకాశం ఉంది. దిగమర్రు నుంచి వేగంగా పనులు కృష్ణా జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–165 రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వంతెన వరకూ రూ.273 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 90 కల్వర్టుల నిర్మాణం, రెండు మేజర్ వంతెనల నిర్మాణం జరుగుతుంది. – ఎం.సత్యనారాయణరావు, డీఈ, ఎన్‌హెచ్, కృష్ణా జిల్లా కోర్టు అనుమతి రావాలి ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ పనులకు కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంది. పలు చోట్ల రహదారి విస్తరణకు అవసరమయ్యే స్థల సేకరణపై సంబంధిత యజమానులు కోర్టుకు వెళ్లారు. నాలుగు జిల్లాల్ని అనుసంధానం చేసే 165 రహాదారి వల్ల ప్రజలకు అనేక ఉపయోగాలున్నాయి. –శ్రీనివాసరావు, డీఈ, ఎన్‌హెచ్, పశ్చిమ జిల్లా, భీమవరం -
గ్రామాలను పట్టణాలకు కలుపుతూ మరో 976 కి.మీ. రోడ్లు
సాక్షి, అమరావతి: గ్రామాలను సమీప పట్టణాలకు కలుపుతూ రాష్ట్రంలో మరో 976 కిలోమీటర్ల పొడవున కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది. పీఎంజీఎస్వైలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 40:60 నిష్పత్తిన మొత్తం రూ.1,110.1 కోట్లు వెచ్చించనున్నాయి. దీన్లో రూ.607.87 కోట్లతో 976 కిలోమీటర్ల రోడ్లు నిర్మించనుండగా, రూ.502.23 కోట్లతో 76 బ్రిడ్జిలు నిర్మిస్తారు. జిల్లాల వారీగా కొత్తగా నిర్మించే రోడ్ల వివరాలతో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. దీనికి తుది ఆమోదం కోసం ఉగాది పండుగ రోజు (ఈ నెల 22న) కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం లాంఛనమేనని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలన్నింటికీ కేంద్రం ఇప్పటికే సూత్రపాత్రయంగా అంగీకారం తెలిపిందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు పీఎంజీఎస్‌వై ద్వారా రాష్ట్రంలో 1,291 కిలోమీటర్ల పొడవున 268 కొత్త రోడ్ల నిర్మాణం పూర్తిచేసినట్టు తెలిపారు. వాటికి సంబందించి జనవరి నెలాఖరు వరకు బిల్లులను కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించిందని చెప్పారు. -
గిద్దలూరు–వినుకొండ రోడ్డుకు లైన్‌క్లియర్
సాక్షి, అమరావతి: రాయలసీమను విజయవాడతో అనుసంధానిస్తూ మరో కొత్త రహదారి నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు కొత్త రహదారిని నిర్మించనున్నారు. ప్రధానంగా రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాల నుంచి విజయవాడకు మరింత మెరుగైన కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విజయవాడ నుంచి బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్ హైవే, అనంతపురం నుంచి విజయవాడకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. వాటితో రాయలసీమ ప్రాంతానికి పూర్తిస్థాయిలో అనుసంధానం సాధ్యపడుతోంది. కానీ, రాయలసీమలోని నల్లమల ప్రాంతానికి మాత్రం విజయవాడతో సరైన రహదారి లేకుండాపోయింది. దాంతో సీమలోని వెనుకబడిన ప్రాంతాలను విజయవాడ ప్రాంతంతో మరింతగా అనుసంధానించేందుకు గిద్దలూరు–వినుకొండ రహదారి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వినుకొండ నుంచి విజయవాడకు ఇప్పటికే ప్రధాన రహదారితో కనెక్టివిటీ ఉంది. కాబట్టి గిద్దలూరు నుంచి వినుకొండ వరకు రహదారి నిర్మిస్తే సరిపోతుందని ప్రభుత్వం భావించింది. దీనిపై ఎన్హెచ్ఏఐ సానుకూలంగా స్పందించి ప్రాజెక్టును ఆమోదించింది. రూ.925.60 కోట్లతో ప్రణాళిక ► ఈ జాతీయ రహదారిని ఎన్‌హెచ్–544డీ పేరుతో ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండ వరకు నిర్మిస్తారు. ► 112.80 కి.మీ. పొడవున రెండు వరుసల రహదారిగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.925.60 కోట్ల ప్రణాళికను ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. ► ఈ రహదారి నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ త్వరలో శంకుస్థాపన చేస్తారు. ► 2023 జనవరి నాటికి ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తిచేయాలన్నది ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
ఆర్ఆర్ఆర్.. అంతా కొత్త రోడ్డే
రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించే ప్రతిపాదిత అలైన్‌మెంట్‌కు కాస్త అటూ ఇటుగా నగరం చుట్టూ ఇప్పటికే ఒకదానికి ఒకటి అనుసంధానమవుతూ చిన్న రోడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిని విస్తరిస్తూ పోతే కూడా కొత్త రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. కానీ ఇవన్నీ పట్టణాలు, ఊళ్ల మీదుగా సాగుతున్న రోడ్లు. ఓ క్రమపద్ధతి అంటూ లేకుండా వంకరటింకరగా ఉన్నాయి. దీంతో ఆ పాత రోడ్లను అసలు వినియోగించుకోకుండా పూర్తి కొత్త రోడ్డుగా రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు. సాక్షి, హైదరాబాద్: నగరం చుట్టూ రానున్న రీజనల్ రింగ్ రోడ్డు (338 కిలోమీటర్లు) పూర్తి కొత్త రోడ్డుగా అవతరించనుంది. నగరానికి 50 కి.మీ.నుంచి 70 కి.మీ. దూరంలో... దాదాపు 20 ప్రధాన పట్టణా లను అనుసంధానిస్తూ వలయాకారంలో నిర్మాణం కానున్న ఈ భారీ ఎక్స్‌ప్రెస్‌వే కోసం ఎక్కడా పాత రోడ్లను వినియోగించుకోరు. భూసేకరణ జరిపి పూర్తి కొత్త (గ్రీన్‌ఫీల్డ్ అలైన్మెంట్) రాచబాటగా నిర్మించబోతున్నారు. నగరం చుట్టూ నిర్మితమైన ఔటర్ రింగురోడ్డుకు (162 కిలోమీటర్లు) ఆవల 30 కి.మీ. దూరంలో ఈ కొత్త రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఇందుకు అవసరమైన భూమి మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సిందే. ప్రస్తుతానికి ఉన్న తాత్కాలిక అంచనా ప్రకారం దాదాపు 11 వేల ఎకరాల భూమి అవసరం కానుంది. దీనికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చవుతాయని భావిస్తున్నారు. ఇందులో 50 శాతం మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం భరించనుండగా, మిగతా మొత్తం కేంద్రం ఇస్తుంది. ప్రస్తుతానికి 4 వరుసల ఎక్స్‌ప్రెస్ వే హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు తర్వాత నిర్మితమవుతున్న రెండో ఎక్స్‌ప్రెస్ వే ఇది. మొదటి దశలో దీన్ని నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనున్నారు. ఇందుకోసం వంద మీటర్ల కారిడార్ ఉండేటట్లుగా భూసేకరణ జరపనున్నారు. ఆర్ఆర్ఆర్ వెంబడి వాణిజ్యపరమైన నిర్మాణాలకు స్థలం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఇంకా అధికంగా భూసేకరణను సూచిం చింది. ప్రస్తుతం నగరం చుట్టూ భూముల ధరలు విపరీతంగా పెరిగినందున భూసేకరణ భారం మోయటం కష్టమవటంతో పాటు, చాలా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున.. 100 మీటర్లకే పరిమితం కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది. ఇందులో 11.5 మీటర్ల (వెడల్పు) చొప్పున ఇరువైపులా డబుల్ లేన్లు ఉంటాయి. అలా మొత్తం నాలుగు లేన్ల ప్రధాన క్యారేజ్ వే ఏర్పడుతుంది. దానికి రెండు వైపులా 7 మీటర్ల చొప్పున సర్వీసు రోడ్లు ఉంటాయి. ప్రస్తుతానికి నాలుగు వరుసల రోడ్డునే నిర్మిస్తారు. భవిష్యత్తులో దాన్ని ఎనిమిది లేన్లకు విస్తరిస్తారు. ఆటోలు, ద్విచక్రవాహనాలకు ‘నో ఎంట్రీ’ ఇది ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మితమవుతున్నందున ఈ రోడ్డుపై ఆటోలు, ద్విచక్రవాహనాలకు అనుమతి ఉండదు. వాహనాలు గరిష్ట పరిమితి వేగంతో దూసుకుపోయేలా నిర్మిస్తున్నందున ఆటోలు, ద్విచక్రవాహనాలు అనుమతిస్తే ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అందుకని వాటికి అనుమతి ఉండదు. ఆ వాహనాలు ప్రస్తుతం ఉన్న రోడ్లను మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఏ ఊరు.. ఏ సర్వే నెంబర్.. ఆరునెలల తర్వాతే స్పష్టత దాదాపు మూడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. భారీ ప్రాజెక్టు కావటంతో దీన్ని జాతీయ రహదారిగా గుర్తించాలన్న రాష్ట్రప్రభుత్వ విన్నపానికి అప్పట్లో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ మౌఖిక సానుకూలత వ్యక్తం చేశారు. తొలుత ప్రాజెక్టు మొదటి దశ అయిన సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 152 కి.మీ. మార్గానికి జాతీయ రహదారి హోదా ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. రెండోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఇలాంటి కొన్ని రోడ్లపై సమీక్షి నిర్వహించి, దాదాపు రూ.13 వేల కోట్ల భారీ వ్యయమయ్యే ఆర్ఆర్ఆర్ వల్ల ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా ఉండవన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. అప్పటికి ఈ రోడ్డు అలైన్మెంటుపై ఎలాంటి స్పష్టత లేదు. కేవలం గూగుల్ మ్యాపు ఆధారంగా ఓ ప్రతిపాదన రూపొందించారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి, గతంలో కేంద్రం సూచించిన మార్పులకు రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో... ఈ ప్రతిపాదనను తిరిగి కేంద్రం పరిశీలిస్తోంది. దాదాపు అనుమతులు మంజూరు చేసే దిశగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టత వచ్చింది. త్వరలో లిఖితపూర్వకంగా ఆమోదముద్ర పడనుంది. అలా అనుమతులు వచ్చాక జాతీయ రహదారుల విభాగం అధికారులు అసలైన అలైన్‌మెంట్‌ను రూపొందించనున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లి రోడ్డు ఏయే ప్రాంతాల మీదుగా నిర్మించాలో నిర్ధారించనున్నారు. ఇందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అసలు అలైన్‌మెంట్‌పై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఫీల్డ్ సర్వే చేసిన తర్వాతనే ఊళ్లు, సేకరించాల్సిన భూమి సర్వే నెంబర్ల వివరాలు తెలుస్తాయి. దాదాపు 25 చిన్నాపెద్దా పట్టణాలు, 300 వరకు గ్రామాలను ఇది అనుసంధానిస్తుందని అంచనా. 8 జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం ఈ బృహత్ ఎక్స్‌ప్రెస్‌వే 8 జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానిస్తుంది. ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్– 161, ఎన్‌హెచ్– 44, ఎన్‌హెచ్–765, ఎన్‌హెచ్–765డి, ఎన్‌హెచ్–163, రాజీవ్ రహదారి, నాగార్జున సాగర్ రోడ్డులను అనుసంధానిస్తుంది. ఒక రోడ్డు నుంచి మరో రోడ్డులోకి మారేందుకు నగరంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే రీజినల్ రింగురోడ్డు మీదుగా మళ్లొచ్చు. దీనివల్ల నగరంపై ట్రాఫిక్ భారం తగ్గుతుంది. కనీసం ఆరేళ్లు పట్టే అవకాశం! ఇది పూర్తిగా కొత్త రోడ్డు అయినందున ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు కనీసం ఆరేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అలైన్‌మెంట్‌కు ఆరు నెలల నుంచి ఏడాది సమయం, భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేందుకే కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కల్వర్టులు, వంతెనలతో కూడిన రోడ్డు నిర్మాణం దాదాపు మూడేళ్లకు పైగా పడుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇందులో భూసేకరణ అతిక్లిష్టమైన అంశం. అందులో ఎంత జాప్యం జరిగితే ప్రాజెక్టు అంత నెమ్మదిగా కదులుతుంది. -
బాట మాటున కాసుల వేట
అధికార పార్టీ నాయకద్వయం అవినీతి బాగోతం వంతాడ మైనింగ్ నిర్వాహకుల లబ్ధికి ఆరాటం ఎన్‌హెచ్ నుంచి లంపకలోవ మీదుగా బీటీ రోడ్డు నిర్మాణం ఆర్ అండ్ బీ శాఖ నుంచి రూ.10 కోట్లు విడుదల ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెక్కు గ్రామాల వారికి ప్రయాణమంటే.. ఒళ్లు హూనమయ్యే ప్రయాస. ఏ అవసరానికి ఊరు కదలాల్సి వచ్చినా.. అదో వ్యధ. ఏళ్ల తరబడి దుస్థితిలో ఉన్న రహదారులే అందుకు కారణం. ఆ దుస్థితికి మూలం ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులే. అదే నియోజకవర్గంలో ప్రస్తుతం 16 కిలోమీటర్ల మేర ఓ రోడ్డు నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అంత అత్యవసరంగా రూ.10 కోట్లతో ఆ రహదారి పనులను చేపట్టడం వెనుక ప్రజాప్రయోజనాకాంక్ష అణుమాత్రం లేదు. ఉన్నదల్లా.. కేవలం వంతాడ మైనింగ్ యాజమాన్యానికి మేలు చేకూర్చాలన్న అధికారపార్టీ ముఖ్యనేతల ఆరాటం మాత్రమే. ఆ ఆరాటం వెనుక వారికి కొన్ని కోట్లు దక్కాయన్న ఆరోపణ వినిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘బాబూ! బురదలో నడవలేకపోతున్నాం. కాస్తంత దారి చూపండి’ అంటూ చాలా గ్రామాల్లో ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోని పాలకులు.. ‘పర్సంటేజీలు’ వస్తాయంటే మాత్రం ఎగిరి గంతేసి ఒకే రోడ్డుకు ఎన్ని కోట్లు విడుదల చేయించడానికైనా ఉత్సాహపడుతున్నారు. జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందినlఇద్దరు ముఖ్యనేతలు ఇప్పుడదే చేస్తున్నారు. ఓ మైనింగ్ నిర్వాహకులకు లబ్ధి చేకూర్చేందుకు రూ.10 కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారు. ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో లంపకలోవ గ్రామం ఉంది. జనాభా సుమారు ఐదువేలు. గ్రామం నుంచి జాతీయరహదారికి 3.7 మీటర్ల వెడల్పున ఉన్న ఆర్అండ్బి రహదారి ప్రస్తుతం అదే నియోజకవర్గంలోని అనేక రహదారుల కన్నా మంచి స్థితిలోనే ఉంది. అయితే ఆ ఒక్క రోడ్డును 3.7 మీటర్ల నుంచి ఏడు మీటర్లకు విస్తరించి బీటీ రోడ్డుగా నిర్మిస్తున్నారు. అంతేకాదు.. లంపకలోవ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో మైనింగ్ జరుగుతున్న వంతాడ వరకూ రోడ్డును అదేస్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవల మెుదలైన ఆ రోడ్డు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అదంతా ఆ గ్రామంపై నేతలకున్న ప్రేమ కాదని, కేవలం వంతాడ మైనింగ్‌కు చెందిన భారీవాహనాలు ప్రయాణించేందుకేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లంపకలోవకు 8 కిలోమీటర్ల దూరంలో వంతాడ వద్ద కోట్ల కోట్ల విలువైన లాటరైట్ మైనింగ్ జరుగుతోంది. అక్కడ నుంచి జాతీయరహదారికి 16 కిలోమీటర్లు. మైనింగ్ జరిగే ప్రదేశం నుంచి లంపకలోవ శివారు వరకు నిర్వాహకులే గ్రావెల్‌రోడ్డు నిర్మించుకున్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారపార్టీకి చెందిన ఇద్దరు నేతలు మైనింగ్ నిర్వాహకుల మేలు కోసం నడుం బిగించారు. ఆర్ అండ్ బీ నుంచి రూ.10 కోట్లు విడుదల చేయించారు. ఆ సొమ్ముతోనే జాతీయ రహదారి నుంచి లంపకలోవ వరకూ, అక్కడి నుంచి మైనింగ్ జరిగే ప్రాంతం వరకూ బీటీ రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరు నేతలకు ఎవరి వాటా వారికి దక్కిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం మైనింగ్ వాహనాల కోసమే రోడ్డు వేయిస్తున్నారు తమపై అభిమానంతో కాదని గ్రామస్తులే అంటున్నారు. ఈ బాటల దుస్థితి కానరాదా? ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే అనేక రహదారులు పెద్దపెద్ద గోతులతో ప్రయాణం ప్రమాదభరితమనిపించేలా ఉన్నాయి. వాటిలో ఆర్అండ్బీ రహదారులు చాలానే ఉన్నాయి. రౌతులపూడి మండలం మెరకచామవరం నుంచి పారుపాక (5 కిలోమీటర్లు), శంఖవరం మండలం కత్తిపూడి నుంచి శంఖవరం (9 కిలోమీటర్లు), ఏలేశ్వరం మండలం భద్రవరం నుంచి ప్రత్తిపాడు మండలం శాంతిఆశ్రమం (30 కిలోమీటర్లు), ప్రత్తిపాడు మండలం రాచపల్లి నుంచి పెద్దిపాలెం (10 కిలోమీటర్లు) రోడ్లు అధ్వానస్థితికి చేరాయి. వీటిలో అనేక రోడ్లు పదుల కొద్దీ గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధానికి ఆధారమైనవి. కొన్ని రోడ్లు ఆటోలు సైతం తిరగలేనంత దుస్థితిలో ఉన్నాయి. ఏలేశ్వరం నుంచి ఏజెన్సీ మండలాలైన అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, విశాఖ జిల్లా నర్సీపట్నం తదితర ప్రాంతాలకు నిత్యం వేలాది మంది ప్రయాణించే రహదారి అధ్వానంగా తయారై మూడేళ్లు గడుస్తున్నా ముఖ్య ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇదే నియోజకవర్గంలో మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి నyì చి వెళ్లేందుకు రహదారులు లేక గిరిజనులు పడుతున్న ఇబ్బందులు అనీఇన్నీ కావు. అటువంటిది లంపకలోవ పేరుచెప్పి ఒకే రోడ్డుకు రూ.10 కోట్లు ఎలా వెచ్చిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకో గ్రామానికి కోటి కేటాయించినా పది రోడ్లు బాగుపడేవంటున్నారు. ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి కేవలం మైనింగ్ నిర్వాహకుల కోసం ఆగమేఘాలపై రోడ్డు వేస్తున్న పాలకుల తీరును ప్రజలు గర్హిస్తున్నారు. మైనింగ్ మాఫియా కోసమే ఆ రహదారి మైనింగ్ మాఫియా కోసం ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారు. లంపకలోవ నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో మైనింగ్ జరుగుతోంది. ముమ్మాటికీ మైనింగ్ కోసమే ఆ రహదారి. –కొశిరెడ్డి గణేష్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యుడు ప్రజాధనం వృథాపై విచారణ జరిపించాలి.. కోట్లాది రూపాయలతో రహదారి నిర్మిస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి ఆ రోడ్డుకు వెచ్చించే నిధులతో పలు రహదారులు బాగుపడేవి. –కందా నాగేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకుడు -
నత్తనడకన హవేళి ఘణాపూర్ రోడ్డు మరమ్మతులు
రోడ్డుపై నుండి విద్యుత్ స్థంభాలు తొలగించని వైనం అవస్థల్లో ప్రయాణికులు మెదక్‌రూరల్: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం అత్యవసరం. దీన్ని గుర్తించి ప్రభుత్వం కొన్ని మేజర్ గ్రామాలకు కొత్తరోడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేసింది. కాని అధికారుల అలసత్వం...కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఓ రోడ్డు పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ప్రయాణీకులు, వాహనదారులు దుమ్ము,ధూళితో నరక యాతన అనుభవిస్తున్నారు. మెదక్ మండల పరిధిలోని రామాయంపేట ఆర్అండ్బి రోడ్డు నుండి హవేళి ఘణాపూర్ వరకు సుమారు 3కిలోమీటర్ల సింగిల్‌రోడ్డును డబుల్‌రోడ్డుగా నిర్మించేందుకు గత 8 నెలల క్రితం రూ.3.50కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు చురుకుగా సాగడం లేదు. పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో రోడ్డుపైన వేసిన కంకరతో వాహనదారులు, ప్రజలు ప్రయాణించలేక నానా పాట్లు పడుతున్నారు. కాగా ఈ రహదారిలోనే జిల్లాలోని ఏకైక డైట్ కళాశాల ఉంది. అలాగే మండలంలోని లింగ్సాన్‌పల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలతోపాటు వైపీఆర్ ఇంజనీర్ కళాశాలకు ఇదే దారి కావడంతో విద్యార్థులతోపాటు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈముఖ్యంగా రామాయంపేట నుండి వయా హవేళిఘణాపూర్ మీదుగా నాగాపూర్ సబ్‌స్టేషన్‌కు 33కేవి హైటెన్షన్ విద్యుత్‌లైన్ వేశారు. ఈ స్థంభాలు తొలగిస్తే తప్ప రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగవు. వాటిని తొలగించడంలో ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్అండ్బి, ట్రాన్స్‌కో శాఖల మధ్య సమన్వయంలేక రోడ్డు నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. పనులు ప్రారంభమై 8నెలలు గడుస్తున్నా వీటిని తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందిఈ విషయంపై ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపుల ఉన్న స్థంభాలను తొలగించడంతో రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
మెరుపు రోడ్లు
కొత్త రహదారుల నిర్మాణం సిద్ధమవుతున్న జీహెచ్ఎంసీ 200 కి.మీ.ల వైట్‌టాపింగ్, 200 కి.మీ.లు బీటీ రోడ్ల ఎంపికకు కసరత్తు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో 400 కి.మీ.ల మేర కొత్త రోడ్లు రానున్నాయి. వీటిల్లో 200 కి.మీ.లు బీటీ రోడ్లు... మరో 200 కి.మీ.లు వైట్ టాపింగ్ రోడ్లు వేయాలని యోచిస్తున్నారు. జీహెచ్ఎంసీలో అన్ని రకాల రోడ్లు దాదాపు 8 వేల కి.మీ.ల మేర ఉన్నాయి. వీటికి మరమ్మతుల పేరిట ఏటా దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినా... నాలుగు చినుకులు పడగానే పరిస్థితి షరా మామూలుగా మారుతోంది. ఇటీవల బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో నిర్మించిన వైట్‌టాపింగ్ రోడ్డు బాగుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. దీంతో గ్రేటర్‌లోని ఐదు జోన్లకుగాను ఒక్కో దానిలో 40 కి.మీ.ల వంతున వైట్‌టాపింగ్ రోడ్లు వేయాలని భావిస్తున్నారు. మరో 40 కి.మీ.ల మేర బీటీ రోడ్లు వేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మార్గాలు ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే పనులు మొదలు పెడతారు. వైట్‌టాపింగ్‌తో మేలని... బీటీ రోడ్లు వేసిన మూణ్నాళ్లకే కొట్టుకుపోతుండటంతో ఖర్చు ఎక్కువైనా వైట్‌టాపింగ్ రోడ్లే మేలని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ భావిస్తున్నారు. నగరానికి ఇవి అనువైనవే కాకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి కాబట్టి వీటిని నిర్మించాక రోడ్ల నిర్వహణ, మరమ్మతుల వ్యయాలు చాలా వరకు తగ్గుతాయి. వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణానికి రెండు పద్ధతులను కమిషనర్ ఆలోచిస్తున్నారు. యధావిధిగా టెండర్లు పిలిచి కొన్ని మార్గాల్లో వైట్‌టాపింగ్ పనులు చేయాలని భావిస్తుండగా... మరికొన్ని మార్గాలకు సిమెంటు కంపెనీల యాజమాన్యాల సమాఖ్య సహకారంతో తక్కువ ఖర్చుతో నామినేషన్‌పై ఇవ్వాలని భావిస్తున్నారు. ఈమేరకు వారితో సంప్రదించిన కమిషనర్ వీలైనంత తక్కువ ఖర్చుతో వైట్‌టాపింగ్ రోడ్లు వేయాల్సిందిగా కోరినట్లు తెలిసింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ప్రయోగాత్మకంగా నిర్మించిన రోడ్డును సమాఖ్య ఉచితంగానే నిర్మించింది. సిమెంటు కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నందున, రాష్ట్ర రాజధాని నగరంలో వైట్‌టాపింగ్ రహదారులు వేయడం ద్వారా నగర ప్రతిష్ట పెరుగుతుందని... అందుకుగాను తగిన సహకారం అందించాల్సిందిగా కమిషనర్ వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.