ట్రిపుల్ ఐటీలో మెగా ఎక్స్‌పో నిర్వహణ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న సాంకేతిక సంబరం టెక్‌జైట్–25లో భాగంగా మంగళవారం మెగా ఎక్స్‌పో నిర్వహించారు. ఈ ఎక్స్‌పోలో 100 జట్లు పాల్గొని తమ ప్రాజెక్టులకు సంబంధించి ప్రజంటేషన్‌లను సమర్పించారు. 86 జట్లు తాము రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించగా వాటిలో 56 జట్లు అర్హత సాధించాయి. ఈ ఎక్స్‌పోలో ఏఐ, డ్రోన్, రోబోటిక్స్ అంశాలపై రూపొందించిన నమూనాలను విద్యార్థులు ప్రదర్శించి న్యాయనిర్ణేతలకు వివరించారు. ఈ ఎక్స్‌పోను డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఆర్జీయూకేటీ డీన్ అకడమిక్స్ దువ్వూరు శ్రావణి ప్రారంభించారు. టెక్ జైట్ 2025 లో భాగంగా ఎన్విజన్ అకాడమి, బిస్ సంస్థ ట్రిపుల్ ఐటీతో ప్రతి ఇంజనీరింగ్ విభాగం నుంచి విద్యార్థులకు పరీక్ష పోటీలను నిర్వహించారు. యూపీఎస్‌సీ ఆశావాహులకు మాక్ టెస్ట్ పోటీని ఎన్విజన్ అకాడమి నిర్వహించగా, ఉత్పత్తుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలి అనే ఉద్దేశంతో బిస్ సంస్థ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో పీయూసీ, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఏఓ బీ లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ చిరంజీవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment