రైతు సంక్షేమంపై దృష్టి సారించాలి
ఉండి: రైతు సంక్షేమంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు డాక్టర్ జీ శివన్నారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన శాసీ్త్రయ సలహా సంఘ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దత్తత గ్రామాల్లో విస్తరణ కార్యక్రమాలు ఎక్కువగా కేంద్రీకృతం చేసి రైతుల అభివృద్ధికి శాస్త్రవేత్తలు దోహదపడాలని అన్నారు. రైతులకు పంట దిగుబడి, ఆదాయం పెంచడం, ఖర్చు తగ్గించడం, భూసారం పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. మార్టేరు వరి పరిశోధనా స్థానం ఉప సంచాలకుడు డాక్టర్ టీ శ్రీనివాస్ మాట్లాడుతూ దాళ్వాలో వరిని నేరుగా విత్తడం, వేస్ట్ డీకంపోజ్, జింకులోప యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు డిజిటల్ మార్కెటింగ్‌పై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుర్రపుడెక్కను కంపోస్టుగా మార్చడం, దానిని విలువ ఆధారిత ఉత్పత్తి అయిన ట్రేసంచులుగా తయారు చేయడం వల్ల కాలువల్లో కలుపు నివారించడమే కాకుండా ఆదాయ వనరుగా మార్చవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి దేవానంద్‌కుమార్, డిప్యూటీ వెటర్నరీ డైరెక్టర్ డాక్టర్ జావల్‌హుస్సేన్, జీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment