నత్తనడకన హవేళి ఘణాపూర్ రోడ్డు మరమ్మతులు
- రోడ్డుపై నుండి విద్యుత్ స్థంభాలు తొలగించని వైనం
- అవస్థల్లో ప్రయాణికులు
మెదక్‌రూరల్: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం అత్యవసరం. దీన్ని గుర్తించి ప్రభుత్వం కొన్ని మేజర్ గ్రామాలకు కొత్తరోడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేసింది. కాని అధికారుల అలసత్వం...కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఓ రోడ్డు పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ప్రయాణీకులు, వాహనదారులు దుమ్ము,ధూళితో నరక యాతన అనుభవిస్తున్నారు. మెదక్ మండల పరిధిలోని రామాయంపేట ఆర్‌అండ్‌బి రోడ్డు నుండి హవేళి ఘణాపూర్ వరకు సుమారు 3కిలోమీటర్ల సింగిల్‌రోడ్డును డబుల్‌రోడ్డుగా నిర్మించేందుకు గత 8 నెలల క్రితం రూ.3.50కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు చురుకుగా సాగడం లేదు.
పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో రోడ్డుపైన వేసిన కంకరతో వాహనదారులు, ప్రజలు ప్రయాణించలేక నానా పాట్లు పడుతున్నారు. కాగా ఈ రహదారిలోనే జిల్లాలోని ఏకైక డైట్ కళాశాల ఉంది. అలాగే మండలంలోని లింగ్సాన్‌పల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలతోపాటు వైపీఆర్ ఇంజనీర్ కళాశాలకు ఇదే దారి కావడంతో విద్యార్థులతోపాటు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈముఖ్యంగా రామాయంపేట నుండి వయా హవేళిఘణాపూర్ మీదుగా నాగాపూర్ సబ్‌స్టేషన్‌కు 33కేవి హైటెన్షన్ విద్యుత్‌లైన్ వేశారు.
ఈ స్థంభాలు తొలగిస్తే తప్ప రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగవు. వాటిని తొలగించడంలో ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌కో శాఖల మధ్య సమన్వయంలేక రోడ్డు నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. పనులు ప్రారంభమై 8నెలలు గడుస్తున్నా వీటిని తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందిఈ విషయంపై ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపుల ఉన్న స్థంభాలను తొలగించడంతో రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.