భూ సమస్యల్లో పోలీసుల జోక్యం నివారించాలి
ఏలూరు (టూటౌన్): ఏజన్సీ భూ సమస్యల్లో పోలీసుల అనుచిత జోక్యం నివారించాలని కోరుతూ సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డీఎన్‌వీడీ ప్రసాద్, కె. శ్రీనివాస్ లతో కూడిన బృందం మంగళవారం జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వాములకు అనుకూలంగా ఇచ్చిన ప్రొటెక్షన్ ఆర్డర్లను రద్దు చేయాలని, 1/70 చట్టం భూములపై పోలీసుల జోక్యం ఆపాలని, గిరిజనులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని ఆయన కోరారు. గిరిజనుల పంటను నాశనం చేసిన భూస్వాములపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీ కమిషన్ సభ్యులు నాయక్ ఆదేశాల ప్రకారం బుట్టాయిగూడెంలో ఆర్‌ఎస్. నెంబర్ 550/3,4లో గిరిజన పేదలు గుడిసెల విషయంలో పోలీసుల జోక్యం నివారించాలని కోరారు. ఎస్పీ స్పందిస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చానట్లు సీపీఎం నేతలు తెలిపారు.
కార్మికుని కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): ప్రసాద్ సీడ్స్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ ప్రమాదానికి గురై మృతి చెందిన కార్మికుని కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఐ, సీపీఎం సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. పెదవేగి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన ఎస్. రవీంద్ర (35) సోమవారం ప్రసాద్ సీడ్స్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్‌లో పడి మృతి చెందాడన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.50 లక్షలు చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ కోరారు.
మహిళ అదృశ్యంపై ఫిర్యాదు
ఆగిరిపల్లి: మహిళ అదృశ్యంపై ఆగిరిపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రెడ్డి విజయ అనే మహిళ తన భర్తతో మనస్పర్థలు రావడంతో వడ్లమానులో ఉన్న తన అన్నయ్య జలసూత్రం వెంకటేశ్వరావు వద్ద నెల రోజుల నుంచి ఉంటుంది. ఈనెల 8వ తేదీన గుండెల్లో నొప్పిగా ఉందని ఆగిరిపల్లి ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి వెళ్తున్నానని అన్నయ్యకు చెప్పి తన కుమారుడితో పాటు వెళ్లింది. కొంతసేపు ఆగిన తర్వాత విజయవాడ సెంటినీ హాస్పిటల్‌కు వెళుతున్నానని అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పింది. రాత్రి అయినా ఆమె తిరిగి రాకపోవడంతో ఆమె కోసం బంధువుల ఇళ్ల వద్ద గాలించిన ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శుభ శేఖర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment