ఆకివీడులోని ఎన్‌హెచ్ 165 రహదారి
ఆకివీడు: నాలుగు జిల్లాల్ని అనుసంధానం చేసే ఎన్‌హెచ్ 165 డెల్టా ప్రాంతానికి కీలకంగా మారింది. పామర్రు–(పీపీ) రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ రోడ్డును జాతీయ రహదారుల శాఖ రెండు దశాబ్దాల క్రితం విలీనం చేసుకుంది. అయితే రహదారి విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. తొమ్మిదేళ్ల క్రితం ఈ రోడ్డు అభివృద్ధికి అప్పటి కేంద్ర మంత్రి ఆకివీడులో భూమి పూజ చేశారు. పామర్రు నుంచి దిగమర్రు వరకూ 107 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లైన్లగా విస్తరించేందుకు రూ.1,275 కోట్లు కేటాయించారు. రహదారి విస్తరణ కోసం సరిహద్దు భూముల సేకరణపై కొంత మంది రైతులు, స్థల యజమానులు కోర్టుకు వెళ్ళడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి.
90 కల్వర్టుల నిర్మాణం
పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వరకూ రహదారి విస్తరణ పనుల్ని వేగవంతం చేశారు. నిర్మాణ పనుల్ని రెండు ప్రాజెక్టులుగా విడదీసి, పామర్రు–ఆకివీడు వరకూ రూ.273 కోట్లతో పనుల్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల పరిధిలో 90 కల్వర్టులు, 16 వంతెనలు, 2 మేజర్ బ్రిడ్జిల నిర్మాణం వేగంగా జరుగుతుంది. పలు చోట్ల రహదారి విస్తరణ పనుల్ని చేపట్టారు. గుడివాడ, ఆకివీడు వద్ద ఉప్పుటేరుపై మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఉప్పుటేరు నుంచి దిగమర్రుపై కోర్టు వివాదం
ఆకివీడు ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణపై కోర్టు వివాదం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న రహదారికి రెట్టింపు భూమి సేకరించాల్సి ఉంది. కొన్ని చోట్ల మూడు లైన్లకు అనుకూలంగా జాతీయ రహదారి భూమి ఉంది. మరికొన్ని చోట్ల రెండు లైన్ల రోడ్డే ఉంది. దీంతో ఆకివీడు, ఉండి, భీమవరం, వీరవాసరం, లంకలకోడేరు ప్రాంతాల్లో భూసేకరణకు ఎన్‌హెచ్ అధికారులు చర్యలు చేపట్టారు. భూ యజమానులకు, ఎన్‌హెచ్ అధికారుల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని యజమానులు కోర్టును ఆశ్రయించారు. ఎన్‌హెచ్ 165 నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులు ఈ ప్రాంతంలో చేపట్టడం ద్వారా రహదారి మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు పేర్కొంటున్నారు. దిగమర్రు వరకు రహదారి పనులు పూర్తయితే అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు రహదారి అనుసంధానమవుతుందని పేర్కొంటున్నారు. దీని ద్వారా పశ్చిమ, కృష్ణా డెల్టా ప్రాంతాలు అనుసంధానమయ్యే అవకాశం ఉంది.
దిగమర్రు నుంచి వేగంగా పనులు
కృష్ణా జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–165 రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వంతెన వరకూ రూ.273 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 90 కల్వర్టుల నిర్మాణం, రెండు మేజర్ వంతెనల నిర్మాణం జరుగుతుంది.
– ఎం.సత్యనారాయణరావు, డీఈ, ఎన్‌హెచ్, కృష్ణా జిల్లా
కోర్టు అనుమతి రావాలి
ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ పనులకు కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంది. పలు చోట్ల రహదారి విస్తరణకు అవసరమయ్యే స్థల సేకరణపై సంబంధిత యజమానులు కోర్టుకు వెళ్లారు. నాలుగు జిల్లాల్ని అనుసంధానం చేసే 165 రహాదారి వల్ల ప్రజలకు అనేక ఉపయోగాలున్నాయి.
–శ్రీనివాసరావు, డీఈ, ఎన్‌హెచ్, పశ్చిమ జిల్లా, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment